ధర్మాఖ్యానము

నారదుడు పలికెను: ఓ భ్రాతా! నేను కోరిన, పాపములను నశింపచేయు గంగామాహాత్మ్యమును వింటిని. ఇప్పుడు దాన లక్షణమును పాత్ర లక్షణమును చెప్పుము.

సనక మహర్షి పలికెను: అన్ని వర్ణములలో బ్రాహ్మణ వర్ణము ఉత్తమము. ఇచ్చిన దానము అక్ష యము కావలయునని తలచువారు బ్రాహ్మణునకే ఈయవలయును. బ్రాహ్మణుడు భయములేనివాడై అందరి నుండి దానమును తీసుకొనవలయును. క్షత్రియులు వైశ్యులు ఎప్పుడూ దానమును తీసుకోరాదు. తీవ్రస్వభావము కలవానికి, పుత్రులు లేనివానికి, డాంబికాచారమును అవలంబించిన వానికి, తన కర్మలను విడచినవానికి ఇచ్చినది నిష్ఫలమగును. పరభార్యల యందు ఆసక్తి కలవానికి, పరద్రవ్యమును అభిలషించువానికి, జ్యోతిష్యము చూచువానికి ఇచ్చినది నిష్ఫలము అగును. అసూయ నిండిన మనసు గలవానికి, కృతఘ్నునికి, కపటికి, యాగమునకు అనర్హుడైన వానిచే యాగము చేయించువానికి, ఇచ్చినది నిష్ఫలమగును. ఎపుడూ యాచించువానికి, హింసకునికి, ఖలునికి, రసములను అమ్మువానికి ఇచ్చునది నిష్ఫలమగును. వేదములను స్మృతులను అమ్ముకొనువానికి, ధర్మమును అమ్ముకొనువానికి ఇచ్చినది నిష్ఫలమగును. గానముతో జీవించువానికి, వ్యభిచారము చేయు స్త్రీ భార్యగా కలవానికి, ఇతరులను పీడించువానికి ఇచ్చినది నిష్ఫలమగును. ఖడ్గముతో జీవించువానికి, సిరాతో జీవించువానికి, దేవాలయమున ధనమును తీసుకొని అర్పించువానికి, గ్రామపురోహితునికి, గ్రామాధికారము చేయువానికి ఇచ్చునది నిష్ఫలమగును. ఇతరులకు, వంట చేయువానికి, కలికి, వైద్యునికి, తినరాని వాటిని తిను వానికి ఇచ్చినది నిష్ఫలమగును. శూద్రుల అన్నమును తినువానికి, శూద్ర శవములను దహనము చేయువానికి, వ్యభిచారిణుల అన్నము తినువానికి, ఇచ్చునది నిష్ఫలమగును. విష్ణు నామములను అమ్మువానికి, సంధ్యావందనమును చేయని వానికి, దుష్టదానములను స్వీకరించువానికి ఇచ్చునది నిష్ఫలమగును. పగలు నిద్రించువానికి, పగలు సంభోగము చేయువానికి సంధ్యా సమయమున తినువానికి ఇచ్చునది నిష్ఫలమగును. మహాపాతకములు కలవానికి, జ్ఞాతులు బంధువులు విడచిన వానికి విధవా పుత్రునికి, వ్యభిచారిణి పుత్రునికి ఇచ్చినది నిష్ఫలమగును. తన కంటె ముందు పెళ్ళి చేసుకొన్నవాని అన్నకు, అన్నకు వివాహము కాకమునుపే వివాహము చేసుకొన్న వానికి, స్త్రీల వశములో ఉన్న వానికి అతిదుష్టునికి ఇచ్చినది నిష్ఫలము అగును. మద్యమాంసములను తినువానికి, స్త్రీ విటులకు, అతిలోభికి తస్కరునికి, చాడీలు చెప్పువానికి ఇచ్చినది నిష్ఫలమగును. పాపనిరతులకు ఇతరులచే నిందించబడు వారికి ఈయరాదు. వారి నుండి తీసుకోరాదు. సత్కర్మనిరతునకే ప్రయత్నముచేసి ఈయవలయును.

