నారద మహా పురాణము
వసు చరిత్ర నిరూపణము
వసువు పలికెను: ఓ మోహినీ! ఇపుడు నీకు చెప్పిన తీర్థమాహాత్మ్య విధిని అనుసరించి తీర్థమండలమును పర్యటించి ఫలమును పొందుము. నేను కూడా నీ తండ్రియగు బ్రహ్మతో సంభాషించి బృందావనమును చేరి మృగములతో కలిసి సంచరించెదను.
సూత మహర్షి పలికెను: పురోహితుడగు వసువు మోహినితో ఇట్లు చెప్పి మోహినిచే చక్కగా పూజాసత్కారములు చేయబడినవాడై బ్రహ్మలోకమునకు వెళ్ళెను. అచట జగద్విధియగు బ్రహ్మకు నమస్కరించి మోహినీ చరిత్ర నంతటిని జరిగినది జరిగినట్టుగా విన్నవించెను. వసువు మాటలను వినిన బ్రహ్మ సంతోషించి నీవు మంచి పని చేసితివి. నేను మోహినిని దేవకార్యార్ధము నియోగించితిని. కాని దేవకార్యము చేయకమునుపే నీచే శపించబడి మృతిచెందెను. మరల నాయాజ్ఞచే నీ వామెను బ్రతికించితివి కృతార్థురాలను చేసితివి. కావున నీ కంటే అధిక పుణ్యాత్ముడెవడు? ఇప్పుడు నీవు నాకు చెప్పిన మోహినీ చరితమును విని ప్రసన్నుడను అయితిని. కావున నీకు వరము నిచ్చెదను. ఏమి కావలయునో కోరుము అని పలికెను. లోకభావియగు బ్రహ్మ ఇట్లుపలుకగా బ్రాహ్మణోత్తముడగు వసువు ప్రణామమును ఆచరించి బృన్దావన నివాసమును వరముగా కోరెను. ఆ మాటలను వినిన బ్రహ్మ చిరునవ్వు నవ్వి అట్లే కానిమ్మని పలికెను. అంతట వసువు సంతోషముతో బ్రహ్మకు నమస్కరించి బృందావనమునుచేరి తపమును ఆచరించెను. వసువు తపస్సు చేయుచుండగా ముగ్గురు ప్రియమిత్రులతో కూడి శ్రీహరి సాక్షాత్కరించి వసువుతో ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణోత్తమా నేను నీ తపస్సునకు సంతోషించితిని ఏమి కావలయునో కోరుము. అంతట వసువు లేచి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి దేవా! ఎల్లపుడూ బృన్దావన నివాసమును కోరుచున్నాను అని పలికెను. శ్రీహరి వసువు కోరికను తీర్చి నమస్కారములను అంది అంతర్ధానమును చెందెను. ఆ వసువు అప్పటినుండి స్వేచ్ఛా రూపధరుడై బృందావనమున ఉండెను. బృందారణ్య కుతూహలయగు శ్రీకృష్ణ భగవానుని ధ్యానించుచుండెను. ఒకప్పుడు యమునా తీరమున కూర్చొని శ్రీకృష్ణ భగవానుని చింతించుచు బ్రహ్మ మానస పుత్రుడగు నారదమహర్షిని దర్శించెను. తనకు పరమ గురువగు నారద మహర్షినిచూచి నమస్కరించి భగవద్భక్తి వర్ధకములగు పలు ధర్మముల నడిగెను. వసువు ఇట్లడుగగా అధ్యాత్మ జ్ఞానముగల నారద మహర్షి శ్రీహరి భవిష్యచ్చరితమును వసువునకు తెలిపెను.
