నారద మహా పురాణము
బ్రాహ్మణాచార నిరూపణము
భరద్వాజ మహర్షి పలికెను: వాయువే ప్రాణపతి, వాయువే చేష్టలు చేసినచో, వాయువే “తీసుకొనుట, వాయువే మాటలాడుట చేసినచో ఇక జీవుడు చేయునదేమి? జీవుడు నిరర్ధకుడగునా? అగ్ని సంబంధమైన వేడి అగ్ని వలననే కలిగినచో, అగ్నియే ఆహారమును శరీరమునందు జీర్ణము చేసినచో జీవునితో ప్రయోజనమేమి? మరణించు ప్రాణికి జీవుడు లభించుటలేదు. జంతువును వాయువు వదులుచున్నది. వేడి నశించుచున్నది. జీవుడు వాయుమయుడు. వాయువుతో సంశ్లేషిం చును. వాయుమండలమువలె చూడవలయును. మరుద్గణములతో కలిసి వెళ్ళవలయును. వాయు వుతో కలిసియుండుట జీవితము, వాయు నాశము మరణము అని చెప్పినచో నీటి సమూహము సముద్రము. సముద్రమనగా నీటికి పాత్ర తప్ప విడిగా సముద్రము లేదనునట్లయినది కదా? నీరు బావిలో ఉండును. దీపము అగ్నినిచ్చును. బావిలో నీరు దీపములోని అగ్ని క్షణములో నశించునట్లు జంతువులోని వాయువును అగ్నులు కూడా నశించవచ్చును కదా? పంచ భూత సంఘాతాత్మకమగు ఈ శరీరమున ఒకటి లేకున్నను మిగిలిన నాలుగు ఉండుటలో సంశయము లేదు కదా? ఆహారమును తీసుకోనిచో నీరు నశించును. గాలిని బిగబట్టిన వాయువు నశించును. భోజనము చేయనిచో అగ్ని నశించును. వ్యాధులచే, గాయములచే, పరిశ్రమచే భూమి నశించును. ఇట్లు ఈ అయిదింటిలో ఏ ఒక్కటి పీడించిననూ అయిదు నశించును కదా? ఇట్లు పంచత్వమును పొందినచో (మరణించినచో) జీవుడు దేనిని అనుసరించును? దేనిని బాధించును, దేనిని వినును, ఏమి మాట్లాడును? ఈ గోవు పరలోకమున ఉన్న యెడల తరింపచేయును అని భావించు ఒకడు గోవును దానము చేయును. దానము చేసిన వాడు మరణించిన పిదప ఆవును ఎవరిని తరింపచేయును? దానము చేయబడిన గోవు, దానము చేసినవాడు, దానమును స్వీకరించినవాడు ఈ లోకముననే మృతి చెందును కదా? వారెట్లు ఎపుడు ఎక్కడ కలియుదురు? పక్షులచే భక్షింపబడిన జంతువు, పర్వతము నుండి పడి మరణించిన జంతువు, అగ్నిచే దహింపబడిన జంతువు మరల ఎట్లు బ్రతుకును? సమూలముగా నరికివేసిన వృక్షము మరల చిగురించనట్లు బ్రతుకు నపుడు పనులు చేసినవారు, మరణించి మరల ఎట్లు వచ్చుదురు? ఎక్కడికి వెళ్ళును? పూర్వమున జీవి మాత్రమే సృజించబడినది. ఆ జీవమే తిరుగుచున్నదని కదా చెప్పితిరి. చనిపోయినవారు చనిపోయిన వెంటనే నశించుచున్నారు. ఒక బీజము మరియొక బీజమును నశింపచేయుచున్నది అయినపుడు తిరిగి వచ్చునదేది? పరలోకమునకు వెళ్ళునదేది? కావున ఓ బ్రాహ్మణోత్తమా? నా మనసులో ఈ సంశయమేర్పడినది. నిన్నాశ్రయించితిరి కావున నా సంశయమును సర్వజ్ఞుడవు అగు నీవు తొలగించుము.”
సనందన మహర్షి పలికెను: అని ఇట్లు భరద్వాజ మహర్షి ప్రశ్నించగా బ్రహ్మపుత్రుడగు భృగు మహర్షి అతని సందేహనివృత్తి కొఱకు మరల ఇట్లు పలికెను.
