గంగామహాత్మ్యము

నారదమహర్షి పలికెను: “ఉత్తమ భూపాలుడైన సౌదాసుడు వసిష్ఠమహర్షి శాపమును ఎట్లు పొందెను? గంగా బిందు అభిషేకముతో మరల ఎట్లు శుద్ధుడు అయ్యెను? దీనిని అంతటిని వివరముగా నాకు చెప్పుము. గంగాచరితమును వినినవారలకు చెప్పినవారలకు శుభములు కలుగును.”

సనకమహర్షి పలికెను: సౌదాసుడు సర్వధర్మములు తెలిసినవాడు. అన్ని విషయములు తెలిసినవాడు. గుణవంతుడు. పవిత్రుడు. తండ్రివలె ప్రజలను రంజింప చేయుచు పృథివిని అనుభవించుచుండెను. ఏడు సముద్రములతో కూడియున్న ఈ భూమిని పూర్వము సగరచక్రవర్తి పరిపాలించినట్లు సౌదాన మహారాజు ఏ ధర్మమునకు భంగము కలుగని విధముగా పరిపాలించుచు పుత్రులతో పౌత్రులతో కలిసి అన్ని సంపదలు కలవాడై అనుభవించెను.

సౌదాసమహారాజు ఒకమారు వేటయందు కోరిక గలవాడై ఆప్తులైన మంత్రులు ముందుగా పరీక్షించిన అరణ్యమున ప్రవేశించెను. వేటగాళ్ళతో కలిసి మృగసమూహము లను చంపుచు ధర్మముతెలిసిన సౌదాసుడు దప్పిగొని రేవానదిని చేరెను. సౌదాస మహారాజు రేవానదిలో స్నానముచేసి సంధ్యావందనాదికములను ముగించుకొని మంత్రులతో కలిసి భోజనము చేసి ఆ రాత్రి అచటనే గడిపెను. మరల ప్రొద్దుననే లేచి ప్రాతఃకాలకృత్యములను ముగించుకొని మంత్రులతో కలిసి రేవానదీ తీరప్రాంత అరణ్యములలో తిరిగెను. తరువాత ఒక్కడే ఒక అరణ్యమునుండి మరొక అరణ్యమునకు వెళ్ళుచు చెవివరకు నారిని లాగి బాణమును ఎక్కుపెట్టి జింకవెంట వెళ్ళెను. అట్లు జింక వెంట గుఱ్ఱము మీద వెళ్ళుచున్న రాజు సైన్యమునకు చాలాదూరముగా వెళ్ళెను. అచట ఒకగుహలో సంభోగము చేయుచున్న పులుల జంటను చూచెను. అతడు జింకను విడిచి పులులకు ఎదురుగా వెళ్ళెను. ఎక్కుపెట్టి ఉన్న బాణముతో ఆడపులిని పడవైచెను. ఆ ఆడపులి పడుచు ముప్పది ఆరు యోజనముల విశాలమగు శరీరము కల రాక్షసిగా మారి ఉరుమువలె భయంకరముగా అరిచెను. పడిపోయిన తన ప్రియురాలిని చూచి ఆ వ్యాఘ్రాసురుడు రాజును ద్వేషించి “ప్రతీకారమును చేసెదను” అని పలికి అచటనే అంతర్ధానమును చెందెను. సౌదాసమహారాజు భయమును పొంది అరణ్యమున తన సైన్యమును చేరి జరిగినదంతయూ వారికి తెలిపి నగరమునకు తిరిగి వెళ్ళెను. రాక్షసుని ప్రతీకారమును శంకించుచు సౌదాస మహారాజు అప్పటినుండి వేటను మానుకొనెను.

