ఖాండిక్య కేశిధ్వజ సంవాదము

సనందన మహర్షి పలికెను: కేశిధ్వజుడు చెప్పిన అధ్యాత్మ జ్ఞానమును అమృతము ఆస్వాదించునట్లు ఖాండిక్యుడు విని కేశిధ్వజుని పొగడుచు ఖాండికుడ్యఉ మరల ఇట్లు పలికెను.

ఓ మహానుభావా! ఈ నిమి వంశమున నీవు యోగశాస్త్రార్ధమును బాగుగా తెలిసినవాడవు. కావున నాకు యోగమును తెలియజేయుము.

కేశిధ్వజుడు పలికెను: “ఓ ఖాండిక్యా! నేను యోగ స్వరూపమును చెప్పెదను వినుము. యోగమున ఉన్నవాడు బ్రహ్మమున లీనమగును. భ్రష్టుడు కాజాలడు. మానవుల బంధ మోక్షములకు మనసే కారణము. మనసును విషయ సంగమును చేసిన బంధము, నిర్వషయము చేసిన మోక్షము లభించును. విజ్ఞాన స్వరూపుడగు జీవుడు జ్ఞానముచే మనసును విషయముల నుండి మరలించి మోక్షము కొఱకు బ్రహ్మ స్వరూపుడగు పరమేశ్వరుని చింతించవలయును. అట్లు బ్రహ్మను ధ్యానించుచు, మనస్సును ఆత్మలో నిలుపవలయును. ఆత్మ శక్తిచే మనస్సు అను లోహమును అయస్కాంతముచే ఆకర్షింప చేయవలయును. మనోగతి విశిష్టమై ఆత్మప్రయత్న సాపేక్షమైనచో, అట్టి అపేక్షను బ్రహ్మ యందు సంయోగము చేయుటయే యోగము అనబడును. ఇట్లు అత్యంత వైశిష్ట్యయుక్త ధర్మోపలక్షణమగు యోగము గలవాడే యోగి ముముక్షువు అనబడును. మనసును ఆత్మలో యోగము చేయునపుడు మొదట యోగి అనబడును. సమాధి నిష్పన్నమగుచో పరబ్రహ్మ లభించును. మనోయోగ సమయమున అంతరాయముచే మనసు దుష్టము కానిచో జన్మాంతరా భ్యాసముచే ముక్తి లభించును. సమాధి నిష్పన్నమగుచో ఆ జన్మలోనే ముక్తి లభించును. యోగాగ్నిచే కర్మములు దగ్ధములై యోగి మోక్షమును పొందును. బ్రహ్మచర్యమును, అహింసను సత్యమును, అస్తేయమును, అపరిగ్రహమును నిష్కామముతో యోగి ఆచరించవలయును. స్వాధ్యాయమును, శౌచమును, తపస్సును, నియమములను, యమములను పరబ్రహ్మయందు మనసును లగ్నము చేసి ఆచరించవలయును. ఈ నియమములు అయిదు, యమములు అయిదుగా చెప్పబడుచున్నవి. సకాములకు విశిష్ట ఫలముల నిచ్చును. నిష్కాములకు ముక్తి నొసంగును. ఇట్లు భద్రాసనాదులగు ఆసనములను అధిష్టించి గుణవంతుడైయమ నియమములతో యతియై మనోయోగమును చేయవలయును. ప్రాణవాయువును ఆధారము చేసి నియమించినచో ప్రాణాయామ మనబడును. ఈ ప్రాణాయామము సబీజము, అబీజమని రెండు విధములు. ప్రాణా పానములు ఒకదానినొకటి సద్విధానముతో నియమించినచో మూడవ యమమగును. ఈ యమము కూడా స్థూలముగా ప్రాణాయామమువలె ఉండును. వాయువునకు ఆత్మ నాధారము చేసుకొనుటయే యోగాభ్యాస మనబడును. యోగవిత్తు శబ్దాది విషయములందు అనురక్తములగు ఇంద్రియములను నిగ్రహించి ప్రత్యాహార పరాయణుడై చిత్తానుకారిణులనుగా చేయవలయును. ఇట్లు చేసినచో ఉత్తమమగు ఇంద్రియవశ్యత సిద్ధించును. ఇంద్రియములను వశము చేసుకొనకయోగి, యోగసాధకుడు కాజాలడు. ప్రాణాయామముచే వాయువులను, ప్రత్యాహారముచే ఇంద్రియములను వశము చేసుకొని మనసును శుభాశ్రయము చేయవలయును.

