కాశీ మాహాత్మ్యము

వసువు పలికెను: ఇక ఇపుడు దేవాదులచే చేయబడిన యథాయోగ్య ఫలప్రదమగు యాత్రా కాలమును చెప్పెదను. పూర్వము చైత్రమాసమున దేవతలచే ఈ యాత్ర విధించబడినది. అచట నుండి కామకుండమున స్నానపూజాదులు నిర్వర్తించిరి. జ్యేష్ఠ మాసమున సిద్ధులు ఈ యాత్రను చేసిరి. వీరు రుద్రావాసమున కుండమున స్నాన పూజాదులు నిర్వర్తించిరి. ఆషాఢమున ప్రియాదేవీ కుండమున స్నాన పూజాదులు చేయు గంధర్వులు ఈ యాత్రను ఆచరించిరి. శ్రావణ మాసము లక్ష్మీకుండమున నుండి స్నానార్చన పరాయణులకు విద్యాధరులు ఈ యాత్రను చేసిరి. భాద్రపద మాసమున మార్కండేయ హ్రదముననుండి స్నానపూజాతత్పరులగు యక్షులచే ఈ యాత్ర ఆచరించ బడినది. మార్గశిర మాసమున కోటి తీర్థముననుండి స్నానపూజావిధాయకులగు పన్నగులు ఈ యాత్రను ఆచరించిరి. పుష్యమాసమున కపాలమోచనమున ఉన్న స్నానధ్యానార్చనలు కావించు గుహ్యకులు ఈ యాత్రను ఆచరించిరి. ఫాల్గుణ మాసమున కాళేశ్వర కుండస్థులు స్నానపూజాది తత్పరులగు పిశాచులు ఈ యాత్రను నిర్వహించిరి. శుభప్రదమగు ఫాల్గుణ మాసమున శుద్ధచతుర్దశి పిశాచి అను పేర ఇందువలననే ప్రసిద్ధిగాంచినది. ఇక ఇపుడు నీకు యాత్రా కృత్యమును చెప్పెదను. ఈ కృత్యమును నిర్వర్తించినవాడు యాత్రాఫలమును పొందును. మృష్టాన్నముతో కూడిన ఫలపుష్ప సమన్వితములగు, వస్త్రసంఛాదితములగు ఉదకుంభములను దానము చేయవలెను. చైత్ర శుక్ల తృతీయ మహాఫలప్రద. ఈనాడు మానవులు భక్తిభావముతో గౌరీదేవిని దర్శించవలెను. స్నానమాచరించి గోప్రేక్షమునకు వెళ్లవలెను. స్వర్ద్వారమున కాళికాదేవిని పూజించవలెను. ఇచట మరియొక దేవి పరాయని సంవర్త లలితాదేవి చెప్పబడినది. ఈ దేవి సర్వకామ ఫలప్రద గావున భక్తిచే దర్శించవలెను. తరువాత శివభక్తులు శివవ్రతపరులగు బ్రాహ్మణులను భుజింప చేయవలెను. సమృద్ధిగా వస్త్రములను దక్షిణల నర్పించవలెను పంచగిరులను ఉద్దేశించి రసములను గంధములను బ్రాహ్మణులకు అర్పించవలెను. ఇట్లుచేసిన ఉత్తమ శ్రేయస్సును సౌభాగ్యమును పొందును. ఆయా క్షేత్రా వాసములందు విఘ్న ప్రదులగు వినాయకులను ఇప్పుడు చెప్పెదను. వీరిని పూజించి నరుడు నిర్విఘ్నముగా ఫలమును పొందును. మొదట డుండిని దర్శించవలయును. తరువాత వినాయకుని దేవీ వినాయకుని, గోప్రేక్షుని, హస్తి హస్తిని మరియొక వినాయకుని సిందూర్య నామకుని చతుర్ధియందు చూడవలెను. వీరు వినాయకులు. వీరికి మోదకములను అర్పించవలెను. ఈ కృత్యముచే సిద్ధిని పొంది జయమును పొందును. ఇక ఇప్పుడు క్షేత్ర రక్షిణిలగు చండికలను చెప్పెదను. దక్షిణమున దుర్గ, నైఋతమున అంతరేశ్వరి, పశ్చిమమున