చాలా దినముల గడిచిన తరువాత ప్రసన్నమైన మనస్సుగల సౌదాస మహారాజు వసిష్ఠాది మహర్షులతో అశ్వమేధయాగము చేయనారంభించెను. ఆ యాగమున బ్రహ్మాది దేవతలకు హవిస్సులను ఇచ్చి యజ్ఞమును సమాప్తి గావించి, స్నానము చేయుటకై వసిష్ఠ మహర్షి (నదికి) వెళ్లెను. ఇంతలో సౌదాసునిచే భార్యను పోగొట్టుకొన్న వ్యాఘ్రరాక్షసుడు కోపముతో ప్రతీకారమును చేయుటకు వచ్చెను. ఆ రాక్షసుడు వసిష్ఠ మహర్షి వెళ్ళిన తరువాత వసిష్ఠ మహర్షి వేషమును ధరించి రాజు వద్దకు వచ్చి భోజనములో మాంసము కావలయునని పలికెను. తరువాత అ రాక్షసుడు వంటవాని వేషముతో మనిషి మాంసమును వండి రాజునకిచ్చెను. ఆ మాంసమును బంగారు పాత్రలో ఉంచి గురువుగారి రాకకు ఎదురుచూచుచుండెను. వసిష్ఠమహర్షి వచ్చినవెంటనే సౌదాసమహారాజు ఆదరముతో ఆ మాంసమును ఉంచెను. దానిని చూచిన వసిష్ఠ మహర్షి ఆశ్చర్యముతో ఏమిటిది అని ఆలోచించెను. పరమ సమాధితో అది నరమాంసమని తెలుసుకొనెను. “ఈ సౌదాసుని దుష్టత్వ మెంత వింత. తినరాని దానిని నాకు భోజనముగా పెట్టెను!” అని ఇట్లు ఆశ్చర్యమును చెంది మిక్కిలి కోపించెను. “ఓ రాజా! నేను చెడిపోవుటకు తినరాని దానిని ఇచ్చితివి. కావున నీకు కూడా ఇదియే భోజనమగుగాక. రాక్షసులకాహారమైన నరమాంసమును నాకు ఇచ్చితివి కావున ఆ ఆహారమునకు తగిన రాక్షసత్వమునే నీవు పొందుము.” అని ఇట్లు వసిష్ఠ మహర్షి శాపమిచ్చుచుండగా సౌదాస మహారాజు భయముతో వణుకుచు మీరే మాంసాహారము నీయమని ఆజ్ఞాపించితిరికదా అనిపలికెను. ఆ మాటలను వినిన వసిష్ఠ మహర్షి మళ్ళీ ఆలోచించి దివ్యదృష్టితో రాక్షసుడు రాజును మోసగించెనని తెలుసుకొనెను. సౌదాస మహారాజు కూడా వసిష్ఠ మహర్షిని శపించుటకు జలమును తీసుకొనెను. చాలా కోపముతో వసిష్ఠ మహర్షిని శపించుటకు సిద్ధపడిన అతని ప్రియపత్ని మదయంతి ఇట్లు పలికెను.

