నారద మహా పురాణము
భగీరథ గంగానయనము
నారదమహర్షి పలికెను: భగీరథ మహారాజు హిమవత్పర్వతమును చేరి ఏమి చేసెను? గంగను ఎట్లు తీసుకొని వచ్చెను? ఈ విషయమును నాకు తెలుపుము.
సనకమహర్షి పలికెను: భగీరధమహారాజు జడలను, నారవస్త్రములను ధరించి తపస్సు చేయుటకు హిమవత్పర్వతమునకు వెళ్ళుచు గోదావరీ తీరమును చేరెను. అచట ఆ మహారణ్యమున ఉత్తమము పవిత్రమైన భృగుమహర్షి ఆశ్రమమును చూచెను. ఆ ఆశ్రమమున జింకలు, ఏనుగులు, తిరుగాడు తుమ్మెదల ఝంకారములు, కూయుచున్న పక్షుల కోలాహలములు, కదులుచున్న వరాహ బృందములు, పుచ్ఛములతో వీచుచున్న చమరీ మృగములు, నాట్యముచేయుచున్న నెమళ్ళ గుంపులు, లేళ్ళు మొదలగు సాధుజంతువులు మునికన్యలచే ఆదరముతో పెంచబడిన వృక్షములు, శాలతమాల తాళమింతాలములు మాలతి, సంపెంగ, మల్లె, సన్నజాజి, రాగి, మొదలగు అతావృక్షములు, వికసించిన పూవులు కలిగి, ఋషి సమూహములచే వేదఘోష చేయబడుచుండగా భగీరథ మహారాజు ఆ ఆశ్రమమున ప్రవేశించెను.
పరబ్రహ్మను ధ్యానము చేయుచు, శిష్య బృందముతో కూడి ఉన్న సూర్యుని వంటి తేజస్సు గల భృగుమహర్షిని ఆయన చూచెను. పాదములు పట్టుకొని భృగుమహర్షికి నమస్కరించెను. భృగుమహర్షి కూడా సన్మాన పూర్వకముగా భగీరథ మహారాజునకు అతిథి మర్యాదను చేసెను. ఇట్లు భృగుమహర్షిచే అతిథి మర్యాదను పొందిన భగీరథమహారాజు చేతులు జోడించి వినయముతో భృగుమహర్షిని గూర్చి ఇట్లు పలికెను.
భగీరథుడు పలికెను: సర్వధర్మములను తెలుసుకొని సర్వశాస్త్రములందు విశారదుడవైన ఓ మహర్షీ! సంసారమునకు భయపడిన నాకు మానవులు సంసారమును దాటు ఉపాయమును తెలుపుము. ఓ మునిసత్తమా! శ్రీమన్నారాయణుడు సంతోషించు విధమును నామీది దయతో తెలుపుము.
భృగుమహర్షి పలికెను: ఓ రాజా! నీ కోరిక తెలిసినది. నీవు పుణ్యాత్ములలో శ్రేష్ఠుడవు. కావుననే నీ కులమును ఉద్ధరించదలచితివి. మంచి పనులచే తన కులమును ఉద్ధరించదలచు నరుని సాక్షాత్తు శ్రీహరిగా తెలియవలయును. ఓ రాజేంద్రా! శ్రీహరి సంతోషించు కర్మసు తెలిపెదను. సావధానముగా వినుము. సత్యపరుడుగా అహింసా నిరతుడుగా ఉండుము. అన్ని ప్రాణల హితమును కోరుము. అసత్యమును పలుకకుము. దుర్జనులతో సాంగత్యమును విడువుము. సాధుజన సమాగమును కోరుము. రాత్రింబవళ్ళు పుణ్యము నాచరించుము. సనాతనుడైన శ్రీమహావిష్ణువును స్మరించుము. మహావిష్ణువును పూజించి సాటిలేని శాంతిని పొందుము. ద్వాదశాక్షర మంత్రమును కాని, అష్టాక్షర మంత్రమును కాని జపించుము. నీకు మేలు కలుగును.
భగీరథ మహారాజు పలికెను: సత్యమనగా ఎట్టిది? సర్వభూతహితము అననేమి? అసత్యము అనగా ఏమి? దుర్జనులెట్టివారు? సాధువులనగా ఎవరు? పుణ్యమనగా ఎట్టిది? విష్ణువును ఎట్లు స్మరించవలయును? ఎట్లు పూజించవలయును? శాంతి అనగా నేమి? అష్టాక్షర మంత్రమనగా నేమి? ద్వాదశాక్షర మంత్రమేది? వాస్తవార్థమును తెలిసిన ఓ మహర్షీ! నా మీద దయ ఉంచి అంతయు తెలుపుము.