భృగుమహర్షి పలికెను: దానము చేసిన వానికి కార్యములను చేయువానికి జీవునకు ప్రాణములు లేవు. ప్రాణి అనగా జీవుడు మరో దేహమున ప్రవేశించును. శరీరము మాత్రమే నశించును. జీవుడు శరీరమును ఆశ్రయించి ఉండువాడు కాడు. శరీరము నశించినచో నశించువాడు కాడు. అగ్నిచే సమిధలు దహించబడును. అనగా అగ్ని సమిధల నాశ్రయించి ఉండునది కాదు. సమిధలచే నశించునది కాదు. సమిధల స్వరూప నాశములో అగ్ని కనపడదు కావున అగ్ని నశించినది అని భావింతుము.
భరద్వాజ మహర్షి పలికెను: సమిధల నాశముచే అగ్ని నశించకపోవచ్చును. కాని సమిధలను పూర్తిగా దహించిన తరువాత అగ్ని అచట కనపడుట లేదు కదా! సమిధలు లేనపుడు అగ్ని శాంతించును కావున నశించుననే భావించుచున్నాను. సమిధలు లేనపుడు అగ్ని గతి ప్రమాణము స్థితి యుండుట లేదు కదా?
భృగుమహర్షి పలికెను: సమిధల ఉపయోగము తరువాత అగ్ని కనిపించదు. సమిధలు లేని అగ్ని శాంతించును కావున నశించుననే భావింతును. గతి ప్రమాణము సంస్థానము కూడా లభించదు. సమిధలు ఉపయోగము తరువాత అగ్ని లభించనట్లు ఆకాశాను గతమైనది నిరాశ్రయ మైనది సూక్ష్మమగుటవలన తెలియజాలము. అట్లే శరీరమును విడిచినపుడు జీవుడు ఆకాశము వలె ఉండును. అతి సూక్ష్మమైనదగుటచే జ్యోతివలె నశించదు. అగ్ని ప్రమాణములను ధరింప చేయును. అతనినే జీవునిగా తెలియుము. వాయుసంధారణ మగు అగ్ని ఉచ్ఛ్వాస నిగ్రహమువలన నశించును. ఆ శరీరాగ్ని నశించినపుడు దేహము అచేతనమగును. దేహమునకు ఆధారము భూమి కావున భూమి మీదనే పడును. ఈ విషయము స్థావర జంగమములకు అన్నింటికి సమానము. వాయువు ఆకాశమును అనుసరించును. అగ్ని వాయువును అనుసరించును ఆకాశవాయ్వగ్నులు ఒకటి కావున వాయ్వగ్నులు భూమియందుండును. ఆకాశమున్నచోట వాయువుండును. వాయ వున్నచోట అగ్నియుండును. ఈ మూడు మూర్తిమంతములు కావు. శరీరులు మాత్రము మూర్తిమంతులు.
భరద్వాజ మహర్షి పలికెను: దేహధారులలో అగ్ని వాయు భూమ్యాకాశ జలములే ఉన్నచో అచట జీవుని గుర్తించు చిహ్నమేమిటో నాకు తెలుపుము. పంచాత్మక, పంచరతము, పంచవిజ్ఞాన సంజ్ఞకమైన ప్రాణుల శరీరమున జీవుడెట్టి వాడో తెలియగోరుచున్నాను. మాంసము, నెత్తురు, కొవ్వు, చీము, నరములు, ఎముకలు కలిసి ఉన్న శరీరమున జీవుడు కనపడుటలేదు. అనగా శరీరమును చీల్చి చూచిన మాంసాదులు కనపడుచున్నవే కాని జీవుడు కనపడుట లేదని భావము. జీవుడు లేని శరీరమే పంచభూత మయమైనచో శారీరక మానస దుఃఖమును తెలియునది ఎవ్వరు? జీవుడు చెవులతో వినును. కాని మనసు పరాకుగా ఉన్నపుడు వినలేదు. కావున జీవుడు నిరర్ధకుడే కదా? మనసుతో కలిసిన కంటితో అందరూ చూతురు. మనసు వ్యాకులముగా ఉన్నపుడు చూచుచున్ననూ కనపడదు. నిద్రావశములో ఉన్నపుడు చూడజాలడు వాసన చూడజాలడు, వినజాలడు, మాటలాడడు, స్పర్శను తెలియజాలడు. ఈ శరరీమున సంతోషించువాడు, కోపించువాడు, విచారించువాడు, బాధపడువాడు, కోరువాడు, ధ్యానించువాడు, ద్వేషించు వాడు, మాటలాడువాడు ఎవరు?