సౌదాసమహారాజును చూచి “ఓ మహారాజా! కోపమును ఉపసంహరింపుము. నీవు అనుభవించవలసిన దానినే పొందితివి. ఈ విషయమున సందేహముతో పనిలేదు. గురువును తిరస్కారముతో దూషించు మూర్ఖుడు అరణ్యమున నిర్జల ప్రదేశమున బ్రహ్మ రాక్షసుడుగా పుట్టును. ఇంద్రియములను, క్రోధమును జయించినవారు, గురువు సేవలో ఆసక్తులైనవారు బ్రహ్మలోకమును పొందెదరు అని శాస్త్ర నిర్ణయము.” ఇట్లు మదయంతి మాటలను వినిన సౌదాస మహారాజు కోపమును విడిచిపెట్టి మదయంతిని అభినందించెను. శాపమునకు గ్రహించిన జలమును ఎక్కడ చల్లవలయునని ఆలోచించెను. ఆ నీటితో చల్లిన ప్రదేశము భస్మమగుట నిశ్చితము. ఇట్లు నిశ్చయించి ఆ జలమును తన పాదములపై చల్లుకొనెను. ఆ జలము తాకగానే సౌదాస మహారాజు పాదములు కాలి మడి కల్మషము లాయెను. అప్పటినుండి సౌదాసునికి కల్మాషపాదుడు అను పేరు ప్రసిద్ధికి వచ్చెను. బుద్ధిమంతుడగు కల్మాషపాదుడు మదయంతిచే ఓదార్చబడి మనసులో చాలా భయపడుచు గురువు పాదములకు నమస్కరించెను. శరణువేడి చేతులు జోడించి వినయముతో నీతికోవిదుడైన కల్మాషపాదుడు “ఓ మహానుభావా! క్షమించుము. నేను అపరాధమును చేయలేదు” అని పలికెను. ఆ మాటలను వినిన వసిష్ఠ మహర్షి బరువుగా నిట్టూర్చి దుఃఖించినవాడై అవివేకపరాయణుడైన తనను తాను నిందించుకొనెను. “అన్ని ఆపదలకు మూలకారణము అవివేకమే. ఈ లోకమున వివేకము లేనివాడు పశుతుల్యుడే. సంశయముతో పనిలేదు. తెలియని రాజు ఉచితమైన పనినే చేసెను. వివేకరహితుడను అజ్ఞుడనైన నేను పాపమును ఆచరించితిని. వివేకము కలవాడు ఏదో ఒక ఆనందమును పొందగలడు. వివేకము లేనివాడు ఏదో ఒక దుఃఖమును పొందగలడు.” అని తనను తాను నిందించుకొని వసిష్ఠ మహర్షి “ఈ రాక్షసత్వము శాశ్వతము కాదు, పన్నెండు సంవత్సరములుండును. గంగా బిందువులో స్నానమాడి రాక్షసత్వమును విడిచి మొదటి రూపమును పొంది రాజ్యమును పాలించగలవు. గంగాబిందుస్పర్శచే కలిగిన జ్ఞానముచే పాపములు తొలగి శ్రీహరి సేవాపరుడవై ఉత్తమశాంతిని పొందగలవు” అని పలికెను.

అధర్వవేదమును బాగుగా తెలిసిన వసిష్ఠమహర్షి ఇట్లు పలికి తన ఆశ్రమమునకు వెడలి పోయెను. రాజు కూడా దుఃఖముతో రాక్షస శరీరమును పొంది మిక్కిలి ఆకలిదప్పులచే బాధపడుచు ఎల్లప్పుడూ కోపము కలవాడై కృష్ణపక్ష రాత్రివలె భయంకరరూపుడై జనులులేని అరణ్యమున తిరుగుచుండెను. పలువిధములైన మృగములను, మానవులను, పాములను, పక్షులను, వానరులను భక్షించుచుండెను. పచ్చని ఎఱ్ఱని శరీరములతో చాలా ఎముకలతో ఎఱ్ఱని కొనలుగల కేశములతో విచిత్రముగా, భయంకరముగా మారెను. ఆరునెలలు నూరు యోజనముల విశాలమైన భూమిని బాధించి దుఃఖింపచేసి తరువాత మరొక అరణ్యమునకు వెళ్ళెను. అచట కూడా ప్రతిరోజు నరమాంస భక్షణము చేయుచు మునులు సిద్ధులు సేవించుచున్న నర్మదాతీరమును చేరెను.

అన్ని లోకములకు భయమును కలిగించువాడై సౌదాసుడు నర్మదాతీరమున తిరుగుచు ప్రియురాలితో రమించుచున్న ఒక మునిని చూచెను. ఆకలి అనెడు అగ్నిచే పరితపించుచున్న ఆ సౌదాసుడు ముని కొఱకు పరుగెత్తి వేటగాడు మృగశిశువును పట్టుకొనినట్లు పట్టుకొనెను. ఆ ముని భార్య రాక్షసుని చేతిలో నున్న తన భర్తను చూచి భయముతో తొట్రుపడుచు చేతులు జోడించి రాక్షసునితో ఇట్లు పలికెను.

