ఏకాదశీవ్రత మహిమ వర్ణనము

సనకమహర్షి పలికెను: మూడులోకములలో ప్రసిద్ధి పొందినది, సర్వపాపములను శమింప చేయునది, సర్వకామఫలప్రదము అయిన మరియొక వ్రతమును చెప్పెదను వినుము. ఇది బ్రాహ్మ క్షత్రియ వైశ్యశూద్రులలో స్త్రీలలో ఎవరు చేసిననూ మోక్షము నొసగునది. విష్ణువునకు ప్రీతికరము, ఈ వ్రతము పేరు ‘ఏకాదశీ వ్రతము’. ఇది సర్వాభీష్టప్రదము. ఈ వ్రతమును అన్ని విధములా చేయవలయును. ఈ ఏకాదశవ్రతము విష్ణుప్రీతికరము. శుక్తకృష్ణపక్షములలోని ఏకాదశీ తిథిన భోజనము చేయరాదు, అట్లు భుజించినవాడు ఇహలోకమున పాపమును పొంది, పరమున నరకమును చేరును, ఉపవాస ఫలమును పొందగోరువారు దశమిరాత్రి, ఏకాదశి రెండు పూటలు, ద్వాదశిన రాత్రి ఈ నాలుగు పూటలు భుజించరాదు. ఏకాదశీ దినమున భుజించగోరువారు సర్వ పాపములను అనుభవించగోరువారని తెలియుము.

ముక్తిని కోరువాడు దశమిన ఒకపూట, ద్వాదశీ తిథిన ఒకపూట, ఏకాదశీ తిథిన రెండుపూటలా నిరాహారముగా నుండవలయును. బ్రహ్మహత్యాది మహాపాతకములు అన్నియు హరిదినమున అన్నము నాశ్రయించి ఉండును. బ్రహ్మ హత్యాది పాపముల కెట్లో నిష్కృతి లభించును కాని ఏకాదశీ తిథిన భుజించువానికి నిష్కృతి లభించదు. మహాపాతకములు కలవారు కాని, సర్వపాతకములు కలవారు కాని, ఏకాదశీ తిథిన ఉపవాసమును చేసినచో పరమపదమును పొందుదురు. ఏకాదశీతిథి పరమపవిత్రమైనది. విష్ణువునకు ప్రీతిపాత్రమైన తిథి. కావున సంసారచ్ఛేదమును కోరువారు ఏకాదశీ తిథిని సేవించవలయును. దశమీతిథి యందు ప్రాతఃకాలమున లేచి దంతధావన పూర్వకముగా స్నానాదికములను నిర్వర్తించి ఇంద్రియ నిగ్రహముతో యథావిధిగా శ్రీమహా విష్ణువునకు స్నానాదికమును చేయించి పూజించవలయును. ఏకాదశినాడు ఇంద్రియ జయముతో నిరహారముగా నుండవలయును. నారాయణుని స్మరించుచు శ్రీమహావిష్ణువు సన్నిధిలో శయనించవలయును. ఏకాదశీ తిథినాడు స్నానముచేసి జనార్దనుని పూజించి గంధ పుష్పాదులు నర్పించి ఇట్లు విజ్ఞాపన చేయవలయును.

ఈ మంత్రము ఉచ్చరించి దేవదేవుడగు శ్రీమన్నారాయణునకు ఉపవాసమును సమర్పించ వలయును. (“ఓ పుండరీకాక్షా! నేను ఏకాదశిన నిరాహారముగా ఉండి ద్వాదశీ తిథిన భోజనము చేయగలను. ఓ అచ్యుతా! నాకు రక్షకుడవు కమ్ము” అని మంత్రమును స్మరించవలెను. నియములతో దేవదేవుని ముందు నృత్య గీత వాద్య పురాణాదులతో జాగరణ చేయవలయును. తరువాత ద్వాదశీ తిథిన ప్రాతఃకాలమున లేచి స్నానము చేసి యథావిధిగా అర్చించవలయును. ఏకాదశీ తిథిన జనార్దనుని పంచామృతముతో స్నానము చేయించవలయును. ద్వాదశిన క్షీరాభిషేకము చేయ వలయును. అట్లు చేసినచో హరి సారూప్యమును పొందును.

