విద్యా ప్రభావము

సనందన మహర్షి పలికెను: పైలాది బ్రాహ్మణులు పర్వతము నుండి దిగి వెళ్ళిన తరువాత వ్యాస భగవానుడు పుత్ర సహాయముతో ఏకాంతమున ధ్యానపరుడై ఊరకనే కూర్చొని ఉండెను. అంతలో అశరీరవాణి పుత్రునితో కూడి ఉన్న వ్యాస మహర్షిని గూర్చి ఇట్లు పలికెను. “ఓ వసిష్ఠకులసంభవా! మహర్షీ! వేదఘోష జరుగుట లేదు. ఒక్కడివే ధ్యానపరుడవై ఉన్నావు. ఏమాలోచించుచున్నావు? వేదఘోష లేనిచో ఈ పర్వతము శోభించదు. కావున జ్ఞానియగు పుత్రునితో కలిపి వేదాధ్యయనమును కావించుము.” అట్లు అశరీరవాణి మాటలను వినిన వ్యాస మహర్షి పుత్రునితో కలిసి వేదాభ్యాసమును గావించసాగెను. ఇట్లు వారిద్దరు వేదాభ్యాసమును చేయుచుండగా చాలాకాలము గడిచెను. అంత సముద్ర వాయువుతో ప్రేరేపించబడిన వాయువు అతిమాత్రముగా వీచెను. అపుడు వ్యాసుడు ఇది అనధ్యయన కాలమని శుకమహర్షిని వారించెను. అట్లు వారించబడిన శుకమహర్షి కౌతూహలముతో ఈ వాయువిట్లు ఏల వీచెనని తండ్రిని అడిగెను. ఈ వాయు చేష్టనంతటిని నాకు తెలుపుము అని ప్రార్థించెను. ఇట్లు శుకమహర్షి మాటలను వినిన వ్యాసమహర్షి మిక్కిలి ఆశ్చర్యమును పొందినవాడై, అనధ్యాయము కావున ఇట్లు పలికెను. నీకు దివ్యజ్ఞానము కలిగినది. నీ మనసు స్వస్ధముగా నిశ్చలముగా ఉన్నది. తమోరజగుణముల నుండి విడువడి సత్యమార్గమున నీ మనసు ఉన్నది. ఆ మనసులో బుద్ధిచే వేదములను తెలుసుకొని ధ్యానించుము. వాయువు దేవయానము పితృయానమని రెండు విధములు. ఈ రెంటిలో పితృయానము తామసము. ఈ రెండు భూమ్యాకాశములలో సంచరించుచుండును. దీని వలననే పృథివ్యంతరిక్షములలో వాయువు తిరుగుచుండును. ఈ వాయు మార్గములు ఏడు ఉండును. వాటిని తెలుసుకొనుము. ఈ వాయువు నుండియే దేవగణములు సాధ్యులు మహాబలశాలురుగా పుట్టిరి. వారికి సమానుడగు పేరుగలవాయువు పుట్టెను. ఈ సమాన వాయువు జయింప శక్యముకానిది. సమానునకు పుత్రుడుగా ఉదానవాయువు, ఉదానునకు వ్యాసుడు అను పుత్రుడు కలిగెను. వ్యానవాయువు నుండి అపానుడు, అపానుని నుండి ప్రాణవాయువు, కలిగెను. ఈ ప్రాణవాయువు శత్రు మర్దనము చేయగలది, ఇతరులచే అణచలేనిది మరియు సంతానము లేనిదిగా ఉండెను. ఇపుడు ఆ వాయువుల కర్మలను విడివిడిగా చెప్పెదను. వాయువు ప్రాణులలో అన్ని చేష్టలను కలిగించును. అందరిని ప్రీతులను చేయును కావున ప్రాణమను పేరు కలిగినది. ధూమమువలన పుట్టు, ఊష్మవలన పుట్టు మేఘసంఘాతములను వాయువే ప్రేరేపించును. మొదటి మార్గమున మొదటి వాయువు పేరు ప్రవహము. ఈ వాయువు ఆకాశమున స్నేహమాత్రల నుండి, మెరుపుల నుండి ఉత్తమకాంతి కలిగి ఉండును. రెండవ వాయువు ఆవహము అనునది అంతటా