నారద మహా పురాణము
పురుషోత్తమ మహాత్మ్యము
మోహినీ దేవి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! పురుషోత్తమ క్షేత్రమునకు ఏ సమయమున వెళ్ళవలయును? పంచతీర్థిని ఏ విధిచే ఆచరించవలెను? ఒక్కొక్క తీర్థమున స్నానము దానమున ఏ ఫలము కలుగును. దేవదర్శనమున ఏఫలము కలుగునో దానినంతటిని విడివిడిగా తెలుపుము.
వసువు పలికెను: కురుక్షేత్రమున నిరాహారుడై, జితేంద్రియుడై ఏడు సంవత్సరములు ఒంటి కాలిపై తపస్సు చేయవలెను. జ్యేష్ఠ శుక్ల ద్వాదశినాడు ఒకమారు పురుషోత్తముని దర్శించి ఉపవసించినచో అధిక ఫలము లభించును. కావున ఓ సుందరీ! జ్యేష్ఠ మాసమున యధావిధిగా పంచతీర్థిని శుక్ల ద్వాదశిన ఆచరించి పురుషోత్తముని దర్శించవలయును. ద్వాదశినాడు అవ్యయుడు దేవుడుగు పురుషోత్తముని దర్శించినవారు శ్రీ విష్ణులోకమును చేరి మరల ఇటకురారు. కావున జ్యేష్ఠశుక్లద్వాదశిన సర్వ ప్రయత్నములచే పంచ తీర్థమునకు వెళ్ళవలెను. పురుషోత్తముని దర్శించవలెను. పురుషోత్తమ క్షేత్రమునకు చాలా దూరమున ఉన్నవారుకూడా ప్రతి దినము పరిశుద్ధమగు మనసుచే పురుషోత్తముని కీర్తించిననూ, శ్రీ విష్ణులోకమును చేరును. శ్రద్ధతో సావధానుడై శ్రీకృష్ణయాత్ర ఆచరించినవాడు సర్వపాప వినిర్ముక్తుడై శ్రీ విష్ణు లోకమును చేరును. పురుషోత్తమ గోపురమున ఉన్న శ్రీహరి చక్రమును చూచి భక్తితో నమస్కరించినవారు పాపము నుండి విముక్తులు అగుదురు. ఓ మోహినీ: ఇపుడు పంచతీర్థ విధినిచెప్పెదను. శ్రద్ధగా వినుము. ఈ పంచతీర్థ విధిని ఆచరించినవారు శ్రీహరికి ప్రియులగుదురు. మార్కండేయ హ్రదమునకు వెళ్ళి ఉత్తరాభిముఖుడై శుచిగా హ్రదమున మూడుమార్లు మునుగవలెను. తరువాత ఈ మంత్రమును ఉచ్చరించవలెను.
సంసార సాగరేమగ్నం పాపగ్రస్త మచేతనమ్ |
త్రాహి మాం భగనేత్రఘ్న త్రిపురారే! నమోస్తుతే
నమశ్శివాయ శాంతాయ సర్వపాపహరాయచ |
స్నానం కరోమి దేవేశ! మమ నశ్య తు పాతకమ్”
అనునది మంత్రము, సంసార సాగరమున మునిగియున్న, పాపగ్రస్తుడను, జ్ఞానహీనుడనగు నన్ను కాపాడుము. ఓ త్రిపురారీ! నీకు నమస్కారము. శివునకు శాంతునకు, సర్వపాపహరునకు నమస్కారము. ఓ దేవేశా! ఇచట స్నానమును చేయుచున్నాను. నా పాకతము నశించుగాత అని అర్థము.
నాభి మాత్ర జలమున నిలిచి యధావిధిగా దేవతలను ఋషులను, పితరులను, ఇతరులను మతిమంతుడై తిలోదకముచే తర్పణమును గావించవలయును. ఇట్లు స్నానము గావించి. ఆచమనమును చేసి శివాలయమునకు వెళ్ళవలయును. దేవాలయమున ప్రవేశించి దేవునికి మూడు సార్లు ప్రదక్షిణము గావించి ఆదరముతో మూల మంత్రముచే మార్కండేయేశుని చక్కగా పూజించి అఘోర మంత్రముచే నమస్కరించి క్షమాపణను కోరవలయును.
