దేవీ మంత్ర నిరూపణము

సనత్కుమార మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! కలి కల్పాంతరమున అవ్యక్త జన్మయగు బ్రహ్మలోక పద్మమున సృష్టి కొరకు తపస్సు చేయుచుండగా విష్ణు కర్ణమలము నుండి మధుకైటభులను రాక్షసులు పుట్టిరి. వారిద్దరూ పుట్టిన వెంటనే ప్రళయ లక్షణమగు జాను మాత్ర జలమున నిలిచి కమలమున ఉన్న బ్రహ్మను చూచి భక్షించుటకు ముందుకు రాగా బ్రహ్మ జగదంబికను స్తుతించెను. తరువాత జగత్కర్త్రి శైవీ శక్తి అగు దేవి నారాయణ నేత్రమున ఉండునదై ప్రీతిచెందెను. ఇప్పుడు ఆ దేవియొక్క మంత్రాదికమును అంతటిని చెప్పెదను వినుము. ‘సారుణా క్రోధనీ శక్తి చంద్రాలంకృత శేఖరా”. “హ్రీం” అను ఏకాక్షరీ బీజ మంత్రము. గాయత్రీ ఛందస్సు. భువనేశ్వరి దేవత. షడ్దీర్ఘ యుక్త బీజముచే అంగన్యాసమును చేయవలెను. సంహార సృష్టి మార్గముతో మాతృకాన్యస్త విగ్రహుడై మంత్ర న్యాసమును దేవతా భావ సిద్ధి కొఱకు చేయవలెను. హృల్లేఖను మూర్థ యందు వచనమున, హృదయాంబు జమున గగనమును, రక్త కరాలికను గుహ్యమున, పదద్వయమున మహోచ్ఛుష్మమును ఊర్థ్వ ప్రాగ్దక్షిణోదీచ్య పశ్చిమోత్తరములందు సద్యాదిహ్రస్వ బీజాదులను వ్యాసమును చేయవలెను. తరువాత జాతియుక్త షడంగములను క్రమముగా న్యాసమును చేయవలెను. గాయత్రీ సహితుడగు బ్రహ్మను ఫాలమున నుంచవలెను. సావిత్రీ సహితుడగు విష్ణువును దక్షిణ కపోలమున, వాగేశ్వరీ యుక్తుడగు మహేశ్వరుని వామగండమున, శ్రీయుక్తుడగు ధనపతిని వామ కర్ణాగ్రమున రతీయుతుడగు స్మరుని ముఖమున వ్యాసము చేయవలెను. పుణ్యాగణపతిని సవ్యకర్ణో పరిభాగమున కర్ణాంగండాంతరాలము లందుంచవలెను. వదనమున మూలమునుంచి తరువాత కంఠ మూలమున, స్తన ద్వంద్వమున, వామ భుజమున హృదయాంబుజమున, వామ భుజమున, పార్శ్వ యుగళమున, నాభి దేశమున చైత్రముల నుంచవలెను. పాలములను పార్శ్వ జఠరమున పార్శ్వాంసమున, హృదయమున ఉంచవలెను. బ్రహ్మణ్యాదులను యథావిధిగా శరీరము నందుంచి, మూలముచే దేహమున వ్యాపకము నుంచి దేవిని ధ్యానించవలెను. ఉదయించు సూర్యునికాంతిగలది, ఉన్నత వక్షోజములు గలది, త్రిలోచన, చిరునవ్వు మోముకలది, ఇందుమకుట, వర పాశాంకుశా భయధారిణియగు దేవినిధ్యానించి, మంత్రమును ముప్పదిరెండు లక్షలు జపించవలెను. దశాంశమును త్రిమధు మిశ్రితములగు అష్ట ద్రవ్యములచే, బ్రహ్మ వృక్ష సమిధలచే కాని హోమమును గావించవలెను. ద్రాక్ష, ఖర్జూర, కాలూద, శక్కర, నాలికేర, తండుల, ఆజ్య, తిలములు అష్ట ద్రవ్యములు అనబడును. పార్వతిని ధ్యానించుచు సూర్యునకు అర్ఘ్యమును ఈయవలెను. తద్బాహ్యమున షోడశదళములచే కూడియున్న అష్టదళ పద్మమును లిఖించవలెను. కర్ణికా మధ్యమున షట్కోణమును లిఖించవలెను. తరువాత నవశక్తి సమన్వితమగు పీఠమును పూజించవలెను. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, దోగ్ద్రీ, అఘోరా, మంగలా అనునవి నవశక్తులు. బీజయుతమగు ఆసనమును ఇచ్చి, ఆ బీజముచేతనే మూర్తిని కల్పించి, దాని అందు దేవిని ఆవాహించి ఆవరణలచే క్రమముగా పూజించవలెను. మధ్య ప్రాగ్యామ్య ఉత్తరములందు అంగ దేవతలను పూజించవలెను. షట్కోణములందు మిధున దేవతలను పూజించవలెను. ఇంద్ర కోణమున (తూర్పున) దండకుండికా అక్ష గుణాభయ ధారిణి అగు గాయత్రిని, ఇట్టి బ్రహ్మను కూడా పూజించవలెను. నైరుతి దిక్కునందు శంఖ చక్ర గదా పద్మధారిణి, పీత వసనయగు సావిత్రిని, అట్టి విష్ణువును పూజించవలెను. వాయు కోణమున పరశు, అక్షమాలా అభయ వరాన్వితయగు, స్వచ్ఛ వర్ణయగు సరస్వతిని, అట్టి లక్షణములు గల రుద్రుని పూజించవలెను. ఆగ్నేయ కోణమున రత్నకుంభమును, మణి కరండకమును, కరములచే ధరించియున్న, పీతవర్ణయగు దేవిని, ధనదాయకుడగు తుందిలుని వామ హస్తముచే అలింగనము చేసుకొని, దక్షిణ హస్తమున తాంబూలమును ధరించియున్న ధనదారిక సమారూఢయగు మహాలక్ష్మిని పూజించవలెను. పశ్చిమ కోణమున బాణపాశాంకుశ ధనువులను ధరించి జపారక్తవర్ణుడు, రక్తభూషణుడగు మన్మధుని పూజించవలెను. దక్షిణ భుజముచే భర్త నాలింగనము చేసుకొని, వామ హస్తమున ఉత్పలమును ధరించియున్న భర్త ఒడిలో కూర్చొనియున్న రతీదేవిని చక్కగా పూజించవలెను. ఐశాన్య కోణమున ప్రియాన్వితుడు, సృణి పాశధరుడు, సుందరుడు, వరాంగ సృక్కలాంగులి, మాధ్వీపూర్ణ కపాలాఢ్యుడు, దిగంబరుడు, పుష్కరమున విగలద్రత్న స్ఫురచ్చషక ధారియగు విఘ్నరాజును పూజించవలెను. సింధూర సదృశాకారము గలది, ఉద్దామమద విభ్రమ, రక్తోత్పలధారిణి, ఇతర హస్తముచే ధ్వజమును స్పృశించునది, భర్తను ఆలింగనము చేసుకొనియున్న, దిగంబరయగు పుష్టిని కర్ణికయందు పూజించవలెను. షట్కోణ పార్శ్యములందు అంగములను పూజించవలెను. తరువాత కేశరములందు పత్రము లందు ఈ దేవీ మణులను పూజించవలెను. అనంగకుసుమ, ఆనంగమేఖల, ఆనంగగమనా, అనంగమదునాతుర, భువనపాలా, గగనవేగా, శశిలేఖ గగన లేఖ యనెడు అష్టశక్తులు. ఖడ్గ ఖేటకధారిణులు, శ్యామ వర్ణములుకల మాతృకలను పూజించవలయును. పద్మ బాహ్య ప్రదేశమున శక్తులను పరిచారికలను పూజించవలయును. అనంగ ద్వయా, అనంగమదన, మదనాతురా, భువనవేగా, భువనపాలికా, సర్వశిశిరా, అనంగవేదనా, అనంగమేఖల, అనువారు పరిచారికలు శక్తులు. చషకమును, తాలవృంతమును, తాంబూలమును, ఉజ్జ్వల ఛత్రమును, చామరములను, అంశుకమును పుష్పములను చేతులలో ధరించియుందురు. సర్వాభరణభూషితులగు లోకపాలురను బాహ్యప్రదేశమున పూజించవలెను. తద్బాహ్యమున వజ్రాదులను పూజించవలెను. ఇట్లు దేవీ పూజ గావించవలెను. త్రిమధుర మిశ్రితములగు అశ్వత్థ సమిధలచే హోమమును గావించి బ్రాహ్మణులను వశము చేసుకొనవచ్చును. పద్మముల హోమముచే క్షత్రియులు వశములో నుందురు. పలాశ పుష్ప హోమముచే వారి పత్నులు వశులగుదురు. కలువలచే