నారద మహా పురాణము
సృష్టి భరతఖండ ప్రాశస్త్యం
నారదుడు అడిగెను: మొదట ప్రభువు ఆదిదేవుడైన శ్రీమన్నారాయణుడు బ్రహ్మాదులను ఎట్లు సృజించెను? నీవు సర్వజ్ఞుడవు కావున నాకు అంతయూ ఎరిగింపుము.
శ్రీ సనక మహర్షి చెప్పెను: అంతము, నాశము లేనివాడు, అంతటా వ్యాపించి ఉండువాడు దేనితో సంబంధము లేనివాడు అయిన శ్రీమన్నారాయణుడు స్థావరజంగ మాత్మకమగు ఈ జగత్తు నంతటినీ వ్యాపించియున్నాడు. జగత్స్వరూపుడు, స్వయంప్రకాశుడు అగు మహావిష్ణువు ఆది సృష్టిలో సత్త్వరజస్తమోగుణముల భేదములను ఆధారముగా చేసుకొని విష్ణువు, బ్రహ్మ, రుద్రుడు అను మూర్తిత్రయమును సృష్టించెను. శ్రీమన్నారా యణుడు జగత్సృష్టి కొరకు పూర్వము తన దక్షిణశరీరము నుండి బ్రహ్మను, శరీర మధ్యభాగము నుండి జగదంతకరుడగు రుద్రుడను పేరుగల ఈశ్వరుని, వామశరీర భాగము నుండి జగత్పాలనకొఱకు విష్ణువును సృష్టించెను. ఆదిదేవుడు జన్మజరాది రహితుడు అగు శ్రీమన్నారాయణుడు. కొందరు శివుడందురు. కొందరు విష్ణువందురు. మరికొందరు బ్రహ్మ అనెదరు. జగత్తును ప్రవర్తింపచేయు శ్రీమహావిష్ణువు శక్తి అన్నిటికంటే పరమైనది. ఆ శక్తి భావస్వరూపమని, అభావస్వరూపమని, విద్య అని అవిద్య అని కీర్తించబడును. ఈ ప్రపంచము మహావిష్ణువు కంటే వేఱుగా తోచినపుడు దుఃఖ సాధనమైన ఆవిద్య సిద్దించును. తెలియునది, తెలియువాడు అను ఉపాధి నశించినపుడు అంతా ఒకటే మహావిష్ణు మయము అను బుద్ధికలుగునపుడు దానిని విద్య అందురు. ఇట్లు మహావిష్ణువు మాయయే భిన్న రూపముగా సంసారము ఇచ్చును. అభేద బుద్ధిచే చూచినచో ఆ మాయయే సంసారమును నశింపచేయును.
ఈ చరాచర జగత్తంతయు విష్ణుశక్తి వలన పుట్టినదే. చలించునది, చలించనిది అయిన ఈ జగత్తంతా విష్ణువు కంటె భిన్నముగా కనబడుచున్నది. ఘటపటాది ఉపాధులచే ఎట్లు ఆకాశము భిన్నముగా తోచునో, అట్లే అవిద్య ఉపాధి భేదముచే ఈ జగత్తు భిన్నముగా తోచును. విష్ణువు జగత్తును అంతటిని వ్యాపించి యున్నట్లు అతని శక్తి కూడా జగత్తును వ్యాపించి ఉండును. అగ్నిలో ఉన్న దాహశక్తి అగ్ని ఆశ్రయమును వ్యాపించి యుండును కదా. ఈ శక్తిని కొందరు ఉమ అని, మరి కొందరు లక్ష్మి అని, ఇతరులు భారతి అని, కొందరు గిరిజ, అంబిక అని అందురు. కొందరు దుర్గ, భద్రకాళి, చండి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఐంద్రి, శాంభవి, బ్రాహ్మి, విద్య, అవిద్య, మాయ అని అందురు. పరమ ఋషులు మాత్రము దీనిని ప్రకృతి అని పరా అని అందురు. విష్ణువుయొక్క ఈ శక్తి అన్నిటికంటే పరమైనది. ఇదియే జగత్సృష్టి స్థితి లయములను చేయును. ఈ శక్తియే వ్యక్త రూపముతో, అవ్యక్త రూపముతో జగమున వ్యాపించి ఉండును. ఈశక్తియే ప్రకృతి, పురుషుడు, కాలము అని మూడు విధముల వస్తుస్థితి ఉండి సృష్టిస్థితి లయము లకు కారణము అగుచున్నది. ఈ జగత్తును సృష్టించిన బ్రహ్మరూపధరుని కంటే పరతరుని నిత్యుడు అందురు. ఈ జగత్తును రక్షించు దేవుని నిత్యుండు అందురు. అన్ని జగత్తులను రక్షించువాడు అందరి కంటే పరుడైనవాడు పురుషుడు. అతని కంటే పరుడే అవ్యయుడు పరముడు అందురు.