“త్రిలోచన నమస్తేస్తు నమస్తే శశిభూషణ! |
త్రాహి మాం పుండరీకాక్ష! మహాదేవ నమోస్తు తే”
ఇది మంత్రము. త్రిలోచనా! నీకు నమస్కారము. చంద్రభూషణా! నీకు నమస్కారము. ఓ పుండరీకాక్షా! నన్ను కాపాడుము. మహాదేవా! నమస్కారము అని అర్థము. ఇట్లు మార్కండేయ హ్రదమున స్నానమాచరించి శంకరుని దర్శించి దశాశ్వమేధముల ఫలమును పొందును. సర్వ భోగములను అనుభవించి భూలోకమున బ్రాహ్మణునిగా పుట్టును. బహుశాస్త్ర కోవిదుడగును. శంకర యోగమును పొంది మోక్షమునందును. తరువాత కల్పవృక్షమునకు వెళ్ళి మూడు మార్లు ప్రదక్షిణమునుచేసి ఉత్తమ భక్తిచే ఈ వటవృక్షమును ఈ మంత్రముచే పూజించవలయును.
“ఓం నమో అవ్యక్త రూపాయ మహతే నతపాలినే |
మహోదకోపవిష్టాయ న్యగ్రోధాయ నమోస్తుతే
అవసస్త్వం సదా కల్పే హరేశ్చాయతనే వటే |
న్యగ్రోధ హర మే పాపం కల్పవృక్ష నమోస్తుతే”
ఇది మంత్రము. అవ్యక్త రూపునకు మహత్స్వరూపునకు, నతపాలకునకు, మహోద కోప విష్ణుడగు న్యగ్రోధమునకు నమస్కారము. నీవు ఎపుడూ హరి నివాసమగు వటమున ఉంటివి. ఓన్యగ్రోధమా! నా పాపమును హరించుము. కల్పవృక్షమా! నీకు నమస్కారము అనియర్థము. ఇట్లు కల్పవృక్షమును చేరి భక్తిచే ప్రదక్షిణము ఆచరించి, పాము కుబుసమును విడుచునట్లు వెంటనే పాపములను వీడును. కల్పవృక్షఛాయ నాశ్రయించినవారు బ్రహ్మహత్యా పాతకమును కూడా విడిచెదరు. ఇక ఇతర పాముల కథయేమి? కృష్ణాంగసంభూతమున పరమగు బ్రహ్మతేజ స్వరూపుడగు న్యగ్రోధాకారమున నున్న శ్రీహరిని దర్శించి నమస్కరించి రాజసూయాశ్వమేధముల ఫలమును పొందును. కులమును ఉద్ధరించి విష్ణు లోకమును పొందును. శ్రీకృష్ణ భగవానుని ముందున్న గరుడునికి నమస్కరించి సర్వపాప వినిర్ముక్తుడై శ్రీహరిలోకమును చేరును. వటవృక్షమును, గరుడుని దర్శించి పురుషోత్తముని చూచినవాడు సంకర్షణుని, సుభద్రను చూచినచో ఉత్తమ గతిని పొందును. శ్రీహరి మందిరమును ప్రవేశించి మూడు మార్లు ప్రదక్షిణము నాచరించి సంకర్షణుని సుభద్రను భక్తిచే పూజించి ప్రసన్నుల గావించవలెను. ఓహలధారీ! ముసలాయుధా! రేవతీకాన్త! భక్తవత్సలా! బలిశ్రేష్ఠా! ధరణీధరా! ప్రలంబారీ! నీకు నమస్కారము. కృష్ణాగ్రజా! నన్ను కాపాడుము. ఇట్లు అజేయుడు, త్రిదశార్చితుడగు అనంతుని ప్రసన్నుని చేసి, కైలాస శిఖరాకారుడు చంద్రకాంత, వరాననుడు, నీల వస్త్రధరుడు, ఫణావికటమస్తకుడు, మహాబలుడు, హలధరుడు, ఏక కుండల విభూషితుడు, రోహిణేయుడు అగు బలభద్రుని భక్తిచే నమస్కరించి అభిమత ఫలమును పొందును. సర్వపాప వినిర్ముక్తుడై విష్ణు లోకమును పొందును. అచట ప్రళయకాలము వరకు భోగములను అనుభవించి పుణ్యక్షయమున ఇచట యోగికుల ఉత్తమ జ్ఞానమును పొంది దుర్లభమగు ముక్తిని పొందును. ఇట్లు బలరాముని పూజించి తరువాత సావధానముతో శ్రీకృష్ణుని ద్వాదశాక్షర మంత్రముచే పూజించవలయును.