హోమము చేసినచో మంత్రులు వశులగుదురు. ఇరువది అయిదు మార్లు జపించిన జలముచే ప్రతి దినము స్నానము గావించినచో సర్వసౌభాగ్యవంతుడగును. ఇరువది మార్లు జపించిన జలమును ప్రతిదినము ప్రాతః కాలమున పానము గావించినచో సాటిలేని ప్రజ్ఞను పొంది కవులలో శ్రేష్టుడు కాగలడు. కర్పూర అగరు కస్తూరీ సంయుక్తమగు కుంకుమను చక్కగా మంత్రించి తిలకముగా ధరించినచో రాజులు వశులగుదురు. మధురాన్వితమగు వరిపిండిచే బొమ్మనుచేసి జపించి ప్రాణ ప్రతిష్ఠ గావించి ఆదివారమున భక్షించినచో రాజును కాని, పురుషుని కాని, స్త్రీని కాని వశము చేయును. కంఠమాత్ర జలమున నిలిచి జలమునుండివచ్చు సూర్యుని చూచి మూడు లక్షలు జపించినచో ఇష్టమగు కన్యను పొందును. సంపద కొరకు మంత్రితాన్నమును భుజించవలెను. భస్మముచే సాధించదగిన మాయను ఫలకాదులందు లిఖించి, ఆ సమయమున యంత్రమును చూపినచో సుఖ ప్రసవము జరుగును. ఈమెయే సహస్ర భుజసంభవ యగు భువనేశ్వరి అనబడును. ఆమె తనను తలచు మానవులకు భుక్తి ముక్తి ప్రదురాలుగా పేర్కొనబడినది.

ఒక కల్పమున ఒకప్పుడు మహిషాసురుడు లోకపాలురను తన బలముచే గెలిచి జగత్త్రయమును అనుభవించుచుండెను. అంతట అతనిచే పీడించబడిన దేవతలు శ్రీ మహావిష్ణువును శరణువేడిరి. అపుడు మహాలక్ష్మీదేవి చక్రాద్యంగ ప్రభవతేజస్సుచే మూర్తిని ధరించి, జగత్త్రయమును వ్యాపించి మహిషాది అసురులను సంహరించి అరవింద వనమును చేరి, సేవించువారి అభీష్టములను ఇచ్చుచుండెను. ఇపుడు ఈ దేవీ పూజా విధానమును సంక్షేపముగా చెప్పెదను వినుము.

గురువగు మృత్యు క్రోధముచే బిందుభూషిత మస్తకము శ్రీ బీజ మంత్రము. అనగా “శ్రీం” అనునది బీజమంత్రము. భజించువారికి అభీష్ట ప్రదము. భృగువు మహర్షి నివృత్ ఛందస్సు. శ్రీదేవత, షడ్దీర్ఘయుక్త బీజముచే షడంగములను క్రమముగా కల్పించ వలెను. తరువాత జగద్వేద్య సంపత్తిదాయిని, కాంచనాభ, నాలుగు తెల్లని యేనుగులు తమ తొండములచే ధరించిన బంగారు కలశములతో అమృతాభిషేకము చేయుచుండగా పద్మమున ఉన్న, వరాభయాబ్జ స్రగ్థారిణి, క్షామ వస్త్ర కిరీటధారిణి యగు మహాలక్ష్మిని ధ్యానించవలెను. ఎనిమిది లక్షల మంత్రమును జపించవలెను. దశాంశమును సుగంధ కుసుమములుచేకాని, మధుర ప్లుతములగు కమలములచే కాని హోమముచేసి మహాలక్ష్మికి చెప్పబడిన పీఠమునందు మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి పూర్వోక్త విధానముగా అంగములను అర్చన చేయవలెను. అష్టదళములందు పూజించవలెను. వాసుదేవుని సంకర్షణుని, ప్రద్యుమ్నుని, అనిరుద్ధుని హిమ పీత తమాలేన్ద్ర నీల వర్ణులను పీత వస్త్రధారులను, శంఖ చక్ర గదా పద్మధారులను, చతుర్భుజులను పూజించవలెను. దిక్కులందు పత్రములందు దమకాదులను పూజించవలెను. దమకమును, పుండరీకమును గుగ్గులు కురింటకము అను గజములు. దక్షిణ భాగమున