భవాటవీ నిరూపణము

సనకమహర్షి పలుకుచున్నాడు: ఇట్లు కర్మపాశముచే నియమించబడు జంతువులు స్వర్గాది పుణ్య స్థానములలో పుణ్యభోగములను అనుభవించి యాతనాలోకములందు మిక్కిలి దుఃఖకరమగు పాప ఫలమును అనుభవించి క్షీణించగా మిగిలిన కర్మలచే ఈ భూలోకమునకు వచ్చి అన్ని భయములతో విహ్వలములగు, మృత్యుబాధాయుతములైన స్థావరాదులలో పుట్టెదరు. వృక్షగుల్మలతా వల్లీ గిరి తృణములు మహోమోహ సమాకృతములగు స్థావరములుగా పేర్కొనబడును. స్థావరత్వమును పొందుటకు భూమిలో విత్తిన బీజములు నీటిలో తడిసిన వెంటనే సంస్కార సామాగ్రి వశమున, లోని వేడితో పక్వములై ఉబికి మూలభావమును పొంది, మూలమునుండి అంకురత్వమునొంది, అంకురమునుండి ఆకులు కాండములు నాళములు కలిగి, కాండముల నుండి మొగ్గలు తొడిగి పూవులగును. ఆ పూవులలో కొన్ని ఫలరహితములు, మరికొన్ని ఫలసహితములు అగును. ఆ పూవులు బాగుగా వృద్ధిపొందినపుడు ఆ పుష్పమూలములనుండి తుషా (పొట్టు) పుట్టును. ఆ పొట్టులో అనుభవించదగిన ప్రాణుల సంస్కారసామగ్రీ వశమున చంద్రకిరణ స్పర్శచే చంద్ర కిరణములలోని ఓషథులలోన ప్రవేశించి, క్షీరభావమును పొందును. కాలవశమున పొట్టులో తండులాకారమేర్పడను. ప్రాణుల భోగసంస్కారవశమున సంవత్సరములో ధాన్యముగా పండును. స్థావరమును పొందియు చాలాకాలము వానరాదులచే భుజింపబడుచు ఛేదన దవాగ్నిదాహ శీతా తపాది దుఃఖములు అనుభవించి మరణించును. తరువాత క్రిములుగా పుట్టి ఎల్లపుడూ దుఃఖ బాహుళ్యము కలిగి ఒకక్షణమో సగము క్షణమో బ్రతుకుచు, అరక్షణములో మరణించుచు బలవత్ప్రణి పీడలను నివారించుకోజాలక శీతవాతాది క్లేశబాహుళ్యము కలవై ఎపుడూ అకలిచే పీడించబడుచు మలమూత్రాదులలో సంచరించుచు దుఃఖమును అనుభవించుచుండును. తరువాత పశుజన్మను పొంది బలవంతుల బాధలచే ఉద్వేగమును పొంది వ్యర్థోద్వేగ బాహుళ్యము కలవారై ఆకలిచే పీడించబడుచు నిత్యము వనచారులై తల్లియందు కూడా విషయభోగపరాయణులై శీతవాతాతపాది క్లేశబాహుళ్యము కలిగి, కొన్ని జన్మలలో తృణాహారమును, మరికొన్ని జన్మలలో మాంసాదికమును మేథ్యమును ఆహారముగా తీసుకొనుచు, మరికొన్ని జన్మలలో కందమూల ఫలాశనులై దుర్బల ప్రాణులను పీడించుచు దుఃఖమును అనుభవించు చుందురు. అండజములుగా పుట్టినను గాలిని మాంసాద్యమే ధ్యములును తినుచు పరపీడా పరాయణులై నిత్యము దుఃఖబాహుల్యము కలిగి యుందురు. గ్రామ పశుజన్మను పొందినను స్వజాతి వియోగము, బరువును మోయుట, పాశములచే బంధించబడుట, కొట్టబడుట, నాగలి మొదలగు వాటిని లాగుట మొదలగు సర్వవిధ దుఃఖములను అనుభవించు చుందురు. ఇట్లు నానా జన్మములలో తిరిగి తిరిగి క్రమముగా మానవజన్మను పొందెదరు. కొందరు పుణ్య విశేషములచే కూడా మానవ జన్మను పొందెదరు.

