నారద మహా పురాణము
పిండ దాన విధి
వసువు పలికెను: ఓ మోహినీ ఇపుడు ప్రేత శిలాభవ పుణ్యమును చెప్పెదను. వినుము. ఇచట పిండ ప్రదానము గావించినచో పితృ సముద్ధరణము జరుగును. ఇచట ప్రభాసాత్రిచే శిలచే పాదము అచ్ఛాదిత మాయెను. మునులచే స్తుతించిన ప్రభాసుడు శిలాంగుష్ఠము నుండి బయలు వెడలెను. ఈ అంగుష్ఠమున నున్న ఈశుడు ప్రభాసేశునిగా ప్రసిద్ధి గాంచెను. శిలాంగుష్ఠ దేశమున ప్రేత శిల కలదు. ఇచట పిండదానమును చేసిన ప్రేత భావము తొలగును. ప్రభాసాత్రి సంగమమున మహానదిలో స్నానము చేయువాడు పవిత్రుడు అగును. వాసుదేవుడు స్వయముగా నిలిచినది వామతీర్థమని ప్రసిద్ధము. ఇచట ఈ మహానదిలో ప్రార్థించబడిన రాముడు స్నానమాచరించెను కాన రామతీర్థమని ఏర్పడినది. ఇది సర్వలోకపానవము. ఈ రామతీర్థమున స్నానమాడినచో వేయిజన్మల పాపము నశించును. ఈ మంత్రముచే స్నానముచేసి శ్రాద్ధముచేసి రామతీర్థమున పిండ ప్రదానము చేసిన విష్ణు లోకమున నివసించును. “రామ రామ మహాబాహో దేవానామ భయంకర త్వాం నమస్యేతు దేవేశ మమ నశ్యతు పాతకమ్” అనునది మంత్రము. దేవతలకు అభయమును ఇచ్చు ఓ రామచంద్రా! మహాబాహూ నీకు నమస్కరించెదను. నా పాపము నశించుగాత! అని ప్రార్ధించుచు ఇచట ప్రజాసేశునికి నమస్కరించి ప్రకాశించు శివుని సమీపించవలయును. శివునికి నమస్కరించి యామ్యబలిని కావించవలెను.
“అపస్త్వమసి దేవేశ జ్యోతిషాం పతిరేవ చ
పాపం నాశయ మే శీఘ్రం మనోవాక్కాయ కర్మజమ్”
అనుమంత్రముచే బలిని గావించవలయును. ఓ దేవేశా! నీవు జలరూపుడవు జ్యోతిష్పతివి. నా మనోవాక్కాయ సంభవములగు పాపములను త్వరగా నశింపచేయుము అని పై మంత్రమునకు అర్ధము. శిలాజఘన ప్రాంతమును యమధర్మరాజు ఆక్రమించి యుండెను. ధర్మరాజు! ఆ పర్వతముకు వెళ్ళకు అని అనుటచే అది అదృశ్యానగము అయ్యెను. ఈ పర్వతమున యమరాజు ధర్మ రాజులు నిశ్చలముగా ఉండిరి. వీరిద్దరిని పూజించక చేసిన శ్రాద్ధము వ్యర్ధమగును. “ఈశ్వానములు శ్యామబలములు. వైవస్వతకులోత్పన్నములు. ఈ రెంటికి పిండ ప్రదానము చేయుచున్నాను. ఈ రెండు హింసించక ఉండనిమ్ము”. అని పలుకవలెను. ప్రేత శిలాతీర్థమున నేయి కలిపిన చరువుచే పితరులను ఆవాహన గావించి మంత్రములచే పిండ ప్రదానము గావించవలెను. ప్రేత పర్వతమున సావధానుడై పితరులను ధ్యానించి ప్రాచీనావీతికుడై దక్షిణాభి ముఖముగా స్మరించుచు, కవ్యవాహుడు, అనలుడు, సోముడు, యముడు, అర్యమా, అగ్విష్వాత్తు, బర్హిషదులు, సోమపులు, పితృదేవతలు మీరందరు మహానుభావులు ఇటకు రండు. మీచే రక్షించబడు నా పితరులు నా కులజాతులు సగోత్రులు వీరందరికి