భృగుమహర్షి పలికెను: పంచభూతసాధారణాత్మకమగు శరీరమును ఒక్క అంతరాత్మయే వహించును. ఆ అంతరాత్మయే గంధమును రసమును శబ్దమును స్పర్శను, రూపమును, గుణములను ఇతరములను తెలియును. ఈ అంతరాత్మ పంచాత్మకమగు శరీరమున పంచ గుణములను చూపుచు అన్ని అవయవములలో అనుగతమై యుండును. అంత రాత్మయే సుఖములను దుఃఖములను తెలియును. అంతరాత్మ వియోగము జరిగినచో దేహము తెలియజాలదు. అగ్నిలో రూపము స్పర్శ ఊష్మ భావము లోపించి శరీరాగ్ని శాంతించినపుడు దేహ త్యాగముతో అంతరాత్మ నశించును. ఈ ప్రపంచమంతయూ జలమయమే. శరీరులకు జలమే మూర్తి నిచ్చును. ఆ జలమున లోక కారకుడగు మానస బ్రహ్మయే ఆత్మ. అతనినే సర్వ లోకహితాత్మకమగు ఆత్మగా తెలియుము. ఈ ఆత్మ దేహమున పద్మదళమున నీటిబిందువు వలె, సంగరహితముగా ఉండును. ఈ ఆత్మయే నిత్యము లోకహితాత్మక మగు క్షేత్రజ్ఞుడు. తమోరజస్సత్త్వములు జీవగుణములుగా చెప్పెదరు. జీవగుణము అచేతనమని అదియే చేయును చేయించును. అతనికంటే పరుడు క్షేత్రవిత్తు. ఇతడే ఏడులోకములను ప్రవర్తింప చేయును. దేహము భిన్నమైనను జీవనాశము జరుగదు. ఇదియంతయు మిథ్య అని అజ్ఞానులందురు. జీవుడు దేహమున అంతరముగానుండును. జీవునకు అయిదు శరీర భేదములుండును. ఇట్లు జీవుడు అన్ని ప్రాణులలో గూఢముగా సంచరించుచుండును. తత్త్వదర్శులు మాత్రమే ఉత్తమమగు సూక్ష్మబుద్ధిచే గ్రహించగలరు. జ్ఞాని పూర్వాపరరాత్రులందు యోగముచే ఆహారమును పొంది విశుద్ధమైన మనస్సు కలవారై ఆత్మదర్శనమును చేయగలరు. చిత్త ప్రసాదముచే శుభాశుభ కర్మలను వదిలి ఆత్మలో ప్రసన్న మనస్కునిగా ఉండి అనంతమైన సుఖమును పొందును. శరీరము లందుండు మానసాగ్నియే జీవుడని పిలువబడును. భూతాధ్యాత్మ నిశ్చయము కొఱకు ప్రజాపతి చేసిన సృష్టి ఇది. ప్రజాపతి అగు బ్రహ్మ మొదట బ్రాహ్మణులనే సృజించెను. వారందరు బ్రహ్మ తేజస్సును నింపుకొని భాస్కరాగ్ని సమతేజస్కులుగా ఉండిరి. తరువాత స్వర్గము కొరకు సత్య ధర్మములను, ఆచారమును, శౌచమును సృజించెను. తరువాత దేవదానవ గంధర్వ దైత్యాసుర మహోరగులు, యక్షులు, రాక్షసులు, నాగులు, పిశాచములు, మానవులు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు సృజించబడిరి.
భరద్వాజ మహర్షి పలికెను: వర్ణముతో చాతుర్వర్ణ్యములని వర్ణభేదమును చేయుచున్నారు. స్వేదము, మూత్రము, పురీషము, శ్లేష్మ, పిత్తము, రక్తము ఇవి అందరిలో సమముగా ప్రవహించుచుండును. అయినపుడు వర్ణ విభాగమెందులకు? స్థావర జంగములు అసంఖ్యేయములుగా ఉన్నవి. వాటిలో జాతులు అసంఖ్యేయములుగా ఉన్నవి. వాటిలో వర్ణ నిశ్చయము ఎట్లు చేయుదురు?
