నారద మహా పురాణము
ద్వాదశమాసస్థ పంచమివ్రత నిరూపణము
సనాతన మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా ! ఇపుడు నీకు పంచమీ వ్రతములను చెప్పెదను వినుము. ఈ వ్రతములను భక్తితో ఆచరించినవారు అన్ని వాంఛితములను పొందగలరు. చైత్ర శుద్ధపంచమిని మత్స్యజయంతి అందురు. ఈ దినమున భక్తులు మహోత్సవముగా మత్స్యావతార పూజను చేయవలెను. ఈ పంచమినే శ్రీ పంచమి అని కూడా అందురు. ఈ దినమున శ్రీ అర్చన చేయవలెను. గంధాది ఉపచారములచే పాయసాదుల నైవేద్యములచే లక్ష్మీదేవిని పూజించువానిని లక్ష్మీదేవి విడిచిపెట్టదు. అట్లే పృథ్వీ వ్రతమును, చాంద్ర వ్రతమును, హయగ్రీవ వ్రతమును ఆయా వ్రత విధానములచే ఆయా సిద్ధులను కోరువారు ఆచరించవలెను. ఇక వైశాఖ శుద్ధ పంచమినాడు ఆదిశేషుని పూజించిన అభీష్ట ఫలమును పొందును. జ్యేష్ఠ శుద్ధ పంచమినాడు పితృ దేవతలను పూజించి బ్రాహ్మణులకు భోజనమును పెట్టినచో సర్వకామ ఫలములను పొందగలుగును. ఆషాఢ శుద్ధ పంచమిన సర్వవ్యాపియగు వాయుదేవుని, గ్రామము నుండి వెలుపలకు వచ్చి భూమి మీదకూర్చుని వంశదండాగ్రమున పంచవర్ణములుగల ధ్వజము నేర్పరచి, మధ్య భాగమున పద్మమును కల్పించి, ఆ మూలదేశమున, అన్ని దిక్కులయందు, లోకపాలకులను పూజించి, వాయు పరీక్షణమును చేయవలయును. ప్రథమాది యామములలో ఏ ఏ వాయువు వచ్చునో ఆయా దిక్పతులకు పూజను గావించవలెను. ఇట్లు అచట నిరాహారముగా నాలుగు ఝాములుండి, సాయంకాలమున స్వగృహమునకువచ్చి సావధానముతో స్వల్పముగా భుజించి, లోకపాలకులకు నమస్కరించి, పవిత్రమగు భూమిపై పరుండవలెను. ఆ రాత్రి నాలుగవ ఝామున వచ్చిన స్వప్నమే నిజమగునని శివుడు చెప్పెను. అశుభ స్వప్నమువచ్చినచో శివపూజను గావించుచు ఎనిమిది ఝాములుకాని ఆ దినము మొత్తము కాని గడుపవలెను. ఎనిమిది మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టి శుభములను పొందవచ్చును. ఈ వ్రతము శుభాశుభములకు నిదర్శనముగా చెప్పబడినది. ఇహపర లోకములలో మానవులకు సౌభాగ్యజనకము. శ్రావణ బహుళ పంచమినాడు చేయు వ్రతము అన్న సమృద్ధిని ఇచ్చునది. చతుర్థీ దిన శేషమున అన్ని విధములగు అన్నములను వేఱువేఱు పాత్రలలో నుంచి వీటితో తడుపవలెను. తరువాత ఇతర పాత్రలలోనికి ఆ యన్నములను తీపిజలములను ఉంచవలెను. ప్రాతః కాలమున సూర్యోదయ కాలమున పితృదేవతలను, ఋషులను దేవతలను చక్కగా పూజించి స్నానాదులను చేయించి నైవేద్యముగా ఆ యన్నములను ఉంచవలెను. తరువాత సంతోషముతో ఆ అయన్నములను యాచకులకు పెట్టవలెను. ఇట్లు దినమంతయు గడిపి, ప్రదోష కాలమున