బ్రాహ్మణి పలికెను: “ఓ రాజశ్రేష్ఠా! భయముతో వణుకుచున్న నన్ను కాపాడుము. నా ప్రాణప్రియుని నాకిచ్చి నా కోరికను నెరవేర్చుము. నీవు సూర్యవంశమున పుట్టినవాడవు. మిత్రసహుడు అను పేరు గలవాడవు. జాతిచే రాక్షసుడవు కావు. నిర్జనమైన అరణ్యములో అనాధగా ఉన్న నన్ను కాపాడుము. భర్త లేని స్త్రీ బ్రతికి ఉన్ననూ మరణించినదానితో సమానమే అందులో చిన్నతనములో వైధవ్యము మరీ సహించరానిది. నాకు తల్లిదండ్రులు లేరు. బంధువులు లేరు. నాకు భర్తయే బంధువు. భర్తయే జీవనము. నీకు అన్ని ధర్మములు తెలియును. స్త్రీ జీవనము తెలియును. కావున బంధువులు లేని దానిని చిన్నపిల్లవాని తల్లిని అయిన నన్ను కాపాడుము. భర్తలేనిదే ఈ నిర్జనారణ్యమున ఎట్లు బ్రతుకగలను? నేను నీకు కూతురు వంటిదానను. పతిదానము చేసి నన్ను కాపాడుము. ప్రాణదానమును మించిన దానము ఇదివరకు లేదు. ఇకముందు ఉండబోదు” అని ఇట్లు ప్రాజ్ఞులు చెప్పెదరు. కావున నాకు ప్రాణదానమును చేయుము.” అని పలికి ఆ బ్రాహ్మణి రాక్షసుని పాదములయందు పడిపోయెను. ఆ ముని భార్య ఇట్లు ప్రార్థించుచున్ననూ రాక్షసుడు మునిని లేడి పిల్లను పెద్దపులి వలె భక్షించెను. తరువాత ముని భార్య పలువిధములుగా విలపించి ఇదివరకే శాపమును అనుభవించుచున్న రాజును కోపముచే మరల శపించెను. సంభోగములోనున్న నా భర్తను హింసించితివి కావున నీవు కూడా సంగమ సమయమున మృతి చెందెదవు. ఇట్లు శపించిననూ కోపము చల్లారక మరల ఇంకొక శాపమునిచ్చెను. నా భర్తను భక్షించితివి కావున నీవు రాక్షసత్వమునే ఎప్పటికీ వహించి యుండుము. ఈ రాక్షసుడు. కూడా శాపద్వయమును విని బాగా కోపించి కనులనుండి నిప్పులను చెఱగుచు ఇట్లు పలికెను. “ఓ దుష్టురాలా! నాకు రెండు శాపములను వ్యర్థముగా ఇచ్చితివి. ఒక అవరాధమునకు ఒక శాపము యోగ్యము. నీవు రెండవ శాపమును ఇచ్చితివి కావున పుత్రునితో పాటు నీవు పిశా చత్వమును పొందుము.” ఇట్లు రాక్షసుని శాపమును పొందిన ఆ బ్రాహ్మణి వెంటనే పిశాచత్వమును పొందెను. ఆ బ్రాహ్మణి పిశాచరూపముతో ఆకలితో పీడించబడి భయంకరముగా రోదించెను. ఆ నిర్జనా రణ్యమున రాక్షసుడు, పిశాచి అరచుచు నర్మదాతీరమున రాక్షససేవితమైన అరణ్యమునకు వెళ్ళిరి.

గురువును ఉపేక్షించి రాక్షస దేహమును పొంది దుఃఖించుచు లోక విరోధమును చేసిన ఒక బ్రహ్మరాక్షసుడు ఆ అరణ్యమున ఉండెను. తానున్న మఱ్ఱి చెట్టువద్దకు వచ్చిన రాక్షసుని, పిశాచిని చూచి కోపముతో “భయంకరులైన మీరు నా మఱ్ఱిచెట్టు వద్దకెందుకు వచ్చితిరి. ఈ రూపమును ఏ పాపముతో పొందితిరో నాకు నిజమును చెప్పుడు.” అని ఆ బ్రహ్మ రాక్షసుని మాటలు వినిన సౌదాసుడు తాను, పిశాచి చేసిన దానినంతయు తెలిపి తరువాత ఇట్లు పలికెను.