ఓ బ్రాహ్మణోత్తమా! ఒకసారి నేను కైలాసవాసియగు శంకరుని దర్శించుటకు భవిష్యద్బృం దావన రహస్యమును అడుగుటకు కైలాసమునకు వెళ్ళితిని. అప్పుడే నేను సిద్ధ సమావృతుడు తన మహిమచే జగత్తునంతటిని వ్యాపించియున్న శంకరునికి నమస్కరించి నా ఈప్సితమును అడిగితిని. అంతట శంకరుడు చిరునవ్వునవ్వుచు ఇట్లు పలికెను. ఓ నారదా! నీవు ఇపుడడిగిన శ్రీహరి భవిష్యచ్చరిత్రను నేను సురభి వదనమునుండి వింటిని. ఇపుడు దానిని నీకు చెప్పెదను. ఒకపుడు నేను గోలోక మధ్యలోనున్న, స్వసంతాన సహిత, సుప్రీతురాలు, సుస్నిగ్ధమానస అగు సురభిని చూచితిని. అపుడు నేను పయస్వినియగు గోమాతను శ్రీహరి భవిష్యచ్చరితమును అడిగితిని. అపుడు నాకు సురభి శ్రీహరి భవిష్య చ్చరితమును తెలిపెను. ఓ శంకరా! ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు రాధాసమన్వితుడై గోపాలక గోపికలకు సుఖమును కలిగించుచు ఈ గోలోకమున ఆనందముగా ఉన్నాడు. అతను కొంత కాలమునకు భూ లోకమున మధురా మండలమున ఆవిర్భవించి బృన్దారణ్యమున క్రీడించును. వృషభాను సుతయగు శ్రీహరి ప్రియురాలగు రాధ విరజాగేహద్వార స్థుడగు శ్రీహరి మిత్రుని శ్రీదాముని కోపించి శపించును. శ్రీదాముడు కూడా నీవు మానుషలోకమున పుట్టుమని శపించును. ఇట్లు ఇద్దరూ శాపముచే భూలోకమున పుట్టెదరు. తరువాత బ్రహ్మ ప్రార్థనచే శ్రీహరి భూ భారమును హరించుటకు భూ లోకమున వసుదేవ పుత్రునిగా అవతరించును. వసుదేవుని ఇంటిలో పుట్టి తరువాత కంసుని భయముచే వ్రేపల్లెకు చనును. అచట నుండి శ్రీహరి కంసుని పంపున వచ్చిన బాలఘాతినియగు పూతనను, సుడిగాలి రూపమున వచ్చిన తృణావర్తుని సంహరించును. అట్లే మహాకాయుడు దేవపీడాకరుడగు వత్సాసురుని సంహరించును. బ్రహ్మను, ఇంద్రుని, వరుణుని, మదించిన కుబేర పుత్రులను గర్వరహితులను చేసి వృషాసురుని సంహరించును. శంఖచూడుని, కేశిని, వ్యోమాసురుని సంహరించి వ్రేపల్లెలో నివసించుచు పదకొండు సంవత్సరములు గోపికలతో క్రీడించును. తరువాత మధురా నగరమును చేరి రజకుని సంహరించి, కుబ్జను చక్కగా చేసి, దనుర్భంగము గావించి కువలయా పీడమను గజమును సంహరించి చాణూరాది మల్లులను పరిమార్చి తన మేనమామ అగు కంసుని సంహరించును. కారాగార బద్ధులగు తన తలిదండ్రులను విడిపించి, కాలయవనుని సంహరించి, జరాసంధ భయము వలన ద్వారకా నగరమున నివసించును.
రుక్మిణిని, సత్యభామను, సత్యను, జాంబవతిని, కైకేయిని, లక్ష్మణను, మిత్రవిందను, కాలిందిని వివాహమాడును. తరువాత నరకాసురుని సంహరించి పదునారువేల రాజ కన్యలను వివాహమాడును. పౌండ్రకుని, శిశుపాలుని, దంతవక్త్రుని, విదూరథుని శాల్వుని, ద్వివిధుని సంహరించును. వజ్రనాభుని, సునాభుని, షట్సురాలయు లతో, త్రిశిరదైత్యుని సంహరించును. కౌరవపాండవులకు పరస్పరము కలహమును కలిగించి భూభార హరణమును కోరి సంహరించును. యాదవులకు యాదవులచే పరస్పరము వైరమును కలిగించి స్వకులమును హరింపచేయును. అపుడు మరల తన నివాసమునకు చేరును. ఓ శంకరా! ఇది శ్రీహరి భవిష్యచ్చరితము. నీకు చెప్పితిని. ఇక నీవు వెళ్ళుము. శ్రీహరి భూతలమునకు వెళ్ళినపుడు దీనిని అంతటిని చూడగలవు. అని ఇట్లు సురభి చెప్పిన శ్రీహరి చరితమును విని నా నివాసమునకు చేరితిని. దానినే ఇపుడు నీకు చెప్పితిని. నీవు కూడా ఈ సమయమున శ్రీ గోపీపతి చరితమును చూడగలవు. ఇట్లు తెలిపిన శంకరుని మాటలను వినిన వసువు సంతోషముచే పులకితగాత్రుడయ్యెను. వీణానాదముచే శ్రీహరిని గానము చేయుచు ఆనందించుచు జగత్తును ఆనందింపచేయుచున్నాను అని నారదుడు పలికెను. ఇది శ్రీహరి భవిష్యచ్చరితము. నీ హితమును కోరి నీకు తెలిపితిని.
సూతమహర్షి ఇట్లు పలికెను: ఇట్లు నారదమహర్షి బ్రాహ్మణోత్తముడగు వసువునకు తెలిపి, వీణానాదము గావించుచు, యదునందనుని ధ్యానించుచు వెడలెను. ఆ వసువు కూడా నారదమహర్షి మాటలను విని బృందావనమున పరమప్రీతిచే నివసించెను. అచట ఎల్ల కాలము బ్రాహ్మణులు శ్రీకృష్ణ భగవానుని క్రీడలను చూడగోరుచుందురు. (II/81)