భృగుమహర్షి పలికెను: వర్ణములలో విశేషమేమియును లేదు. ఈ జగత్తంతయు బ్రహ్మమయమే. బ్రహ్మ సృష్టించిన ప్రాణులు వారి కర్మలచే వర్ణములను పొందిరి. కామ భోగములు కలవారు, ప్రీతి పాత్రులు, కఠినులు, కోపముకలవారు, సాహస ప్రియులు, స్వ కర్మలను వదిలిన రక్త వర్ణము కల ద్విజులు క్షత్రియులైరి. గోపోషణను వృత్తిగా స్వీకరించి వ్యవసాయమును చేయుచు వచ్చినవారై తమ ధర్మములను అనుష్ఠించని ద్విజులు వైశ్యులుగా మారిరి. హింసను అసత్యమును స్వీకరించి లోభులు అన్ని కర్మలచే బ్రతుకును సాగదీయుచు నల్లవారై శౌచ పరిభ్రష్టులైన ద్విజులు శూద్రులైరి. ఇట్లు ఆయా కర్మలచే ద్విజులే అయా వర్ణములను పొందిరి. ధర్మశాస్త్రమును అనుసరించిన వారు బ్రాహ్మణులు వారికి తపస్సు ఎప్పుడూ నశించదు. నిత్యము పరబ్రహ్మను వ్రతములను నియమములను ధరించువారు బ్రాహ్మణులు. వీరినే బ్రహ్మ మొదట సృష్టించెనని జ్ఞానులు తెలియుదురు. ఈ ద్విజులే ఆయా ప్రదేశములలో బహు విధములుగా మారిరి. పిశాచులు, రాక్షసులు, ప్రేతలు, పలు మ్లేచ్ఛ జాతులుగా ఉండిరి. ఈ సృష్టి బ్రహ్మమనసు నుండి ఏర్పడినది. ధర్మమును ఆధారముగా చేసుకొనినది.
భరద్వాజ మహర్షి పలికెను: ఏ కర్మచే బ్రాహ్మణులగుదురు? ఏ కర్మచే క్షత్రియులు వైశ్యులు శూద్రులుగా మారుదురో తెలుపుము.
భృగుమహర్షి పలికెను: జాతకర్మాది సంస్కారములతో సంస్కరించబడి, శుచియై వేదాధ్యయన సంపన్నుడై, బ్రహ్మకర్మ నిష్ఠుడై, శౌచాచారములు కలవాడై, చక్కగా విద్యాభ్యాసము చేయుచు, గురు ప్రియుడై నిత్యము వ్రతపరుడై, సత్యపరుడైనవాడు బ్రాహ్మణు డనబడును. సత్యం, దానము, అద్రోహము, అక్రూరత్వము, దయ, జాలి, తపస్సు ఉన్నవాడు బ్రాహ్మణుడనబడును. క్షత్రియ కర్మలను సేవించుచు, వేదాధ్యయనమును చేయుచు దానము నందు ఆ దానమునందు ప్రీతికలవాడు క్షత్రియుడు అనబడును. పశుపోషణము చేయుచు వ్యవసాయము నందు ప్రీతికలవాడై పవిత్రుడై, వేదాధ్యయన సంపన్నుడు వైశ్యుడు అనబడును. అన్నిటిని భక్షించుటలో ప్రీతికలవాడు, అన్ని పనులను చేయుచు అశుచియై వేదాధ్యయనమును వదిలి ఆచార శూన్యుడు శూద్రుడు అనబడును. పైన చెప్పబడిన లక్షణములు శూద్రుని గుర్తింపచేయును. ఈ లక్షణములు ద్విజునిలో కనపడవు. ఆయా కర్మలను అనుసరించియే బ్రాహ్మణత్వాదులను నిర్ణయించవలయును. కాని శూద్రుడు శూద్రుడే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే అని వంశమున జన్మించిన మాత్రమున చెప్పరాదు. అన్ని ప్రయత్నములచే క్రోధలోభములను నిగ్రహించుటయే జ్ఞానములలో ఉత్తమ జ్ఞానము. అట్లే మనో నిగ్రహమును అలవరచుకొనవలయును. శ్రేయస్సును భంగపరచు క్రోధ లోభములను అన్ని విధము లుగా వదలవలయును. కోపమునుండి సంపదను, మాత్సర్యము నుండి తపస్సును కాపాడు కొన వలయును, మానావమానములనుండి విద్యను, ప్రమాదము నుండి ఆత్మను రక్షించుకొనవలయును. ఆశాబంధరహితములగు ప్రయత్నములు కలవాడు, సర్వమును త్యాగమున అర్పించువాడు మాత్రమే నిజమగు త్యాగి, బుద్ధిమంతుడు. అన్ని భూతముల విషయమున