మనుష్యజన్మలో కూడా చర్మకార, చండాల, వ్యాధ, నాపిత, రజక, కుంభకార, లోహకార, స్వర్ణకార, తంతువాయ, సౌచిక, జటిల, సిద్ధి, ధావన, లేఖన, భృతక, శాసన హరి, నీచభృత్య, దరిద్ర, హీనాంగ, అధికాంగత్వాది భేదములచే దుఃఖ బహుళములగు జ్వరతాప, శీత, శ్లేష్మ, హస్తిపాద, నేత్రశిరో, గర్భ పార్శ్వ వేదానాది దుఃఖములను అనుభవించుచుందురు. మనుష్య జన్మలో కూడా స్త్రీ పురుష సంగమసమయమున రేతస్సు గర్భకోశమును ప్రవేశించునపుడు కర్మ వశమున ప్రాణి శుక్రముతో కలిసి జరాయువును ప్రవేశించి శుక్రశోణిత సమ్మేళన రూపఘన పదార్థముగామారును. ఆ వీర్యమున జీవుడు ప్రవేశించుట వలన అయిదు దినములలో ఘన పదార్థముగా మారి, పక్షమున మాంస పిండ రూపమును పొంది, మాసమున ప్రాదేశమాత్రమగును. అప్పటినుండి చైతన్యము లేకున్ననూ వాయు వశమున మాతృగర్భమున దుస్సహతాప క్లేశములు ఉండుటచే ఒకచోట ఉండుటకు శక్యము కాక తిరుగుచుండును. రెండవమాసము నిండిన వెంటనే మానవాకార మాత్రమును పొందును. మూడవమాసము నిండగనే కరచరణాది అవయవ భావము లభించును. నాలుగు నెలలు గడిచినచో గోళ్ళ చివురులేర్పడును. నాభిసూత్రముచే పోషించ బడు చుండును. మలమూత్రములచే పూయబడిన శరీరము కలవాడై మావిచే బంధించబడి రక్త అస్టిక్రియ వసామజ్ఞాస్నాయు కేశాదులచే దూషితమైన శరీరమున నివసించుచు, తాను కూడా ఇట్టి శరీరమును చూచుకొని జీవుడు పూర్వజన్మ స్మరణానుభవముచే పూర్వమున అనుభ వించిన నరకదుఃఖములను స్మరించుటచే అంతర్దుఃఖముచే దహించబడుచు మాతృ దేహములోని మూత్రాది ఉష్ణములచే దహింపబడుచు తన మనసులో ఇట్లు పరితపించును.

అయ్యో! నేనెంత పాపిని. పూర్వజన్మలో భృత్యమిత్రకళత్రపుత్రగృహక్షేత్ర ధనధాన్యాల యందు వ్యామోహముచే భార్యాపుత్రులను పోషించుటకై పరధన క్షేత్రాదులయందు దృష్టి నుంచి పలు ఉపాయములచే హరించి కామాంధకారముచే పరస్త్రీ గమనాది పాతకములను ఆచరించి, ఆ పాతకములచే నేను ఒక్కడినే బహువిధ నరకముల అనుభవించి, మరల స్థావరాదిరూపములతో మహాదుఃఖము అనుభవించి, ఇప్పుడు మావిచే కప్పబడి, అంతః ర్దుఃఖముచే నేనొక్కడినే బహువిధ కరకముల అనుభవించి, మరల స్థావరాదిరూపములతో మహాదుఃఖమును అనుభవించి పోవు చున్నాను. నేను పోషించిన దారాపుత్రాదుల కెంతదుఃఖము! పుత్రమిత్ర కళాత్రాది పోషణ కొఱకు పరద్రవ్యములను అపహరించితిని. ఆ పాపముచే ఇప్పుడు మావిచే కప్పబడి ఉంటిని. పూర్వము ఇతరుల సంపదను చూచి అసూయచే దహించి పోతిని. ఇప్పుడు ఇచట గర్భాగ్నిచే దహించి పోవు చుంటిని. మనోవాక్కాయములచే పరపీడన మాచరించితిని. ఆ పాపముచే ఇప్పుడు నేనొక్కడినే మిగుల దుఃఖముచే దహించి పోతిని. ఇట్లు గర్భస్థజీవుడు పలువిధములుగా విలపించి తననుతానే ఓదార్చుకొని పుట్టిన తరువాత సత్సంగముచే శ్రీమహావిష్ణు చరిత్రశ్రవణముచే విశుద్ధమనస్కుడనై సత్కార్యములను ఆచరించి అఖిలజగదంతరాత్మ సత్యజ్ఞానానందమయుడు, శక్తి ప్రభావముచే స్వర్గాదులను సృజించినవాడు లక్ష్మీపతి అయిన నారాయణుని సకల సురాసుర యక్షగంధర్వ రాక్షస పన్నగముని కిన్నర సమూహములచే పూజింపబడిన పాదపద్మములను భక్తిచే పూజించి, దుస్సహమైన సంసారమును ఛేదించుకు కారణభూతుడు, వేదరహస్యోపనిషత్తులచే స్పష్టము చేయబడినవాడు అయిన సకలలోక పరాయణుని హృదయమున నిలుపుకొని ఈ దుఃఖమును, సంసారమును దాటెదను అని మనసున భావించును.