సౌదాస మహారాజు పలికెను: “ఓ మహానుభావా! నీవెవరవు? పూర్వము నీవేమి చేసితివి. మిత్రుడవైన నాకు మిక్కిలి స్నేహముతో దీనినంతటిని వివరించుము. మిత్రుని విషయమున మోసమును చేసినవాడు పాపఫలమును అనుభవించును. పదివేల యుగములు యాతనలను అనుభవించును. మిత్రుని చూచుట వలన ప్రాణులకు అన్ని దుఃఖములు తొలగిపోవును. కావున బుద్ధిమంతులు ఎవ్వరూ మిత్రుని విషయమున మోసమును తలపెట్టరు.” ఇట్లు కల్మషపాదుడు చెప్పిన మాటలను విని మట్టిచెట్టు మీదున్న బ్రహ్మరాక్షసుడు ప్రీతిచెంది ధర్మవాక్యమును పలికెను.

బ్రహ్మరాక్షసుడు పలికెను: “నేను పూర్వము వేదములను బాగుగా అధ్యయనము చేసిన బ్రాహ్మణుడను. మగధదేశ నివాసిని. నా పేరు సోమదత్తుడు. నేను ధర్మ పరాయణుడనుగా ఉంటిని. విద్య చేత, ధనముచేత, యౌవనముచేత బాగుగా మదించిన నేను గురువు గారిని ఉపేక్షించి ఈ గతిని పొందితిని. అహారమును జయించికూడా సుఖమును పొందలేక దుఃఖమునే పొందుచున్నాను. నేను మొదట నూర్లకొలది వేలకొలది బ్రాహ్మణులను భక్షించితిని. ఎల్లప్పుడూ ఆకలిదప్పుల బాధచే మనస్తాపముచే జగత్తునకు భయమును కలిగించుచు మాంసాహారమునందు ఆసక్తుడనైతిని. మానవులు గురువును అవమానించినచో రాక్షసత్వము ప్రాప్తించును. నేను దీనిని అనుభవించితిని. కావున తన శ్రేయోభిలాషి అయినవాడు గురువును అవమానించరాదు.”

కల్మాషపాదుడు పలికెను: “గురువు ఎటువంటివాడు? నీవు కొనియాడినదెవరిని? దానినంతటిని నాకు తెలుపుము. వినవలయునని చాలా కుతూహలముగా ఉన్నది.”

బ్రహ్మరాక్షసుడు పలికెను: ఓ మిత్రమా! పూజించదగినవారు, ఆదరముతో నమస్కరించదగినవారు, చాలామంది గురువులున్నారు. వారిని గూర్చి నేను వివరముగా చెప్పెదను. ఏకాగ్రమనస్సుతో వినుము. వేదములను అధ్యాపనము చేయువారు, వేదార్థమునకు సంగతిని బోధించువారు, శాస్త్రమును చెప్పువాడు, ధర్మమును చెప్పువాడు, నీతిశాస్త్రము ఉపదేశించువాడు, మంత్రమును ఉపదేశించువాడు, మంత్రములను వ్యాఖ్యానము చేయువాడు, వేదములలో కలుగు సందేహములను పరిహరించువాడు, వ్రతములను ఉపదేశించువాడు, భయమునుండి కాపాడువాడు, అన్నము పెట్టువాడు, కన్యాదానమును చేసినమామ, మేనమామ, పెద్దఅన్న, కన్నతండ్రి, ఉపనయనము చేసినవాడు, నిషేకము(గర్భాధానము)ను చేసినవాడు, సంస్కరించినవాడు - వీరందరూ గురువులే. వీరిని ఆదరముతో పూజించ వలయును. నమస్కరించవలయును.

కల్మాషపాదుడు పలికెను: - “ఓ! మిత్రమా! చాలామంది గురువులను గూర్చి చెప్పితివి. వీరందరిలో ఎవరు శ్రేష్ఠులు లేదా అందరూ సమానులేనా? ఈ విషయమును నాకు యథావిధిగా తెలుపుము.”