ధ్వనించుచు సంచరించుచుండును. ఈ వాయువే చంద్రుడు మొదలగు నక్షత్రములను ఉదయింప చేయును. బుద్ధిమంతులు ప్రాణుల దేహములలో ఉండు దానిని ఉదానము అని అందురు. నాలుగు సముద్రముల జలమును ఈ వాయువు ధరించును. వనమున ఉన్న వాయువు సముద్రములనుండి జలమును తీసుకొని మేఘములకు ఇచ్చును. మేఘములను నీటితో కూర్చి పర్జన్యునకు ఇచ్చును. ఇక మూడవవాయువు ఉద్వహము అనునది ఇది సదాగతి. చాలా పెద్దది. ఈ వాయువుచే కొనిపోవబడు మేఘములు వర్షించుటకు ఆరంభించును. ఈ వాయువే దేవ విమానములను ఆకాశమున ధరించును. నాలుగవ వాయువు సంవహము. ఈ వాయువు పర్వతములను మర్దించును. ఈ వాయు వేగముచే ప్రాణులు రోగములు కలవారౌదురు. ఈ వాయువుచే చెట్ల నుండి రసము ఏర్పడును. అయిదవ వాయువు మహావేగము కలది వివహము అను పేరుకలది. ఈ వాయువు నందు దివ్యజలములు ప్రవహించు చుండును. ఈ వాయువు వలననే ఆకాశగంగా జలము నిలిచి యుండును. ఈ వాయువు నందు సూర్యుడు ప్రతిహతుడై ఏకరశ్మి గలవాడగును. వేయి కిరణములుగల సూర్యుడు భూమిమీదికి చేరుట ఈ వాయువు చేతనే. ఈ వాయువు వల్లనే అమృతనిధియగు చంద్రుడు తడుపబడును. ఆరవ వాయువు పరివహమనునది. ఇది ప్రాణులకు చాలా శ్రేష్టమయినది. ప్రాణధారులందరి ప్రాణములను అంత్యకాలమున ఈ వాయువే తొలగించును. మృత్యువు, యముడు ఇద్దరు ఈ వాయు ధర్మముననే అనువర్తించుచుందురు. చక్కగా చూడగలిగిన, అధ్యాత్మ నిత్యమగు బుద్ధిచే చేయబడు ధ్యానాభ్యాసాభిరామములకు అమృతత్త్వమును కల్పించునది ఈ వాయువే. ఈ వాయువు వేగముచే దక్షప్రజాపతి పుత్రులు పదివేలమంది దిగంతములకు చేరిరి. ఈ వాయువుచే పరాభూతమగు జలము వృష్టిచే మరొక దిశకు మరలును. ఏడవ వాయువు పరీవాహ మనునది ఉత్తమమగు వాయువు. దీనిని ఎవరు అతిక్రమించజాలరు. ఇట్లు ఏడుగురు వాయువులు దితిపుత్రులు, అత్యాశ్చర్యకరులు. ఆద్యంతములు లేనివారు ప్రతిదాని లోపల నుండువారు. అంతట వెళ్ళగలవారు. అంతట సంచరించువారు. ఇది చాలా ఆశ్చర్యమును కలిగించు విషయము. ఈ హిమవత్పర్వము ఈ వాయువుచే కంపించబడినది. ఈ వాయువు విష్ణువు యొక్క నిశ్వాసముతో వెలువడి వేగము కలది అగును. అప్పుడు ఒకేసారి బయలు వెడలును. దానిచే జగత్తు క్షోభించును. కావున అతివాయువు వీచినపుడు వేదజ్ఞులు వేదాధ్యయనమును కావించరు. వాయువువలన కలుగు వాయు భయమును చెప్పితిని. ఈ భయముచే వేదము పీడించబడును. ఇట్లు పరాశరసుతుడగు వ్యాసుడు ఇంతమాత్రము చెప్పి పుత్రుని అధ్యయనము చేయమని ఆకాశగంగకు వెళ్ళెను. అట్లు వ్యాసమహర్షి స్నానము చేయుటకు వెళ్ళగా, బ్రహ్మవిదులలో శ్రేష్టుడగు శుకమహర్షి వేదవేదాంగ పారగుడు కావున స్వాధ్యాయమును చేసెను.

