నారద మహా పురాణము
కాశీ మాహాత్మ్యము
మాంధాత పలికెను: ఓ మహానుభావా నీవు సర్వజ్ఞుడవు కావున మహాపాతక నాశనమగు పవిత్రమగు మోహినీ చరితమును చెప్పితివి. మోహిని భర్తను పుత్రుని సవతిని ధర్మరక్షణకు పిత్రాజ్ఞచే ప్రయత్నించి సంసారమునుండి విముక్తులను చేసెను. ఆబ్రహ్మపుత్రి సర్వజ్ఞురాలు, సర్వలోక హితకరురాలు, తన పురోహితుని శరణు పొందినది. పితృగతి ప్రదమగు గయా మాహాత్మ్యమును విని మరల ఏమడిగెను?
వసిష్ఠ మహర్షి పలికెను: ఓ రాజా! తీర్థ సేవన కాముకురాలగు మోహినీదేవి వస్తువునే మడిగెనో చెప్పెదను. వినుము.
మోహిని పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా? బాగు బాగు నీవు లోకోద్ధరణ తత్పరుడవు. కరుణాత్ముడవగు నీవు నన్ను ఉద్ధరించితివి. ఉత్తమము పావనమగునది, రహస్యము, పితృగతి ప్రదము, ధర్మాఖ్యానము, సుఖావహమగు గయా మాహాత్మ్యమును వింటిని. ఇక ఇప్పుడు ఉత్తమమగు కాశీ మాహాత్మ్యమును తెలుపుము. నేను పూర్వము సంధ్యావళిచే కొంత వింటిని. కావున స్మరించితిని. ఇప్పుడు విస్తరముగా తెలుపుము.
వసిష్ఠ మహర్షి పలికెను: మోహినీ వాక్యమును వినిన పురోహితుడగు వసువు వేదవేదాంగ తత్వజ్ఞుడు కావున వినుమని ఇట్లు చెప్పసాగెను.
వసువు పలికెను: కాశీపురము శుభప్రదము, ధన్యము మహేశ్వరదేవుడు ధన్యుడు. మహేశ్వరుడు విష్ణు పురమగు కాశిని సర్వకాలములందు సేవించుచుండెను. శ్రీహరి క్షేత్రమును యాచించి సనాతనుడగు హరుడు ఉండెను. హృషీకేశుని పూజించుచు, దేవాదులచే స్తుతింపబడుచుండెను. వారాణసీ నగరము అతిసుందరము. భువనత్రయ సారభూతము. సేవించిన వారికి సద్గతి ప్రదము. మహాపాతకులైననూ ఇచటికి వచ్చి పాపక్షయముచే నిష్కల్మషులై సన్మనస్కులగుదురు. ఈ క్షేత్రము అతి రమ్యతమము. సర్వప్రాణి సుఖావహము. సర్వప్రాణులకు మోక్ష ప్రదము. విష్ణు క్షేత్రము, శివక్షేత్రము కూడా. బ్రహ్మహత్య, గోహత్య, గురుతల్ప గమనము, మిత్ర ద్రోహము, న్యాసాపహారము, కుశిదాది నిషిద్ధ కర్మలను ఆచరించువాడు కూడా సంసార భూతదృఢ పాశవిముక్లదేహుడైననే శివపురియగు వారాణసిని చేరగలడు. సురసిద్ధ సేవితమగు ఈ క్షేత్రమును పూర్వజన్మ సుకృత వశమున చేరి దేవదానవులు అందరిలో ప్రసిద్ధి చెంది మరణించిన తరువాత పరమపదమును చేరును. హరి భక్తులైననూ హర భక్తులైననూ సుకృతులు ఈ క్షేత్రమున నివసించువారు ప్రతి దినము పవిత్రులై ఆదరముతో చూచువారు శంభుతుల్యులు అగుదురు. అట్టి మానవులు భయ దుఃఖపాప రహితులై సంసుద్ధ కర్మక్రియులై జనన మరణ రూపమగు సంసార జాలమును భేదించి పరమపదమును చేరెదరు. ఈ కాశీక్షేత్రము తూర్పు పడమరలలో రెండున్నర యోజనములు, దక్షిణోత్తరములలో అర్థయోజన విస్తార్ణముగా నున్నది. వారణాసి నది వరకు అసి అను శుష్కనది ఉండును. ఇది క్షేత్రవిస్తారము అని శంకరుడు చెప్పెను. ఉత్తరాయణము తరువాత తిమి చండీశ్వరము, దక్షిణమున శంకుకర్ణము, తరువాత