నాశరహితుడు, గుణరహితుడు, శుద్ధుడు, పరిపూర్ణుడు, సనాతనుడు, పరము కంటే పరుడు యోగులచే ధ్యానింతగినవాడు కాలనామము కలవాడు పరమాత్మ, పరానందుడు ఉపాధులేవీ లేనివాడు, జ్ఞానముతో మాత్రమే తెలియతగినవాడు పరముడు సచ్చిదానంద స్వరూపుడు పరమాత్మ శుద్ధుడైనను అహంకారముతో సంబంధముచేత దేహి (జీవుడు) అని అనబడుచున్నాడు. అజ్ఞానప్రవృత్తి వింత కదా! అన్నిటికంటే పరముడైన ఆ ఆదిదేవుడు సత్త్వరజస్తమోగుణ భేదముల వలన సృష్టి స్థితిలయములను చేయు విష్ణు బ్రహ్మ శివాఖ్యములగు మూడు మూర్తుల రూపమును పొందెను. జగత్తును సృష్టించిన బ్రహ్మ ఎవని నాభి కమలమునుండి పుట్టెనో అతనే ఆనందస్వరూపుడు పరమాత్మ. అతని కంటే భిన్నుడు ఇంకొకడు లేడు. ఆ పరమాత్మయే అంతర్యామిగా జగత్తును వ్యాపించి ఉండును. సర్వసాక్షి అయిననూ దేనితో సంబంధములేనివాడు. ఈ పరమేశ్వరుడే (జగజ్జీవాదుల కంటే) భిన్నరూపముతో అభిన్నరూపముతో ఉండును. ఈ పరమాత్మశక్తి అగు మహామాయయే జగత్స్వరూపమును ధరించును. ప్రపంచము పుట్టుటకు మూల కారణము కావున పండితులు ఈ మాయను ప్రకృతి అందురు. మహావిష్ణువు అదిసృష్టిలో లోకములను సృజించుటకు సంకల్పించి ప్రకృతి, పురుషుడు, కాలము అని మూడువిధములు అయ్యెను. ఆత్మస్వరూపమును తెలిసినవారు ఇతనినే బ్రహ్మ అని అందురు. పరిశుద్ధమైన ఈ పరంధామమే పరమపదమని పిలువబడును. ఈ పరమాత్మ పరిశుద్ధుడు అక్షరుడు, అనంతుడు, కాలరూపి, మహేశ్వరుడు, గుణరూపి, గుణములకు ఆధారము, జగత్తును మొదట సృజించినవాడు. జగత్తులకధిపతి.
