నారద మహా పురాణము
మాఘమాహాత్మ్యము
వసిష్ఠ మహర్షి పలికెను: ఆ కాష్ఠీల వచనమును వినిన సంధ్యావళి ఆదరముగా ఇట్లు పలికెను. ఓ కాష్ఠీలా! నీ మాటల వలన ఇప్పుడు నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. నీవు కుత్సితగతికి వెళ్ళు చుండగా ఎట్లు చూడగలను? నీచ జాతినుండి నీవు విముక్తురాలవు అగుటకు ఏమి చేయవలయును? నాకా విషయమును చెప్పుము. నిన్ను చూచి నాకు దుఃఖము కలుగుచున్నది. కోమలము, మృదువు, నవనీతము వంటి నీ శరీరము మాంసపిండముగా ఉండుట చూచి నా మనసులో దయ కలుగుచున్నది.
కాష్ఠీల పలికెను: ఓ సుందరీ! నా కొఱకు సమస్త భూమండలమును దానము గావించినను నాకు నీచజాతి నుండి విముక్తి లభించదు. నాకు విముక్తిని కలిగించి ఉత్తమ గతిని ప్రసాదించు గొప్ప పుణ్యమును తెలిపెదను వినుము. ఈ మాఘమాసము సర్వమాసములలో ఉత్తమ మాసము. ఈ మాసమున బ్రహ్మ హత్యాది పాపములు ఆక్రోశించును. మాఘ మాసము దుర్లభము. మానవ జన్మ దుర్లభము. ఉషఃకాల స్నానము, శ్రీకృష్ణ సేవనము, యథావిధిగ ఉపవసించు హరివాసరము దుర్లభము. మాఘ మాసమున దేవతలు తమ తేజస్సును జలమున నుంచెదరు. కావుననే మాఘ మాసమున జలము విశేషముగా పావనము. మాఘమాసమున ప్రాతః కాలమున స్నానము చేయు వానికి లభించుగతి యుద్ధమున శూరులకు కూడా లభించదు. బావి, చెరువు నదులలో మాఘ స్నానము శ్రేష్ఠము. కూపజలము, భాండజలము మధ్యమములు. వేడి నీరు అధమము. పుణ్యము సుఖములచే లభించదు. దుఃఖముల చేతనే లభించును. స్నానము ధర్మ సేవనమునకే కాని శరీర శుద్ధికొఱకుకాదు. వహ్నిని హోమము కొఱకు సేవించవలయును కాని శీతమును వారించుటకు కాదు. సూర్యోదయమునకు ముందే స్నానమాడ వలయును. ఆకాశమున మేఘములు కప్పియుండగా ఉదయించుచున్న సూర్యుని ప్రార్ధించవలెను. నద్యాదికము లేనిచో కొత్తకుండలోని నీరు రాత్రిపూట గాలి కుంచినది గంగాజల సమమని చెప్పెదరు. మాఘ స్నానమును చేయువాడు దుర్గతిని చెందడు. మాఘ స్నానము శుద్ధి చేయని పాతకములు లేవు. అగ్ని ప్రవేశముకంటే మాఘోషస్స్నానమే శ్రేష్ఠము. బ్రతికినపుడు దుఃఖించును. మరణించి సుఖించును. కావున మాఘస్నానము విశిష్టము. ప్రతి దినము శర్కరతో కూడిన తిలలు బ్రాహ్మణునికి దానము చేయవలెను. తరువాత సూర్యుడు నిరంజన విష్ణురూపుడు ప్రీతి చెందునని షడ్రసాన్నమును భుజింప చేయవలెను.
బ్రాహ్మణ జంటకు వస్త్రములను సప్తాన్నములను అర్పించవలెను. ముప్పది మోదకములను శర్కరా సహితములగు అన్నములను దానము చేయవలెను. మూడు భాగములు తిలలు, ఒక భాగము శర్కరను, భోగ్యములగు తాంబూలాదులను భక్తిచే దానము గావించవలెను నదులలో నదీ ముఖముగా, ఇతర ప్రదేశములలో సూర్యముఖముగా గంగాది తీర్ధములను ఆవాహన గావించి స్నానము చేయవలెను. అనేక జన్మలలో తెలిసీ తెలియక చేసిన పాపములన్నియూ నీ తేజస్సుతో హతమగుగాక. ఓ దివాకరా! జగన్నాధా! ప్రభాకరా! నీకు నమస్కారము. ఓ అచ్యుతా! ఈ నా మాఘ స్నానమును పరిపూర్ణమును గావించును. మాఘ స్నానము చేయువాని కంటే తీర్ధస్నానము చేయువాడు అల్ప ఫలమును పొందును. తీర్థ స్నానమును పరిపూర్ణమును గావించుము. తీర్థ స్నానము వలన స్వర్గమును పొందును. మాఘ స్నానము వలన పరమపదమును పొందును. మాఘ శుక్ల ఏకాదశి ఆదివారమున వచ్చినచో మహాపాతకములను నశింపచేయును. నక్షత్ర యోగము లేకున్ననూ శుక్లేకాదశి చెడురాజు రాజ్యమును పోనాడునట్లు పాపములను దహింపచేయును. దుష్ట పుత్రుడు కులమును, దుష్టభార్య భర్తను అధర్మము ధర్మమును, దుష్టమంత్రి రాజును, అజ్ఞానము జ్ఞానమును