పిండప్రదానమును చేయుటకు ఇచటికి వచ్చితిని. ఈ శ్రాద్ధముచే వారందరు శాశ్వతమగు తృప్తిని పొందుదురు గాక! అని పలికి ఆచమనము గావించి పంచాంగమును వినిపించి ప్రాణాయామముచేసి పునరావృత్తి రహిత బ్రహ్మలోకాప్తి హేతువుగా సంకల్పించి యధాక్రమముగా శ్రాద్ధము ఆచరించవలెను. పితరుల ఆవాహనచేసి అర్చించి, మంత్రములచే పిండ ప్రదానము గావించవలెను. మొదట హోమమును పంచగవ్యములచే చేసి, సపిండులకు శ్రాద్ధమును చేసి, వారికి దక్షిణ భాగమున దర్భలను పరిచి తిలోదకమును ఇచ్చి, చేతులు జోడించి అంజలిలో తీసుకొని పితృ తీర్థముతో ప్రయత్న పూర్వకముగా ముష్టి మాత్ర సక్తువులచే అక్షయ్య పిండమును పెట్టవలెను. పిండ ద్రవ్యములలో తిలాజ్యదధి మధ్యాదులను కలుపవలెను. దర్భలలో తిలాదులచే సంబంధులు నావాహన చేయవలెను. ఈ మూడు మంత్రములచే మూడు లింగములను అర్చించవలెను. పూర్వమువలె పితరుల నావాహనను గావించి యధాపూర్వముగా పిండ ప్రదానమును గావించవలెను. స్వగోత్రమున కానివి గోత్రమున కాని దంపతులకు కలిపి పిండ ప్రదానమును చేసినచో శ్రాద్ధము నిష్పలమగును. పిండప్రదానము ఉదక తర్పణమును చేయుచు, పిండపాత్రలో తిలలనుంచి శుభోదకములచే నింపి ఈ మంత్రముచే ప్రదక్షిణముగా పిండములను మూడు మార్లు పరిషేచనము చేయవలెను. నమస్కరించి క్షమాపణ వేడ వలయును. పితరులను విడిచి ఆచమనముచేసి సాక్షులగు దేవతలకు వినిపించవలెయును. అన్ని స్థానములలో ఇట్లే పిండ ప్రధానము గావించవలెను. గయా పిండదానమునకు కాల విచారమును చేయరాదు. అధిక మాసమున, జన్మ దినమున, గురు శుక్ర మూఢములలో, బృహస్పతి సింహరాశిలో ఉన్ననూ పిండ ప్రదానమును విడువరాదు. గయకు వెళ్ళి పిండ ప్రదానము చేయనివానికి భిక్షువు కూడా దండమును చూపును. విష్ణు పదమున దండమును చూపును. విష్ణు పదమున దండమునుంచి పితరులతో విముక్తుడగును. గయయందు, పాయసముతో సత్తుచే, పిండిచే చరువుచే, తండులాదులచే పిండ దానమును చేయవలెను. మహాపాపి అయిననూ గయా దర్శనమున పరిశుద్ధుడు అగును. గయా శ్రాద్ధమును ఆచరించినవాడు పిండదానమును చేయవలెను. మహాపాపి అయిననూ గయా దర్శనమున పరిశుద్ధుడగును. గయా శ్రాద్ధమును ఆచరించినవాడు బ్రహ్మ లోకమును పొందును. ఫల్గు తీర్థమున పిండ ప్రదానముచేసిన వారికి కలుగుఫలము సహస్రాశ్వ మేధములచేకూడా కలుగదు. గయను చేరగానే పితరులకు ప్రియములుగ పిండ ప్రదానము గావించవలయును. ఆలస్యమును చేయరాదు. విఘ్నములను కలిగించరాదు. పిత, పితామహులు, ప్రపితామహులు, మాత, పితామహి ప్రప్రితామహి మాతామహుడు, అతని పిత, ప్రమాతా మహాదులు, వీరందరికి నాచే ఈయబడు పిండము