నారద మహా పురాణము
పురుషోత్తమ మాహాత్త్యము
వసువు పలికెను: శ్రీకృష్ణ భగవానుడు నిరంజనుడు, చిత్స్వరూపుడు, జనార్దనుడు, జ్యోతిస్స్వరూపుడు. అతని లక్షణమును వినుము. ఆ భగవానుడు నిత్యము గోలోకమున అభ్యంతరమున నుండును. అతనొక్కడే పరబ్రహ్మ. దృశ్యాదృశ్య స్వరూపమును ధరించియుండును. ఆ గోలోకమున గోవులు గోపాలురు గోపికలు, పూర్వభాగమున బృందావనము, శతశృంగము, విరజానది, వేరు వేరు పక్షులుండును. ప్రకృతి ఉన్నంత వరకు గోలోకమున శ్రీకృష్ణ భగవానుడు దృశ్య స్వరూపముతో ఉండును. ప్రళయకాలమున నిదురించిన గవాదులు శ్రీకృష్ణభగవానుని తెలియజాలవు. జ్యోతిః పుంజాంతర్భాగమున సుందర శరీరధారియై కిశోరుడు, నీలమేఘశ్యాముడు పీతాంబరధారి, ద్విభు జుడు, మురళీహస్తుడు కిరీటాది విభూషితుడు, రాధా వక్షస్థలోజ్జ్వలుడు కైవల్యనాధునిగా ఉండును. శ్రీ కృష్ణభగవానునకు రాధ ప్రాణాధిక ప్రియతమురాలు. ఈ రాధ స్వర్ణవర్ణ చిద్రూపురాలు, ప్రకృత్యతీతురాలు, నిత్యస్వరూపులగు దేహస్థులగు రాధాకృష్ణులకు తెలుపునకు పాలకు, పృథివీ గంథములకు భేదము లేనట్లు భేదములేదు. సకల కారణములకు కారణమును నిర్దేశించ శక్యము కాదు. వేదములకు కూడా చెప్ప శక్యము కాని ఆ వస్తువును చెప్పజాలము. జ్యోతి అంతర్భాగమున ఉన్న శ్యామసుందర రూపమును శివుడుమాత్రము చూడగలిగెను. ఎపుడో ఒక మారు ధ్యాన గోచరమగును. అప్పటి నుండి కోరబడు గోలోక కథను నారదాదులు సనకాదులు మాత్రమే తెలి యుదురు. వారు కూడా వినినదానిని మాత్రమే ధ్యానము చేయుచున్నారు కాని ఎప్పుడూ చూడలేదు. సనాతనుడగు శివుడు కూడా సాక్షాత్తుగా చూచుటకు తపించుచున్నాడు. కాని చూడలేకపోవుచున్నాడు. ధ్యాన గోచరమగు దానిని ధ్యానముచేయుచున్నాడు. ఒకమారు క్రీడించుచున్న రాధామాధవుల శరీరము రెండు భాగములు అయ్యెను. వామభాగము మాత్రము చతుర్భుజముగా ఉండెను. రెండు రూపములు సమాన రూపావయవము, సమాన వస్త్రాభరణములు కలదిగా నుండెను. అట్లే రాధా స్వరూపముకూడా రెండుగా అయ్యెను. ఆ ఇద్దరూ ఈ స్వరూపమును చూచిరి. వీరుకూడా వారితో సమానముగా ఉండిరి. చతుర్భుజముగా ఉన్న సుందరమగు లక్ష్మీకాంత రూపమును శివాది భక్త బృందములు చాలా మార్లు చూచిరి. చతుర్భుజమగు దేవి రూపమును ఒకసారి బ్రహ్మ చూచెను. సృష్టి కార్యమున మగ్ధుడగు బ్రహ్మకు దయతలచి చూపెను. సనత్కుమారునికి లక్ష్మి స్వయముగా వర్ణించినది. తత్త్వమూర్తి అగు విష్వక్సేనునకు శ్రీమన్నారాయణుడు స్వయముగా వివరించెను. ధర్మపుత్రుడు నారదునకు చెప్పెను. గోలోకవర్ణన మంతయూ రాధా కృష్ణమయము. ఉత్తమదేవ గణములచే పూజించబడు రాధాదేవి తాను కుతూహలముతో స్వయముగా శివరూపమును ధరించెను. ఆ రూపమును చూచి యోగీశ్వరుడగు శ్రీకృష్ణ భగవానుడు ఆశ్చర్యకరముగా సమయోచితమగు మూల ప్రకృతి రూపమును ధరించెను. వామదేవుడు సంతోషముచే విపరీతమగు శరీరమును దాల్చి ఉండెను. కావున దుర్గా రూపమును ధరించిన శ్రీహరిని రేయింబవళ్ళు ధ్యానించ వ్చ్యను. రాధయే లక్ష్మీదేవి, సావిత్రి సరస్వతి గంగ వీరికి భేదములు లేవు. కామధేను స్వరూపిణి అగు ఈ విద్య అయిదు రూపములతో నుండెను.