హింసను వదిలి స్నేహముతో ప్రవర్తించవలయును. పరిగ్రహమును విడిచి జితేంద్రియుడు కావలయును. ఇహపర లోకములలో శోకరహిత స్థితిని సాధించవలయును. అట్లు సాధించుటకు నిత్యతపము ఇంద్రియనిగ్రహము, మౌనము, మనోనిగ్రహములు ముఖ్యోపాయములు. జయించ శక్యము కాని మనసును జయించ కోరువాడు విషయసంగమమును పరిత్యజించవలయును. ఇంద్రియములచే గ్రహించబడునది అంతయు వ్యక్తము అనబడును. అతీంద్రియము లింగమాత్ర గ్రాహ్యము అవ్యక్తము అనబడును. విశ్రంభము (తొట్రుపాటు) లేక మననము చేయవలయును. తొట్రుపడు మనస్సును నిగ్రహించ వలయును. ప్రాణముతో మనసును నిగ్రహించవలయును. ప్రాణమును పరబ్రహ్మలో నిలుప వలయును. వైరాగ్యము వలననే ఆనందము లభించును. దేనిని గూర్చి చింతించరాదు. బ్రాహ్మణుడు వైరాగ్యముచేతనే ఆనందమును పొందగలడు. ఎపుడూ శౌచాచారములు కలవాడై అన్ని ప్రాణుల యందు దయ కలిగి యుండుట ద్విజలక్షణము. సత్య వ్రతమే తపస్సు, సత్యమే శౌచము. సత్యము వల్లనే సృష్టి జరుగుచున్నది. సత్యముచేతనే లోకము ధరించబడుచున్నది. సత్యము చేతనే స్వర్గమును పొందగలడు. అసత్యము తమోరూపము. తమస్సుచే పతితుడగును. తమోగ్రస్తులై తమస్సుచే అవరించబడిన వారు ప్రకాశమును చూడజాలరు. ప్రకాశము ఏమాత్రము లేని తమస్సే సరక మనబడును. జగత్తున సంచరించువారు సత్యాసత్యములను ఆశ్రయింతురు. లోకవృత్తి కూడా సత్యానృతములలో ఉండును. ధర్మా ధర్మములు, ప్రకాశతమములు సుఖదుఃఖములు శారీరక మానసిక దుఃఖములు, దుఃఖములను కలిగించు సుఖములు వీటితో లోక ప్రవృత్తిని చూచువారు మోహములో పడరు. వివేకము కలవాడు దుఃఖమోక్షము కొఱకు ప్రయత్నించవలయును. ప్రాణులకు ఇహపరములలో సుఖము అనిత్యమే. గ్రహణము పట్టిన చంద్రుని వెన్నెల ప్రకాశించినట్లు తమోగ్రస్తులగు ప్రాణులకు సుఖము ప్రకాశించదు. సుఖము శారీరకము మానసమని రెండు విధ ములు. ఇహపరములందు వస్తు ప్రవృత్తులు సుఖము కొఱకే చెప్పబడినవి. ఇహపరములలో కూడా అపవర్గము కంటే విశిష్టమైనది లేదు. ఆ అపవర్గమే కోరదగిన గుణ విశేషము. ధర్మా చరణము అపవర్గహేతువు. అన్ని ప్రయత్నములు సుఖమును పొందుటకొఱకే కొనసాగుచుండును.
భరద్వాజ మహర్షి పలికెను: సుఖములకే ఉత్తమ స్థితి అని మీరు చెప్పియుంటిరి. కాని దానిని మేము అంగీకరించుట లేదు. మహర్లోకమున ఉన్న ఋషులకు సుఖము అను ఈ కామ్య గుణ విశేషము పొందకూడనిదిగా చెప్పబడి ఉన్నది. ఋషులు ఈ సుఖమును కోరుటలేదు. తపోలోకమున మూడు లోకములను సృజించిన బ్రహ్మ ప్రభువు ఒంటరిగా ఉండెనని వినుచుంటిమి. బ్రహ్మచారిగా ఉండెను. కామ సుఖములయందు తనను తాను నియోగించుకొనలేదు మరియు పూజ్యుడగు శివుడు తనలో కామమును కలిగించగోరు మన్మథుని అనంగునిగా చేసెను. కావున భూలోకమున కూడా మహానుభావులు సుఖముచే ఆనందించుటలేదు. అంతేకాదు. సుఖము విశిష్ట గుణమని కూడా గ్రహించబడలేదు మరియు సుఖమునకు పరమావధి స్త్రీలు అని. కాని లోకమున వ్యవహారము రెండు విధములుగా నున్నది. సుకృతము వలన ఫలోదయమైన సుఖము లభించును, లేనిచో దుఃఖము కలుగును అని.