ప్రమదాన్వితమగు శంఖ నిధిని పూజించవలెను. ముక్తామాణిక్య సంకాశులు, కించి త్స్మిత ముఖాంబుజులు, అన్యోన్య ఆలింగనపరులు, శంఖ పంకజ ధారులు రత్నములను వర్షించు శంఖపద్మములచే శిరస్సున గుర్తించబడిన తుందిలుని, కంబుకనిధిని, వసుధారను, ఘనస్తనిని, వామ భాగమున పంకజ నిధిని ప్రియా సహితుని పూజించవలెను. సింధూర వర్ణముగల, భుజ శ్లిష్టులు రక్త పద్మోత్పాలాన్వితులు రత్నములను వర్షించు పద్మములచే మూర్థ భాగమున చిహ్నితములు అగు తుందిలుని, పంకజ నిధిని తత్త్వమును, వసుమతిని దలాగ్రము లందు పూజించవలెను. బలాకాదులను పూజించవలెను. బలాకి విమల, కమల వనమాలిక, విభీషిక, మాలికా, శాంకం, వసుమాలిక అనువారు రెండు పద్మములను ధరించినవారు ముక్తాహార సమ ప్రభలు అగువారిని పూజించవలెను. అంతమున లోకేశులను వారి అస్త్రములను పూజించ వలెను. ఇట్లు దేవిని సేవించువారు ధనధాన్య సమృద్ధిని పొంది గొప్ప సంపదను పొందును. వక్షస్థ్సల మాత్ర జలమున నిలిచి ఈ మంత్రమును జపించవలెను. సూర్యమండలగతుని ధ్యానించుచు మూడు లక్షలు జపించినచో లక్ష్మీ నివాసమగును. విష్ణ్వాలయములో నున్న మారేడు చెట్ల మూల భాగమున మూడులక్షలు జపించవలెను. ఇట్లు చేసినచో కోరిన ధనరాశులు లభించును. అశోక సమిధలచే ఏర్పరిచిన అగ్నిలో నేయి కలిపిన తండులములచే హోమమును గావించినచో జగత్తు వశమగును. చండ్రనిప్పులో మధు ప్లుతములగు తండులములచే హోమమును గావించినచో రాజు వశము అగును. మహా సంపదను పొందును. మారేడు నీడలో ఉంటూ మారేడు కలిసిన హవిస్సును భుజించుచు మూడు సంవత్సరములు హోమము గావించినచో, మారేడు ఫలములచే కాని అంబుజములచేకాని హోమమును గావించినచో మహాలక్ష్మిని స్వయముగా కన్నులతో చూడగలడు.

ఓ బ్రాహ్మణోత్తమా? మరియొక కల్పమున దేవ రాజ్యమున హరించువారు లోకకంటకులు శుంభ నిశుంభులను ఇరువురు రాక్షసులు పుట్టిరి. వారి వలన రాజ్య భ్రష్టులైన ఇంద్రాదిదేవతలు ప్రార్థించగా మహాసరస్వతీదేవి అవతరించెను. అతి సుందరము అతి పవిత్రమగు హిమాలయ ప్రాంతమున అవతరించి శుంభ నిశుంభులను సంహరించి దేవతలచే పూజించబడును. వారికి వరములను ఇచ్చి మానస సరస్సున ప్రవేశించెను. ఆ సరస్వతీ మంత్రమును చెప్పెదను. సావధానముగా వినుము. జ్ఞానామృత స్వరూపురాలు చంద్రకళను శిరమున ధరించి శోభించు దేవత. వాగ్బీజము ఆ దేవతా మంత్రము. వాగ్బీజముచే అంగకల్పన చేయవలెను. సదాశివుడు ఋషి. అనుష్టుప్ఛందస్సు. వాగ్దేవి దేవత. సేవించువారికి అభీష్టముల నొసంగును. శ్వేతాంబర బిసశ్వేత, వీణా పుస్తకధారిణి, దివ్యాభరణ భూషితయగు సరస్వతీ దేవిని ధ్యానించవలెను. మహా సరస్వతీ పీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆ మూర్తి యందు దేవి నావాహన గావించి అంగాద్యా వరణలచే చక్కగా పూజించవలెను. మొదట అంగావరణము, తరువాత అంబి