అక్షయ్యమును కలిగించనిమ్ము. నాకులమున మరణించినవారిని, గతిలేనివారిని ఉద్ధరించుటకు ఈ పిండమును ఇచ్చుచున్నాను. బంధు వర్గకులములోని వారికి గతిలేని వారి ఉద్ధరణ కొరకు ఈ పిండమును ఇచ్చుచున్నాను. దంతములు రానివారిని, గర్భ పీడితులను ఉద్ధరించుటకు ఈ పిండమును ఇచ్చుచున్నాను. అగ్ని దగ్ధులను అనగ్నిదగ్ధులను, విద్యుచ్చోర హతులను ఉద్ధరించుటకు ఈ పిండము నిచ్చుచున్నాను. దాన దాహమృతులకు, సింహ వ్యాఘ్రాతులకు, దంష్ట్రులచే శృంగులచే హతులైన వారికి పిండమును ఇచ్చుచున్నాను. వురిచే మరణించిన వారికి, విషశస్త్రహతులకు, ఆత్మఘాతకులకు పిండ ప్రదానము చేయుచున్నాను. అరణ్యమున, దారిలో, అడవిలో మరణించినవారికి, ఆకలి దప్పులచే మరణించినవారికి, భూతప్రేత పిశాచహతులకు పిండమును ఇచ్చుచున్నాను. రౌరవనరకమున, తామిస్రమున, కాలసూత్రమున నున్నవారికి ఉద్ధరణ కొరకు ఈ పిండమును ఇచ్చుచున్నాను. అనేక యాతనాస్థితులకు, ప్రేతలోక గతులను ఉద్ధరించుటకు ఈ పిండమును ఇచ్చుచున్నాను. దుర్గతిని పొంది అభిశాపాదులచే హతులైన వారిని ఉద్ధరించుటకు ఈ పిండమును ఇచ్చుచున్నాను. సమస్త నరకములలో యమదూత వశులైనవారిని ఉద్ధరించుటకు ఈ పిండమును ఇచ్చుచున్నాను. పశుయోనిగతులకు పక్షికీట సరీసృపయోనిగతులకు, వృక్షయోని గతులకు ఈ పిండమును ఇచ్చుచున్నాను. స్వకర్మవశమున జాత్యంతర సహస్రములలో భ్రమించువారికి, మానవజన్మ దుర్లభమగు వారికి పిండమును ఇచ్చుచున్నాను. దివ్యంత రిక్ష భూమిగతులగు పితరులకు బాంధవాదులకు సంస్కార హీనముగా మరణించిన వారికి పిండమును ఇచ్చుచున్నాను. ప్రేత రూపములో నున్న పితరులందరూ పిండదానముచే తృప్తి పొందుదురుగాక. బంధువులకు, బంధువులుకానివారికి, ఇతర జన్మలలో బంధువులకు, నాచే ఈయబడు పిండము అక్షయముగా చేరనీ, పితృవంశమున మరణించినవారికి, మాతృవంశమున మరణించిన వారికి గురుశ్వశుర బంధువులకు, మరణించిన ఇతర బంధువులకు, నా కులమున లుప్తపిండులకు, పుత్రదారవర్జితులకు, క్రియాలోపము జరిగిన వారికి, జాత్యంధులకు, పంగువులకు, విరూపులకు, అమగర్భులకు, నా కులమున తెలిసినవారికి, తెలియనివారికి వారందరికి నాచే ఈయబడిన ఈ పిండము అక్షయము కానిమ్ము. బ్రహ్మనుండి నా పితృ వంశమున పుట్టినవారికి, మాతృ వంశీయులకు రెండు కులములలో సంగతులకు నేను పిండమును ఇచ్చుచున్నాను. నేను గయనుచేరి పితరులకు నిష్కృతిని గావించితిని. బ్రహ్మేశానాది దేవతలు నాకు సాక్షులుగా ఉందురు గాత! ఓ దేవా! గదాధరా! గయా తీర్థమునకు వచ్చితిని. ఇచట నీవే సాక్షివి. ఇచట రుణత్రయము నుండి నేను విముక్తుడనైతిని.