భృగు మహర్షి పలికెను: అసత్యము నుండి తమస్సు పుట్టినది. ఆ తమస్సుచే ఆవరించ బడినవారు అధర్మమునే అనుసరింతురు. ధర్మమును అనుసరించరు. క్రోధలోభమోహ మీమాంసా అనృతాదులచే కప్పబడినవారు ఇహమున పరమున సుఖమును పొందలేరు. పలువిధములగు వ్యాధులచే, బాధలచే కలిగిన ఉపతాపములతో ఆవరించబడుదురు. చంపుట, బంధించుట, కష్టములు, ఆకలిదప్పులు, పరిశ్రమ మొదలగు వాటిచే తపించెదరు. వర్షము, గాలి, అత్యుష్ణము, అతిశీతము మొదలగు భయములచే శరీర దుఃఖములచే బాధపడుదురు. బంధనాల వినాశము తడబాటు మొదలగు మానసిక దుఃఖములచే కృశింతురు, జరా, మృత్యువు మొదలగు ఇతరదుఃఖములచే ఆక్రమించ బడుదురు. స్వర్గమున శారీరక మానస దుఃఖములు ఉండవు. ముసలితనము, పాపములు ఉండవు. నిత్యము సుఖమే ఉండును. ఇచట సుఖదుఃఖములు రెండు ఉండును. నరకమున దుఃఖము మాత్రమే ఉండును. పరమపదమున సుఖము మాత్రమే ఉండును. అన్నిప్రాణులకు జన్మనిచ్చునది పృథివి. స్త్రీ అట్టిదే. పురుషుడు ప్రజాపతి. శుక్రము తేజోమయము. ఇదియే ధర్మమునకు చరితమునకు లోకనియమము. చక్కగా తపమును ఆచరించుట స్వాధ్యాయము హోమము. ఇవియే ధర్మచరిత్ర నియమములు. హోమముచే పాపము శమించును. స్వాధ్యాయముచే శాంతి కలుగును. దానముల వలన భోగములు లభించును. తపముచే స్వర్గము లభించును. దానము రెండు విధములు. పర లోకార్థము ఇహలోకార్థము అని సత్పాత్రదానము కొంచమైనను పరలోకము ఫలించును. అసత్పాత్ర దానము ఇహలోకమున ఫలించును. దానానుగుణమగు ఫలమే లభించును.
భరద్వాజ మహర్షి పలికెను: ఎవరు ఏ ధర్మమును ఆచరించవలయును? ధర్మమునకు లక్షణమేమి? ధర్మమెన్ని విధములు? దీనిని అంతటిని తెలుప ప్రార్ధన.
భృగు మహర్షి పలికెను: స్వధర్మమును ఆచరించు బుద్ధిమంతులకు స్వర్గము లభించును లేని యెడల వారు మోహపాశబద్ధులగుదురు.
భరద్వాజ మహర్షి పలికెను: బ్రహర్షి విహితములైన నాలుగు ఆశ్రమములో ఏయే ఆశ్రమములవారు ఏ ధర్మములను ఆచరించవలయునో తెలుపుడు.
భృగు మహర్షి పలికెను: పూర్వకాలముననే లోకహితమును చేయదలచిన బ్రహ్మ ధర్మ సంరక్షణము కొఱకు నాలుగాశ్రమములను నిర్దేశించెను. ఆ నాలుగాశ్రమములలో గురుకులవాసము మొదటి ఆశ్రమమని చెప్పుచున్నారు. ఈ గురుకుల వాసమున చక్కగా శౌచసంస్కార నియమ వ్రతములచే మనసును నిగ్రహించి, ఉభయ సంధ్యలందు సూర్యాగ్నులను ఆరాధించి సోమరితమును, అలస్య మును విడిచి గురువునకు అభివాదము చేయుచు, వేదాభ్యాసముచే, శ్రవణముచే అంతరాత్మను పవిత్రము చేసుకొని మూడువేళలలో స్నానాది కర్మములను నిర్వర్తించి, బ్రహ్మచర్యమును అగ్ని పరిచర్యను గురుశుశ్రూషను, నిత్యభిక్షా చరణమును, భిక్షచే సంపాదించినదానిని గురువునకు నివేదించి అంతరాత్మను గుర్వధీనము చేసి, గురువు చెప్పిన మాటను అజ్ఞగా పరిపాలించుట, వ్యతిరేకించకుండుటచే గుర్వను గ్రహమును పొంది, అనుగ్రహముచే గురువు ఇచ్చిన స్వాధ్యా యమును అభ్యసించవలయును. ఈ విషయమున ఒక శ్లోకముకలదు. గురువునారాధించి వేదమును పొందిన వానికి స్వర్గ ఫలము లభించును, సిద్ది లభించును అని ఆ శ్లోకమునకు అర్థము.