పురుషుడను పేరుగల జగద్గురువునందు క్షోభ (కదలిక) చెందిన ప్రకృతినుండి మహత్తత్త్వము అను బుద్ధి పుట్టెను. మహత్తత్త్వమునుండి అహంకారము పుట్టెను. అహంకారము నుండి సూక్ష్మ ములైన పంచతన్మాత్రలు, ఇంద్రియములు పుట్టెను. ఈ జగత్సృష్టి కొఱకు తన్మాత్రలనుండి పంచ భూతములు పుట్టెను. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అను పంచభూతములు వరుసగా ఒక్కొక్కదానికి కారణములగును. అనగా ఆకాశమునుండి వాయువు, వాయువునుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి పుట్టినవని భావము. తరువాత జగత్తును సృష్టించు బ్రహ్మ తమోగుణ భూయిష్ఠములైన తిర్యగ్జంతువులగు పశుపక్షిమృగాదులను సృష్టించెను. అది తన కార్యసాధనము కాదని భావించిన బ్రహ్మ దేవతలను సృజించెను. పిమ్మట మానుషసృష్టిని కావించెను. తరువాత సృష్టిని సాధించుటయందు తత్పరులైన దక్షాది పుత్రులను సృష్టించెను. దేవదానవమానవాత్మకమగు ఈ ప్రపంచమంతయు ఈ పుత్రులచే వ్యాపించబడెను. భూలోకము భువర్లోకము, స్వర్ణలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అను ఏడు లోకములు ఉపరిభాగమున ఉన్నవి. అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాళము అనునవి ఏడు క్రింది భాగమున నున్న పాతాల లోకములు. ఈ అన్ని లోకములందును లోకనాథులను కూడా సృష్టించెను. ఆయా లోకములలో నివసించువారికొఱకు కుల పర్వతములను నదులను కూడా సృష్టించెను. ఆయా లోకములలో నివసించువారికి యోగ్యముగా ప్రవర్తన మొదలగు వాటిని కూడా ఏర్పరిచెను.
భూమండలమున మధ్యభాగమున దేవతలందరికి ఆశ్రయమైన మేరుపర్వతము ఉన్నది. భూమి చివర లోకాలోక పర్వతమున్నది. భూమి మధ్యభాగమున ఏడు సముద్రములు కలవు. ఓ బ్రాహ్మణోత్తమా! ఈ భూమండలమున ఏడు ద్వీపములు కలవు. ప్రతి ద్వీపమున కులాచలములు కలవు. ఈ భూమండలమున చక్కని ప్రవాహములుకల నదులు కలవు. ఇచటి జనులు దేవతా సములు, జంబూద్వీపము, ప్లక్షద్వీపము, శాల్మల ద్వీపము, కుశద్వీపము, క్రౌంచద్వీపము, అశోక ద్వీపము, పుష్కర ద్వీపము అను ఏడు ద్వీపములు దేవనివాసములు. ఈ ఏడు ద్వీపములు ఏడు సముద్రములచే చుట్టబడి ఉన్నవి. లవణ సముద్రము, ఇక్షు సముద్రము, సురా సముద్రము, సర్పి సముద్రము, దధి సముద్రము, క్షీర సాగరము, జల సముద్రములు అని ఏడు సముద్రములు. లోకాలోక పర్యతము వరకు ఈ ఏడు ద్వీపములు, సముద్రములు మొదటి దానికంటే రెండవది ఈ విధముగా రెట్టింపు విస్తారము కలవి. ఉప్పు సముద్రమునకు ఉత్తర భాగమున హిమాద్రికి దక్షిణ భాగమున భారత వర్షము కలదు. ఈ భారతవర్షము అన్ని కర్మల ఫలము ఇచ్చునది. ఓ నారదా! ఈ భారతవర్షమున మూడు విధములైన కర్మలను (కాయిక వాచిక మానసిక) చేయుదురు. ఆ కర్మల ఫలమును భోగరూపముగా భూరూపముగా ధనరూపముగా వరుసగా అనుభవింతురు. భారతవర్షమున చేయు శుభాశుభ కర్మల ఫలమును ప్రాణులు మరొకచోట అనుభవింతురు. ఇప్పటికీ దేవతలు భారతభూమిలో పుట్టవలయునని కోరుచుందురు. ఈ భూమిపై సంపాదించిన పుణ్యము, అక్షయము, అమలము శుభము అగును. భారతవర్ష భూభాగమున ఎపుడు పుట్టెదమా! ఎపుడు గొప్ప పుణ్యముతో పరమపదమును చేరెదమా! అని దేవతలు ఆశింతురు.