తల్లి ప్రసూతి సమయమున గర్భస్థుడగు దేహి వాయువుచే పరిపీడితుడై తల్లికి కూడా దుఃఖమును కలిగించుచు కర్మపాశముచే బలముగా యోని మార్గము నుండి బయలు వెడలుచు సకలయాతన అనుభవమును ఒకే సమయమున అనుభవించును. అట్లు అతిక్లేశముతో యోని యంత్ర పీడితుడై గర్భము నుండి నిష్క్రమించి సంజ్ఞను కోల్పోవును. అట్టి శిశువును బాహ్యవాయువు మరల బ్రతి కించును. బాహ్యవాయు స్పర్శ కాలముననే పూర్వమున అనుభవించిన సమస్త దుఃఖాదుల స్మృతి నశించును. వర్తమాన దుఃఖములనుకూడా జ్ఞానము లేనందున తెలియజాలక, అత్యంత దుఃఖమును అనుభ వించును. ఇట్లు బాలత్వమును పొందిన జంతువు అచట కూడా తన మలమూత్రాదులను శరీరమున పూసుకొని ఆధ్యాత్మికాది తాపత్రయములచే పీడించబడుచున్నను చెప్పజాలక ఆకలి దప్పులచే పీడించబడుచు బిగ్గరగా ఏడ్చును. అట్లేడ్వగా స్తన్యమీయవలయునని భావించి తల్లి ఆ ప్రయత్నమునుచేయును. ఇట్లు అనేక దేహభోగములను అన్యాధీనముగా ననుభవించుచు కీటకములు కరచుచున్ననూ వారింపజాలడు. బాల్యభావమును పొంది తల్లిదండ్రు లచే, ఉపాధ్యాయులచే తాడనములను పొందుచు ఇటునటు తిరుగుచు దుమ్ము, బూడిద, బురద మొదలగు వాటియందు అడుచు ఎప్పుడూ కలహస్వభావమును అపవిత్రతను పొంది బహువ్యాపార అభ్యాస కార్య నియతుడు అగుచు ఆపని చేయలేక ఆధ్యాత్మికాది తాపత్రయములచే దుఃఖములను అనుభవించును.

పిమ్మట యౌవనమును పొంది ధనమును సంపాదించుచు సంపాదించిన ధనమును రక్షించుచు, ధనము నష్టమైనను, వ్యయమైనను మిక్కిలి దుఃఖించుచు మాయామోహితులై కామ క్రోధాదులచే చెడిన మనసుగలవారై, ఎపుడూ అసూయాపరులై పరులధనమును, పరస్త్రీలను హరించు ఉపాయము లను ఆలోచించుచు, పుత్ర మిత్ర కళత్రాదులను పోషించు ఉపాయములను విచారించుచు వ్యర్థమగు అహంకారముచే దూషితులై, పుత్రాదులు వ్యాధిపీడితులైనపుడు అన్ని వ్యాపకములనువదిలి, రోగాదులచే పీడించబడువారి సమీపమున స్వయముగా అధ్యాత్మికాది దుఃఖములచే పీడించబడుచు ఇట్లు చింతించెదరు. “ఇల్లు, పొలము మొదలగు స్థిరాస్థినిగూర్చి ఏ మాత్రము ఆలోచించక పోతిని. ఇంత పెద్ద కుటుంబమెట్లు పోషించబడును. నాకు మూలధనము లేదు. వర్షము కూడా కురియుట లేదు. గుఱ్ఱములెటు పారిపోయినవో, గోవులు ఇంకనూ ఇల్లు చేరలేదు. నా భార్యకు చిన్నచిన్న వయసుగల పిల్లలున్నారు. నేను వ్యాధిగ్రస్తుడ నైతిని. ధనహీనుడను. ఆలోచించనందున వ్యవసాయము నశించినది. పుత్రులెప్పుడూ రోదించుచున్నారు. నేనెట్లు శత్రువులను గెలిచెదను. ప్రయత్న శూన్యుడను అయితిని. వ్యాధులన్నీ ఒకేసారొచ్చినవి. ఇట్లు మిక్కిలి దుఃఖాకులుడై తన దుఃఖములను నివారించజాలక, ఈ విధి నన్నెందుకు భాగ్యహీనుని చేసెను” అని దైవము నాక్షేపించును.

