లింగపురాణాను క్రమణీ నిరూపణము

శ్రీ బ్రహ్మ పలికెను: చదువు వారికి వినువారికి భుక్తిముక్తులను ప్రసాదించు లింగపురాణమును ఇపుడు నీకు చెప్పెదను వినుము. శంకరుడు వహ్ని లింగమున నుండి నాకు ధర్మాది సిద్ధి కొరకు అగ్ని కల్పకథా శ్రయమగు లింగపురాణమును స్వయముగా చెప్పెను. దీనినే వ్యాస మహర్షి రెండు భాగములుగా బహుకథా చిత్రముగా లింగ పురాణమును చెప్పెను. ఈ లింగపురాణము శివుని మాహాత్మ్యమును తెలుపునది. పదకొండు వేల శ్లోకములు కలది. జగత్త్రయమున సర్వపురాణ సారభూతము. పురాణోపక్రమమున సంక్షేపముగా సృష్టి విషయక సంప్రశ్నము, తరువాత యోగాఖ్యానము, కల్పాఖ్యానము, లింగోద్భవము, పార్వతీ చరిత్రము, సనత్కుమార శైలాది సంవాదము, దధీచి చరితము, యుగధర్మ నిరూపణము, భువన కోశకథ, సూర్యచంద్ర వంశ కథలు, తరువాత విస్తృతముగా సృష్టి, త్రిపురాఖ్యానము, లింగ ప్రతిష్ఠ, పశుపాశ విమోచనము, శివవ్రతములు, సదాచార నిరూపణము, ప్రాయశ్చిత్తములు, అరిష్టములు, కాశీ శ్రీశైల వర్ణనములు, అంధకాఖ్యానకము, వరాహ చరితము, నృసింహ చరితము, జలంధర వధ, శివసహస్ర నామములు, దక్షయజ్ఞ వినాశనము, కామ దహనము, పార్వతీ కళ్యాణము, వినాయకా ఖ్యానము, కృపాఖ్యానము, ఉపమన్యు కథ, ఇంతవరకు పూర్వభాగమున వివరించబడినది.

ఉత్తర భాగమున విష్ణు మాహాత్మ్య కథనము, అంబరీషకథ, సనత్కుమార నందీశ సంవాదము, శివమాహాత్మ్యము, స్నానయాగాదికము, సూర్యపూజావిధి, ముక్తి ప్రదమగు శివపూజ, బహువిధ దానములు, వ్రాద్ధప్రకరణము, ప్రతిష్టాతంత్రము, అఘోర కీర్తనము, వజ్రేశ్వరీ మహావిద్యా, గాయత్రీ మాహాత్మ్యము, త్ర్యంబక మాహాత్మ్యము, పురాణ శ్రవణ ఫలము వివరించబడినవి. ఈ పురాణమును వ్రాసి తిలధేను సమన్వితముగా, ఫాల్గుణ పూర్ణిమనాడు భక్తితో బ్రాహ్మణునకు దానము చేసినవాడు జరామరణ వర్జితమగు శివసాయుజ్యమును పొందును. పాపహరమగు లింగపురాణమును చదివిననూ వినిననూ ఇహలోకమున సకల భోగములను అనుభవించి అంతమున శివలోకమును పొందును. ఈ లింగపురాణానుక్రమణిని చదివిననూ వినిననూ శివభక్తులై ఉభయ లోకములలో భోగములను అనుభవించెదరు. సాటిలేని శివుని అనుగ్రహపాత్రులు అగుదురు. (4/102)