మరునాడు శుచియై ప్రేత పర్వతమునకు వెళ్ళవలయును. బ్రహ్మకుండమున స్నానము గావించి దేవాదులకు తర్పణమును గావించవలయును. శ్రద్ధాలులై ప్రేత పర్వతమున పితరులను ఆహ్వానించి పూర్వమువలె సంకల్పించి పిండ ప్రదానము గావించవలెను. స్వమంత్రములతో పరమ పితృ దేవతలను చక్కగా పూజించవలెను. పితృ కర్మలలో గ్రహించిన తిలల సంఖ్యతో అసురులు గరుడుని చూచిన సర్పములవలె భయపడి పారిపోదురు. ఇచట కూడా అంతయూ పూర్వమువలెనే ఆచరించవలెను. ప్రేత పర్వతమున తిలమిశ్రితములగు సక్తును చల్లవలయును. ప్రేత రూపములో నున్న నా పితృ దేవతలు అందరూ తిల మిశ్రిత సక్తులచే తృప్తిని చెందుదురుగావుత. బ్రహ్మ నుండి స్తంభము వరకున్న చరాచర సకల జగత్తు నేనిచ్చు పిండముచే తృప్తిని పొందనిమ్ము. మొదట పంచతీర్ణములలో ఉత్తర మానసమున ఆచమనమును గావించి దర్భలచే శిరస్సున నీరు చల్లుకొని, ఉత్తర మానసమునకు వెళ్ళి మంత్రముచే స్నానము ఆచరించవలెను. ఆత్మ శుద్ధి కొరకు ఉత్తరమానసమున స్నానము చేయుచున్నాను. సూర్యలోకాది సంప్రాప్తి సిద్ధికి, పితృముక్తికి స్నానముచేసి దేవాదులకు యధావిధిగా తర్పణము చేయవలెను. బ్రహ్మ నుండి స్తంభ పర్యంతము దేవర్షి పితృమానవులు పితరులందరు మాతృమాతా మహాదులు తృప్తి పొందెదరు గాత, స్వసూత్రోక్త విధానముగా శ్రాద్ధమున సపిండకమును చేయవలెను. అష్టకలయందు, వృద్ధియందు, గయయందు, అక్షయ దినమున విడిగా తల్లికి శ్రాద్ధమును చేయవలెను. ఇతరత్ర స్వామితో చేయవలెను “ఓం నమోస్తు భానవే భర్త్రే సోమ భౌమ జ్ఞరూపిణే, జీవభార్గవ శనైశ్చర రాహుకేతు స్వరూపిణే” అని మంత్రమును జపించి, సూర్యునికి నమస్కరించి, అర్చించినచో పితరులను సూర్యలోకమునకు చేర్చును. ఇచట మానస సరోవరము కలదు. దాని తరువాత ఉత్తర మానసము కలదు. ఉత్తర మానసము నుండి మౌనముగా దక్షిణ మానసమునకు వెళ్ళవలెను. ఇది ఉత్తర తీర్థమని చెప్పబడినది. కావున ఉత్తర దిక్కు మోక్షప్రదము. మండపృష్ఠమునకు ఉత్తర భాగమున దేవర్షి పితృ తర్పణమును చేయవలయును. మధ్యలో కన ఖల తీర్థము పితరులకు గతిదాయకము. ఇచట స్నానము చేసిన నరుడు కనకమువలె భాసించును. పవిత్రుడగును. కావున కనఖల తీర్థము ఉత్తమ తీర్థముగా ప్రసిద్ధిగాంచినది. కావున దక్షిణ భాగమున దక్షిణ మానసతీర్థము కలదు. దక్షిణ మానసమున తీర్ధత్రయము చెప్పబడినది. వీటిలో యధావిధిగా స్నానముచేసి విడివిడిగా శ్రాద్ధమును చేయవలెను. ఓ దివాకరా! ఇచట దక్షిణ మానసమున స్నానమును చేయుచున్నాను. బ్రహ్మ హత్యాది పాపరాశి నాశనమునకు, విముక్తికి స్నానము చేయుచున్నాను. అను ఈ మంత్రముచే స్నాన పూజాదికమును సపిండ శ్రాద్ధమును చేయవలెను. పితరులను తృప్తి కొరకు తరింప చేయుటకు సూర్యునికి నమస్కరించుచున్నాను. పుత్రపౌత్ర ధనైశ్వర్య ఆయురారోగ్య వృద్ధి కొఱకు నమస్కరించుచున్నాను అని పలికి దర్శించి సూర్యుని పూజించి ఈ మంత్రమును ఉచ్చరించవలెను. కవ్యవాడాదులు పితృదేవతలు పితృదేవతలతో కలిసి స్వధాభుజులై తృప్తి పొందుదురు. ఇటనుండి ఫల్గు తీర్థమునకు వెళ్ళవలెను. ఈ ఉత్తమ తీర్థమున పితృ శ్రాద్ధమును ఆచరించిన వారికి పితరులకు ముక్తి కలుగును. బ్రహ్మ ప్రార్థించగా విష్ణువు ఫల్గుణుడాయెను. దక్షిణాగ్నిలో చేయబడినది ఫల్గు తీర్థకమైనది. ఇచటనే ఫల్గులో గోవు కామధేనువు జలము, మహిమ ఫలించును ఇది యుగ సృష్ట్యంతర్గతము. కావున ఫల్గు తీర్థము నిష్ఫలము కాదు.