శ్రద్ధతో ఇచ్చినది, విష్ణువునకు అర్పించినది, యోగ్యుడైనవాడు అడిగినపుడు ఇచ్చినది, ఉత్తమ దానము అనబడును. పరలోకఫలము కొఱకు ఇహలోకమున యోగ్యునికి ఫలాకాంక్షతో ఇచ్చు దానము మధ్యమము. డాంబికము కొఱకు, హింసించుటకు విధిరహితముగా, కోపముతో అశ్రద్ధతో అయోగ్యుడైన ఇతరునికి మధ్యమము. అధమ దానము బలిచక్రవర్తి ప్రీతి కొఱకు, మధ్యమ దానము స్వార్థసిద్ధికి, ఉత్తమదానము హరిప్రీతికొఱకు అని వేదార్థములు తెలిసినవారు చెప్పెదరు. ధనమునకు దానము, అనుభవము, వినాశము అని మూడు గతులుండును. దానము చేయని, అనుభవించని ధనము వినాశకారణము అగును. ధనము ధర్మఫలము కావలయును. ధర్మమును శ్రీహరి సంతోషము కొఱకు ఆచరించవలయును. చెట్లు బ్రతుకుచున్నవి కదా! కాని అవికూడ పరార్థము కొఱకే జీవించుచున్నవి. మూలములతో (గడ్డలతో) ఫలములతో చెట్లు పరులకు ఉపకారమే చేయుచున్నవి. ఇతరుల కొఱకు జీవించని మనుజులు చనిపోయినవారితో సమానులే. శరీరముతో, మనసుతో, మాటతో పరోపకారము చేయని మనుజులు పాపులు. ఓ నారదా! ఈ విషయమున నీకొక కథను చెప్పెదను వినుము.

ఈ కథలోనే దానాదికముల లక్షణములు గంగా మాహాత్మ్యము చెప్పబడినది. ఈ కథ అన్ని పాపములను నశింపచేయును. భగీరథ, యమధర్మరాజు సంవాదము అన్ని పుణ్యములను కలిగించును. సగరవంశమున పుట్టినవాడు భగీరథుడను పేరుగల వాడొక రాజుండెను. సప్త ద్వీపములతో, సప్త సాగరములతో కూడిన ఈ భూమండలమునంతయు పరిపాలించెను. అన్ని ధర్మములందు ప్రీతి కలవాడు, సత్యవ్రతము గలవాడు, అమిత పరాక్రమము కలవాడు, రూపమున మన్మథుని పోలినవాడు, యజ్ఞములను చేయువాడు, వివేకము కలవాడు, ధైర్యమున హిమాద్రిని పోలినవాడు, ధర్మమున ధర్మరాజుతో సమానుడు అన్ని ఉత్తమ లక్షణములు కలవాడు, అన్ని శాస్త్రార్థములు తెలిసినవాడు, అన్ని సంపదలు కలవాడు అందరికీ ఆనందమును కలిగించువాడు, ఎల్లప్పుడు అతిథులను పూజించుట యందే ఆసక్తి కలవాడు, శ్రీమన్నారాయణుని పూజించుటలో మనసు కలవాడు, అన్ని మంచి గుణములకు నిధి, స్నేహశీలి, భూతదయ కలవాడు, మంచి బుద్ధి గలవాడు. ఇంతటి ఉత్తముడైన భగీరథ చక్రవర్తిని గూర్చి తెలుసుకొని సంతోషించిన యమధర్మరాజు ఒకప్పుడు చూచుట కొచ్చెను. భగీరథ చక్రవర్తి వచ్చిన ధర్మరాజును యథావిధిగా పూజించెను. భగీరథుని పూజలంది సంతోషించిన యమధర్మరాజు అతనితో ఇట్లు పలికెను.

ధర్మరాజు పలికెను: “ఓ రాజా! ధర్మమును తెలిసిన వారిలో శ్రేష్ఠుడవని ప్రసిద్ధి చెందితివి. ఈ మూడు లోకములలో విస్తరించిన నీ కీర్తిని విని ధర్మరాజునైన నేను నిన్ను చూచుటకు వచ్చితిని. సన్మార్గమునందు అసక్తుడైనవాడవు, సత్యసంధుడవు అన్ని ప్రాణులకు హితమును చేయవలయునని కోరువాడవు అయిన నిన్ను నీ ఉత్తమ గుణములయందలి ప్రీతిచే దేవతలు చూడగోరుచున్నారు. ఓ రాజా! కీర్తి, నీతి, సంపద ఉన్నచోట సద్గుణములు సత్పురుషులు దేవతలు తప్పక ఉందురు. ఓ రాజా! నీ చరితము అత్యాశ్చర్యకరము. సుందరము. అన్ని ప్రాణులకు హితమును చేయ వలయును అనెడు బుద్ధి మావంటి వారికి కూడా దుర్లభమే.” అని పలుకుచున్న ధర్మరాజును భగీరధ చక్రవర్తి నమస్కరించి వినయముతో సంతోషముతో మృదుమధురమైప మాటలతో ఇట్లు పలికెను.