భృగుమహర్షి పలికెను: ఓ మహాప్రాజ్ఞుడా! బాగు! బాగు! నీ బుద్ధికి సాటిలేదు. నీవడిగిన వాటి నన్నింటినీ నీకు తెలిపెదను. ఉన్నది ఉన్నట్లుగా యథార్థమును చెప్పుట సత్యమని పండితులందురు. ధర్మపరాయణులు ధర్మమునకు విరుద్ధము కాని విధముగా చెప్పవలయును. దేశకాలాదులను చక్కగా తెలిసి తనకు తన ధర్మమునకు విరుద్ధముగా కాని విధముగా చెప్పబడు మాటయే సత్యమని సత్పురుషులు చెప్పెదరు. అన్ని ప్రాణులకు కష్టమును కలిగించక ఉండటయే అహింస అనబడును. ఈ అహింస అన్ని కోరికలను తీర్చును. చేయదగిన కార్యమునకు సాయపడుట చేయరాని పనిని అడ్డగించుటయే సర్వలోకహితమని ధర్మకోవిదులు చెప్పెదరు. ధర్మాధర్మములు తెలియక ఇష్టమొచ్చినట్లు చెప్పుటయే అసత్యమనబడును. ఈ సత్యము అన్ని శ్రేయస్సులకు విరోధియే అగును. లోకమున అందరిని, అన్నిటిని ద్వేషించువారు, మూర్ఖులు, చెడుదారిన నడుచుటలో ఆసక్తి కలవారు దుర్జనులని తెలియుము. ఈ దుర్జనులు అన్ని ధర్మకార్యములలో, ధర్మములలో బహిష్కృతులే. ధర్మాధర్మ వివేకముతో వేదమార్గమును అనుసరించుచు అన్ని ప్రాణులకు హితమును సమకూర్చవలయునని కోరువారు సజ్జనులు అనబడుదురు. శ్రీహరి యందు భక్తిని కలుగజేయునది, సత్పురుషులకు అనందమును కలిగించునది, తమకు ప్రీతిని కలిగించునది, సత్పురుషులకు ఆనందమును కలిగించునది, తమకు ప్రీతిని కలిగించునది పుణ్యమనబడును. ఈ జగత్తంతయూ విష్ణువే. అన్నిటికీ కారణము విష్ణువే. నేను కూడా విష్ణువునే అను జ్ఞానమే విష్ణుస్మరణము అనబడును. విష్ణువు సర్వదేవ స్వరూపుడు, శ్రీమహావిష్ణువును విధిగా పూజించెదను అను శ్రద్ధయే భక్తి అనబడును. విష్ణువు సర్వప్రాణి స్వరూపుడు, పరిపూర్ణుడు. సనాతనుడు అను అభేదుబుద్ధియే సమత అనబడును. శత్రుమిత్రవిషయమున సమబుద్ధితో ఉండుట, ఇంద్రియజయము, దైవసంకల్పముచే లభించిన దానితో తృప్తి చెందుట శాంతి అనబడును. ఈపైన చెప్పబడినవి అన్నియూ మానవులకు తపస్సిద్ధిని కలిగించునవి. అన్ని పాపరాశులను వెంటనే నశింపచేయగలవి. అన్ని పాపములను నశింపచేసి అన్ని పురుషార్ధములను సాధించగల ఒకే సాధనము అయిన అష్టాక్షరీ మహామంత్రమును నీకు చెప్పెదను. ఈ మంత్రము విష్ణువునకు ప్రియము, అన్ని సిద్ధులను అందించునది. మొదట