అట్లు స్వాధ్యాయమును, అధ్యయనము చేయుచున్న వ్యాస పుత్రుడగు శుకుని ఏకాంతమున మహానుభావుడగు సనత్కుమారుడు సమీపించెను. వ్యాసపుత్రుడగు శుక మహర్షి లేచి సత్కరించగా, వేదజ్ఞులలో శ్రేష్టుడగు సనత్కుమారుడు ఓ వ్యాసపుత్రా! మహా తేజశ్శాలీ! ఏమి చేయుచున్నావు అడిగెను.

శుక మహర్షి పలికెను: ఓ బ్రహ్మపుత్రా! ఇపుడు నేను స్వాధ్యాయమున ప్రవర్తించుచుంటిని. నా సుకృత విశేషమున మీ దర్శనమును పొందగలిగితిని. మోక్షార్ధ సాధనమగు తత్త్వమును మిమ్ములను అడుగ కోరుచున్నాను. నాకు మోక్షార్ధ జ్ఞానము కలుగునట్లు నాకు తత్త్వమును తెలియజేయుము.

సనత్కుమార మహర్షి పలికెను: విద్యతో సమానమగు నేత్రము మరొకటి లేదు. విద్యా సుమమగు తపస్సు వేరొకటి లేదు. రాగసమమగు దుఃఖము, త్యాగ సమమగు సుఖము మరొకటి లేదు. పాపకర్మ నివృత్తి, సర్వదా పుణ్యశీలత, సద్వృత్తి, సముదాచారము ఇవియే సాటిలేని శ్రేయస్సు. దుఃఖకారకమైన మానవత్వమును పొంది, సంగమును అలవర్చుకొనువాడు మోహమును పొందును. అట్టివాడు దుఃఖమునుండి విముక్తిని పొందజాలడు. సంగమనగా దుఃఖ లక్షణమే. సక్తుడగువానికి మోహజాలమును పెంచు బుద్ధి కలుగును. మోహజాలావృతుడు ఇహపరములలో దుఃఖమునే పొందును. శ్రేయస్సును కోరువాడు సర్వోపాయములతో కామ క్రోధములను నిగ్రహించుకొనవలయును. కామక్రోధములు శ్రేయస్సును భంగపరచ ప్రయత్నించుచుండును. తపస్సును క్రోధము నుండి శ్రీని మాత్సర్యము నుండి, విద్యను మానావమానములు అను ప్రమాదము నుండి, ఆత్మను కాపాడుకొనవలయును. ఎదుటివారి యందు దయ కలిగియుండుట పరమధర్మము. క్షమ పరమబలము. ఆత్మజ్ఞానమే ఉత్తమ జ్ఞానము. సత్యమే పరమహితము. సర్వసంగపరిత్యాగమును చేసినవాడే విద్వాంసుడు. పండితుడు. ఇంద్రియార్ధముల నుండి ఇంద్రియములను స్వాధీనము చేసుకొని తిరుగువాడు, సంగరహితుడు, శాంతమనస్కుడు, వికారమును పొందనివాడు, సావధాన మనస్కుడు ఆత్మభూతములచే కలిసికాని, కలియకకాని అతద్భూతుడు, నిజముగా విముక్తుడగును. త్వరలో శ్రేయస్సును పొందగలడు. ప్రాణులతో దర్శనస్పర్శన సంభాషణములు చేయనివాడు ఉత్తమ శ్రేయస్సును పొందగలడు. ఏ ప్రాణిని హింసించరాదు. అన్ని ప్రాణులయెడ మైత్రీ భావమున ఉండవలెను. మానవ జన్మను పొందినవాడు ఎవనితోను వైరమును చేయరాదు. ఆకించన్యము, సంతోషము కలవాడై కోరికలు చాపల్యము లేని వాడై యుండుటే జితేంద్రియుడగు ఆత్మజ్ఞానికి ఉత్తమ శ్రేయస్సు. ఇతరుల నుండి పరిగ్రహమును పరిత్యజించి జితేంద్రియుడవు కమ్ము. ఇహ లోకమున పరలోకమున శోక రహిత స్థితిని పొందుము. ఆశలేనివారు శోకించరు. కావున మనసు నుండి కోరికలను విడువుము. కోరికలను విడిచినవాడు దుఃఖ విముక్తుడగును. ఎప్పుడు