ఓం కారమున పింగలాతీర్థము, ఆగ్నేయమున లోలార్కుడున్నది శుష్కనదిగా తెలియవలెను. ఇడాయను నాడి సౌమ్య యనబడును. కేశవుడుండునది వరణానది. ఈ రెంటి మధ్యన నుండునది సుషుమ్నా అనబడును. దీనినే మత్స్యోదరీయందురు. దీనినే విస్వరమని కూడా అందురు. ఈ క్షేత్ర మెప్పుడూ విముక్తము కాలేదు. విముక్తము కాబోదు. కావున ఈ క్షేత్రమును అవిముక్త క్షేత్రమందురు దుస్తరమగు సంసారమును తరింపచేయుటలో ఈ క్షేత్రము ప్రయాగక్షేత్రము కంటే అతి విశిష్టమైనది. ఇచట ఆయాసము లేకుండగనే మోక్షము లభించును. నానావర్ణులు, వికర్ణులు, జుగుప్సితులు చండాలులు పాప పరిపూర్ణదేహులు మహాపాతకులు, వీరందరికి అవిముక్త క్షేత్రము పరమపదము. దుష్టులను, అంధులను, దీనులను, కృపణులను, పాపకారులను, దుష్కృత కారులను, అందరిని హరుడు పరమ కృపచే పరమగతిని పొందించును. ఈ క్షేత్రమధ్యము నుండి బయలు వెడలిన గంగానది సముద్రుని చేరినట్లు ఇచటివారు హరుని చేరెదరు. కావుననే ఈ పురి పుణ్యపురి అయినది. ఇచటి పవిత్ర గంగానది ఉత్తరాభిముఖిగా నుండును. సరస్వతీ నది ప్రాఙ్ముఖిగా నుండును. ఇచటనే శివుని హస్తము నుండి కపాలము విముక్తమాయెను. ఈ తీర్థమునకు వెళ్ళి పితరులను శ్రాద్ధములందు పిండ ప్రదానముచే ప్రీతి కలిగించువారికి ఉత్తమలోకములు ప్రాప్తించును. బ్రహ్మహంతకుడు ఈ క్షేత్రమును చేరినచో అవిముక్త క్షేత్ర మాహాత్మ్యముచే బ్రహ్మహత్య తొలగిపోవును. పుణ్యాత్ములు అవిముక్త క్షేత్రమును చేరినచో అక్షయులు అజరులు దేహరహితులగుదురు. తెలిసి కాని తెలియక కాని స్త్రీ కాని పురుషుడు కాని చేసిన కొద్ది యశుభకర్మ అవిముక్త క్షేత్రమును ప్రవేశించిన వెంటనే భస్మమగును. అవిముక్త క్షేత్రమున నివసించు మానవుడు ఎప్పుడూ యజ్ఞదానతపములను చేయును. ఆ విముక్త వాసులకు లభించు సద్గతి కురుక్షేత్రమున గంగాద్వారమున, పుష్కరమున సంభవించదు. ఇచట నుండు వారి తపస్సు సత్యము సార్థకములగును. అ విముక్తమున నివసించువాడు సాక్షాన్మహేశ్వరుడే. అవిముక్త క్షేత్రమును సేవించని మూఢులు, తామసులు మలమూత్ర ధూళులలో మాటామాటికి నివసింతురు. అవిముక్తమున నివసించువారు, అవిముక్త క్షేత్ర పాంసువులచే వాయువుచే స్పృశించబడిన పాతకులు కూడా ఉత్తమగతిని పొందెదరు. అవిముక్త క్షేత్రమున నివసించు మానవుడు త్రైలోక్యభోజియైనను వాయు భక్షకునిగా గుర్తించబడును. ఈ క్షేత్రమున ఒక మాసము ఆహారము తీసుకొని నివసించువాడు చక్కగా మహాపాశుపత వ్రతమును ఆచరించినవాడే యగును. జన్మమృత్యు భయమును జయించి పరమగతిని పొందును. పవిత్రమగు నిశ్శ్రేయసగతిని యోగగతిని పొందును. వేల జన్మలచే కూడా పొంద శక్యముకాని యోగగతి ఈ క్షేత్రమాహాత్మ్యము వలన శంకరుని ప్రభావమువలన పొందగలుగును. ఈ క్షేత్రమున ఒక పూట మాత్రమే భుజించుచు ఒక మాసమున్నచో యావజ్జీవితమున చేసిన పాపము ఒకే మాసమున నశించును.