ఇక రెండవది గృహస్థాశ్రమము అని చెప్పెదరు. గృహస్థాశ్రమ సదాచారమలను ఇపుడు చెప్పెదను. సదాచారము కలిగి సహధర్మాచరణ ఫలమును కోరువారి కొఱకు గృహస్థాశ్రమము విధించబడి ఉన్నది. గృహస్థాశ్రమమున ధర్మార్ధకామావాప్తిని త్రివర్గ సాధనమును అపేక్షించి సత్కర్మలచే ధనమును సంపాదించి స్వాధ్యాయమువలన పొందిన జ్ఞానముచే, బ్రహ్మర్షి నిర్మిత మార్గముచే కాని, సాగరజలములచే కాని, ద్రవ్య నియమా భ్యాసముచే దైవానుగ్రహముచే కాని పొందిన ధనముచే గృహస్థులు గృహస్థాశ్రమమును కొనసాగించవలయును. గృహస్థాశ్రమమే అన్ని ఆశ్రమములకు మూలముగా పేర్కొందురు. గురుకులవాసులకు పరివ్రాజకులకు సంకల్పించిన వ్రత నియమ ధర్మానుష్టానములను చేయు ఇతరులకు భిక్షా బలి సంవిభాగము గృహస్థాశ్రమముననే చేయబడును. వానప్రస్థులకు కూడా ద్రవ్యోపస్కారమును చేయవలయును. సామాన్యముగా సాధవులు చక్కని పథ్యమైన ఆహారమును తీసుకొనుచు, స్వాధ్యాయ ప్రవచనమును చేయుచు తీర్థాభిగమనము కొఱకు పుణ్యక్షేత్ర దేశ దర్శనము కొఱకు భూమి నంతయు పర్యటింతురు. అట్టి వారికి లేచి ఎదురేగి అభివాదము ఆచరించి అసూయా రహితముగా మాటలాడి ఆనందమును కలిగించు సత్కారముల నాచరించి, ఆసనశయనాదులనేర్పరిచి చక్కని ఆహారమునొసంగి సన్మానించవలయును. ఈ విషయమున ఒక శ్లోకము కలదు. అతిథి నిరాశతో ఇంటి నుండి వెడలినచో తన దుష్కృతమును గృహస్థున కొసంగి అతని పుణ్యమును తీసుకొని వెళ్ళును అని ఆ శ్లోక భావము. ఈ గృహస్థాశ్రమ మున యజ్ఞములచే దేవతలు, తర్పణముచే పితృ దేవతలు, విద్యాభ్యాస శ్రవణ ధారణములచే ఋషులు, సంతానోత్పత్తిచే ప్రజాపతి ప్రీతి చెందెదరు. ఇచట రెండు శ్లోకములను చెప్పెదరు. సర్వభూతములయందు వాత్సల్యమును చూపవలయును. శ్రోత్రములచే దుర్భాషలను వినరాదు. వాక్కుచే పరుషముగా మాట్లాడరాదు, పరితాపమును పొందరాదు. ఎదుటివారిని బాధించరాదు. అవమానము అహంకారము, దంభము ఈ మూడు నింద్యములు. అహింసా, సత్యము, అక్రోధము, తపస్సు అనునవి నాలుగాశ్రమములలో ఆచరించదగినవి మరియు ఈ గృహస్థాశ్రమమున మాల్యాభరణ, వస్త్ర, అభ్యంగన, నిత్యోపభోగ, నృత్యగీత వాద్యములచే చెవులకు నేత్రములకు ఆనందమును కలిగించుచు, ఆరామదర్శనాదులను చేయుచు, భక్ష్య భోజ్య లేహ్య పేయ చోష్యాది రసవంతములగు ఆహారమును స్వీకరించుచు వివిధ భోగానుభవముండును. విహారముచే సంతోషము, కామ సుఖావాప్తి కూడా ఉండును. గృహస్థాశ్రమమున త్రివర్గ గుణములను నివృత్తి చేయువారు ఇహమున సుఖములను అనుభవించి పరమున సద్గతిని పొందుదురు. ఉంఛవృత్తిని అవలంబించి స్వధర్మాచరణమును చేయుచు కామ సుఖములను వదిలిన గృహస్థుడు సులభముగా స్వర్గమును పొందును.