భక్తిచే ద్వాదశాక్షర మంత్రముతో ఎల్లకాలము పురుషోత్తముని పూజించువారు మోక్షమును పొందెదరు. ద్వాదశాక్షర తత్పరులు పొందు గతిని దేవతలు, యోగులు, సోమపానమును చేసిన వారుకూడా పొందజాలరు. కావున జగద్గురువగు శ్రీకృష్ణుని ద్వాదశాక్షర మంత్రముచే గంధ పుష్పాదులచే చక్కగా పూజించి, నమస్కరించి ప్రసన్నుని చేసుకొనవలెయును. కృష్ణా! జగన్నాథా! సర్వపాప నాశన! చాణూరకేశిఘ్నా! కంస నిషూదనా! నీకు జయము. పద్మఫలాశాక్షా! చక్రగదాధరా! నీలమేఘశ్యామా! సర్వసుఖప్రదా! జగత్పూజ్యా! సంసార నాశనా! లోకపతీ! వాంచాఫలప్రదా! నీకు జయము. ఘోరము, నిస్సారము, దుఃఖ బహుళము, క్రోధగ్రాహకులము, రౌద్రము విషయోదక సంప్లవము, నానారోగోర్మికలిలము, మోహావర్తము, సుదుస్తరము, అగు సంసార సాగరమున నేను మునిగి ఉంటిని. ఓ పురుషోత్తమా! నన్ను కాపాడుము. ఇట్లు వరప్రదుడు భక్తవత్సలుడగు దేవేశుని ప్రసన్నుని చేసుకొని, సర్వ పాపహరుడు, దేవుడు, సర్వకామఫల ప్రదుడు, పీనభుజుడు, ద్విభుజుడు, పద్మపత్రాయతేక్షణుడు, మహోరస్కుడు, మహా బాహువు, పీతవస్త్రుడు, శుభాననుడు, శంఖచక్రగదాపాణి, ముకుటాంగద భూషణుడు, సర్వలక్షణ సంయుక్తుడు, వనమాలా విభూషితుడు అగు శ్రీకృష్ణ భగవానుని దర్శించి చేతులు జోడించి దండవత్ప్రణామములు ఆచరించి సహస్రాశ్వమేథ ఫలమును పొందును. సర్వతీర్థములలో స్నానదానముల వలన కలుగుఫలము శ్రీకృష్ణుని దర్శించి నమస్కరించినచో కలుగును. సర్వ వేదములందు, సర్వ యజ్ఞములందు ఉండు ఫలము శ్రీకృష్ణ ప్రణామముచే కలుగును. యథావిధిగా గృహస్థ ధర్మమును ఆచరించినవారికి కలుగు ఫలము శ్రీకృష్ణ సందర్శన ప్రణామములచే లభించును. సర్వ దానములందు, వ్రతము లందు, నియమములందు కలుగు ఫలము శ్రీకృష్ణ ప్రణామముచే లభించును. వాన ప్రస్థునికి వనవాసముచే కలుగు ఫలము శ్రీకృష్ణ సందర్శన ప్రణామములచే కలుగును. యధావిధిగా ఆచరించు సన్యాసముచే కలుగు ఫలము శ్రీకృష్ణ సందర్శన ప్రణామములచే కలుగును. ఇంకనూ వేయేల ? భక్తిచే శ్రీకృష్ణుని దర్శించినవారు మోక్షమును పొందుదురు. కోటి కల్పములనుండి వచ్చు పాపములచే విముక్తుడై, పరిశుద్ధుడై ఉత్తమ సంపద్యుక్తుడై సర్వ సద్గుణోపేతుడై సర్వకామ సమృద్ధిని పొంది, చక్కని తేజోవంతమగు విమానముచే ఇరువదియొక్క కులములను ఉద్ధరించి శ్రీవిష్ణు లోకమును పొందును. అచట నూరు కల్పములకాలము మనకు నచ్చిన భోగములను అనుభవించి చతుర్భు జుడగు శ్రీహరివలె గంధర్వాప్సరసలతో ఆనందించి, అటుండి భూలోకమునకు వచ్చి ఉత్తమ బ్రాహ్మణ కులమున సర్వజ్ఞునిగా సర్వవేద పారంగతునిగా మత్సర రహితునిగా పుట్టును. స్వధర్మ నిరతుడు, శాంతుడు, దాత, భూతహితరతుడుగా నుండి విష్ణు జ్ఞానమును పొంది మోక్షమును పొందును.