అట్లే వృద్ధత్వమును పొంది బలముడిగి, వార్ధక్యముచే ముడతలు పడిన దేహము కలవాడై తెల్లబడిన కేశములు కలిగి మురికిపట్టిన శరీరముచే వ్యాధులచే బాధించబడుచు వణుకుచున్న అవయవములతో ఊపిరి పీల్చరాక ఆయానముచే కనులు తిరుగగా చూడదగిన దానిని చూడజాలక కంఠమున శ్లేష్మము నిండి భార్యపుత్రాదులచే చీదరించ బడుచు ఎపుడు మరణించెదనా అని చింతించుచు, నేను మరణించినచో నేను సంపాదించిన గృహక్షేత్రాదికములను నా పుత్రులెట్లు కాపాడెదరో, ఎవరికి చెందునో? నా సంపదను ఇతరులపహరించినచో నా పుత్రాదులెట్లు బ్రతికెదరు? అని మమకారముచే దుఃఖముచే గాఢముగా నిట్టూర్చి తాను యౌవనములో చేసిన పనులను మాటిమాటికి తలచుకొనుచు, అంతలోనే మరచుచు మరణము సమీపించగా వ్యాధి పీడితుడై, మానసిక సంతాపముచే అర్హుడై కొంతసేపు అటునిటు తిరుగుచు ఆకలిదప్పులు పీడించగా, కొంచెము నీరు ఇమ్మని అతిదీనముగా యాచించుచు, అక్కడున్నవారు జ్వరము వచ్చినవారికి నీరీయకూడదని చెప్పుచుండగా వారిని మనసులో ద్వేషించుచు తెలివి తప్పుచుండును. తరువాత కాలుచేతులు కదల్చలేక రోదించు బంధుజనులతో కూడినవాడై, ఏమియూ చెప్పజాలక తాను సంపాదించిన ధనాదిక మెవరి పాలు అగునో అని చింతించుచు నీరు నిండిన కనులతో కంఠమున ఘరఘర ధ్వని వచ్చుచుండగా శరీరమునుండి ప్రాణములు పోవుచుండగా యమదూతలు బెదిరించుచు పాశముచే కట్టగా, ఇంతకు ముందు విధముగా నరకాదులను అనుభవించును.

ధాతువులు మలక్షయము వరకు అగ్నిలో దాహమగునట్లు జీవులు కర్మక్షయమగు వరకు సంసారాగ్నిలో దహింపబడుదురు. కావున సంసార దావాగ్ని తాపార్థుడగు మానవుడు పరమజ్ఞానము నభ్యసించవలయును. కావున సంసార విముక్తికి పరమ జ్ఞానమును అభ్యసించవలయును. జ్ఞానము వలన మోక్షము లభించును. జ్ఞానశూన్యులగు మానవులు పశువులనబడుదురు. కావున సంసార విముక్తికి పరమజ్ఞానమును అభ్యసించ వలయును. జ్ఞానమువలన మోక్షము లభించును. జ్ఞాన శూన్యులగు మానవులు పశువులు అనబడుదురు. అన్ని కర్మలను చక్కగా నిర్వహించగల మానవత్వమును పొంది శ్రీహరిని సేవించుకున్న అతనికన్నా అజ్ఞాని ఎవడుండును? అన్ని కోరిక లను తీర్చు శ్రీహరి ఉండగా మానవులు నరకమునకు వెళ్ళుట ఎంతవిచిత్రము? ఎంతవిచిత్రము. ఇది గొప్పవింతయే. జగన్నాథుడు సర్వకర్మఫలప్రదుడగు నారాయణుడు ఉన్ననూ మానవులు జ్ఞానశూన్యులై నరకములో మ్రగ్గుచుందురు. మూత్ర పురీషములు స్రవించు నశ్వరమైన శరీరమును మాయామోహా విష్ణులగు అజ్ఞానులు నిత్యమని భావింతురు. రక్త మాంసములచే దూషితమగు శరీరమును పొందిన మానవుడు సంసారమును ఛేదించు విష్ణువును భజించనిచో మహాపాపి అగును. మూర్ఖత్వము చాలా కష్టములను కలిగించును. హరి ధ్యానపరుడగు చండాలుడు కూడా ఆనందించును. తన దేహమునుండి వెలువడు మలమూత్రాది కిల్బిషమును చూచిన మానవులు ఉద్వేగము నెట్లు పొందకుందురు? మానవజన్మ పరమదుర్లభము. దేవతలు కూడా ఈ జన్మకై ప్రార్థనలు చేతురు. అట్టి మానవజన్మను పొంది పరలోకము కొరకు వివేకముకలవాడు ప్రయత్నించ వలయును. ఆధ్యాత్మ జ్ఞానముకలిగి హరిపూజా పరాయణు లైనవారు పునరావృత్తి దుర్లభమగు పరమపదమును పొందెదరు. ఈ ప్రపంచము ఎవరివలన పుట్టెనో, ఎవరివలన చైతన్యమునుపొంది, ఎవరిలో లీనమగునో అతనే సంసారము నుండి విముక్తిని ప్రసాదించును. నిర్గుణుడైనను గుణ వంతునివలె భాసించు శ్రీహరిని చక్కగా పూజించి సంసారమునుండి విముక్తుడగును. (1/32)