అంగారేశ్వరి, వాయవ్యమున భద్రకాళికా, ఉత్తరమున భీమచండ, ఈశాన్యమున మహామత్త, పూర్వమున ఊర్ధ్వకేశ సమితయగు శాంకరి, అగ్యేమున అధఃకేశీ, మధ్యన చిత్రఘంట; ఈ చండికలను దర్శించువానికి ప్రీతిచెందినవారై క్షేత్రమును రక్షించుచుందురు. పాపులకు ఈచండికలు ఎల్లప్పుడు విఘ్నములను కలిగించుచుందురు. కావున ఉత్తమసిద్ధిని, సంతానమును, విభవమును, సుఖమును కోరువారు వినాయకులతో కూడియున్న ఈ క్షేత్ర పాలికలను ఎల్లప్పుడూ పూజించవలెను. భక్తిచే గంధ పుష్ప నైవేద్యాదులను సమర్పించవలెను. ఇచటనే మరియొక విశేషమును గూర్చి నీకు చెప్పెదను. ఇచటనే శుభజలములు గల మూడు నదులు ప్రవహించుచుండును. ఈ నదులను దర్శించి నంతనే బ్రహ్మహత్య తొలగి పోవును. వీటిలో ఒకటి త్రిస్రోతా, రెండవది మందాకిని, మూడవది మత్స్యాదరి. ఈ మూడు పుణ్యప్రదములు. వీటిలో మధ్య మేశ్వరమున నున్న మందాకిని మహాపుణ్యకరము. త్రిస్రోతిక యున్నందున అవిముక్త పుణ్యప్రద. ఓంకారమున మత్స్యోదరి పుణ్యప్రద. ఈ స్థానమున గంగవచ్చు కాలము అత్యంత పుణ్యతమ కాలము. ఈకాలము దేవతలకు కూడా దుర్లభము. వరణాసిక్త సకాలమున, జాహ్నవీ జల విప్లుతమున పుణ్యతమమగు నాగేశ్వరమున స్నానము చేయువాడు దేనిని ఆలోచించును? గంగమత్స్యోదరీ సమాయుక్త మగునపుడు శివుడు స్నానము చేయగా కపాలము విడిచెను. కావున ఇచట కపాల మోచనమను గొప్ప సరస్సు సర్వప్రాణులను పావనము చేయునది, పరమపుణ్యప్రదముగా ప్రసిద్ధి గావించినది.

ఓంకారేశ్వర సన్నిధిలో మత్సోదరీ గంగాజలమున స్నానమాచరించి ఓంకారేశ్వరుని దర్శించి శోకమును, జరను, మృత్యువును విడుచును. మత్స్యాదరీ జలమున స్నానమాడినవాడు సాక్షాత్తుగా ఓంకారేశ్వరుడను శివుడే అగును. నీ మీది వాత్సల్యముచే ఈ రహస్యమును చెప్పితిని. ఓంకారమున అకార ఉకార మకారములు కలవు. వీటిలో అకారము విష్ణు లోకగతి ప్రదము. అకారమునకు దక్షిణ భాగమున ఉకారము చెప్పబడినది. ఇచటనే దేవాచార్యుడగు బృహస్పతి ఉత్తమసిద్దిని పొందెను. ఇచట ఓంకారము అవ్యయమగు బ్రహ్మపదముగా తెలియవలయును. అకార ఉకారములకు ఉత్తర భాగమున విష్ణు సంజ్ఞితమగు మకారము కలదు. ఈ లింగమునే మహర్షియగు కపిలముని సిద్ధి పొందెను. భీష్ముడు వారాణసికి చేరి ఉత్తమమగు పంచాయతనమును దేవేశుని అరాధించుచు, అచటనే యుండెను. ఈ స్థానమున శివుడు స్వయముగా ఆవిర్భవించెను. సర్వదేవతలచే స్తుతించబడుచు గోప్రేక్షకుడని ప్రసిద్ధిని గాంచెను. గోప్రేక్షేశ్వరుని చేరి దర్శించి పూజించిన మానవుడు దుర్గతిని పొందజాలడు. కల్మషములనుండి విముక్తుడగును. అరణ్యములో ఉండి సురభులు దావాగ్నిచే దహించబడుచు తిరుగుచు ఈ హ్రదమును