అన్ని ధర్మములు తెలిసిన భగవానుడా! సమదర్శీ! సురేశ్వరా! నా మీద పరమకృప కలవాడవై నేనడిగిన వాటిని చెప్పుము. ధర్మములు ఎటువంటివి? ధర్మశీలురకు లభించు లోకములేవి? నరకములెన్ని? ఆ నరకములు ఎవరికి ప్రాప్తించును? నీవు ప్రేమతో ఆదరించునది ఎవరిని? శాసించునది ఎవరిని? దీనంతటిని నాకు విస్తరముగా తెలుపుము.

ధర్మరాజు పలికెను: “ ఓ మహాబుద్దీ! బాగు! బాగు! నీ బుద్ధి నిర్మలమైనది ప్రసన్నమైనది. ధర్మా ధర్మములను గూర్చి చెప్పెదను. భక్తితో వినుము. పలువిధములుగా ధర్మములుండును. ఈ ధర్మములు పుణ్యలోకములను ప్రసాదించును. భయంకరములైన ఆ ధర్మములు కూడా బహువిధములు. లక్షసంవత్సరముల కాలమున కూడా ధర్మాధర్మములను విస్తరముగా చెప్ప శక్యముకాదు. కావున ధర్మాధర్మ విషయములను సంగ్రహముగా చెప్పెదను. బ్రాహ్మణులకు బ్రతుకు తెరువును కల్పించుట మహాపుణ్యమని చెప్పబడినది. అట్లే ఆధ్యాత్మజ్ఞానికి దానము చేసిన ఫలము తరగనిది అగును. శాస్త్రములు తెలిసిన కుటుంబిని, సద్గుణవంతుడైన శ్రోత్రియుని బ్రతుకుతెరువు కల్పించి గ్రామమున ఉంచినచో తల్లివంశములు తండ్రి వంశములు కోటి తరములు విష్ణు భవనమున ప్రవేశించి ఒక కల్పము నివసించును. భూరేణువులను లెక్కించవచ్చును. వర్ష బిందువులను లెక్కించ వచ్చును. బ్రాహ్మణునికి వృత్తి కల్పించిన పుణ్యములను బ్రహ్మకూడా లెక్కించలేడు. బ్రాహ్మణుడు సమస్త దేవతా స్వరూపుడుగా చెప్పబడుచున్నాడు. అటువంటి బ్రాహ్మణునికి బ్రతుకుతెరువునిచ్చిన వాని పుణ్యమును ఎవడు చెప్పగలడు? బ్రాహ్మణులకు హితమును చేయువాడు అన్ని యజ్ఞములను చేసినవాడే. అన్ని పుణ్య తీర్థములలో స్నానము చేసినవాడు, అన్ని తపములను చేసిన వాడూ అగును. బ్రాహ్మణునకు బ్రతుకుతెరువును కల్పించమని ఇతరులను ప్రోత్సహించినవానికి కూడా అంతియే ఫలము కలుగును. ఇక వేయి మాటలేల? స్వయముగా చెరువును తవ్వించిననూ, ఇతరులచే తవ్వింప చేసిననూ అతని పుణ్య ఫలమును నూరేండ్లకాలములోనైనను చెప్పలేము. ఒక్క బాటసారి అయిననూ ఆ చెరువులో నీరు త్రాగినచో చెరువును త్రవ్వించిన వాని పాపము లన్నియూ నశించును. సంశయము లేదు. ఒక దినమునకు సరిపోవు నీటిని చెరువులో ఉంచగలవాడు అన్ని పాపముల నుండి విముక్తుడై స్వర్గమున నూరు సంవత్సరములు నివసించును. చెరువును త్రవ్వించు వానికి శక్తి కొలది సాయము చేయువాడు, ఆకార్యమును చూచి ఆనందించువాడు, చెరువును త్రవ్వించమని ప్రోత్సహించువాడు కూడా అంతియే ఫలమును పొందును. ఆవగింజ అంత మట్టిని చెరువునుండి తీసి బయట పడవేసినవాడు అన్ని పాపముల నుండి విముక్తుడై నూరు సంవత్సరములు స్వర్గములో నివసించును. దేవతలను గురువులను సంతోషింప చేసిన వాడు చెరువును త్రవ్వించినవాని పుణ్యమును పొందును అని శ్రుతి చెప్పుచున్నది.