ఖాండిక్యుడు పలికెను: “ఓ మహానుభావా! చిత్తమునకు శుభాశ్రయమనగా ఏమియో తెలుపుము. శుభాశ్రయమును ఆధారము చేసుకొనియే సమస్త దోషములు నశించును.”

కేశిధ్వజుడు పలికెను: “చిత్తమునకు ఆశ్రయము స్వరూపమతో ద్వివిధము మూర్తము, అమూర్తము, పరము అపరము అని భావన త్రివిధ రూపముగా ఉండును. ఈ ప్రపంచము మూడు విధములుగా ఉండును. బ్రహ్మరూపము కర్మరూపము ఉభయ రూపము అని. భావభావన కూడా కర్మభావన, బ్రహ్మభావన ఉభయభావన అని మూడు విధములు. ఓ జ్ఞానీ! సనకాది మహర్షులు సర్వకాలములలో బ్రహ్మ భావనతో ఉందురు. దేవాదులు స్థావర జంగమములు కర్మభావనతో ఉందురు. హిరణ్య గర్భాదులలో బ్రహ్మ కర్మభావన యుండును. అధికార జ్ఞానము కలవారికి భావభావన ఉండును. సమస్తములైన విశేష జ్ఞానకర్మలు క్షయము నొందనపుడు భిన్నదృష్టి గలవారై ఈ ప్రపంచము వేరు పరలోకము వేరు అని భావించెదరు. అన్ని భేదములు తొలగి, వాక్కులకు గోచరము కాక ఆత్మమాత్రవేద్యమై సత్తామాత్రముగా భాసించు జ్ఞానమే బ్రహ్మజ్ఞానమనబడును. రూపరహితుడు జన్మరహితుడగు విష్ణువుకు అదే పరరూపము. పరమాత్మకు విశ్వస్వరూపముగా వైరూప్యముగా గోచరించుటయే లక్షణము. యోగమును సాధన చేయువారు పరమాత్ముని రూపరహితునిగా చూడజాలరు. ధ్యానించజాలరు. కావున చక్షుర్గోచరమగు శ్రీహరియొక్క స్థూలరూపమును చింతన చేయవలయును. భగవానుడగు హిరణ్యగర్భుడు, ఇంద్రుడు, ప్రజాపతి, మరుత్తులు, వసువులు, రుద్రుల, భాస్కరులు, తారకలు, గ్రహములు, గంధర్వులు, యక్షరాక్షసులు, సకల దేవతలు, మనుష్యులు, పశువులు, పర్వతములు, సముద్రములు, నదులు, వృక్షములు, అశేష భూతములు, భూత హేతువులు, ప్రధానము మొదలుకొని విశేషాంతము వరకు గల చేతనాచేతనాత్మకమగు విశ్వము, ఏకపాదము ద్విపాదము, బహుపాదము అపాదకము, భావనాత్రితయాత్మకమగు ఈ ప్రపంచ మంతయు శ్రీహరి స్థూలరూపమే. చరాచరమగు సమస్త జగత్తు, ఈ ప్రపంచమంతయు పరబ్రహ్మ స్వరూపుడగు శ్రీమహావిష్ణువు యొక్క శక్తిసమన్వితమే. విష్ణుశక్తి పర అని, క్షేత్రజ్ఞుని అపర అని, అవిద్యాకర్మ అనునది మూడవ శక్తి అని చెప్పెదరు. క్షేత్రజ్ఞశక్తి గలవారు కర్మలవలన చేష్టలు చేయుదురు. అది సారము లేని సంసారమున ఉండును. దానివలననే సమస్త సంసార తాపములను పొందును. అశక్తిచే తిరోహితమగు శక్తియే క్షేత్రజ్ఞశక్తి యనబడును. ఈ క్షేత్రజ్ఞశక్తి అన్ని ప్రాణుల యందు తరతమ భేదములచే ఉండును. ప్రాణములేని వాటియందు స్వల్పముగా ఉండును. స్థావరములందు మరి కొంత అధికముగా ఉండును. సర్పాదులందు కొంత అధికముగా అంతకంటే ఎక్కువగా పక్షులలో, పక్షులకంటే అధికముగా మృగములలో, మృగములకంటే పశువులలో, పశువుల కంటే మనుజులలో, మనుజులలో కూడా స్త్రీల కంటే పురుషులలో, వారికంటే అధికముగా, నాగగంధర్వ యక్షదేవతాదులలో ఉండును. దేవతలందరి కంటే అధికశక్తి కలవాడు ఇంద్రుడు. ఇంద్రుని కంటే ప్రజాపతి, ప్రజాపతులకంటే అధికుడు హిరణ్యగర్భుడు అధిక శక్తి కలవాడు. ఈ సమస్తరూపములు ఆ శ్రీహరి రూపములే. ఆకాశముతో కూడియున్నట్లు, ఈ రూపములు అన్నియూ పరమాత్మ శక్తితో కూడియున్నవే. విష్ణువు యొక్క రెండవరూపము యోగులచే మాత్రమే ధ్యానించదగినది. దానినే అమూర్తమందురు. అమూర్తమగు విష్ణురూపమునకే సత్తని పేరు. ఈ సమస్త శక్తులు ప్రతిష్ఠించబడియున్న శ్రీహరి స్వరూపరూపమే మూడవ మహద్రూపము. అరూపమే సమస్త శక్తి రూపములను ఏర్పరచును. శ్రీహరిలీలచే దేవతిర్యజ్మనుష్యాదులు చేష్టలు కలవారగుదురు. శ్రీహరి చేష్ట సర్వవ్యాపిని, ఇతర నిమిత్తముగా విధించబడునదికాదు. విశ్వరూపుని అరూపమునే యోగసాధన చేయువారు చింతన చేయవలయును. ఆరూప చింతనమే ఆత్మశుద్ధిని కలిగించి సర్వపాపములను నశింపచేయును. జ్వాలలచే కూడిన అగ్ని వాయువుతో కలిసి అరణ్యమును దహించునట్లు చిత్తమున ఉన్న శ్రీహరి యోగుల సర్వపాపములను దహించివేయును. కావున సమస్త శక్తుల కాద్యంతములగు శ్రీహరిశక్తిని చక్కగా హృదయమున నిలుపుకొనవలయును. దానిని శుద్ధ లక్షణమందురు. ఇదియే చిత్తమునకు శుభాశ్రయము. సర్వవ్యాపియగు ఆత్మకు కూడా ఇదియే శుభాశ్రయము. ఇదియే తిభ్రావభావనాతీతము. యోగులముక్తికి హేతువు, కర్మహేతువులగు దేవాదులగు సమస్తాశ్రయములు చిత్తమునకు అశుభములు అపరిశుద్ధములు కావున అశుభాశ్రయములే అగును. అన్నిటిని ఆశ్రయించక విడిచి భగవంతుని సాకారమగు రూపమునందు చిత్తమును ధరించినచో దానిని ధారణ అందురు. ఈ ధారణలో శ్రీహరి రూపమును ఎట్లు చింతించ వలయనో చెప్పెదను వినుము. నిరాధారముగా ధారణ కుదరదు కావున ఒక రూపమును ఆధారము చేసుకొనవలయును. ప్రసన్నమగు సుందరవదనము, పద్మ పత్రములవంటి విశాల నేత్రములు చక్కని కపోలములు, విశాలమగు ఫాలభాగముచే శోభితము సమమగు కర్ణములందు ధరించిన ఆభరణములుగల దానిని, శంఖము వంటి కంఠము, విశాలము శ్రీవత్సశోభితమగు వక్షస్థ్సలము, త్రివళులచే లోతైన నాభిచే కూడిన ఉదరము, దీర్ఘములైన అష్టభుజములు కలదిగా కాని నాలుగు భుజములు కలదిగా దాని ఎక్కువ తక్కువలు కాక సమముగా నున్న ఊరు జఘనములు, సుస్థిరమైన కరచరణాం బుజములు, పరిశుద్ధమైన పీతాంబరమును ధరించినదానిని, కిరీట కేయూర కటకాది భూషణములను ధరించినదానిని, శార్ఞశంఖగదా ఖడ్గ చక్రాది ఆయుధముల ప్రకాశములతో శోభించునది అగు శ్రీహరి రూపమును మనసున నిలిపి ఆత్మచే ధ్యానము చేయవలయును. ఇట్లు శ్రీహరి రూపమునందు దృఢమగు వరకూ ధారణను చేయవలయును మాటలాడుచున్ననూ, నిలుచున్నను, స్వేచ్ఛతో ఏపని చేయుచున్నను ధారణ తొలగనిచో ధారణ సిద్ధించినదని భావించవలయును.