ప్రణవమును ఉచ్చరించి పిదప నమో నారాయణాయ అని జపించినచో అష్టాక్షరీ మహామంత్రము అగును. మొదట ప్రణవమును ఉచ్చరించి, పిదప నమోభగవతే అని పలికి పిమ్మట వాసుదేవాయ అని ఉచ్చరించినచో ద్వాదశాక్షరీ మంత్రమగును. అనగా “ఓమ్ నమో నారాయణాయ” అనునది అష్టాక్షరీ మంత్రము, “ఓమ్ నమో భగవతే వాసుదేవాయ” అనునది ద్వాదశాక్షరీ మంత్రము అని భావము. ఈ రెండు మంత్రములకు సమానమైన ఫలమే లభించును. ప్రవృత్తిలోను నివృత్తిలోను అనగా ఇహపరములలో ఈ రెండు మంత్రములు సమములే. శంఖచక్ర ధరుడు, వికారరహితుడు, శాంతుడు, వామాంకమున లక్ష్మీ కలవాడు, అభయప్రదుడు, కిరీట మండలాది నానాభరణ శోభితుడు, కౌస్తుభమణిచే ప్రకాశించు హారము కలవాడు, శ్రీవత్సము అను పుట్టుమచ్చ వక్షస్థలమున కలవాడు, పీతాంబరధారి, సురాసురులతో నమస్కరించబడువాడు, ఆద్యంతములు లేనివాడు అందరి కోరికలను ఈడేర్చువాడు, అంతర్యామి, జ్ఞానస్వరూపుడు, పరిపూర్ణుడు, సనాతనుడు అగు శ్రీమన్నారాయణుని ధ్యానించవలయును. ఇట్లు నీవు అడిగినదంతయూ చెప్పితిని. నీకు శుభమగుగాక! తపస్సిద్ధిని పొందుటకు యథావకాశముగా వెళ్ళుము.
పరమర్షి అయిన భృగువిట్లు పలుకగా పరమానందమును పొందిన భగీరథ మహారాజు తపస్సు చేయుటకు అరణ్యమును చేరెను. హిమవత్పర్వతమును చేరి పవిత్రము సుందరము అయిన నాదేశ్వరమను క్షేత్రమున కఠోరమైన తపస్సును ఆచరించెను. మూడువేళలలో స్నానమును చేయుచు కందమూల ఫలములను భుజించుచు, అతిథులకు హితమును కలిగించుచు నారాయణుని యందు మనసునిలిపి, పత్రపుష్పఫల తోయములతో మూడువేళలా శ్రీహరిని పూజించుచు, మిక్కిలి ధైర్యముతో చాలా కాలమును గడిపి శ్రీమన్నారాయణుని ధ్యానముచేయుచు రాలిపడిన ఆకులను తినుచు తపము ఆచరించెను. పరమధార్మికుడైన భగీరథమహారాజు ప్రాణాయామముచే ఊపిరిపీల్చకనే తపస్సును చేయ సంకల్పించెను. అనంతుడు, అపరాజితుడు అగు శ్రీమన్నారాయణుని ధ్యానము చేయుచు అరువది వేల సంవత్సరములు గాలి పీల్చకనే ఉండగా, అతని నాసికాపుటము నుండి గొప్ప అగ్నిపుట్టెను. ఆ అగ్నిచే తపించిన దేవతలు భగీరథుని చూచి భయమును చెంది జగత్పతియగు శ్రీమన్నారాయణుడు నివసించు క్షీరసాగర ఉత్తరతీరమును చేరి శరణాగత పాలకుడు దేవదేవేశుడగు శ్రీమన్నారాయణుని ఇట్లు స్తుతించిరి.