ఈ క్షేత్రమున పుట్టినవాడు జీవితాంతము ఈ క్షేత్రమును విడువక బ్రహ్మచర్యముచే యుండినచో అతను సాక్షాత్తు శంకరుడే యగును. విఘ్నములు కలుగుచున్ననూ విముక్తమును వదలనివాడు అజరామృత్యువులను నశ్వరమగు జన్మను వదులును. పుట్టినప్పటి నుండి అవిముక్తమును సేవించు వారు హంసయానముచే దివ్యలోకములను పొందెదరు. విసయాస్తచిత్తుడు భక్తి రహితుడైననూ ఈ క్షేత్రమున మరణించినచో మరల సంసారమును చూడడు. ఈ పుణ్యతీర్థము స్వర్గాపరవర్గములకు హేతువు. ఈ తీర్థమున మరణించినవారికి ముక్తి తప్పక లభించును. ఒక యోగి వేల జన్మలచే పొందని దానిని ఈ క్షేత్రమున మరణించినవాడు పొందును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వర్ణసంకరులు, క్రిములు, మ్లేచ్చులు, సంకరులు, పాపులు, కీటకములు, పిపీలికలు, ఇతర మృగపక్షులు కూడా కాలవశమున నిధనమును పొందిననూ వారు దేవేశ్వరులుగా తలచబడుదురు. వారందరూ చాంద్రార్ధ మౌళులు, లలాటాక్షులు, వృషధ్వజులుగా అగుదురు. ఈ క్షేత్రమున యధార్ధముగా ప్రాణములను విడిచిన వారు రుద్రత్వమునుపొంది శివ సన్నిధిలో ఆనందింతురు. అకాముడు కాని, సమకాముడుకాని, పశుపక్ష్యాదుల లోని వారు కాని అవిముక్త క్షేత్రమున ప్రాణములు విడిచిన ముక్తిని పొందును. ఇతర భక్తులు కాక శివభక్తిపరులు, శివచిత్తులు, శివగత ప్రాణులు జీవన్ముక్తులే. అవిముక్తమున విచారించక అగ్ని ప్రవేశమును చేసినవారు కాలాగ్ని రుద్ర సాయుజ్యమును పొందెదరు. శివభక్తులు దృఢ నిశ్చయముతో నిరాహారులుగా ఉన్నచో వారికి కల్పకోటి శతములకు కూడా పునర్జన్మ కలుగదు. అవిముక్త క్షేత్రమున మృత్యుకాలమున భూతాధితి స్వయముగా శ్రీరామచంద్రుడు శివకారియగు శివునకు అతిప్రసన్నచిత్తముతో అవిముక్తనివానికి ఉపదేశించెను. మరణించ బోవువాడు ఎవడైననూ వాని కుడిచెవిలో నా మన్త్రమును ఉపదేశించినచో ముక్తుడగును. కర్మలు క్షీణించగా అంత్య కాలమున ప్రాణవాయువు గతించుచుండగా స్మృతి కలుగదు. అవిముక్తమున నుండు రుద్రభక్తులు, వారికి ప్రీతిని కలిగించువారు డిమి చండీశ్వరాదులు కర్ణమున మంత్రమును ఉపదేశింతురు. అవిముక్తమున మృతి చెందినవాడు ఎవ్వడు నరకమునకు వెళ్ళడు. అందరూ ఈశ్వరానుగ్రహమున ఉత్తమగతిని పొందెదరు. నీకిప్పుడు ఇట్లు సంక్షేపముగా అవిముక్త తీర్థ గుణములను వివరించితిని.