నిత్యానందస్వరూపుడు, శుద్ధుడు, జగదీశ్వరుడైన శ్రీహరిని పలువిధములైన దానములచేత కాని, యజ్ఞములచేత కాని, తపములచేత కాని ఆరాధించి ఎప్పటికైన అతనిని చేరగలమా అని దేవతలు కోరుకొనుచుందురు. భారత భూమిలో పుట్టి విష్ణుపూజారతుడైనచో వానితో సాటివచ్చువాడు మూడులోకములలో మరి ఎవడు ఉండడు. హరిని కీర్తించు స్వభావము కలవాడు కాని, హరిభక్తులకు ప్రీతిపాత్రుడుకాని, మహాత్ములను సేవించువాడు కాని దేవతలచే కూడా నమస్కరింపతగినవాడు అగును. హరిని పూజించుట యందు ఆసక్తిగలవాడు, హరిభక్తులను పూజించకోరువాడు, హరిభక్తులు తినగా మిగిలిన అన్నమును తినువాడు శ్రీమహావిష్ణువు నివసించు పరమపదమును చేరును. నారాయణ కృష్ణ, వాసుదేవ అని శ్రీహరిని కీర్తించువాడు అహింసను ఆశ్రయించి శాంతుడుగా ఉండువాడు దేవతల చేత కూడా నమస్కరించ తగినవాడు అగును. శివా, నీలకంఠా, శంకరా అని కీర్తించువాడు సర్వప్రాణుల హితమును కోరువాడు దేవతల పూజలు అందతగినవాడగును. గురువు యందు భక్తికలవాడు, శివుని ధ్యానించువాడు తన ఆశ్రమాచారములయందు ఆసక్తడు, అసూయలేనివాడు, పవిత్రుడు, సమర్థుడు అయినవాడు కూడా దేవతలచే పూజించదగినవాడు. బ్రాహ్మణులకు హితమును చేయువాడు, వర్ణ ధర్మములయందు శ్రద్ధకలవాడు ఎల్లప్పుడు వేదాధ్యయనమునం దాసక్తి కలవాడు ఎల్లపుడు పంక్తిపావనుడే. నారాయణ శివరూపములతో నున్న ఆదిదేవుని అభేదమును చూచువాడు ఎల్లపుడు చతుర్ముఖ బ్రహ్మచేతగూడ నమస్కరింప దగినవాడగును. ఇక మన విషయమేమి చెప్పగలము? ఓ నారదా! ఆవులయందు క్షమాశీలుడు, బ్రహ్మచారి, పరనిందను వదలినవాడు ఎవరి నుండి దేనిని గ్రహించనివాడు దేవపూజ్యుడు. చౌర్యము మొదలగు దోషములయందు విముఖుడు, కృతజ్ఞుడు, సత్యమును మాత్రమే మాట్లాడువాడు, పరి శుద్ధుడు, పరోపకారము నందు ఆసక్తి కలవాడు దేవదానవులందరిచే పూజించదగినవాడగును. వేదార్థములను వినుటయందు, పురాణములను వినుటయందు, సజ్జన సాంగత్యమునందు ఆసక్తికలవాడు కూడా దేవతలచే కూడా పూజించదగినవాడగును. ఇటువంటి పనులను అనేకములను శ్రద్ధతో భారతవర్షములో చేయుచు ఋషులతో సంబంధమును ఏర్పరచుకొనిన వాడు ఉత్తముడు. భారత వర్షములో పుట్టి శ్రద్ధతో ఇట్టి పనులు చేయువాడు మనకు నమస్కరింపతగినవాడు. పైనచెప్పిన పనులలో ఏ ఒక్క పనిని కూడా చేయనివాడు మహాపాపి. మూర్ఖుడు కూడ. అతని కంటే అజ్ఞాని మరియొకడు ఉండడు. భారతవర్షములో పుట్టి కూడా మంచి కర్మలయందు ఆసక్తిలేని వాడు అమృతకలశమును వదిలిపెట్టి విషభాండమును ఆశ్రయించిన వాడు అగును. శ్రుతి స్మృతులచే చెప్పబడిన ధర్మములతో తనను పవిత్రుని చేసుకొననివాడు ఆత్మఘాతి, పాపులలో మొదటివాడగును. కర్మభూమిలో పుట్టి కూడా ధర్మమును ఆచరించనివాడు అందరిలో అధముడుగా వేదజ్ఞులచే చెప్పబడును. శుభకర్మలను వదిలి చెడుపనులను చేయువాడు కామధేనువును వదిలి జిల్లేడు పాలను వెతుకువాడు అగును. ఇట్లు బ్రహ్మాదిదేవతలు తమ భోగము క్షీణించును అను భయముచే భారత భూభాగమును ప్రశంసించెదరు.