బ్రహ్మ రాక్షసుడు పలికెను: “ఓ! ప్రాజ్ఞుడా! బాగుగా అడిగితివి. నీవడిగిన దానిని చెప్పెదను. గురువు మాహాత్మ్యమును చెప్పుట, వినుట, ఆమోదించుట అందరికి మేలును చేకూర్చును. కావున నేను చెప్పెదను. నేను మొదట చెప్పిన గురువులు అందరు సమానముగా పూజించదగినవారే. ఈ విషయమున సందేహము లేదు. అయిననూ సకలశాస్త్ర నిశ్చయసారమును చెప్పెదను వినుము. వేదాధ్యాపకులు, మంత్రములకు వ్యాఖ్యానము చేయువారు, తండ్రి, ధర్మమును చెప్పువారు విశేషించి గురువులు. వీరిలో కూడా శ్రేష్ఠులను చెప్పెదను వినుము. ఈ విషయమును అన్ని శాస్త్రార్థములతత్త్వము తెలిసిన వారు చెప్పిన దానినే తెలిపెదను. సంసార పాశములను ఛేదించగల ధర్మములతో కూడిన పురాణములను చెప్పువారు ఉత్తమ గురువులు. దేవతలను పూజించుటకు తగిన కర్మలు, దేవతలను పూజించుటవలన కలగుఫలము పురాణములవలన కలుగును. కావున పురాణములే దేవతలు. ఓ రాజా! పురాణములు అన్ని వేదార్థ సారములని మునులు కూడా చెప్పుచున్నారు. కావున పురాణములను చెప్పువారు పరమ గురువులు, సంసార సాగరమును దాటుటకు ప్రయత్నము చేయువారు పురాణములను వినవలయునని శాస్త్ర విభాగములను చేసినవారు చెప్పుచున్నారు. ఓ రాజా! పురాణములలో అన్ని ధర్మములను చెప్పియున్నారు. తర్కశాస్త్రము వాదమునకు కారణము. నీతి శాస్త్రము ఇహఫల సాధనము. పురాణములు ఇహపరములలో సుఖదాయకములు. ఎపుడూ భక్తితో పురాణములను వినువారలకు ధర్మపరాయణమైన, నిర్మలమైన బుద్ధి కలుగును. పురాణములను వినుట వలన శ్రీహరియందు, శుభకరమైన భక్తి కలుగును. విష్ణుభక్తిగల వారలకు ధర్మమునందు బుద్ధి ప్రవర్తించును. ధర్మమువలన పాపములు నశించును. జ్ఞానము శుద్ధమగును. ధర్మార్థ కామమోక్షముల ఫలములను పొందగోరువారు పురాణములను వినవలయునని ప్రాజ్ఞులు చెప్పెదరు. నేను బ్రహ్మవాది, సర్వజ్ఞుడు అయిన గౌతమమహాముని వలన సర్వ ధర్మార్థములను, సుందరమైన గంగాతీరమున వినియుంటిని. ఒకప్పుడు పరమేశ్వరుని పూజించుటకు నేను వెళ్ళితిని. అచటికి వచ్చిన గురువుగారికి నమస్కారమును చేయలేదు. తేజోనిధి, శాంతుడు, మహాబుద్ధియైన గౌతమ మహర్షి మంత్రప్రోక్త విధుల నాచరించుచున్నాడని సంతోషించెను. కాని సర్వజగద్గురువైన శంకరుడు నా పూజలందుచు గురువును అవమానించినందున నాకు రాక్షసత్వమును ప్రసాదించెను. తెలిసికాని, తెలియకకాని గురువును అవమానించినవారికి బుద్ది, విద్య, తాను చేసిన సుకృతములు అన్నియూ నశించును. గురువును సేవించువారికి అన్ని సంపదలు కలుగునని పండితులు చెప్పుదురు. ఆ శాపముతో పాటు ఆకలిచే దహింపబడుచుంటిని. ఈ రాక్షసత్వము నుండి ఎపుడు విముక్తుడను అగుదునో తెలియదు” ఇట్లు మఱ్ఱిచెట్టుపైనున్న బ్రహ్మరాక్షసుడు చెప్పుచుండగా ధర్మ శాస్త్రముల చర్చ జరిపిరి కావున వారి పాపము నశించినది.