అని శ్రీహరికి విజ్ఞాపన చేయవలయును. (“అజ్ఞానమను చీకటిలో గుడ్డివాడినైన నాకు ఈ వ్రతాచరణతో సుముఖుడవై ప్రసన్నుడవై జ్ఞానదృష్టిని ప్రసాదించుము” అని అర్థము). తరువాత శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి దక్షిణను సమర్పించవలయును. తరువాత పంచమహా యజ్ఞములను ఆచరించి బంధువులతో కలిసి మౌనముతో తాను భుజించవలయును. ఇట్లు పవిత్రమైన ఏకాదశీ వ్రతమును ఆచరించినవారు పునరా వృత్తి రహితమైన శ్రీమహావిష్ణు భవనమును చేరెదరు.

ఉపవాస వ్రతము నాచరించు ధర్మకార్య పరాయణులు చండాలురను పతితులను ఎప్పుడూ చూడరాదు. నాస్తికులను మర్యాదా రహితులను, నిందించువారిని, కొండెములను చెప్పువారిని, ఉపవాసవ్రతము చేయువారి పలుకరించరాదు. శూద్ర స్త్రీకి పుట్టిన వారిని పోషించువారితో, శూద్ర స్త్రీ పతితో యజ్ఞాధికారములేని వానిచే యజ్ఞమును చేయించు వానితో మాటలాడరాదు. భర్త ఉండగా జారుని వలన కలిగినవాని ఇంటిలో భోజనము చేయువారితో, గాయకునితో, ధనము తీసుకుని దేవార్చన చేయువానితో, డబ్బు తీసుకొని వైద్యము చేయువారితో, కార్యమును చేయువారితో దేవబ్రాహ్మణులను ద్వేషించువారితో పరాన్నముపై ఆశపడువారితో, పరస్త్రీ నిరతునితో మాటమాత్రముగానైన గౌరవముగా వ్యవహరించరాదు. ఇటువంటి నియమములను ఆచరించి శుద్ధుడై ఇంద్రియజయము కలిగి సర్వహితమును కోరుచు ఉపవాస వ్రతమును ఆచరించినచో ఉత్తమ సిద్ధిని పొందగలరు. గంగాసమతీర్థము, మాతృనమగురువు, విష్ణుసమ దైవము, నిరాహారమును మించిన తపము మరియొకటిలేదు. ఓర్పుతో సమమగు తల్లి, కీర్తి సమమైన ధనము, జ్ఞానసమమగు లాభము, ధర్మసముడగు తండ్రి, వివేక సముడైన బంధువు, ఏకాదశిని మించిన వ్రతము లేదు. ఈ విషయమున ఈ ఇతిహాసమును చెప్పుచుందురు వినుము.

భద్రశీలునికి, భద్రశీలుని తండ్రి గాలవునికి జరిగిన సంవాదమును వినుము. పూర్వకాలమున గాలవుడను మహర్షి పరమశాంతుడు, దాంతుడు, తపోనిధి నర్మదాతీరమున నివసించుచుండెను. ఆ నర్మదా తీరము నానావృక్షసమన్వితము. గజ భల్లుకాది మృగ నిషేవితము. సిద్ధచారణ గంధర్వ యక్ష విద్యాధర సేవితము. కందమూలఫలముతో సమృద్ధము. ముని బృందసేవితము. అచట గాలవ మహర్షి చాలాకాలము నివసించెను. గాలవమహర్షికి భద్రశీలుడను కుమారుడు కలిగెను. అతడు సుప్రసిద్ధుడు, జితేంద్రియుడు. పూర్వజన్మజ్ఞానము కలవాడు. మహానుభావుడు. నారాయణ భక్తుడు. మహామతియగు భద్రశీలుడు బాల్యక్రీడలలో కూడా మట్టిచే విష్ణుప్రతిమను చేసుకొని సర్వకాలము పూజించుచుండెడివాడు. సర్వకాలమున శ్రీమహావిష్ణువును పూజించవలయునని మిత్రులను బోధించుచుండెడివాడు. పండితులైనవారు ఏకాదశీ వ్రతము నాచరించవలయును. ఓ మునీశ్వరా! ఇట్లు భద్రశీలునిచే బోధించబడిన శిశువులు కూడా కలిసి విడిగా మట్టిచే శ్రీహరి ప్రతిమను నిర్మించుకొని విష్ణుభక్తి పరాయణులై అర్చించుచుండిరి. సర్వజిష్ణువగు శ్రీమహావిష్ణువునకు నమస్కరించుచు సర్వజగములకు శుభముకలుగ వలయునని కోరుచుండెడివాడు. క్రీడా సమయమున ఒక ముహూర్తము కాని ముహూర్తార్థముకాని ఏకాదశీ అని సంకల్పము చేసి శ్రీహరికి వ్రతమును సమర్పించెడి వాడు. ఇట్లు సచ్చరిత్రగల కుమారుని చూచి గాలవ మహర్షి ఆశ్చర్యమునందినవాడై చక్కగా అలింగనమును చేసుకొని, ఇట్లు అడిగెను.

