ద్వాదశమాసస్థిత చతుర్దశీవ్రత వర్ణనము

సనాతన మహర్షి పలికెను: ఓ నారదా! ఇపుడు నీకు చతుర్దశీ వ్రతములను చెప్పెదను వినుము. ఈ వ్రతములను ఆచరించిన మానవుడు సర్వకామలను పొందును. చైత్ర శుక్ల చతుర్దశినాడు కుంకుమాగరు చందనములచే, గంధాదులచే, వస్త్రమణులచే శివునకు మహాపూజను గావించవలెను. మాతృ దేవతలను వితానధ్వజ ఛత్రములనిచ్చి పూజించవలెను. ఇట్లర్చన గావించి ఉపవాసమును కాని ఏక భుక్తమును కాని ఆచరించవలెను. ఇట్లు చేసినచో అశ్వమేధాది యజ్ఞపుణ్యమును పొందును. ఈనాడే గంధపుష్పాదులచే దమనార్చన గావించవలెను. శివరూపియగు శివునకు పూర్ణిమనాడు దమనమును సమర్పించవలెను. వైశాఖబహుళ చతుర్దశినాడు ఉపవసించి సాయంకాలమున స్నానము చేసి ధౌత వస్త్రములను ధరించి శివలింగమును గంధాద్యుపచారములచే బిల్వపత్రములచే చక్కగా పూజించవలెను. ఇట్లే కృష్ణ చతుర్దశులలో కూడా ధనమును సంతానమును కోరువారు శివ వ్రతము నాచరించవలెను. వైశాఖశుద్ధ చతుర్దశినాడు శ్రీకృసింహ వ్రతము నాచరించవలెను. శక్తిగలవాడు ఉపవాసముతో, శక్తిలేనివాడు ఏకభుక్తముతో నాచరించవలెను. సాయంకాల సమయ మున రాక్షస సంహారకుడగు శ్రీనృసింహస్వామిని షోడశోపచారములతో, పంచామృత స్నానములతో పూజించవలెను. తరువాత ఈ మంత్రముతో క్షమాపణను వేడుకొనవలెను. చక్కగా పుటముపెట్టిన బంగారువన్నెగల కేశములుగల మండుచున్న అగ్నివంటి నేత్రములు కల వజ్రాయుధమును మించిన వాడిగల నఖముల స్పర్శగల ఓ నృసింహా! నీకు నమస్కారము. ఇట్లు దేవదేవుని చక్కగా ప్రార్థించి వ్రతము నాచరించువాడు భూమి మీద పరుండవలెను. ఇంద్రియజయము కలవాడై, కోపమును జయించి అన్ని భోగములను విడిచి వ్రతము ఆచరించవలెను. ఇట్లు ఈ వ్రతమును యధావిధిగా ఆచరించినవాడు ఇహమున అన్ని భోగములను అనుభవించి అంతకాలమున శ్రీహరి పదమును చేరును. ఈ దినముననే ఓంకారేశ్వర యాత్రను కూడా ఆచరించవలెను. ఇచట పూజ చేయుట దుర్లభము. దర్శనము సమస్త పాపహరము. ఇదియననేల? ఈ ధ్యానమున పూజధ్యానము, జపము, దర్శనము మొదలగునవన్నియూ నరులకు జ్ఞాన ప్రదములు మోక్షప్రదములు. అట్లే ఈ దినమున పాపనాశకమగు లింగవ్రతమును కూడా ఆచరించవలెను. శివలింగమును పంచామృతముతో స్నానము చేయించి, కుంకుమాదులతో చక్కగా అర్చించి, ధూప దీప నైవేద్యములతో, ఫలములతో, వస్త్ర విభూషణము లతో పిండితో చేసిన శివ లింగమును సర్వార్థ ప్రదమును చక్కగా పూజించిన వారు మహాదేవుని అనుగ్రహము వలన భుక్తిముక్తిని పొందెదరు. జ్యేష్ఠ శుక్ల చతుర్దశినాడు పగలు పంచాగ్ని మధ్యమున నిలిచి, రాత్రిముఖమున హోమధేనువును అర్చించవలెను. ఇదియే రుద్ర వ్రతము. ఆషాఢశుద్ధ చతుర్దశినాడు నరుడు దేశకాలోద్భవములను పుష్పములతో చక్కగా పూజించి సర్వసంపదలను పొందును. శ్రావణ శుద్ధచతుర్దశినాడు పవిత్రా రోపణము చేయవలెను. ఈ పవిత్రా