దేవతలు పలికిరి: జగదేకనాథుడు, పరేశుడు, స్మరించువారి ఆర్తిని నశింపచేయు వాడు, సహజ శుద్ధుడు పరిపూర్ణకాముడు, తెలిసినవారిచే జ్ఞానరూపునిగా చెప్పబడుచున్న శ్రీమహావిష్ణువునకు నమస్కరించుచున్నాను. ఉత్తమయోగులచే సర్వకాలములందు ధ్యానము చేయబడు మహానుభావుడు, తన సంకల్పముచే స్వీకరించిన శరీరములచే దేవకార్యములను నిర్వహించినవాడు, జగత్స్వరూపుడు, జగత్తునకు మొదటి ప్రభువు, పురుషోత్తముడు అయిన శ్రీహరికి నమస్కరించుచున్నాము. నామ సంకీర్తనముచే ఖలుల పాపములను కూడా నశింపచేయు పురాణపురుషుడు, స్తుతించదగినవాడు, ప్రభువు అయిన శ్రీహరిని పురుషార్ధ సిద్ధికి నమస్కరించుచున్నాము. శ్రీహరి తేజస్సుచే సూర్య చంద్రాదులు ప్రకాశించుచున్నారు. శ్రీహరి ఆజ్ఞను ఎవ్వరూ అతిక్రమించలేరు. అట్టి కాలాత్మకుడు దేవాధినాథుడు పురుషార్ధ రూపుడు అయిన మహావిష్ణువునకు నమస్కరించుచున్నాము. బ్రహ్మ రూపముతో జగత్తును సృష్టించి, రుద్రరూపముతో లయముచేసి, బ్రాహ్మణ రూపముతో పావనము చేయుచున్న అదిదేవుడు, సకలసద్గుణరూపుడు, అందరికి అన్నింటిని ఉపదేశించువాడు అయిన శ్రీహరిని శరణువేడుచున్నాము. ఉత్తముడు, సర్వోత్తముడు, మధుకైటభులను సంహరించినవాడు, దేవదానవులచే పూజించబడు పాదపద్మములు కలవాడు, సద్భక్తుల సంకల్పము సిద్ధించుటకు హేతుభూతుడు, జ్ఞానముచే మాత్రమే తెలియదగువాడు అగు శ్రీహరికి నమస్కరించుచున్నాము. అది మధ్యాంతములు లేనివాడు, పుట్టుక లేనివాడు, పరేశుడు, అనాదియైన అవిద్యయను అజ్ఞానమును నశింప చేయువాడు, సచ్చిదానంద ఘనస్వరూపుడు, రూపాది రహితడగు దేవునికి నమస్క రించుచున్నాము. అనంతుడు, ఈశుడు పీతాంబరుడు, బ్రహ్మాదులచే సేవించబడువాడు, యజ్ఞ ప్రియుడు, యజ్ఞములను చేయువాడు, విశుద్ధుడు, సర్వోత్తముడు, అవ్యయుడు, సర్వవ్యాపి అయిన శ్రీమన్నారాయణునికి నమస్కరించుచున్నాము.
ఇట్లు ఇంద్రాది దేవతలచే స్తుతించబడిన శ్రీమహావిష్ణువు భగీరధమహారాజు చరిత్రను దేవతలకు తెలియచేసెను. తరువాత దేతలను ఓదార్చి అభయమునిచ్చి భగీరధుడు తపస్సు చేయుచున్న ప్రదేశమునకు వెళ్ళెను. సర్వజగద్గురువు, సచ్చిదానంద స్వరూపుడు అయిన శ్రీహరి శంఖ చక్రములను ధరించి భగీరధమహారాజునకు ప్రత్యక్షమాయెను. తన కాంతిచే దిగంతములను ప్రకాశింవ చేయుచున్నవాడు, పుండరీకాక్షుడు, అవిశపూవు వన్నె కలవాడు, ప్రకాశించు మండలములచే అలంకరించబడువాడు, దట్టమైన ముంగురులచే ప్రకాశించు ముఖపద్మము కలవాడు, కిరీటముచే ప్రకాశించువాడు, శ్రీవత్సమును కౌస్తుభమును ధరించినవాడు, వనమాలచే అలంకరించబడినవాడు, ఆజానుబాహువు, ఉదార అవయవములు కలవాడు, లోక పాలకులచే పూజించబడు పాదపద్మములు కలవాడు అయిన శ్రీమన్నారాయణుని చూచి దండవత్ప్రణామము లాచరించెను. మిక్కిలి సంతోషముతో నిండినవాడై పులకింతలు తడబాటు రాగా కృష్ణ, కృష్ణ, కృష్ణ శ్రీకృష్ణ అని కీర్తించెను. జగద్గురువు, అంతర్యామి అయిన శ్రీహరి భూతసృష్టి చేసిన భగవానుడు కావున భగీరథ మహారాజునకు ప్రసన్నుడై దయతో ఇట్లు పలికెను.