గాలవ మహర్షి పలికెను: “మహానుభావా! భద్రశీలా! నీవు నిజముగా భద్రమగు శీలము గలవాడవే. నీ చరితము యోగులకు కూడా దుర్లభము, మంగళకరము. ఎల్లపుడూ హరి పూజను చేయుచు, సర్వప్రాణి హితమును కోరుచు, ఏకాదశి వ్రతమును ఆచరించుచు నిషిద్ధమైనదానిని విడిచి సుఖ దుఃఖములను పరిత్యజించి, మమకార రహితుడవై, శాంతుడవై హరిధ్యాన పరాయణుడవై ఉంటివి. బాలుడవైన నీకు ఇట్టి బుద్ధి ఎట్లు కలిగెను? మహాత్ముల సేవ లేనిదే హరి భక్తి కలుగునది కాదు. సామాన్యముగా లోకమున మానవులకు అవిద్యవలన కామ్యకర్మలయందు ఆసక్తి కలుగును కదా! నీకు ఎట్లు అలౌకికమైన బుద్ధి కలిగినది. మానవులకు సత్సంగము ఉన్ననూ పూర్వజన్మ సుకృతము లేనిదే భగవద్భక్తి కలుగదు. అందువలననే నేను విస్మయము చెందుచున్నాను. కావుననే ప్రీతిచెంది అడుగుచున్నాను. కావున తెలుపుము” ఇట్లు తండ్రి అయిన గాలవమహర్షి ప్రశ్నించగా పుణ్యాత్ముడు పూర్వజన్మజ్ఞానము కలవాడు అయిన భద్రశీలుడు అనందముతో విప్పారిన మోము కలవాడై తాను అనుభవించిన దానిని యథాతధముగా తండ్రికి తెలియపరిచెను.

భద్రశీలుడు పలికెను: “ఓ తండ్రీ! మహామునీ! నేను పూర్వ జన్మలో అనుభవించిన దానిని చెప్పెదను వినుము. నాకు పూర్వజన్మ జ్ఞానము కలదు కావున యమధర్మరాజు చెప్పనదానిని వినుము.” ఈ విషయమును వినిన గాలవ మహర్షి ఆశ్చర్యమునొంది ప్రీతితో మహామతియగు భద్రశీలుని గూర్చి ఇట్లు పలికెను.

గాలవ మహర్షి పలికెను: “ఓ మహానుభావా! నీవు పూర్వజన్మలో ఎవరివి? యముడు నీతో ఏమి పలికెను? ఎందువలన పలికెనో త్వరగా చెప్పుము.”