రోపణమున తమతమ శాఖోక్త విధిననుసరించి చేయవలెను. పవిత్రమును శతాభిమంత్రి తమును గావించి దేవికి నివేదించవలెను. పవిత్రారోపణమును చేసిన స్త్రీకాని పురుషుడుకాని ఉమాదేవ్యనుగ్రహముతో భుక్తిముక్తులను పొందును. ఇక భాద్రపదశుక్ల చతుర్దశినాడు అనంత వ్రతము ఆచరించవలెను. గోధుమపిండి శర్కర నేయి కలిపి చక్కగా ఉడికించి మొదట గంధాదులతో చక్కగా పూజించి అనంతునకు నివేదించవలెను. పత్తితో కాని, చర్మముతో కాని నేర్పడిన దారమును పదునాలుగు ముడులు వేసి పాతదానిని తీసివేసి, జలాశయమున పడవేసి కొత్త కంకణమును పురుషునకు దక్షిణకరమున, స్త్రీకి వామకరమున కట్టవలెయును. పిండివంటను వండి దక్షిణ సహితముగా బ్రాహ్మణునకిచ్చి తాను మితముగా భుజించవలెయును. ఇట్లు పదునాలుగు సంవత్స రములు వ్రతము నాచరించి ఉద్యాపన గావించవలెను. ధ్యానవర్ణములతో సర్వతోభద్ర మండలమును నిర్మించి, ఆ మండలమున తామ్ర కలశమునుంచి, దానిపై బంగారముతో నిర్మించి అనన్త ప్రతిమను పీటపట్టాంశుకముతో అచ్ఛాదించి యధావిధిగా పూజించవలెను. గణేశుని, మాతృకలను, ఖేటమును, లోకపాలకులను విడివిడిగా పూజించవలెను. తరువాత హవిస్సుతో హోమమునుచేసి పూర్ణాహుతిని ఆచరించవలెను. చక్కగా అలంకరించిన శయ్యను, ధేనువును బంగారు ప్రతిమను గురువునకు సమర్పించవలెను. అట్లే పదునాలుగుమంది బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలతో సంతోషింప చేయవలెను. ఇట్లు ఆదరముతో అనన్త వ్రతమును ఆచరించినవాడు అనన్తుని అనుగ్రహము వలన భుక్తి ముక్తులను పొందును. నరుడుకాని, నారికాని చక్కగా స్నానముచేసి ఉపవనమున నున్న అరటి చెట్టును గంధుష్పధాన్యాంకుర దధిదూర్వా అక్షతాదులచే, దీపములచే, వస్త్రములచే, పక్వాన్నములచే చక్కగా పూజించి ఇట్లు ప్రార్థించవలెను. అప్సరో దేవకన్యలచే, నాగకన్యలచే పూజించబడు రంభావృక్షమా? నాకు శరీరారోగ్యమును, లావణ్యమును ప్రసాదించుము. ఇట్లు ప్రార్థించి నలుగురు కన్యలను కాని, ముత్తయిదువులను కాని చక్కగా భుజింపచేసి అంశుక సిందూర కజ్జల అలక్తములను సమర్పించి, నమస్కరించి నియమమును ముగించి తన ఇంటికి వెళ్లవలెను. ఇట్లు వ్రతమును చేసినచో ఉత్తమమగు సౌభాగ్యమును పొంది, అంతమున విమానముతో స్వర్గలోకమును చేరును. ఆశ్వయుజ బహుళచతుర్దశినాడు విష, శస్త్ర, అంబు, అగ్నులచే, సర్పములచే, జంతువులచే, వజ్రాదులచే మరణించినవారికి, బ్రహ్మ ఘాతకులకు, ఏకోద్దిష్ట విధానముతో క్రియా శ్రాద్ధమును చేయవలెను. బ్రాహ్మణ వర్గమును మిష్టపక్వాన్నము లతో భుజింపచేయవలెను. తర్పణ మును, గోగ్రాసమును, కాక శునకములకు బలినిచేసి, ఆచమనమును చేసి, తరువాత బంధువులతో కలిసి భుజించవలెను. ఇట్లు దక్షిణలతో చక్కగా శ్రాద్ధమును చేసినచో పితృదేవతలను ఉద్ధరించి సనాతనమగు దేవ లోకమును చేరును.

