ధర్మాంగద వచనము

వసిష్ఠ మహర్షి పలికెను: అంతట సంధ్యావలీ దేవి భర్త పాదములను పట్టుకొని ధర్మాంగద వినా శనము గురించి ఇట్లు పలికెను. ఓ రాజా మోహన రూపయగు మోహినికి నీవు చెప్పినట్లుగా చాలా చెప్పిచూచితిని. అయిననూ ఏకాదశీ భోజనము, లేదా తనయుని వధ కంటే ఇతరములు ఈమెకు ఇష్టములు కావు. ధర్మ త్యాగమున కంటే పుత్ర వధయే ఉత్తమమని తలచెదను. పుత్రునికి జన్మనిచ్చుటలో తల్లి పడు వేదన తండ్రికి ఉండదు. గర్భమును ధరించుటలో ఖేదముతో కలుగు స్నేహము తల్లికి అధికముగా ఉండును. తండ్రికి అంతగా ఉండదు. తండ్రి క్షేత్రమున బీజమునుంచు వాడు మాత్రమే. గర్భమును ధరించుటలో, జన్మనిచ్చుటలో పెంచి పోషించుటలో తల్లి ఎక్కువగా కష్టములను అనుభవించును. పుత్రుని యందు తండ్రి కంటే తల్లికి నూరురెట్లు ప్రేమ ఎక్కువగా ఉండును. స్నేహాధిక్యమును చూచియే తండ్రి కంటే తల్లిని అధికురాలినిగా తెలియుదురు. అట్టి తల్లినగు నేను పరలోక జిగీషతో పుత్రునిపై స్నేహమును దూరముగా విడిచి పుత్రుని వధించుము. సత్యమును మాత్రము తప్పకుము. నామీద ఒట్టుపెట్టుచున్నాను. కష్టములతోనే శ్రీహరి ఫలప్రదు డగును. ఈ వ్రతము పూర్తి చేసినచో దేశమున కొద్ది బాధ కూడా కలుగదు. అధర్మముచే మానవుడు తప్పక స్వర్గ బ్రష్టుడగును. ప్రాణములను కాని, పుత్రులను కాని సర్వస్వమును కాని ఇచ్చి దైవమును అనుసరించువాడే మహాపురుషుడుగా కీర్తించబడును. సత్యమును నిలబెట్టు ఆపదలు కూడా ధన్య ములు. సత్యమును సంరక్షించుట కొఱకు పడిన కష్టములు మోక్షప్రదములగును. కీర్తిని వ్యాపింప చేయుటకు మానవులెపుడూ స్నేహ ద్వేషములను విడిచి శాస్త్రోక్త కర్మలను ఆచరించవలెను. కావున పరితాపమును విడిచి సత్యమును కాపాడుము. సత్య పాలనముచే విష్ణుదేహము లభించును. ఈ విమోహిని నీ కొఱకు దేవతలు సృజించిన వరిపిడిరాయి. శత్రుత్వమున వారు చేసిన దానిని మీరు తెలియుటలేదు. పుత్రుని వధించుటచే దేవతలు తలను వంచెదరు. దేవతల శిరముపై పాదమునుంచి పరమపదమును పొందెదవు. విష్ణుభక్తి కలవారికి దేవతలు శత్రువులు, లోకమున గుడ్డి తనము వచ్చును. ఇపుడదియే ప్రకటించబడినది. నీ కర్మలచే ఈశ్వరుడు మొదలు దేవతలు అందరూ నీకు శత్రువులైరి. నీ నిశ్చయము చలింపచేసి మోక్ష మార్గమును భేదించువారే. కావున నీవు దృఢ నిశ్చయముతో ప్రియుడగు పుత్రుని వధించుము. నీ సత్యపాలనమునకై మోహిని మాటలను ఆచరించుము. నీవు నీ మాటను తప్పినచో బ్రహ్మహత్యా పాతకముతో సమమగు పాపము కలుగును. యమలోకమునకు వెళ్ళెదవు. ఈ భూ మండలమున నీ కీర్తి నశించును.