అఖిల భువనములలో ఉన్న సమస్త తీర్థములు స్నానము చేయుటకు ఫల్గు తీర్థమునకు వచ్చును. గంగ విష్ణుపాదోదకము, ఫల్గుతీర్థము సాక్షాత్తు గదాధరుడే. హిమము ద్రవమైనపుడు ఫల్గుతీర్థమైనది. కావున ఇది గంగకంటే అధికము. ఫల్గు తీర్థమున స్నానము చేసినచో సహస్రాశ్వమేధ ఫలితము కలుగును. ఫల్గుతీర్థమున విష్ణుజలమున ఈ రోజు స్నానమును చేయుచున్నాను. దీనితో పితరులకు విష్ణులోకము భుక్తి ముక్తులు సిద్ధించును. ఫల్గు తీర్థమున స్నానముచేసి తర్పణమును శ్రాద్ధమును ఆచరించవలెను. ఈ శ్రాద్ధమును సపిండకముగా ఆచరించి పితామహునికి నమస్కరించవలెను. శివునకు దేవునకు, ఈశాన పురుషునికి అహోర వామదేవునకు సద్యోజాతునకు శంభునకు నమస్కారము. పితామహునికి నమస్కరించి ఈ మంత్రముచే పూజించవలెను. ఫల్గు తీర్థమున స్నానమాడి గదాధరుని దర్శించి, పితరులతోపాటు విష్ణు లోకమును చేరును. వాసుదేవునకు నమస్కారము. సంకర్షణునకు, ప్రద్యుమ్నునకు, అనిరుద్ధునకు, శ్రీధరునకు, విష్ణువునకు నమస్కారము. పంచతీర్థమున స్నానమాచరించి పితరులను బ్రహ్మ లోకమునకు చేర్చును. గదాధరుని పంచామృతముతో స్నానము చేయించి పుష్ప వస్త్రాదులచే అలంకరించి శ్రాద్ధమును చేయవలయును. ఇట్లు గదాధరుని పూజించక చేసిన శ్రాద్ధము నిరర్ధకమగును. నాగకూటము, గృధ్రకూటము, విష్ణువు ఉత్తర మానసముల కంటే ఇది గయా శిరము అనబడును. దీనినే ఫల్గు తీర్థమందురు. ముండ పృష్ఠ పర్వతాధో భాగమున ఫల్గు తీర్థము కలదు. ఈ ఫల్గు తీర్థమున శ్రాద్ధము చేయుటచే పితరులు మోక్షమును పొందెదరు. గయా శిరమున శమీపత్ర ప్రమాణముతో పిండ ప్రదానమును చేయవలెను. ఎవరి పేరుతో పిండము అర్పించిన వారు బ్రహ్మ లోకమును చేరెదరు. అవ్యక్త రూపముగా నున్న దేవుడుమండ పృష్ఠాద్రి రూపమున ఫల్గు తీర్ధాది రూపమున గదాధరుని నమస్కరించును. శిలాపర్వత ఫల్వాది రూపముతో అవ్యక్తముగా నుండి, గదాధరుని రూపముగా వ్యక్తముగా నుండును. అటనుండి ధర్మారణ్యమునకు వెళ్ళును. ఇచటనే ధర్ముడున్నాడు. మతంగవాపిలో స్నానముచేసి తర్పణమును శ్రాద్ధమును ఆచరించవల యును. వెళ్లి మతంగేశునికి నమస్కరించి ఈ మంత్రమును పలుకవలెను. దేవతలు శంభువు ప్రమాణము. లోకపాలకులు సాక్షులు. నేను మతంగ క్షేత్రమునకు వచ్చి పితరులకు నిష్కృతిని చేసితిని. మొదట బ్రహ్మతీర్థమున కూపమున శ్రాద్ధాదుల ఆచరించవలెను. కూపయూపముల మధ్యన శ్రాద్ధము నాచరించి పితరులను తరింపచేయును. ధర్ముని, ధర్మేశ్వరుని సమస్కరించి, మహా బోధితరువుకు నమస్కరించవలెను. ఇట్లు ద్వితీయ దివసమున చేయవలసిన స్నానతర్పణ పిండ నమస్కారాది కృత్యములను వివరించితిని. ఈ కృత్యము పితృ సౌఖ్యమును కలిగించును. (II/45)