ఆశ్వయుజ శుక్ల చతుర్దశినాడు ధర్మరాజును గంధాదులతో చక్కగా పూజించి బ్రాహ్మణుని భుజింపచేసి, సువర్ణమును దానము చేసినచో ధర్మరాజు కాపాడును. ఇట్లు ధర్మరాజు ప్రతిమను దానముచేసినవాడు ఇహలోకమున ఉత్తమ భోగములను అనుభవించి ధర్మరాజు ఆజ్ఞచే స్వర్గమును పొందును. కార్తిక కృష్ణ చతుర్దశినాడు చంద్రోదయ కాలమున తైలాభ్యంగమును చేసుకొని స్నానముచేసి ధర్మరాజును పూజించి నరకమునుండి అభయమును పొందును. ప్రదోషకాలమున యమధర్మరాజు ప్రీతికొరకు సావధానముతో నూనె దీపములను నాలుగు దారుల కూడలిలోకాని, ఇంటి బయటి ప్రదేశమునకాని ఉంచవలెను. హేమలంబ సంవత్సర కార్తిక శుద్ధ చతుర్దశినాడు అరుణోదయ కాలమున స్నానముచేసి దేవతలతోపాటు విశ్వేశ్వరుడు మణికర్ణికా తీర్థమున భస్మముతో త్రిపుండ్రమును ధరించి తననుతాను చక్కగా పూజించుకొని పాశుపత వ్రతమును ఆచరించెను. కావున ఆ దినమున శివలింగమున గంధాదులతో మహాపూజను ఆచరించవలెను. ద్రోణ పుష్పము లతో బిల్వ దళములతో, జిల్లేడు పూవులతో, కేతక పుష్పములతో, ఫలములతో, మృష్టాన్నములతో, పక్వాన్నములతో, బహువిధ నైవేద్యములతో పూజించి ఏక భుక్తముతో విశ్వేశ్వర ప్రీతికరమగు వ్రతము ఆచరించి, ఇహపరములలో సకలాభీష్టములను పొందును. ఈ దినమున అభివృద్ధిని కోరువారు బ్రహ్మకూర్చ వ్రతము నాచరించవలెను. ఉపవాసముతో రాత్రియందు జితేంద్రియుడై పంచగవ్యపానమును చేయవలెను. కపిలాధేను మూత్రమును, కృష్ణగోమయమును, శ్వేత గోక్షీరమును, కర్త గోవుదధి, కుర్బురో గోఘృతమును ఒకచోట కలుపవలెను. ప్రాతఃకాలమున దర్భ జలముతో స్నానముచేసి దేవతలకు సంతర్పణచేసి, బ్రాహ్మణులను సంతోషింపచేసి, మౌనముగా భుజించవలెను. ఈ బ్రహ్మకూర్చ వ్రతము సర్వపాతక నాశనము. బాల్యమున, కౌమారమున, వార్థక్యమున చేసిన పాపములన్నియూ బ్రహ్మకూర్చోపవాసముతో వెంటనే నశించును. ఈ దినముననే పాషాణ వ్రతముకూడా చెప్పబడినది. దానిని వినుము. పగలు రాత్రి ఉపవసించి, పాషాణాకార పిష్టమును ఘృతపక్వముగాచేసి, గంధాదు లతో గౌరీదేవిని పూజించి నైవేద్యమును సమర్పించవలెను. ఈ వ్రతమును యధా విధిగా ఆచరించి ఐశ్వర్య సౌఖ్య సౌభాగ్య సౌందర్యములను పొందును.