కాదులు, ద్వితీయావరణము మాతృకలు. తృతీయా వరణము అష్ట శక్తులు. నాలుగైదు అవరణలు ముప్పది రెండు శక్తులచే చేయవలెను. అరువది నాలుగు శక్తులచే ఆరవ ఆవరణము, సప్తమావ రణము లోకపాలకులు. అష్టమావరణము వారి ఆయుధములు. ఇట్లు వాక్సంభవయగు దేవతను పూజించవలెను. పూర్వోక్త స్థానములందు అంగములను పూజించవలెను. అంబికా, వాగ్భవ, దుర్గ, శ్రీ శక్తి మొదలగు వారష్ట శక్తులు. తరువాత బ్రహ్మాదులను పూజించవలెను. కరాలి, వికరాలి, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, లక్ష్మి, ధృతి, స్మృతి, శ్రద్ధమేధా, రతి, కాంతి ఆర్యా అనునవి పదునారు శక్తులు. వీరందరు ఖడ్గఖేటకధారిణులు శ్యామస్వరూపిణులు, స్వలంకృతులుగా ఉన్న వీరిని పూజించవలెను. విషఘ్నీ, పుష్టి, ప్రజ్ఞా, సినీవాలి, కుహూ, రుద్రవీర్య, ప్రభ, నన్ద, పోషణ, వృద్ధిద, శుభ, కాలరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దినీ, వికృతి, దండీ, ముండీ, సేన్దు ఖండా, శిఖండిని, నిశుంభ శుంభమధని, చండముండ వినాశిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్ధ శరీరిణి నారీ, నారాయణి, త్రిశూలినీ, పాలిని, అంబికా, హ్రాదిని అనువారు ముప్పది రెండుశక్తులు. వీరందరు చక్రహస్తలు, పిశాచాస్యలు, చారుభూషణలుగా నున్న వారిని చక్కగా పూజించవలెను. పింగలాక్షి, విశాలాక్షి, సమృద్ధి, బుద్ధి, శ్రద్ధ, స్వాహా, స్వధా, భిక్షా, మాయ, సంజ్ఞ, వసుంధర, త్రిలోకధాత్రి, గాయత్రి, సావిత్రి, త్రిదశేశ్వరి, సరూప, బహురూప, స్కన్దమాత, శ్రుతి ప్రియ, విమలా, కమలా, అరుణీ, అరుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్యా, మాత, సతీ, హంసీ, మర్దికా, వజ్రకా, పరా, దేవమాత, భగవతి, దేవకీ, కమలాసన, త్రిముఖీ, సప్తవదనా, సురాసుర విమర్దిని, లంబోష్ఠీ, ఊర్థ్వకేశి, బహు శిశ్నా, వృకోదరి, రధరేఖా, శశిరేఖ, గగనవేగా, పవనవేగా, వేగా, భువనపాల, మదనాతురా, అనంగా, అనంగవదన, అనంగమేఖల. అనంగకుసుమ, విశ్వరూప, సుభయంకరి, అక్షోభ్యా, సప్తవాహినీ, వజ్రరూపా, శుచివ్రత, వరదా, వాగేశీ అనువారలు అరువది నాలుగుశక్తులు. చాపబాణధారిణులు, జ్వాలా జిహ్వలు, మహాప్రభలు, దంష్ట్రిణులు, ఊర్థ్వకేశినులు, యుద్ధోపక్రాంత మానసలు, సర్వాభరణ భూషితలుగా పూజించవలెను. లోకేశులను, వజ్రాదులను పూర్వోక్త విధిగా ఆరాధించవలెను. పదునారు లక్షలు జపించవలెను. దశాంశమును నేతితో చండ్ర నిప్పులో హోమము చేసిన మంత్రము సిద్ధించును. కమలములచే పదివేలు హోమమును చేసినచో రాజు వశమగును. కలువలచే హోమము చేసినచో మహాలక్ష్మి పుట్టును. మోదుగు పూలచే హోమమును గావించిన సంవత్సరమున కవి అగును. రాజీవలవణ హోమముతో స్త్రీ వశమగును. వాణీ బీజమును జపించువారు సకల భోగములను అనుభవించి అంతమున విష్ణులోకమును చేరును. (3/84)