శ్రీమన్నారాయణుడు పలికెను: ఓ మహానుభావుడగు భగీరథుడా! నీ కోరిక నెరవేరును. నీ పితామహులు నా లోకమునకు రాగలరు. నాకు మరో రూపమై శంకరుని నీ శక్తి కొలది స్తోత్రములను చేయుము. ఆ శంకరుడు నీ కోరికనంతటిని వెంటనే తీర్చగలడు. శరణు వేడిన చంద్రుని స్వీకరించిన వాడు శంకరుడు. కావున స్తుతించదగిన వాడు సుఖమునిచ్చువాడు అయిన శంకరుని స్తుతించుము. ఆద్యంతములు లేని ఆ శంకరుడు అన్ని కోరికల నిచ్చువాడు. నీచే పూజింపబడి వెంటనే మేలును చేకూర్చును. జగత్పతియగు అచ్యుతుడు ఇట్లు పలికి అంతర్ధానము చెందెను. ఆ భగీరథమహారాజు కూడా లేచి నిలబడెను. ఇదినిజమా? నేనేమి చేయవలయును అని ఆశ్చర్యము చెందెను. ఇట్లు భ్రాంతి చెందిన భగీరథ మహారాజును గూర్చి ఆకాశవాణి ఇది సత్యమే. విచారించవలదని పలికెను. ఆ మాటను వినిన భగీరథ మహారాజు, సమస్తదేవతలకు రాజు, జగత్కారణుడు అయిన శంకరుని స్తోత్రము చేసెను.
భగీరథ మహారాజు పలికెను: జగన్నాథుడు, ప్రణామము చేయువారి ఆర్తిని నశింప చేయువాడు, ప్రమాణములకు గోచరము కానివాడు, ప్రణవస్వరూపుడు అయిన ఈశ్వరునికి నమస్కరించుచున్నాను. జగద్రూపుడు, పుట్టుకలేనివాడు, నిత్యుడు, సృష్టి స్థితిలయకారుడు, విశ్వరూపుడు, ఉగ్రరేతసుడు అయిన విరూపాక్షునికి నమస్కరించుచున్నాను. అది మధ్యాంతములు లేనివాడు అవ్యయుడు, పుష్టివర్ధనుడు, యోగీంద్రులచే మననము చేయబడువాడు అయిన ఈశ్వరునికి నమస్కరించుచున్నాను. లోకాధినాథుడు, నీలకంఠుడు అయిన పశుపతికి నమస్కారము. చైతన్యరూపునికి, పుష్టులపతికి, అకల్పప్రకల్పునికి భూతపతికి నమస్కారము. పినాకహస్తునికి, శూలహస్తునికి, కపాలహస్తునికి పాశముద్గర ధారికి నమస్కారము. సర్వభూతస్వరూపునికి, ఘంటాహస్తునికి, పంచముఖునకు, క్షేత్రపతికి నమస్కారము. సమస్త భూతములకు ఆదిభూతుడైనవానికి, భూభరణునకు, అనేకరూపునకు నిర్గుణునకు పరమాత్మునకు నమస్కారము. గణాధిదేవునకు గణపతికి హిరణ్య గర్భునకు హిరణ్యపతికి నమస్కారము. హిరణ్య రేతస్కునకు, హిరణ్యబాహువునకు, ధ్యాన స్వరూపునకు, ధ్యానసాక్షికి, ధ్యానసంస్థునకు, ధ్యానగమ్యునకు నమస్కారము. చరాచరాత్మకమగు ఈ ప్రపంచమును అంతటిని ప్రకాశింపచేయువానికి నమస్కారము. ప్రకృతి పురుషరూపముతో ఉన్నవానికి, స్వయంప్రకాశునకు, మహాత్మునకు, పరంజ్యోతికి, సనాతనునకు, తత్వజ్ఞులు మననము చేయువానికి, మానవ నేత్రములకు సూర్యునివంటివానికి నమస్కారము. ఉమాకాంతుడు, నంది కేశుడు, నీలకంఠుడు, సదాశివుడు, మృత్యంజయుడు, మహాదేవుడు, పరాత్పరుడు, విభువుపరుడు, శబ్ద బ్రహ్మ రూపుడు, అఖిలకారణుడు అగు శివునికి నమస్కరించుచున్నాను. కపర్దికి సద్యోజాతునకు నమస్కారము, భవోద్భవుడు, శుద్ధుడు, జ్యేష్ఠుడు, కనిష్ఠుడు, మన్యువు, త్రయీపతి అయిన ఈశునకు నమస్కారము. దిక్పతికి, కాలునకు అఘోర రూపునకు కృశాను రేతస్కునకు మహాత్మునకు నమస్కారము. సముద్రములు, నదులు, పర్వతములు గంధర్వ, యక్ష అసురసిద్ధ సంఘములు ఎవనినుండి పుట్టినవో, ఆ స్థాణువుకు మహద్రూపుకు అల్పునకు, చరిష్ణువునకు సదసద్రూపునకు నమస్కరించుచున్నాను. యోగులచే నమస్కరించుబడు పాద పద్మములు కలవానికి, సర్వాంతర్యామికి, రూప రహితునికి స్వతంత్రునికి, గుణవంతుల గుణ స్వరూపునికి ఈశ్వరునికి మాటిమాటికి నమస్కరించుచున్నాను.