మార్గశిర శుక్ల చతుర్దశినాడు ఏకభుక్తముతో కాని, నిరాహారముగా కాని స్వర్ణ వృషమును చక్కగా పూజించి బ్రాహ్మణునకు దానముచేయవలెను. మరునాడు ప్రాతః కాలమున లేచి స్నానము చేసి ఉమాసహిత మహేశ్వరుని కమల పుష్పములతో, గంధ మాల్యాను లేపనములతో పూజించి, బ్రాహ్మణులను మృష్టాన్నములతో భుజింపచేసి, దక్షిణాదులతో ప్రీతుల గావించవలెను. ఇది శివ త్రము. భుక్తిముక్తి ప్రదము. ఈ వ్రతమును చేయువారికి, ఉపదేశించువారికి, సహాయము చేయు వారికి, ఆమోదించు వారికి భుక్తి ముక్తులు లభించును. పుష్య శుక్ల చతుర్దశినాడు విరూపాక్ష వ్రతమును ఆచరించవలెను. ఈ దినమున అగాధ జలమున స్నానముచేసి విరూపాక్షుడగు శివుని చక్కగా ధ్యానించి పూజించవలెను. గంధమాల్య నమస్కారములను, ధూపదీపాన్న సంపదలను బ్రాహ్మణునకు సమర్పించి స్వర్గమున దేవతలవలె అనందించును. మాఘకృష్ణ చతుర్దశినాడు యమతర్పణము చెప్పబడినది. సూర్యోదయ కాలమునకు పూర్వమే స్నానముచేసి, పదునాలుగు నామములతో యమునికి తర్పణము కావించవలెను. ఇట్లు చేసినచో సర్వపాపములు నశించును. తిలదర్భ జలములచే తర్పణమును చేయవలెను. నువ్వుల అన్నముతో బ్రాహ్మణులను భుజింపచేయ వలెను. తాను కూడా మౌనముగా ఆ యన్నమునే భుజించవలెను. ఫాల్గుణ బహుళ చతుర్దశినాడు శివరాత్రి వ్రతమును ఆచరించవలెను. ఈ దినమున నిర్జలముగా ఉపవసించి పగలురాత్రి స్వయం భువ లింగమునుకాని, పార్థివ లింగమును కాని సావధానముగా, గంధాద్యుప చారములచే, జల ముతో, బిల్వదలాదులచే, ధూపదీపనైవేద్యములచే, స్తోత్ర పాఠములచే, జపాదులచే చక్కగా పూజించవలెను. తరువాత మరువాడు మరల ఉపచారములచే చక్కగా పూజించి, మృష్టాన్నములతో బ్రాహ్మణులకు చక్కగా భుజింపచేసి, దక్షిణలను ఇచ్చి పంపవలెను. ఇట్లు వ్రతమును ఆచరించి మహాదేవానుగ్రహముతో దేవతలతో ఆదరింపబడి దివ్యభోగములను అనుభవించును. ఫాల్గుణశుక్ల చతుర్దశినాడు భక్తితో దుర్గాదేవిని గంధాద్యుపచారములచే చక్కగా పూజించి బ్రాహ్మణులను భుజింప చేయవలెను. ఏక భుక్తముతో ఇట్లు దుర్గావ్రతమును ఆచరించినచో ఇహపరములలో సకలాభీష్టము లను పొందును. చైత్రబహుళ చతుర్దశినాడు ఉపవసించి కేదారోదక పానమును చేసినచో అశ్వమేథ యాగఫలమును పొందును. ఇట్లు సమస్త చతుర్దశీ వ్రతముల ఉద్యాపనము సామాన్యముగా ఒకేవిధముగా చెప్పబడినది. పదునాలుగు కలశములు పూగాక్షతమోదకములతో, దక్షిణాంశుకము లతో తామ్రములు కాని మృణ్మయములుకాని కొత్తవి స్థాపించి పదునాలుగు వెదురు దండములను, పవిత్రములను, ఆసనములను, పాత్రలను, యజ్ఞ సూత్రములను కూడా పదునాలుగు ఉంచవలెను. మిగిలిన దంతయూ పూర్వము చెప్పినట్లు శాఠ్యము లేకుండగా ఆచరించవలయును. (4/123)