తరువాత భక్తవత్సలయగు సుభద్రను మంత్రముచే పూజించి నమస్కరించి, చేతులను జోడించి, ప్రార్థించవలయును.
“నమస్తే సర్వగే దేవీ! నమస్తే శుభసౌఖ్యదే! |
త్రాహి మాం పద్మపత్రాక్షి ! కాత్యాయని నమోస్తు తే!”
ఇది మంత్రము. సర్వ ప్రదేశములలో నుండే దేవీ! శుభసౌఖ్య ప్రదాత్రీ! నీకు నమస్కారము. పద్మపత్రాక్షీ! నన్ను కాపాడుము. కాత్యాయనీ! నీకు నమస్కారము అని అర్థము. ఇట్లు సుభద్రాదేవిని ప్రార్థించి, బలదేవ సోదరి, వరద, శుభప్రద అగు సుభద్రను జగద్ధాత్రిని, జగద్ధితను నమస్కరించి కామగతిగల విమానముచే శ్రీహరిలోకమును చేరును. అచట ప్రళయ కాలము వరకు దేవతలవలె విహరించి, మరల భూలోకమున వేదవిత్తగు బ్రాహ్మణునిగా పుట్టి, శ్రీహరి యోగమును పొంది మోక్షమును పొందును. దేవాలయమునుండి బయలువెడలి కృతకృత్యుడగును. తరువాత దేవాయతన మున సమస్కరించి సావధానముగా ఇంద్రనీలమయుడగు శ్రీహరి వాలుకావృతుడుగా ఉన్న ప్రదేశము నకు వెళ్ళవలెను. అచట అంతర్థానముగాఉన్ననూ శ్రీహరిని నమస్కరించి శ్రీవిష్ణులోకమును చెందును. సర్వదేవమయుడు, హిరణ్య కశ్యప సంహారకుడు, అర్థ సింహదేహుడగు నరసింహ దేవుడున్న ప్రదేశమునకు వెళ్ళి నృహరిని భక్తితో నమస్కరించిన సకల పాప వినిర్ముక్తుడగును. ఈ భూలోకమున నరసింహస్వామి భక్తులకు దుష్కృతముండదు. అభీష్టఫలము లభించును. కావున సర్వ ప్రయత్నముచే శ్రీనృసింహదేవుని ఆశ్రయించ వలయును. ధర్మార్థ కామమోక్షముల నొసంగును. కావున మహావీర్యుడు సర్వకామ ఫలప్రదుడు అగు శ్రీనృహరిని ఎల్లపుడూ భక్తిచే పూజించవలయును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అంత్యజాతిజులు సురశ్రేష్ఠుడగు శ్రీనృహరిని పూజించి అభీష్టములను పొందును. దేవత్వమును అమరేశత్వమును, ధనేశత్వమును, యక్ష విద్యాధరత్వమును, ఇంకా ఇతర ఫలములనుకూడా పొందును. ఓ బ్రహ్మపుత్రీ! నరసింహ భగవానుని ప్రభావము వినుము. శ్రీనృహరి అజితుడు, అప్రమేయుడు, భుక్తి ముక్తిప్రదుడు అగు నరహరి సమస్త గుణములను ఎవరు చెప్పగలరు ? నరసింహదేవుని ప్రభావమును సంగ్రహముగా చెప్పెదను. ఈ లోకమున కల దైవమానుష సిద్ధులు సమగ్రముగా నృహరి అనుగ్రహముతో లభించును. స్వర్గమున, భూలోకమున, పాతాళమున, ఆకాశమున, జలమున, దేవతలలో పర్వతము లందు, నరహరి అనుగ్రహమువలన అడ్డులేని గమనము కలవాడగును. ఈ చరాచర జగత్తులో నృహరికి అసాధ్యమగునది లేదు. శ్రీ నృహరి సర్వదా భక్తానుగ్రహశీలుడు, నృహరిని పూజించు విధానమును భక్తోపకారమును చెప్పెదను. ఈ విధానముచే శ్రీనృహరి ప్రసన్నుడగును. నృహరి తత్త్వము దేవదానవులకు కూడా తెలియదు. శ్రీనృహరి పూజకుడు శాకయావకమూలములను, ఫలములను, పిండిని