సముద్రమున రత్నములవలె అవిముక్తమున గుణవిస్తారము కలదు. జ్ఞాన విజ్ఞాన నిష్ఠులకు పరమానందమును కోరువారికి ఉండు బుద్ధి ఈ క్షేత్రమున ప్రాణములు విడిచిన వాడు మరల పుట్టడు. అట్టి వానికి యోగులకు లభించు అనంత గతి లభించును. ఇచట శ్మశాన మనునదే యోగ పీఠము. ఇదియే మణికర్ణికా తీర్థము. స్వకర్మలచే పతితుతులగు వారికి ఈ క్షేత్రములలో ముక్తి ఉద్దేశించబడినది. మరియు అన్ని తీర్థములలో మణికర్ణిక ఉత్తమ తీర్థము. ఇచట నిత్యము ధూర్జటి సన్నిహితునిగా ఉండును. మణికర్ణికా తీర్థమున స్నానమాడిన వానికి దశాశ్వమేధ ఫలము లభించును. ఈ తీర్థమున స్వధనమును దానము గావించినవాడు శుభగతిని పొందును. అగ్నివలె ప్రకాశించును. ఇచట ఉపవసించి బ్రాహ్మణ సంతర్పణమును గావించినవాడు ఇంద్రయాగ ఫలమును పొందును. ఇచట దీప దానమును చేసిన ఇంద్రియము జ్ఞానవత్తుగా శోభించును. ధూప దానముచే రుద్రసేవిత స్థానమును పొందును. తరుణము సౌమ్యము నాలుగు వర్షముల ఈడుగల వృషభమును చిహ్నితము చేసి విడిచినవాడు మోక్షమును పొందును. ఇంకనూ ఏమి చెప్పవలెను. శివాదులను ఉద్దేశించి ధర్మాదులను చేయువారికి అనంత ఫలము కలుగును. పుష్ప దానమున దశాశ్వమేధ ఫలము, ధూప దానమున అగ్నిహోత్ర ఫలము, గంధార్పణచే భూదాన ఫలము, మార్జనమున గోదాన ఫలము కలుగును. అనులేపనమున పదిరెట్లు, మాల్య సమర్పణము పదిరెట్లు, మహాదేవుని అర్చనలో, స్తుతిలో, గీతములో వేయిరెట్లు వాద్యమున లక్షరెట్లు ఫలము లభించును. వారు సర్వపాప వినిర్ముక్తులై జరామరణ రహితులై స్వర్గమున నుందురు. అవిముక్తమున చేరి లింగమును పూజించువారికి కల్పకోటి శతములకు కూడా పునర్జన్మ రాదు. జరామరణ వర్జితుడై శివ సన్నిధిలో ఆనందించును. ధ్యానమునుపొంది, జితేంద్రియులై, సావధానులై, ఇంద్రియములను నిగ్రహించి శతరుద్రియమును జపించువారు అవిముక్త స్థితులు కృతార్థులు అగుదురు. ఇచట ఒక దినము ఉపవసించిననూ శతవర్షోపవాస ఫలమును పొందును. ఇక తరువాత చేరవలసినది గంగావరుణ సంగమము. బుధవారము శ్రవణ ద్వాదశీ యోగము కలిగినచో ఆనాడు ఇచట స్నానమాచరించి ఉత్తమ ఫలితమును పొందును. ఈ సమయమున ఇచట శ్రాద్ధమును ఆచరించిన పితరులను తరింపచేసి విష్ణు లోకమునకు వెళ్ళును. వారణాసి జాహ్నవుల సంగమము లోక విశ్రుతము. ఇచట అశ్వదానమును గావించిన వాడు మరల పుట్టడు. భక్తి గలవాడు ఇచట సంగమేశుని పూజించినచో, స్వయముగా అతడు దేవదేవేశుడు నిగ్రహానుగ్రహ సమర్థుడు అగును. దేవేశ్వరునికి పూర్వ భాగమున కేశవుడు ఉండును. కేశవునకు పూర్వ భాగమున సంగమేశ్వరుడు ఉండును. (II/48)