భద్రశీలుడు పలికెను: “ఓ తండ్రీ! నేను పూర్వము సోమవంశపురాజుగా ఉంటిని. నా పేరు ధర్మ కీర్తి. నా గురువు దత్తాత్రేయ మహర్షి. తొమ్మిది వేల సంవత్సరములు రాజ్యపాలన చేసితిని. అధర్మములను ధర్మములను చాలా ఆచరించితిని. అంతట ఐశ్వర్య మదముతో చాల అధర్మములను ఆచరించితిని. పాషండ జనుల మైత్రితో పాషండ ఆచారమును అనుసరించితిని. మొదట చాల పుణ్యములను సంపాదించితిని కాని పాషండులచే బాధించబడిన నేను వేదమార్గమును పరిత్యజించితిని. మాట యుక్తివిదుడను అయిన నేను చాల యజ్ఞములను ధ్వంసము చేసితిని. నేను అధర్మనిరతుడనగుట చూచి నా దేశప్రజలు కూడా ఎప్పుడూ అధర్మమునే ఆచరించుచుండిరి. ఆ అధర్మమునుండి ఆరవ భాగము నాకు చేరినది. ఇట్లు పాపాచారుడను, వ్యసనరతుడను అయిన నేను, వేట మీద ఆసక్తి కలిగి ఒకసారి అడవికి వెళ్ళితిని, సైన్యముతో అడవిలో చాలా మృగములను చంపితిని. ఆకలిదప్పులు బాధించగా రేవానదీతీరమును చేరితిని. సూర్యకిరణతాపార్తుడనైన నేను రేవానదీలో స్నానము చేసితిని. కాని నా వెంట నా సైన్యము చేరలేదు. సైన్యములేక ఒంటరినై ఆకలిచే దప్పికచే పీడించబడుచు రేవానదీ తీరవాసులను కొందరిని కలిసితిని. సాయంకాల సమయమున ఏకాదశీవ్రతము ఆచరించుచున్నవారిని చూచితిని. ఒంటరినైన నేను వారితో కలిసి నిరా హారముగా ఉంటిని. సైన్యము లేనందున రాత్రి అంతయు జాగరణ చేసితిని, నడక బడలికతో ఆకలి దప్పులతో పీడించబడిన నేను జాగరణ చివరలో ప్రాతః కాలమున మరణించితిని. అపుడు మహాదంష్ట్రలతో భయంకరులైన యమభటులు నన్ను బంధించి, బహుకష్టతరమైన మార్గముతో యముని సన్నిధికి చేర్చగా, అచట దంష్ట్రాకరాళ వదనుడైన యమధర్మరాజును చూచితిని. అపుడు సమవర్తి చిత్రగుప్తుని పిలిచి “ఇతని చరితమును శిక్షను వివరించుము” అని పలికెను. ధర్మరాజు మాటలను వినిన చిత్రగుప్తుడు చాలాకాలము ఆలోచించి ఇట్లు పలికెను ఓ ధర్మరాజా! ఇతడు వాస్తవముగా పాపాచారరతుడే. అయిననూ ఏకాదశీ తిథిన నిరాహారముగా ఉన్నచో అన్ని పాపములు తొలగును. ఇతడు వేటకై బయలువెడలి ఏకాదశీ తిథిన రేవానదీ తీరమున నిరాహారముగా నుండి జాగరము చేసెను. కావున ఇతని పాపములన్నియు తొలగెను. ఇతను చేసిన పాపములన్నియు ఏకాదశీ ఉపవాస ప్రభావముచే నశించినవి” అని ధీమంతుడగు చిత్రగుప్తుడిట్లు పలుకగా యమ ధర్మరాజు వినయముతో భక్తితో నాముందు దండవత్ప్రణామమును ఆచరించెను. భక్తి భావముతో నన్ను పూజించెను. తరువాత తన భటులనందరిని పిలిచి ఇట్లు పలికెను.