తపమును అంతరింద్రియ నిగ్రహము కలవాడై, మౌనమును అవలంబించి, మనసును నిగ్రహించుకొని సంగములయందు సంగతిని విడిచినవాడు జయించరాని సంసారమును జయించగలడు. గుణసంగములందు ఆసక్తి లేనివాడై ఎప్పుడూ ఏకచర్యారతుడు కావలెను. బ్రహ్మ జ్ఞానము కలవాడు త్వరలోనే ఉత్తమానందమును పొందగలడు. సుఖదుఃఖాది ద్వంద్వములలో ఆనందించు ప్రాణులలో మూర్ఖుడు. సంతోషించగలడు. కొంచెము ప్రజ్ఞానముచే తృప్తి నందినవాడు, జ్ఞానతృప్తుడు దుఃఖించడు. శుభకర్మలచే దేవత్వమును, శుభాశుభమిశ్ర కర్మలచే మానవత్వమును, అశుభకర్మలచే అధోగతిని పొందును. ఆ నీచ జన్మలో జరా, దుఃఖము మృత్యువులచే నిండియున్న సంసారమును చూచును. ఆ విషయమునెట్లు తెలియకున్నావు? హితము కాని దానిని హితమని, నిత్యము కాని దానిని నిత్యమని అనర్ధమును అర్థముగా భావించుచు నిజము నేల తెలియకున్నావు? ఆత్మభవములగు పలు మోహతంతువులచే చుట్టబడియు సాలెపురుగువలె తనను తాను చుట్టబడినట్లు తెలియజాలడు. పరిగ్రహించుటను మానుము. పరిగ్రహము దోషయుక్తము. సాలెపురుగు స్వపరిగ్రహము వలననే బంధించబడుచున్నది. ప్రాణులు దారాపుత్రకుటుంబములయందు బంధించబడి దుఃఖించుచుందురు. బురదయున్న కొలనులో బంధించబడిన యేసుగులవలె నుందురు. మోహ జాలముచే అకర్షించబడి దుఃఖించుచున్న ప్రాణులను చూడుము. కుటుంబము, దారా పుత్రులు, శరీరము, ద్రవ్య సంపాదన ఇవియన్నియును పరలోకమున నిలుచునవి కావు. కేవలము సుకృత దుష్కృతములు మాత్రమే నిలుచును. అన్నిటిని విడిచి తప్పనిసరిగా పరాధీనుడవై వెళ్ళవలసియున్నపుడు అనర్ధమునందు ఎందుకు తగలియున్నావు. నీ యర్ధమును ఎందుకు అనుసరించవు? విశ్రాంతి, ఆధారము, దారి బత్తెము, ఆవాసము లేని, చీకటి అలుముకొని యున్న మార్గమున ఒక్కడివే ఎట్లు వెళ్ళగలవు? అట్లు వెళ్ళుచున్న నీ వెంట ఏ ఒక్కడూ రాజాలడు. కేవలము సుకృత దష్కృతములు మాత్రమే నీ వెంట వచ్చును. విద్య, కర్మ, శౌర్యము, విస్తృతమగు జ్ఞానము అర్ధసాధనకు బాధపడుచుండును. సిద్ధాద్దార్ధుడు మాత్రము ముక్తిని పొందగలడు. గ్రామమున ఉండుటలో ప్రీతి కలిగి ఉండుట బంధించు త్రాడు వంటిది. సుకృతులు ఈ రజ్జువును (తాడును) ఛేదించి వెళ్ళగలరు. దుష్కృతులు వెళ్ళజాలరు. నీతో సమానమగు జాతి, వయస్సు, రూపముగలవారు మృతులగుట చూచుచున్నావు కదా! అయిననూ నీలో వైరాగ్యము కలుగుట లేదు. నీ హృదయము లోహమయమా? మనస్సుఅను ప్రవాహము, రూపము అను తీరములు, స్పర్శలను దీవులు రసమగు వేగము, గంధమను బురద, శబ్దమను జలము, స్వర్గమార్గమును అధిరోహించజాలని నదిని క్షమారిత్రము, సత్యమయము, ధర్మ స్ధైర్యములు అను కరములు (తెడ్డులు) కలది త్యాగము అను వాయువును