చేరి వాంతిని పొంది జలపానమును చేసినవి. అప్పటినుండి ఈ హ్రదమును కపిలాహ్రదము అందురు. ఇచటనున్న శివుని వృషధ్వజుడు అందురు. ఇచట సాక్షాత్తు శివుడు సర్వకాలములందు సన్నిహితుడై దృశ్యమానుడై ఉండును. ఇంద్రియ నిగ్రహముతో ఈ కపిలా హ్రదమున స్నానమాచరించి వృషధ్వజుడగు శివుని దర్శించిన సర్వయజ్ఞ ఫలమును పొందును. ఇచట శివుని పూజించి మరణించినవాడు స్వర్గమును పొందును. దేహభేదముచే అతిదుర్లభమగు గుణత్వమును పొందును. ఈ ప్రదేశముననే పూర్వము బ్రహ్మ స్వయముగా గోవులను సర్వలోక శాంతికొరకు అందరిని పవిత్రము చేయుటకు భద్ర దోహమను సరస్సును ఏర్పరిచెను. ఈ సరస్సు పరమపావనము. సర్వపాపహరము. ఇచట స్నానమాడినవాడు సాక్షాత్తు వాక్పతియగును. బ్రహ్మ ఇచట స్వయముగా శివుని తీసుకొని వచ్చి స్థాపించెను. విష్ణువు బ్రహ్మ అంశమును సంగ్రహించి ఇచట స్థాపించెను. కావున ఇచట శివుడు హిరణ్యగర్భ నామముతో ఉండెను. మరల ఇచట బ్రహ్మ స్వర్లోకేశ్వరము అను పేరుగల లింగమును కారణాంతరమున స్థాపించెను. ఈ లింగదర్శనమున శివలోకమున విరాజిల్లును. ఇచట మృతి చెందినవాడు మరల పుట్టడు. యోగులకు లభించు అనంతగతి అతనికి లభించును. ఈ ప్రదేశముననే ఒక రాక్షసుడు దేవకంటకుడు స్థాపించిన వ్యాఘ్రేశ్వరుని దర్శించినవారు దుర్గతిని పొందజాలరు. హిమవంతునిచే స్థాపించబడిన శైలేశ్వర లింగము ఇచట కలదు. ఈ లింగమును దర్శించిన నరుడు దుర్గతిని పొందడు. ఉత్పలుడు విరలుడు అను రాక్షసులు ఇద్దరు బ్రహ్మవరగర్వముతో స్త్రీ లౌల్యమును కనబరచగా పార్వతీదేవి సంహరించెను. ఈ కథను చిహ్నముగా లింగము స్థాపించబడినది. జ్యేష్ఠ స్థానమును ఆశ్రయించిన ఈ లింగమును దర్శించిన వారు దేహభేదమున గణత్వమును పొందెదరు. ఇచట వారాణసీనదీ పవిత్రము, పాపనాశిని. ఈ క్షేత్రమున చేరి గంగతో కలిసినది. ఈ వారాణసీ గంగాసంగమమున బ్రహ్మ లింగమును స్థాపించెను. ఈ లింగము సంగమేశ్వరమని ప్రసిద్ధి గాంచినది. ఈ దేవనదీ సంగమమున స్నానమాచరించి సంగమేశ్వరుని పూజించినవాడు జన్మ భయమును పొందడు. ఈ యుగమును భృగుపుత్రుడగు శుక్రుడు స్థాపించెను. ఈ లింగమునకు శుక్రేశ్వరుడని పేరు. సర్వసిద్ధ అమరార్చితమైన ఈ లింగమును చూచినవాడు సర్వకిల్బిషముక్తుడై, సద్యోమోక్షమును పొందును. మరణించినచో మరల జన్మించడు. ఇచట శివుడు జంబుకాసురుని చంపెను. ఈ లింగమును చూచిన వారు సర్వకామనలను పొందుదురు. ఇంద్రాది దేవతలు ఈ లింగములను స్థాపించిరి. ఈ లింగములు పవిత్రములు సర్వకామప్రదములు. ఇట్లు ఈ అవిముక్త క్షేత్రమున ఉన్న అన్ని లింగములను గూర్చి నీకు విస్తరముగా చెప్పితిని. (II/50)