ధర్మరాజు పలికెను: “ఓ దూతలారా! నా మాటను వినుడు. మీకు హితమును బోధించెదను. ధర్మమార్గరతులైన మానవులను నా వద్దకు చేర్చకుడు. విష్ణుపూజా పరులను, భక్తులను, కృతజ్ఞులను, ఏకాదశీవ్రతపరులను, జితేంద్రియులను “నారాయణ! అచ్యుత! హరీ! రక్షకుడవుకమ్ము” అని ఎప్పుడూ పలుకు శాంతులను త్వరగా వదిలిపెట్టుడు. నారాయణా! “అచ్యుత! హరీ! జనార్దన! కృష్ణ! విష్ణో! పద్మేశ! పద్మజపిత! శివ! శంకర” అని ఎల్లపుడూ పలుకు అఖిల లోకహితకాంక్షులను, ప్రశాంతులను దూరము నుండియే వదులుడు. వారి విషయమున నా శిక్షలుండవు. అన్ని కర్మలను నారాయణునకు అకర్పించు వారిని, హరిభక్తిగలవారిని, స్వాచారమార్గమున నడుచువారిని గురు సేవకులను, సత్పాత్రదాననిరతులను, దీనపాలకులను, హరినామ పరాయణులను వదిలిపెట్టుడు. పాషండ సంగములేని వారిని, బ్రాహ్మణ భక్తి కలవారిని, సత్సంగమునందు ఆసక్తి కలవారిని, అతిథిపూజ చేయువారిని, శివ విష్ణువులందు సమబుద్ధి కలవారిని, జనోపకారములను విడిచిపెట్టుడు. హరికథామృతమును సేవించువారిని, నారాయణస్మృతి పరాయణ మానసులతో కలియని వారిని, బ్రాహ్మణపాద జలసేచనముతో సంతోషించని వారిని, లోకులను ద్వేషించువారిని, జనులను నాశము చేయువారిని, అపరాధ పరులను ఇక్కడికి తెండు. ఏకాదశీవ్రత పరాఙ్ముఖుని, ఉగ్రస్వభావుని, లోకోపవాదనిరతుని, పరనిందకుని, గ్రామ నాశకుని, ఉత్తములను ద్వేషించువానిని, బ్రాహ్మణ ధనమును ఆశించువానిని ఇటకు తెండు. విష్ణుభక్తి విముఖునకు, మూర్ఖులను అతి పాపరతులను, ఇటకు తెండు” అని ఇట్లు యమధర్మరాజు పలికిన మాటలను వినిని నేను చేసిన పాపకర్మలను తలచుకొని పరితపించితిని. పాపములను తలచి పశ్చాత్తాపమును చెందుటచే సద్ధర్మములను వినుటచే అప్పుడే అక్కడే నా పాపములన్ని నిశ్శేషముగా నశించినవి. ఇట్లు పాపరాహిత్యమునొంది హరి సారూప్యమును పొందియున్న సహస్ర సూర్యనమ ప్రకాశుడనైన నాకు ధర్మరాజు నమస్క రించెను. ఇట్లు నన్ను చూచిన యమదూతలు భయముచే వణుకుచు యమధర్మరాజు చెప్పిన దానిన దృఢముగా విశ్వసించిరి.

తరువాత యమధర్మరాజు నన్ను సన్మానించి నూరు దివ్యవిమానములతో శ్రీమహా విష్ణు పరమ పదమునకు పంపెను. నేను చేసిన ఆచిన్న పనిచే అన్ని భోగములతో కూడిన కోటి విమా నములతో విష్ణు లోకమున ఉంటిని. కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు, విష్ణు లోకము నునుండి తరువాత ఇంద్రలోకమునకు వచ్చితిని. అచట కూడా దేవతలందరిచే పూజను అందుచు కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు, అన్ని భోగములతో నివసించి భూలోకమునకు వచ్చితిని. ఇచట కూడా విష్ణుభక్తులైన మీ వంశమున పుట్టితిని. పూర్వజన్మ జ్ఞానముచే దీనినంతటిని తెలిసియున్నాను. కావుననే బాలురతో కలిసి విష్ణుపూజా ప్రయత్నమును చేయుచున్నాను. మొదట నేను ఆచరించినది ఏకాదశీ వ్రతమని తెలియకపోతిని. పూర్వజన్మజ్ఞానముచే ఇప్పుడు తెలిసితిని. నేను నా వశములో లేనపుడు చేసిన పనికే ఇంతటి ఫలము కలిగినదన్న భక్తిచే ఏకాదశీ వ్రతమును చేయువారికి కలుగు ఫలమును ఏమి చెప్పవలయును. కావున ఓ మహర్షి! నేను పరమ పవిత్రమైన ఏకాదశీ వ్రతమును ఆచరించెదను. పరమ పదమును కాంక్షించి ప్రతిపూట విష్ణుపూజను చేసెదను. శ్రద్ధతో ఏకాదశీ వ్రతమును ఆచరించువారు పరమానంద దాయకమగు విష్ణుభవనమును పొందె దరు. ఇట్లు భద్రశీలుని మాటలను వినిన గాలవమహర్షి సంతోషించినవాడై పరమానందమును మానసికముగా పొందెను. “విష్ణుభక్తి పరాయణుడైన నీవు నా వంశమున పుట్టితివి కావున నా వంశము ధన్యమైనది, నా జన్మసఫలమైనది” ఇట్లు చెప్పి పుత్రుని కర్మలచే సంతోషించిన గాలవ మహర్షి విధి విధానముగా హరిపూజా విధానమును బోధించెను. “ఓ మునిపుంగవా! ఇట్లు ఏకాదశీ వ్రత మహిమను సంకోచ విస్తారములతో నీకుచెప్పితిని. ఇంకను ఏమి వినకోరుచుంటిరో తెలుపుడు. (1/23)