వసిష్ఠ మహర్షి పలికెను: రుక్మాంగద మహారాజు భార్య వచనములను విని మోహిని సమీపమున సంధ్యావళితో ఇట్లు పలికెను. ఓ ప్రియురాలా, పుత్రహత్య మహాహత్య, బ్రహ్మహత్య కంటే ఘోరమైనది. పుత్రుని వధించిన నాకు ఏ గతి లభించును. నేను మందరాచలమున కేల వెళ్ళితిని? మోహిని ఏల లభించినది? ధర్మాంగద వినాశమునకే వచ్చిన కాలుని ప్రియురాలు ఈ మోహిని. ధర్మజ్ఞుడు, వినయాన్వితుడు, ప్రజారంజన కారకుడు, సంతానవంతుడు కాని పుత్రుని చంపిన నాకు ఏ గతి పట్టును? దుష్ట పుత్రుని చంపిననూ తండ్రికి దుఃఖము కలుగును. ఇక ధర్మశీలుడు గురుసేవా పరాయణుని చంపిన చెప్పవలయునా? నేనొక జంబూ ద్వీపమును మాత్రమే అనుభవించితిని. నీ పుత్రుడు సప్త ద్వీపములను అనుభవించెను. శ్రీహరి అంశ సంభూతుడు మాత్రమే తండ్రిని మించిన వాడగునని పురాణములలో పండితులు చెప్పియున్నారు. ఈ భూమండలమున ధర్మాంగదుడు అత్యధికుడని ప్రసిద్ధి నొంది నా వంశమును తరింపచేసి నా కీర్తిని పెంపొందించెను. నాకు పుత్రుని వలన ఎంత దుఃఖము కలుగుచున్నది. నీవు నాకు దుఃఖమును కలిగించు మోహనరూప అగు మోహినికి ఇంకొకసారి మంచి మాటలతో చెప్పి చూడుము. ఇట్లు ప్రియురాలగు సంధ్యావళితో పలికి రుక్మాంగద మహారాజు మోహినిని సమీపించి ఇట్లు పలికెను. ఏకాదశినాడు భుజించను. పుత్రుని సంహరించను. నన్ను సంధ్యావళిని చంపుకొందును. నీ ఆజ్ఞతో ఇంకొక రౌరవ కర్మను చేతును, పుత్రవధ విషయమున పట్టుదలను విడువుము. పుత్రుడగు ధర్మాంగదుని వధించిన నీకు కలుగు లాభమేమి? ఏకాదశీ భోజనమున మాత్రము నీకేమి లాభము? నీకు నేను దాసుడను, భృత్యుడను, వశవర్తిగ ఉంటిని. నిన్ను శరణు వేడుచున్నాను. మరొక వరమును కోరుము. నీకు కావలసిన ఇతర ప్రయోజనములను చేకూర్చెదను. నన్ను అనుగ్రహించుము. నాకు పుత్ర భిక్షను ప్రసాదించుము. గుణవంతుడగు పుత్రుడు దుర్లభుడు. హరివాసరము కూడా దుర్లభమే. గంగాజలము, తల్లి, సత్కుల జన్మ, సద్వంశ జాతయగు ప్రియురాలు, స్వర్ణ దానము, హరి పూజనము, వైష్ణవ దీక్ష, స్మృతి సంగ్రహము దుర్లభములు. శౌకరవాసము, హరి చింతనము, విష్ణు వాసర జాగరము, ఆత్మ సత్కారము, పుత్ర ప్రాప్తి, పుష్కర జలము, సజ్జన సంగతి, భక్తి, కపిల గోదానము, నీలమోక్షణము, త్రయోదశి శ్రాద్ధము దుర్లభములు. భూమి, పాతకనాశక వ్రతపాలనము తిలమయి విప్రగామిని అగు ధేనువు, ధాత్రీస్నానము, శ్రీహరివాసరము దుర్లభములు, పర్వకాలమున శీతల జలస్నానము, విశేషించి మాఘ మాసోషః కాలమున శీతల జల స్నానము శాస్త్రోక్తకర్మాచరణము, వధ్యమగు దానికి క్షేమము, ఔషధము, వ్యాధి విఘాతము, శాస్త్ర మార్గానుసరణము, మరణ కాలమున శ్రీహరి స్మరణము దుర్లభములు. కావున ధర్మమును రక్షణచేయు నా మాటను వినుము. పుత్రవధతో నీకేమి లాభము. నాపై అనుగ్రహమును చూపుము. విషయ సుఖములను చక్కగా అనుభవించితిని. నిష్కంటకముగా రాజ్యపాలనమును గావించితిని. దేవగోవిప్రరక్షకుల పాదములను నా శిరమున దాల్చితిని. విషయ భోగములను అనుభవించని పుత్రుని నేను వధించజాలను. నా చేతిలో నేను స్వయముగా నా పుత్రుని చంపుటను మించిన మహాపాతక మింకొకటి ఉండదు.