శివాలయమునకు వెళ్ళి లింగరూపియగు ఈశ్వరుని గంధపుష్పాదులతో చక్కగా పూజించి, నూరుమార్లుకాని, వేయిమార్లుకాని పంచాక్షరీ మంత్రమును జపించవలెను. ఆ జపమును భవరూపియగు భవునకు నివేదించవలెను. సావధానమనస్కుడై వైదిక మంత్రములచే పౌరాణిక మంత్రములచే స్తుతించి, ఎల్లకాలము అన్ని అన్నములు నాకుప్రతి జన్మలో సమృద్ధిగా లభించవలెను. శారదాన్నములు, వాసంతికాన్నములు లభించుటకు ఈశ్వరుని ప్రార్థించవలెను. శారదాన్నములు, వాసంతికాన్నములు ఇంకా ఈ ప్రపంమునున్న అన్ని అన్నములు నాకు ప్రతిజన్మలో సమృద్ధిగా లభించవలెను అని ఈశ్వరుని ప్రార్థించి తన గృహమున కొచ్చి బ్రాహ్మణాదులకు పక్వాన్నమును పెట్టి తాను భుజించవలెను. ఇట్లు ఈ అన్నవ్రతమును విధిగా ఆచరించిన వారు సర్వాన్న సంపదలను ఇహలోకమున పొంది పరలోకమున ఉత్తమగతిని పొందుదురు. ఇక శ్రావణ శుక్ల పంచమినాడు ఆస్తికులైన నరులు ద్వారమునకు రెండు ప్రక్కలా గోమయముతో సర్పములను లిఖించి గంధాదులచే పూజించి శచీదేవిని పూజించవలెను. స్వర్ణ రూప్యములతో దధి అక్షతకుశ అంబు గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలను అర్పించి, ప్రదక్షిణముగావించి, ఆ ద్రవ్యమును భక్తి భావముతో బ్రాహ్మణులకు నమస్కరించి సమర్పించవలెను. ఇట్లు బ్రాహ్మణాధీనము చేసిన స్వర్ణ రూప్యాది ద్రవ్యము నాకు ప్రతి జన్మలోను అనన్త ఫలప్రదమగు గావుత అని భావించి భక్తిచే ద్రవ్య దానము చేయువానికి ధనాధ్యక్షుడు ప్రసన్నుడై స్వర్ణాది ద్రవ్య సమృద్ధిని కలిగించును. ఈ వ్రతమును మానవుడు ఆచరించి, బ్రాహ్మణులకు భోజనమును పెట్టి కుటుంబ బంధుమిత్రులతో కలిసి తానూ భుజించవలెను. భాద్రపద కృష్ణ పంచమినాడు నాగులకు పాలతో తర్పణము గావించవలెను. ఇట్లు చేసిన ఆ వంశములో ఏడుతరముల వరకు సర్వభయము ఉండదు. భాద్రపద శుద్ధ పంచమినాడు ఋషివర్యులను పూజించవలెను. ప్రాతః కాలమున సద్యాదులందు స్నానము కావించి నిత్య కృత్యములను జాడ్యము లేక ఆచరించి, గృహమయునకువచ్చి, శ్రద్ధగా మట్టితో వేదికను ఏర్పరచి, గోమయముతో అలికి, పుష్పములతో అలంకరించి, దానిపై దర్భలను పరిచి సప్త ఋషులను గంధపుష్ప దూప దీపములచే చక్కగా పూజించవలెను. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర గౌతమ, జమదగ్ని, వసిష్ఠులు సప్త ఋషులుగా ప్రసిద్ధులు, వీరికి విధిగా కల్పించిన అర్ఘ్యమును ప్రదానముచేసి, పండించని శ్యామాకాదులచే నైవేద్యమును సిద్ధముచేసి నివేదించి, వారిని విసర్జన కావించి, దానినే తాను భుజించవలెయును. ఇట్లు ఈ విధిచే ఏడు సంవత్సరముల కాలము ప్రతి సంవత్సరము ఆచరించి వ్రతాంతమున సప్త ఆచార్యులను వరించవలెను. స్వశక్తి కొలది బంగారముతో ఏడు ప్రతిమలనుచేసి, ఆ ప్రతిమలను జటిలులుగా అక్షసూత్రధారులుగా కమండల ధారులుగా నిర్మించి, కలశములందు వీరిని స్థాపించి (తామ్రములుకాని మృణ్మయములు కాని కలశములు) భక్తితో యధావిధిగా వేరువేరుగా పంచామృతములచే స్నానము చేయించి, షోడశోపచారములచే భక్తి భావముచే పూజించి అర్ఘ్యమునిచ్చి తిలవ్రీహియవాదు లచే 'సహస్తోమా' అను ఋక్కుచేకాని నామ మంత్రములచేకాని హోమముకావించి, పూర్ణాహుతిని ఆచరించి, తరువాత వస్త్రాలంకార యుతములగు ఏడు గోవులను దానము చేయవలెను. వస్త్రాలంకార భూషణములతో ఆచార్యుని పూజించవలెను. గురువుగారి అనుజ్ఞతో ప్రతిమలను బ్రాహ్మణులకు దానము గావించవలెను. ఆ బ్రాహ్మణులకు భోజనము పెట్టి నమస్కరించి విసర్జించవలెను. అపుడు బ్రాహ్మణ శేషముతోను ఇష్టబంధు జనముతోను కలిసి భుజించి ఆనందించవలెను. ఈ వ్రతమును సాంగోపాంగముగా ఆచరించి ఇహలోకమున వాంఛిత భోగములను అనుభవించి దేహాంతమున సప్తర్షుల ప్రభావము వలన విమాన వరమును అధిష్ఠించును. అశ్వయుజ శుక్ల పంచమినాడు ఉపాంగలలితా వ్రతము చెప్పబడినది. స్వర్ణముతో లలితామూర్తి నేర్పరచి షోడశోపచారములతో పూజించి ఫలసంయుక్తమగు పక్వాన్నమును సఘృతముగా దక్షిణా సహితముగా బ్రాహ్మణోత్తమునకు దానము కావించవలెను. సవాహన శక్తియుతముగా వరదురాలు నా చేతపూజించబడినది. నన్ను అనుగ్రహించి నీ మందిరమునకు వెళ్ళుము అని ప్రార్థించవలెను. కార్తిక శుక్ల పంచమినాడు సాటిలేని జయా వ్రతమును పాపనాశము కొఱకు ఆచరించవలెను. జయాదేవిని శ్రద్ధగా సావధానముగా యధావిధిగా షోడశోప చారములచే పూజించి, పవిత్రుడై, అలంకరించుకొని. ఒక బ్రాహ్మణునికి భోజనము పెట్టి దక్షిణనిచ్చి విడిచి, తాను మౌనముగా భుజించవలెను. జయా దినమున భక్తి కలవాడై స్నానముచేసిన వాని పాపములు సింహము ఆక్రమించిన మృగములవలె పారిపోవును. అశ్వమేధ యాగావ భృధస్నానమున కలుగు ఫలము జయాదినమున స్నానము చేసిన కలుగును. పుత్రులు కలిగెదరు. గొడ్రాలు గర్భమును పొందును. రోగి రోగమునుండి విముక్తుడగును. బంధనము కలవాడు బంధనము నుండి విముక్తుడగును. మార్గశీర్ష శుక్ల పంచమినాడు యథావిధిగా నాగులను పూజించి నాగులనుండి అభయమును పొంది బంధు మిత్రాదులతో ఆనందించును. పుష్య శుద్ధ పంచమినాడు మధుసూదనుని పూజించి వాంఛితములను పొందును. ఇట్లు ప్రతి మాసమున శుక్ల కృష్ణ పంచముల యందు పితృ దేవతలను నాగులను పూజించుట ప్రశస్తము. (4/114)