ఓ రాజా! ఇచట నీకు ఒక కథను చెప్పెదను వినుము. ఈ కథను వినినచో అన్ని పాపములు నశించును. గౌడదేశమున వీరభద్రుడను ప్రసిద్ధి చెందిన మహారాజు కలడు. మహాప్రతాపము కలవాడు, విద్యావంతుడు, ఎప్పుడూ బ్రాహ్మణులను పూజించువాడు. వేదశాస్త్రకుల ఆచారములు కలవాడు. మిత్రులను పెంచువాడు. అతని భార్య మహానుభావు రాలు చంపక మంజరి. వీరభద్రుని మంత్రులు కృత్యాకృత్య విచారములు కలవారు. ధర్మశాస్త్రములచే ధర్మములను నిర్ణయించువారు. ప్రాయశ్చిత్తమును. చికిత్సను, జ్యోతిషశాస్త్రమును, ధర్మనిర్ణయమును, శాస్త్రము ప్రమాణముగా లేక చెప్పువాడు బ్రహ్మఘాతకుడగును. ఇట్లు మన్వాదులు చెప్పిన ధర్మములను ఎప్పుడూ గురువుల నుండి విధి పూర్వకముగా వినుచుండును. వీరభద్రుని రాజ్యమున అన్యాయముగా ప్రవర్తించువాడు ఒక్కడునూలేడు. తక్కువ వాడు కూడా రాజ్యమున లేడు. ఆ రాజు ధర్మబద్ధముగా రాజ్యపాలన చేయుచుండెను.

వీరభద్రుని సౌరాజ్యము స్వర్గముతో సమానమాయెను. ఒక మారు వీరభద్రమహారాజు మంత్రులతో కలిసి వేటకు బయలుదేరి మహారణ్యమున మధ్యాహ్నము వరకు తిరిగెను. దైవవశమున వేటాడు మృగములు లభించక మిక్కిలి అలసిన మహారాజు పరివారముతో వెళ్ళి ఒక సరస్సును చూచెను. కాని ఆ సరస్సు నీరులేక ఎండిపోయి ఉండుట జూచి ఈ భూమిపై ఎత్తు ప్రాంతమున ఇట్లు సరసును ఎవరు నిర్మించిరి? ఈ సరస్సులో నీరెట్లు లభించును? ఆ నీటిని త్రాగి ఈ రాజు ఎట్లు బ్రతుక వలయును? అని (మంత్రి) చింతించెను. అపుడు అతనికి ఈ సరస్సును త్రవ్వ వలయునని అలోచన కలిగెను. వెంటనే ఒక మూర లోతు సరస్సును త్రవ్వగా నీరు వచ్చెను. ఆ నీటిని త్రాగి రాజు తృప్తి చెందెను. బుద్ధిసాగరుడను పేరుగల మంత్రికూడా నీరు త్రాగి తృప్తి చెందెను. తరువాత బుద్ధిసాగరుడు రాజుతో నిట్లు పలికెను. “ఓ మహారాజా! ఈ సరస్సు వర్షపునీటితో మాత్రమే నిండి ఉండును. వర్షములు లేనపుడు ఎండిపోయి ఉండును. కావున ఈ సరస్సును లోతుగా త్రవ్వవలయునని నాకు ఆలోచన వచ్కినది. కావున మీరు దీనిని ఆమోదించి నాకాజ్ఞనీయుడు.” ఈ మాటలను వినిన వీర భద్రమహారాజు మిక్కిలి సంతోషించి తాను కూడా అట్లు త్రవ్వించసంకల్పించెను. అట్లు ఆ సరస్సును చక్కగా త్రవ్వించు శుభకార్యమున ఆ బుద్ధిసాగరునే నియమించెను. అపుడు రాజాజ్ఞను పొందిన పుణ్యాత్ముడైన బుద్ధిసాగరుడు సంతోషముతో ఆ సరస్సును సాగరమును చేయుటకు సిద్ధపడెను. అట్లు ఆ సరస్సును మూడువందల అడగులలోతు అంతయే వెడల్పుగా త్రవ్వించి చుట్టూ రాతిగోడ కట్టించి చాలా లోతుగా సరస్సును నిర్మింపచేసెను. అట్లు సరస్సును నిర్మించి బుద్ధిసాగరుడు వీరభద్రమహారాజునకు నివేదించెను. అప్పటి నుండి ఆ అరణ్యములో ఉండువారు, బాటసారులు దప్పిగొనినపుడు ఆ సరస్సులోని నీరు త్రాగుచుండెడివారు.