ఇట్లు స్తోత్రము చేయబడిన శంకరుడు లోకములకు శుభములను కలిగించువాడు కావున ఉగ్రమైన తపస్సుచే తపించిన భగీరథ మహారాజునకు ప్రత్యక్షము అయ్యెను. పంచ వక్త్రుడు, దశభుజుడు, అర్ధచంద్రశేఖరుడు, త్రిలోచనుడు, ఉదారాంగుడు, నాగ యజ్ఞోప వీతుడు, విశాలాక్షుడు, హిమాద్రి సమకాంతి దేహుడు, గజచర్మాంబర ధారి, సురార్చిత పదాంబుజుడు అయిన శంకరుని చూచి భగీరథుడు దండమువలె శివుని పాదములపై పడెను. తరువాత లేచినిలబడి శివునిముందు. చేతులు జోడించుకొని మహాదేవుని కీర్తించుచు నమస్కరించెను. చంద్రశేఖరుడగు శంకరుడు రాజు భక్తిని తెలుసుకొని రాజును ఉద్దేశించి ఇట్లు పలికెను. ఓ రాజా! నీ విషయమున సంతోషించితిని. నీకు కావలసిన వరమును కోరుకొనుము. నీవు చేసిన స్తోత్రమునకు తపస్సునకు సంతోషించితిని. ఇట్లు శంకరుడు పలుకగా భగీరథమహారాజు సంతోషించి జగదీశ్వరునితో చేతులు జోడించి ఇట్లు పలికెను.
భగీరథుడు పలికెను: ఓ మహేశ్వరా! వరములను ఇచ్చి అనుగ్రహించ దలచినచో మా పితామహులు మోక్షమును చేరుటకు కారణమైన గంగను ప్రసాదించుము.
శ్రీ శివుడు పలికెను: నీ పితామహుల కొరకు నేను గంగను ఇచ్చుచున్నాను. నీకు ఉత్తమమైన మోక్షమును కూడా ఇచ్చితిని. అని పలికి అంతర్ధానము చెందెను. తరువాత శంకరుని జటలనుండి జారిపడిన లోకపావని అగు గంగ జగత్తును పావనము చేయుచు భగీరథుని అనుసరించెను. అప్పటి నుండి మలమును తొలగించు నిర్మల అగు గంగ మూడు లోకములలో భాగీరథి అని ప్రసిద్ధి చెందెను. సగరపుత్రులు తన పాపములచే దగ్ధమైన ప్రదేశమును నదీ శ్రేష్ఠమైన గంగ ముంచివేసెను. సగరపుత్రుల భస్మమును గంగ తడిపిన వెంటనే సగరపుత్రులు పాపము తొలగినవాదై నరకమునుండి ఉద్దరించబడిరి. పూర్మము యమునిచే పీడించబడిన సగర పుత్రులు గంగాజల సేచనముచే పూజించబడిరి. యముడువారిని పాపరహితులుగా తెలుసుకొని నమస్కరించి యథావిధిగా పూజించి సంతోషము నిండిన మనసుతో ఇట్లు పలికెను. “ఓ రాజాపుత్రులారా! మీరు మిగుల భయంకరమైన నరకమునుండి విముక్తులైతిరి. విమానమును అధిరోహించి విష్ణు మందిరము నకు వెళ్ళుడు” ఇట్లు యమధర్మరాజు చెప్పగా పాపము తొలగిన సగరపుత్రులు దివ్య దేహమును ధరించి విష్ణులోకమును పొందిరి. విష్ణుపాదాగ్రమున పుట్టిన గంగ ఇంతటి ప్రభావము కలది. అన్ని లోకములతో మహాపాతకనాశిని అని ప్రసిద్ధి చెందినది. మహా పాతకములను నశింపచేయు పవిత్రమైన ఈ కథను చదివిననూ వినిననూ గంగా స్నానఫలము లభించును. బ్రాహ్మణులముందు పవిత్రమైన ఈ కథను చెప్పినవారు పునరా వృత్తి రహితమైన విష్ణుభవనమును చేరుదురు. (1/16)