అనుసరించి పోగల బుద్ధి అను నావ మాత్రమే దాటగలదు. ధర్మమును, అధర్మమును, సత్యమును, అసత్యమును త్యజించుము. సంకల్పించక ధర్మమును, హింసించక అధర్మమును విడువవలెను. సత్యా సత్యములను తెలిపి పరమ నిశ్చయమును బుద్ధిలో నిలుపుము. అస్ధి అను స్ధూణము కలది (స్తంభము) స్నాయు యుతము, మాంస శోణితలేపనము, నరములచే బంధించబడినది. దుర్గంధ భూయిష్టము, మూత్ర పురీషములతో పూర్ణము, జరాశోక సమావిష్టము, రోగ ఆలవాలము, అస్థిరము రజోయుతము, అనిత్యము అయిన ప్రాణాధారమగు శరీరమునందు మమకారమును విడువుము. ఈ ప్రపంచము, సర్వ జగత్తులు, జగద్భిన్నములు, అంతయు పంచమహా భూతాత్మకమే. దీనికంటే పరమ పరమాణువులు గలది. పంచేంద్రియములు సత్తరజస్తమో గుణాత్మకములు అనునవి పదిహేడు అవ్యక్తము అనబడును. ఇంద్రియార్ధములు అన్నింటితో వ్యక్తావ్యక్తలతో కూడియున్నదే ఈ జగము. ఈ వ్యక్తావ్యక్త స్వరూపములుగల సమూహమున పంచవింశతి తత్త్వములు ఉండును.

వీటన్నిటితో కలిసి యున్నది అనిత్యము అనబడును. ఇచట త్రివర్గము, సుఖ దుఃఖములు, జీవితము మరణము అనుదానిని తెలిసినవాడు సృష్టి ప్రళయములను తెలియగలదు. ఇంద్రియములచే గ్రహించబడునదంతయూ వ్యక్తము అనబడును. ఇంద్రియాతీతము లింగమాత్రగ్రాహ్యమైనది అవ్యక్తమనబడును. జీవుడు నియతములగు ఇంద్రియములచే ధారలతో వలె తృప్తి పొందును. తనను లోకమున, లోకమును తనలో ఇమిడ్చి ఉంచబడినదని తెలియును. పరావరములను చూచువారు చూడగలశక్తి జ్ఞానపు చివరిహద్దును చూడజాలరు. అన్ని భూతములను అన్ని వేళలలో అన్ని అవస్థలలో చూచు వాడు జ్ఞానావధిని చూడజాలడు. బ్రహ్మభూతునికి అశుభముతో సంబంధము కలుగదు. దేహము వలన కలిగెడు క్లేశముల నుండి నివృత్తి లభించదు. లోకబుద్ధి కలిగి ఉన్నంత వరకు లౌకిక మార్గము నశించదు. జీవుడు ఆద్యంతములు లేనివాడు, ఆత్మలో ఉండువాడు, క్షయము లేనివాడు, కర్తకాడు, మోహమును పొందడు అని తీర్ధజ్ఞుడగు భగవంతుడు చెప్పి ఉన్నాడు. జీవుడు తాను చేసిన అయాకర్మలచే నిత్యదుఃఖితుడగుచున్నాడు. తన దుఃఖమును తొలగించు కొనుటకు బహువిధములుగా హింసించుచుండును. హింసవలన మరల కొత్తది, చాలా కర్మను స్వీకరించుచుండును. మరల ఆ కర్మచే బహువిధములుగా పరితపించుచుండును. రోగి అపథ్యముతో పరితపించునట్లు దుఃఖములను సుఖములుగా భావించి ఎప్పుడూ మోహితుడగుచుండును. తాను చేయు భయమును కలిగించు కర్మలచే వధించబడును. బంధించబడును. తన కర్మోదయము వలన బంధనిర్ముక్తుడని తలచును. బాహువులు లేనివాడై చక్రమువలె సంసారమున పరిభ్రమించు చుండును. నిగ్రహమువలన, సంబంధ నివృత్తి వలన, తపోబలమువలన చాలామంది బాధలు లేని ఆనంద స్వరూపమగు సిద్ధిని పొందిరి. (2/60)