తరువాత శంఖ చక్ర గదా శార్ఞాది రహితము, ప్రశాంతము అక్షసూత్ర సహితమగు భగవద్రూపమును ధ్యానము చేయవలయును. ఈ ధారణ స్థిరమైన తరువాత కిరీట కేయూర కటకాది భూషణరహితమగు రూపమును ధ్యానము చేయవలయును. తరువాత ఏకావయవ రూపమును స్మరించవలయును. తరువాత అవయవిని మాత్రమే ధ్యానించ వలయును. ఇట్లు అవయవియందు దృఢ ప్రత్యయము కలిగిన తరువాత ఇతర స్పృహ వీడవలయును. ఇట్లు ప్రాథమికములగు షడంగములచే ధ్యానము సిద్ధించును అపుడు కల్పనా హీనమగు స్వరూపమును గ్రహించగలుగును. కేవలము మనసుచే ధ్యానముచే నిష్పన్నమగు దానిని సమాధి అందురు. ప్రాప్యమగు పరబ్రహ్మను పొందించు విజ్ఞానముచే అశేష భావనలను క్షీణింపచేసి ఆత్మను పొందించవలయును. దీనిచే క్షేత్రజ్ఞుని చేయు జ్ఞానము సాధనమగును. ఈ సాధనముచే ధ్యానము సిద్ధించును. ఇట్లు ధ్యానసిద్ధి కలిగినచో ముక్తి కార్యమును నిష్పన్నమునుచేసి కృతకృత్యుడగును. అపుడు అన్నిటినుండి నివర్తించును. ఇట్లు పరబ్రహ్హభావభావనను పొంది ఈ జీవుడు పరమాత్మతో ఐక్యమును పొందును. అజ్ఞానముచే భేదమును పొందును. ఇట్లు విభేదమును కలిగించు జ్ఞానము ఆత్యంతిక నాశమును పొందిన తరువాత ఆత్మకు పరమాత్మచే అభేదమును తెలియగలడు. ఓ ఖాండిక్యా! నీవు అడిగిన యోగమును సంగ్రహముగా విస్తరముగా సమగ్రముగా వివరించితిని. ఇంకనూ ఏమి చేయవలయునో చెప్పుము.”

ఖాండక్యుడు పలికెను: యోగము గూర్చి చక్కగా తెలిపి నాకెంతయో హితమును చేసితివి. నీ ఉపదేశము వలన మనో మాలిన్యము నశించినది. నాది అని నేను చెప్పినదంతయు అసత్తే (లేనిదే) వేరుకాదు. జ్ఞానులు కూడా వేరుగా చెప్పజాలరు. నేను నాది అనుట అవిద్య. ఈ వ్యవహారము కూడా అవిద్యకృతమే. పరమార్థము చెప్పశక్యము కానిది. వాగ్గోచరముకానిది. కావున! ఓ కేశిధ్వజా నీవు నా మేలునకే దీనిని అంతటినీ చేసితివి. అవ్యయమగు, విముక్తి పరమగు యోగమును చెప్పితిని. కావున ఇక వెళ్ళుము.

సనందన మహర్షి పలికెను: అపుడు ఖాండిక్యుడు తగిన విధముగా కేశిధ్వజుని పూజించెను. తరువాత కేశిధ్వజుడు తన నగరమునకు వచ్చెను. ఖాండిక్యుడు కూడా తన పుత్రుని రాజుగా చేసి యోగసిద్ధి కొఱకు శ్రీహరియందు మనసున ఉంచి విశాలాప్రాంతమునకు వెళ్ళెను. అచట ఏకాంతికుడై యమాదిగుణయుక్తుడై విష్ణువను పేరుగల నిర్మలుడగు పరబ్రహ్మయందు లీనమాయెను. కేశిధ్వజుడు కూడా మోక్షము కొఱకు తన కర్మలను క్షీణింప చేయగోరి విషయములను అనుభవించెను. సంగరహితముగా కర్మను ఆచరించెను. ఇట్లు శుభానుభవములచే శుభకర్మలచే పాపములు నశించి శుద్ధుడై తాపత్రయ నాశకమగు సిద్ధిని పొందెను. ఇట్లు నీవడిగిన విధముగా తాపత్రయ చికిత్సనంతటిని చెప్పితిని. ఇంకనూ ఏమి చెప్పవలయును? (2/47)