భుజించుచు కాసకౌపీనధారియై ధ్యానయుక్తుడు, జితేంద్రియుడు కావలెను. అరణ్యమునందుకాని, ఏకాంత ప్రదేశమున కాని నరసింహస్వామిని ప్రతిష్ఠించి వాని, స్వయంవ్యక్తుని కాని యధావిధిగా పూజించినచో ఉపపాతకములు కలవాడు, మహాపాతకములు కలవాడు కూడా అన్ని పాతకముల నుండి విముక్తుడగును. మొదట ప్రదక్షిణమును ఆచరించి నృహరిని పూజించ వలెను. గంధ పుష్పాదులను, ధూపదీపములను సమర్పించి, శిరసువంచి నమస్కరించి కర్పూర చందనములను, జాతీ పుష్ఫములను, నరసింహస్వామి మస్తకమున ఉంచవలెను. అపుడు సిద్ధి కలుగును. సర్వకామములందు విఘ్నములు కలుగవు. ఎచటా విచారించడు. ఇట్టి నరసింహ భక్తుని బ్రహ్మ రుద్రాది దేవతలుకూడా అడ్డగించజాలరు. ఇక దానవులు, సిద్ధులు, గంధర్వులు, మానవులు, విద్యాధరులు, యక్షులు, కిన్నరులు, మహోరగులు ఏల అడ్డగించగలరు. దివ్యశక్తులు అన్నియూ శ్రీనృహరి దివ్యాగ్నితేజస్సుచే ధ్వంసమగును. ఒకసారి అగ్ని శిఖా మంత్రమును జపించి సర్వోపద్రవములను నశింప చేయగలుగును. నృసింహ కవచమును మూడుమార్లు జపించి దైత్య దానవులనుండి కాపాడుకొన గలుగును. భూతములనుండి, పిశాచములనుండి, ఇతర శత్రువర్గము నుండి రక్షణను పొందును. మూడుమార్లు జపించిన కవచము సురాసురులచే కూడా భేదించ శక్యముకాదు. ద్వాదశ యోజన పర్యంతము సర్వకాలములందు నృహరి కాపాడుచుండును. శ్రీనరసింహస్వామి మహాబలపరాక్రమము కలవాడు అంతటా కాపాడును.
తరువాత బిలద్వారమునకు వెళ్ళి మూడు రాత్రులు ఉపవసించి మోదుగు సమిధలచే అగ్నిని ప్రజ్వలింపచేసి మోదుగు సమిధలను, పాలు పెరుగు చేతులలో కలిపి హోమమును గావించ వలెను. రెండు పద్మాక్షముల జంటలు శకటమును హోమము గావించిన బిలాద్వారము క్షణకాలమున తెరుచుకొనును. అంతట నిస్సందేహముగా బిలద్వారమును ప్రవేశించవలెను. శకటము వెళ్ళుచుండగా చీకటి మోహము నశించును. అచట విశాలమగు రాజ మార్గము కనపడును. నరసింహస్వామిని స్మరించుచు పాతాళమున ప్రవేశించును. పాతాళమునకు వెళ్ళి అవ్యయుడగు నరసింహస్వామిని జపించవలెను. అంత వీణాచామర పాణులగు వేలస్త్రీలు నగరమునుండి వెలు పలకువచ్చి స్వాగతమును పలికెదరు. మంత్ర సాధకుని చేయిపట్టుకొని నగరమున ప్రవేశింపచేతురు. అపుడు దివ్యమగు రసాయనమును త్రాగించెదరు. రసాయనపానముచేసిన వెంటనే దివ్యదేహుడు మహాబలుడగును. ప్రళయ కాలమువరకు దివ్యకన్యలచే క్రీడించును. భిన్నదేహుడైనచో వాసుదేవుని చేరును. ఈ దివ్య క్రీడలు రుచించనిచో మరల అటనుండి పట్టమును, శూలమును, ఖడ్గమును, రోచనమును, మణిని, రసమును, రసాయనమును, పాదుకలను, అంజనమును కృష్ణాంజలిని, గుటికను, మనశ్శిలను, మండలమును, అక్ష