కావున భారతవర్షము అన్నిటికంటే ఉత్తమము, పరమ పవిత్రము అని తెలియుము. అట్లే అన్ని విధముల కర్మల ఫలములను ఇచ్చునది. దేవతలకు కూడా లభించ శక్యము కానిది. ఈ భారత భూభాగమున మంచి పనులను చేయసమకట్టిన వానితో సమానుడు మరియొకడు ఉండడు. ఈ భారత భూభాగమున పుట్టి కర్మలను క్షీణింపచేయదలచిన మానవుడు మానవరూపముతో ఉన్న శ్రీహరియే. ఈ విషయమున సందేహముతో పనిలేదు. పరలోక ఫలమును పొందగోరువాడు కూడా సోమరితనమును విడిచి కర్మలను చేయవలయును. చేసిన కర్మలను శ్రీహరికి సమర్పించినచో ఆ ఫలము తరగనిది అగును. కర్మఫలములలో ఆశలేనివాడుకూడా సత్కర్మలను ఆచరించి శ్రీహరి ప్రీతి చెందుగాక అని సుకృతములను శ్రీమన్నారాయణునకు సమర్పించవలయును. బ్రహ్మలోకము వరకు ఉన్న లోకములన్నియు పునర్జన్మను ఇచ్చునవే. కర్మఫలములను ఆశించనివాడు పునర్జన్మ లేని పరమపదమును పొందును. పరమేశ్వరుని ప్రీతికొరకు తన ఆశ్రమానుగుణముగా వేదవిహిత కర్మలను ఆచరించవలయును. కర్మ ఫలములను వదిలినవాడు పరమపదమును పొందును, కోరికలు ఉన్నవాడైనను లేనివాడైనను శాస్త్రము ననుసరించి కర్మలను ఆచరించియే తీరవలయును. తన ఆశ్రమాచారములను అనుసరించని వానిని పండితులు పతితుడందురు. సదాచారపరుడైన బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సుతో వృద్ధిచెందును. భక్తియుక్తుడైన వానికి శ్రీహరి సంతుష్టుడు అగును. ఓ నారద మహర్షీ! భారత వర్షమున పుట్టి అత్మను తరింపచేసు కొననివాడు సూర్యచంద్రులుండువరకు నరకమును అనుభవించుచుండును. ధర్మము వాసుదేవ స్వరూపము. తపస్సు వాసుదేవ స్వరూపము. జ్ఞానము వాసుదేవుని తెలుపునదే. వాసుదేవుని చేర్చునదే ఉత్తమగతి. స్థావర జంగ మాత్మకమగు ఈ ప్రపంచమంతయు వాసుదేవ స్వరూపమే. బ్రహ్మనుండి స్తంబమువరకున్న ఈ ప్రపంచము సర్వము వాసుదేవాత్మకమే. శ్రీహరి కానిదేదీలేదు. శ్రీహరియే బ్రహ్మ. శ్రీహరియే విష్ణువు. దేవదానవ యజ్ఞరూపములన్నియూ శ్రీహరియే. ఈ బ్రహ్మాండమంతయూ శ్రీమన్నారాయణుడే. శ్రీహరి కాని శ్రీహరికంటే వేరైనది ఏదియును లేదు. శ్రీహరి కంటేగొప్పది, తక్కువది ఏదియును లేదు. శ్రీహరి కంటే పెద్దది చిన్నది కూడా ఏదీలేదు. ఈ చిత్ర విచిత్రమైన ప్రపంచమందు అంతటనూ శ్రీమన్నారాయణుడు వ్యాపించి యున్నాడు. కావున చక్కగా స్తుతించదగిన శ్రీమన్నారాయణునికి నమస్కరించ వలయును. (1/3)