అనాచారము ఆచారమును, అసత్యము సత్యమును, వాదము సంవాదమును, ఉష్ణము హిమమును, అనర్ధము అర్ధమును, పాపము కీర్తిని, గర్వము తపస్సును, రసము మహారోగములను, శ్రాద్ధమును సంకేతము నశింపచేయునట్లు ఆచరించబడిన ద్వాదశి పాప సంఘమును నశింపచేయును. ఈ పాపములన్నింటిని పుష్కరము, నైమిశారణ్యము, కురుక్షేత్రము, ప్రభాసము, గయ, రేవా, సరస్వతి, గంగా, యమునా, ప్రయాగము, దేవిక, సరస్సులు, ఇతర నదులు, హోమదానతపములు, పురాణములలో చెప్పబడు ఇతర సుకృతములు నశింపచేయ జాలవు. ఒక్క హరివాసరము మాత్రమే నశింపచేయును. ఒక మారు ఉపవాసముతో పాపరాశులు అన్నియూ నశించును. పృధివీ దానము ఒకవైపు హరివాసరము ఒకవైపు ఉంచినచో రెండు సమములు కాజాలవు. హరివాసరమే అధికము అని బ్రహ్మచెప్పెను. ఈ హరివాసరమున బంగారముతో వరాహమూర్తిని చేసి ఘటముపైన కొత్త తామ్ర పాత్రలో సర్వ బీజాన్వితము, శ్వేత వస్త్రాచ్ఛాదితము, హిరణ్య సహితము, దీప శోభితము, పుష్పమాలాలంకృతము అగుదానిలో నుంచి యధావిధిగా పూజించి, రాత్రి జాగరణచేసి, ప్రాతఃకాలమున, విష్ణు భక్తుడు కుటుంబియగు బ్రాహ్మణు నకు దానము గావించవలెను. వరాహ ప్రతిమా యుతమగు ఆ కుంభమును నైవేద్య పరిచ్ఛద సహితముగా దానము గావించి, బ్రాహ్మణులను భుజింపచేసి బంధు మిత్రులతోకలిసి తాను పారణ చేయవలెను. ఇట్లు చేసినచో మరల జన్మకలుగదు. చాలా జన్మలలో తెలిసీ తెలియక చేసిన పాపములన్నింటిని సూర్యోదయము చీకటిని నశింపచేసినట్లు నశింపచేయును. ఓ శుభకరురాలా! ఇట్లు శాస్త్ర విధిననుసరించి నేను ద్వాదశీ వ్రతమును వర్ణించితిని. నీవు పూర్వజన్మలో ఈ వ్రతమును ఆచరించితివి. దీని వలన నీకు సాటిలేని పుష్టి ఉన్నది. ఉండగలదు. నీకే నీ భర్తను పుత్రునకు సర్వ కాలములందు సుఖములనిచ్చును. ఆ వ్రత పుణ్యములో నాలుగవ భాగమును నాకిచ్చితివేని నేను ప్రీతితో శ్రీహరి పరమధామమును పొందెదను. పూర్వ జన్మలో నేను చేసిన విత్తాపహరణ పాపమును నశింపచేయగల నాలుగవ భాగమును నాకు ఇమ్ము. జీవితముతో, విత్తముతో భర్తను వంచించిన స్త్రీ నూరు జన్మలు క్రిమిగా పుట్టి పుల్కసిగా” సంభోగమును ధనమును యాచించు భర్తకు ఆరెంటిని ఈయని స్త్రీ కాష్ఠీలగా పుట్టును. కావున ఆ పాపము నశించుటకు ద్వాదశివలన కలిగిన పుణ్యములో నాలుగవ భాగము నిమ్ము. నా అందు జాలికలదేని ఇమ్ము. ఇట్లు యాచించిన కాష్ఠీలా వాక్యమునువిని, చేతిలో జలమును తీసుకొని ఆమె కోరిన పుణ్యమునిచ్చితిని. నేను పూర్వజన్మలో ఏకాదశీ ఉపోషము వలన కలిగిన పుణ్యములో నాలుగవ భాగముచే ఈ కాష్ఠీల విద్యుత్సమ ప్రభయై దివ్య విమానమున కూర్చుండి విష్ణు పదమునకు వెళ్లుటను చూచితిని. కావున ఈలోకమున భర్తయే దైవము. భర్తను వంచించరాదు. సద్గతిని కోరు భార్య ధనముచే జీవితముచే మోసగించరాదు. కావున ఓ మోహినీ, నా భర్త కొరకు నీ ఇష్టము నిచ్చెదను. కావున చెప్పుము. ధనమును, దేహమును, పుత్రుని, ఇంకా ఇతరములను కూడా ఇచ్చెదను. ఈ లోకమున భర్తకాక ఇతర దైవమే లేదు. అట్టి భర్త కొరకు ధనమును కాని జీవితము కాని త్యాగము చేయవలయును. అట్లు చేసినచో కల్పకోటి శతము విష్ణు లోకమున విరాజిల్లును. అగ్నిసాక్షిగా వివాహమాడిన బ్రాహ్మణపుత్రి కఠినురాలై ఘోరవ్యసనములుకల భర్తను దానము చేసెను కాని అతను కోరిన ధనము నీయజాలకపోయెను. ఆ పాపముచే కాష్ఠీలగా పుట్టెను. నేను కుమారిగా ఉండి తండ్రి ఇంటిలో దీనిని చూచితిని. కావున నేను ఈ సత్యమును హితమును తెలిసి నా భర్త కొఱకు సర్వమును ఈయగలను. స్వీకరించుము. (II/31)