రాధికాపతియగు శ్రీకృష్ణ భగవానుడే లక్ష్మీపతి. అతనే బ్రహ్మరూపుడు. ధర్మస్వరూపుడగు నారాయణుడు. ఇట్లు అజుడగు శ్రీకృష్ణుడు కూడా అయిదు రూపములను ధరించియుండెను. ఈ కృష్ణ భగవానుని కార్యకారణ రూపముగా ధ్యానించుచుందురు. ఈ రూపముతో ప్రేమ సంబద్ధుడై విషయ రూపముతో శివుడగును. రాధా రూపమును, రాధాపతి రూపమును స్వయముగా సచ్చిత్సుఖ స్వరూపముగా చూచెదరు. దేవతేజస్సు నుండి ఉద్భూతమగు ఈశ్వరి అగు మూల ప్రకృతి కృష్ణరూపురాలు ఈమెయే దైత్య సంహారకారణి, దక్షపుత్రియగు సతీరూపమును ధరించి శివుని ఆశ్రయించినది. భర్తను నిందించుట చూచి సతీదేవి తన దేహమును విడచెను. హిమంతుని భార్యయగు మేనయందు పుట్టి తపమును ఆచరించి మరల శివుని పొంది శివప్రదురాలాయెను. శస్తముగా ఈ కృష్ణుని రాధయే శివమోహన తత్పరురాలు. జగదంబా స్వరూపురాలు. విభువు కూడా స్వయముగా మాయా స్వరూపుడు. కావుననే కుమారస్వామి, గణపతి కూడా ఈ రూపములే. శ్రీకృష్ణుడే స్వయముగా గణపతి. శివుడే కుమారస్వామి. రాధా రూపమును ఆశ్రయించిన స్వామినే కొందరు శివునిగా చెప్పెదరు. రాధ శ్రీకృష్ణ వక్షస్థ్యలమున ఉండును. వీరిద్దరికీ భేదములేదు. కృష్ణుడే మూలప్రకృతి. శివుడే రాధిక. ఈ ఇద్దరూ ఒకటా జంటయా అని ఎవ్వరూ నిశ్చయింపజాలరు. మనచే నిర్దేశించబడు స్వరూపము కేవలము ఉప లక్షణము మాత్రమే. శాస్త్రములు వేదములు వర్ణించు ఈశ్వర స్వరూపము ప్రాకృతము మాత్రమే. కావున నిర్దేశించవీలగును. అనిర్ధేశ్యమగు దానిని ‘న’, ‘న’ అని చెప్పజాలము అని నిషేధించబడుచున్నది. కావున శరణాగతులు ప్రభువును నిషేధ శేషము అందురు. సర్వకర్మలకు శాస్త్రములు యామకముగా ఉండును. కర్మలనాచరించు జీవుడు ఈశ్వరాంశ. స్వయముగా విభువు. ప్రకృతి కంటే పరుడే. నిత్యుడే. కాని మాయామోహితుడు. సాక్షిగా ఉండు ఈశ్వరుడు మాత్రము స్వయముగా పూర్ణుడు. జీవునితో కలిసి ఉండువాడు. అతనిని కలిసి ఉండు జీవుడు తెలియజాలడు. పరమాత్మను ఆశ్రయించినవారు శంఖచక్రగదా పద్మములచే అలంకరించబడిన భుజద్వయము కలవారు ప్రసన్నులనబడుదురు. ఈ ప్రసన్నులు రెండు విధములుగా ఉందురు. ఆర్త ప్రపన్నులు, దృప్తప్రపన్నులు అని, ఆర్త ప్రపన్నులు మాత్రము స్వామి వియోగమును ఏమాత్రము సహించజాలరు. దృప్తప్రపన్నులు జన్మాంతరమువరకు సహించ గలరు. వీరు నిర్దయులు. సద సజ్జనులు. మహాలక్ష్మి ప్రసన్నులైనవారు సఖి భావమును ఆశ్రయిం తురు. ఇట్టివారు జపించు మంత్రమును బ్రహ్మ చెప్పిన దానిని ఇప్పుడు చెప్పెదను.
“గోపీజన వల్లభ చరణం శరణం ప్రపద్యే” అను మంత్రము పదునారు వర్ణములు కలది. ఈ మంత్రమును సాక్షాత్తుగా లక్ష్మిదేవియే ప్రకాశింపచేసినది. మొదట సనత్కుమారునకు, తరువాత శంకరునకు ప్రకాశింపచేసినది. సఖి భావమును ఆశ్రయించి గోపికాబృంద మధ్యగతుడగు రాధా మాధవ నామముగల ఆత్మను ధ్యానించవలయును. గురువులందు ఈశ్వర భావముచే ఎల్లపుడూ ప్రణతుడై ఉండవలెను. విష్ణు భక్తులందు సత్కార పూర్వకముగా ప్రవర్తించవలయును. ఇతరులను సమభావముతో చూడవలయును. ప్రేమబంధనముచే రాధాకృష్ణులను రాత్రి పగలు ధ్యానించ వ్చ్యయును. అన్ని పర్వకాలములందు యాత్రలను, పర్వమహోత్సవములను ఆచరించవలెను. (II/59)