వానప్రస్థాశ్రమమును స్వీకరించినవారు కూడా ధర్మమును అనుసరించుచు, పుణ్య తీర్థములను, పుణ్య జలమును సేవించుచు, మృగ వరాహ మహిష శార్దూల వనగజాది సేవితమగు అరణ్యములలో తపస్సును చేయుచు సంచరించుచుండ వలయును. గ్రామ్య వస్త్రములను ఆహారమును పరిత్యజించి వన్యములగు ఓషధి ఫలమూల పర్ణాదులచే అహార నియమమును అభ్యసించి భూమిపై కూర్చొనుచు, పాషాణములపై, ఇసుకపై, గులకరాళ్ళపై, సదీతీరములందు, భస్మాదులయందు, ధూళిలో శయనించుచు కాశకుశ చర్మవల్కలాదులను వస్త్రములుగా ధరించుచు, కేశశ్మశ్రునఖ రోమాదులను ధరించి నియమబద్ధముగా కాల కృత్యములను, సంధ్యా బలిహోమాదులను అనుష్ఠించుచు, సమిధలను, పుష్పములను, జలమును సంగ్రహించుకొనుచు, సమ్మార్జమాదులచే తమ నివాసమును పవిత్రముగా ఉంచుకొనుచు, విశ్రమించుచు చలి, వేడి, గాలి మొదలగు ప్రకృతి సహజమైన స్పర్శలకు చలించక, పలునియమములతో యోగానుష్ఠానముచే శరీరము నందలి మాంసాస్థి రక్త చర్మాదులను శుష్కింపచేయుచు ధైర్యము కలవారై సత్త్వ యోగముచే శరీరమును ధరించి ఉందురు. ఇట్లు బ్రహ్మర్షులచే విధించబడిన నియమములు ఆచరించువారు అగ్నివలె పాపమును దహించి అన్ని లోకములను జయింతురు.
ఇక ఇపుడు సన్యాస ఆశ్రమ ఆచారములను వివరించెదను. అగ్నిని పరిత్యజించి ధన భార్యా లింగనాది భోగములను వీడి సంసారమునందలి వ్యామోహమును త్రోసిపుచ్చి సన్యసించవలయును. బంగారమును మట్టిగడ్డను ఒకేవిధముగా చూచుచు త్రివర్గములయందు ఆసక్తులు కాక శత్రుమిత్ర ఉదాసీనుల విషయమున సమదృష్టిని ప్రదర్శించుచు అన్ని విధములగు ప్రాణులకు కరణ త్రయముచే ద్రోహమును ఆచరించక స్థిర నివాసహీనులై పర్వత శిఖరములందు, వృక్షమూలములందు, దేవాలయములందు నివసించుచు, సంచరించుచు దారిలో కనపడిన గ్రామమునకు కాని నగరమునకు కాని వెళ్ళవలయును. కామ క్రోధ లోభ మోహ మదమత్సరములను, దైన్యదంభ పరివాదములను, హింసను విడిచి ఉండవలయును. ఈ విషయమున ఈ శ్లోకములను చెప్పెదరు. సర్వ భూతములకు అభయము నిచ్చుచు, చరించువానికి ఏ ప్రాణి వలన భయము కలుగదు. అగ్నిని శరీరమున నిలిపి, శరీరమునగల అగ్నిని ముఖమున హోమము చేసి, భిక్షాటనము వలన లభించిన దానిని భుజించుచు అనగా ముఖమున ఉన్న అగ్నికి అర్పించుచు, చితాగ్నిచే పరలోకములను చేరును. ఇట్లు సంకల్ప బుద్ధిచే యథోక్తవిధిగా సన్యాసాశ్రమము ఆచరించినవారు ఇంధనములు లేని అగ్నివలె ప్రశాంతులై బ్రహ్మలోకమును చేరుదురు (2/43)