సూత్రమును, సంజీవనిని, సిద్ధవిద్యను, శాస్త్రములను తీసుకొని బయలుదేరును. మండు అగ్ని విస్ఫులింగ ప్రవాహ చక్రమును హృదయమున న్యాసము కావించును. ఈ న్యాసము ఒక మారు జరిగిన కోటి జన్మముల పాపములు భస్మము లగును. విషమున ఉంచిన విషమును దహించునట్టి శరీరముననున్న కుష్టు వ్యాధిని నశింపచేయును. భ్రూణహత్యాది పాపములు నశించును. మహాగ్రహములు పట్టినచో ఈ జ్వాలను ధ్యానించ వలెయును. వెంటనే ఆగ్రహములన్నియూ రోదించుచు నశించును. ఈ న్యాసమును బాలుర కంఠమున ధరించినచో ఎల్లకాలము రక్షించును. గండపిండ కృత్యములను నశింపచేయును. వ్యాధులు కలిగినచో సమిధలచే నేయిచే పాలచే హోమమును చేయవలయును. ఇట్లు ఒకనెల నశించును. ఈ చరాచర ప్రపంచమున ఇతనికి అసాధ్యమగున దేదియునుండదు. కోరిన ప్రతి సిద్ధి లభించును. నరసింహస్వామిని నూటాఎనిమిది సార్లు పూజించి ఏడు పుట్టలలోని మట్టిని శ్మశాన మృత్తికను, నాలుగు దారుల కూడలిలో మట్టిని రక్తచందనమును గోక్షీరములను కలిపి ఆరంగుళముల సింహప్రతిమను నిర్మించి గోరోచనముతో భూర్జపత్రమున వ్రాసిమంత్రించి కంఠమున బంధించి సంఖ్యాహీనముగా జపించి, జలాశయమునపూజించి ఇంద్రియనిగ్రహముతో ఏడు దినములు జపించినంతనే భూమియంతయు జలమము అమగును. లేదా పరిశుద్ధమగు వృక్షాగ్రమున నృసింహస్వామిని పూజించవలెను. నూట ఎనిమిది మారులు జపించినచో వర్షమును వారించును. ఈ మంత్రమును పింజకమున బంధించి తిప్పినచో క్షణకాలమున పెనుగాలి వచ్చును. ఏడుమార్లు జపించిన జలముచే తడిపిన నరసింహ ప్రతిమను ద్వారమున ప్రతిష్ఠించినచో గోత్రోత్సాదనము జరుగును. ప్రతిమను ఉద్ధురించిన శాంతి కలుగును. కావున ఎపుడూ మహావీర్యుడు, సర్వకామ ఫలప్రదుడు అగు మృగరాజును పూజించవలయును. నరసింహస్వామిని దర్శించి, విని సమస్కరించి, పూజించవలయును. నరసింహస్వామిని దర్శించినవారు లక్షయ ఫలములను పొందెదరు. సర్వపాప వినిర్ముక్తులై విష్ణు లోకమును చేరెదరు. సింహవపుర్ధరుడగు శ్రీనృహరిని ఒకమారు దర్శించినచో వాక్కాయ మనో సంభవములగు అన్ని పాపముల నుండి విముక్తిని పొందును. సంగ్రామమున, సంకటమున, దుర్గమున చోరవ్యాఘ్రాది పీడలందు, అరణ్యమున, ప్రాణ సంకటమున, విషవహ్ని జలములందు, రాజభయమున, గ్రహరోగాది పీడలందు, నృసింహుని స్మరించినచో సకల సంకట ములు తొలగును. సూర్యోదయమున చీకటివలె ఆపదలు నశించును. నరసింహ దర్శనమున ఉపద్రవములు నశించును. జనపాతాలమున గుటికను, పాదలేపరసాయనమును, ఇతర వాంఛితములను నృసింహ ప్రసాదమున పొందగలుగును. ఇతరములగు కామములను మనసున సంకల్పించి నరసింహ స్వామిని సేవించినచో ఆ కోరికలు అన్నింటిని నిశ్చయముగా పొంద గలుగును. (II/55)