కొంతకాలమునకు ఆయుష్యము పూర్తికాగా బుద్ధిసాగరుడు మరణించి లోకపాలకుడైన నా లోకమునకు వచ్చెను. ధర్మలిపిని వ్రాయు చిత్రగుప్తుని నేను బుద్ధిసాగరుని విషయమున అడిగితిని. అపుడు చిత్రగుప్తుడు నాతో బుద్ధిసాగరుడు చేసిన దానిని తెలిపెను. ఈ బుద్ధిసాగరుడు మహారాజునకు ధర్మకార్యమును ఉపదేశించెను. కావున ఇతను ధర్మవిమానమును అధిరోహించుటకు యోగ్యుడు. ఇట్లు చిత్రగుప్తుడు తెలుపగా ధర్మ విమానమును అధిరోహించమని నేను బుద్ధిసాగరుని అజ్ఞాపించితిని. మరికొంత కాలమునకు ఆ వీరభద్రమహారాజు మరణించి నాలోకమునకు వచ్చి సంతోషముతో నాకు నమస్కరించెను. నేను ఆ రాజు విషయమున కూడా చిత్రగుప్తుని అడిగితిని. అపుడు చిత్రగుప్త రాజు త్రవ్వించిన సరస్సువలన కలిగిన ధర్మమును తెలిపెను. అప్పుడు నేను రాజుతో సరస్సు చరిత్రను ఇట్లు తెలిపితిని.” వినుము. సైకతపర్వత శిఖరముపై ఈ లకుముకి పిట్ట తన ముక్కుతో నీటిలో రెండంగుళములను త్రవ్వెను. తరువాత కొంత కాలమునకు ఈ వరాహము తన తుండముతో ఒక మూరలోతు త్రవ్వెను. తరువాత కొంత కాలమునకు ఈ వరాహము రెండుమూరలు త్రవ్వెను. అట్లు త్రవ్విన దానిలో నీరు రెండు నెలలుండెను. దప్పిగొనిన చిన్న జంతువులు ఆ నీరు త్రాగినవి. తరువాత మూడు సంవత్సరములకు ఏనుగల గుంపొకటి వచ్చి మూడు మూరలు త్రవ్వినది. ఎక్కువ నీరు వచ్చినది. ఆ నీరు మూడు మాసములున్నవి. చిన్న చిన్న జంతువులు ఆ నీటిని త్రాగి బ్రతికినవి. ఆ నీరెండి పోయిన తరువాత నీవచటికొచ్చితివి. నీవు ఒక మూరత్రవ్వి నీటిని పొందితివి. తరువాత మంత్రి ఉపదేశముతో మూడువందల అడుగుల లోతు త్రవ్వించితివి. అందులో చాలా నీరు వచ్చినది. రాతితో చక్కగా కట్టించినందున గొప్ప సరస్సాయెను. దాని తీరమున లోకులకు ఉపకరించు చెట్లనునాటించితివి. కావున వారి వారి పుణ్యములతో ఈ అయిదు ప్రాణులు ధర్మ విమానమును అధిరోహించినవి. నీవు కూడా విమానమును అధిరోహించుము.” ఇట్లు చెప్పిన నా మాటలను వినిన వీరభద్ర మహారాజు ధర్మ విమానము అధిరోహించి ఆరవ భాగమును స్వీకరించెను. ఇట్లు నీకు తటాకమును నిర్మించుట వలన కలుగు ఫలమునంతయు తెలిపితిని. ఈ కథను వినినవారు పుట్టిన నాటి నుండి మరణించువరకు చేసిన పాపములనుండి విముక్తిని పొందెదరు. ఈ చరితమును శ్రద్ధతో వినినవారు చదివిన వారు కూడా తటాకమును నిర్మించుట వలన కలుగు ఫలమును పొందెదరు. (1/12)