మోహిని పలికెను: ధర్మాంగదుడు నాకు శత్రువు కాడు. నేను నీ పుత్రుని చంపుట లేదు. నీవు హరివాసరమున భుజించమని మొదటనే చెప్పితిని. నీ ఇష్టమొచ్చినంత కాలము చాలా సంవత్సం ములు భూమిని పాలించుము. నీవు భోజనము చేయుటయే నాకు కావలసినది. కాన నీ పుత్రుని చంపుటలో పనియేమియు లేదు. నీకు పుత్రుడు ప్రియుడైనచో హరివాసరమున భుజించుము అని ఇట్లు మోహిని పలుకుచుండగా ధర్మాంగదుడు చూచి నమస్కరించి ముందు నిలిచి ఇట్లు పలికెను. నీవు దీనినే స్వీకరించుము. ఓ దేవీ! సందేహించకుము. నిర్మల ఖడ్గమును తీసుకొని రాజుముందు ఉంచి, తనను కూడా ఉంచి సత్య ధర్మ నిష్ఠుడై ఇట్లు పలికెను. ఓ తండ్రీ! నన్ను చంపుటలో నీవాలసించకుము. నా తల్లి మాటలను, తల్లికి నీవు ఇచ్చిన మాటను నిజము చేయుము. ధనములతో, దారలతో, పుత్రులతో తనను తాను కాపాడుకొనుట ధర్మము. శ్రేయస్కాముడగు రాజునకు సంతానము ధర్మకామార్ధ రక్షణ కొరకే. నీ కొరకు మరణించుట నాకు అక్షయ లోకమును ప్రసాదించును. నీకుకూడా నీ వాక్యపాలనతో నిర్మల లోకములు సంప్రాప్తించును. పుత్రుని సంహరించుట వలన కలుగు దుఃఖమును విడిచిపెట్టుము. సర్వరోగ వినిర్ముక్తము, ఇంద్ర సమమగు ఈ మానవ దేహమును విడుచుటకే నా ప్రయత్న మంతయు. తండ్రి కొరకుకాని, తల్లికొరకుకాని, గోవులకొరకుకాని, బ్రాహ్మణుల కొరకుకాని, స్త్రీల కొరకు, భూమి కొరకు, రాజుకొరకు, దేవతల కొరకు, బాలులకొరకు, వికలులకొరకు, చనిపోయినవారు తేజోమయ లోకములకు వెళ్ళెదరు. కావున నీ పరితాపము చాలును. నన్ను ఉత్తమ ఖడ్గముచే వధించుము. ఓ రాజేంద్రా! నీవు సత్యమును నిలుపుము. హరివాసరమున భుజించకుము. ధర్మరక్షణ కొరకు పుత్రునికాని, భార్యనుకాని చంపవచ్చును. అశ్వమేధ యాగమున ఉన్నవారు యజ్ఞవిఘ్ననివారణ కొరకు పుత్రుని వధించిననూ దోషము లేదని వేద వాక్యములలో చెప్పబడి ఉన్నది. ఓ రాజా! అన్ని సందేహములను విడిచి నా తల్లియగు మోహిని చెప్పిన మాటను ఆచరించుము. ఓ రాజా! ప్రసన్నుడవు కమ్ము. నా వధ కొరకు నేను చెప్పు మాటలను ఆచరించుము. మోహిని హస్తమున ఉన్న ఘోరమగు అనృత వాక్యము నుండి నిన్ను విడిపించుకొనుము. పుత్రుని వధచే నీకు యశము ప్రకాశమాన మగును. యశః ప్రకాశము వలన కీర్తి అక్షయమగును. (II/33)