ఇంతలో కళింగ దేశమున పుట్టిన గర్గుడను పేరుగల అతి ధార్మికుడైన బ్రాహ్మణుడు ఒకడు భుజముపై గంగాజల కలశమును మోయుచు జగన్నాథుడైన విశ్వేశ్వరుని సోత్రము చేయుచు, విశ్వేశ్వర నామ సంకీర్తనము చేయుచు ఆనందముచే వంటిపై పులకింతలు రాగా అచటికి వచ్చెను. అట్లు వచ్చిన బ్రాహ్మణుని చూచి ఆ ఇద్దరు రాక్షసులు, పిశాచి మాకు ఆహారము దొరికినదని పలికి చేతులు పైకెత్తి పరుగెత్తిరి. ఆ బ్రాహ్మణుడు కీర్తించు పేర్లను విని దూరములో నిలిచిరి. ఆ బ్రాహ్మణుని హింసించుటకు శక్తిలేనివారై ఆ రాక్షసులిట్లు పలికిరి. “ఓ మహానుభావా! బ్రాహ్మణోత్తమా! మహాత్ముడవైన నీకు నమస్కారము. నామకీర్తన మహాత్మ్యముచే రాక్షసులమైన మేము దూరములో ఉంటిమి. మేము ఇదివరకు వేలమంది బ్రాహ్మణులను భక్షించితిమి. నీవు కీర్తించు నామకవచము నిన్ను గొప్ప అపదనుండి కాపాడుచున్నది. నీవు కీర్తించు నామములను వినినంతనే రాక్షసులమైన మేము కూడా శ్రీహరి మహిమచే గొప్పశాంతిని పొందితిమి. కావున నీవు అన్నివేళలా రాగద్వేషాదులు లేనివాడవే. ఓ మహానుభావా! గంగాజలమును మాపై చల్లి మమ్ములను పాపరాశినుండి కాపాడుము. హరిసేవాపరుడే తనను తరింప చేసుకొనిన వాడు మొత్తము జగమును తరింపచేయునని జ్ఞానులు చెప్పుదురు. భయంకరమైన సంసారమునకు ఔషధమైన హరి నామమును వదిలిపెట్టి అంతటా దుర్లభమైన ముక్తిని ఎట్లు పొందగలరు? ఇనుముతో ఏర్పరిచిన పడవనెక్కి నదిని దాటగోరువారు నీట మునుగు నట్లు పుణ్యములను చేయని వారు ఇతరులను ఎట్లు తరింప చేయగలరు? మహానుభావుల చరిత్ర అన్ని లోకములకు ఆనందమునిచ్చును. చంద్రుడు లోకముల ఆనందము కొరకే కదా ఉదయించును. ఈ భూమండలమున పావనములైన పుణ్యతీర్థములన్నియు గంగా జలబిందువుతో సమానములు కావు. తులసీ దళముతో కలిసిన గంగాజల బిందువు అవగింజంత దైనను ఇరువదియొక్క తరములను తరింపచేయును. కావున ఓ మహానుభావుడవైన బ్రాహ్మణోత్తమా! అన్ని శాస్త్రార్థములు తెలిసినవాడా! గంగా జలమునిచ్చి పాపములు చేసిన మమ్ములను కాపాడుము.” అని ఇట్లు రాక్షసులు చెప్పిన గంగా మాహాత్మ్యమును వినిన బ్రాహ్మణోత్తముడు ఆశ్చర్యమును పొందెను.

లోకమాతయైన గంగపై ఇటువంటి రాక్షసులకు కూడా ఇంతటి భక్తి ఉన్నదనిన పుణ్యాత్ములు మహానుభావులు గొప్పజ్ఞానము కలవారికెంత ఉండునో ఏమి చెప్పగలము? అన్ని ప్రాణులకు హితమును కోరుభక్తుడు శ్రీవిష్ణువు యొక్క పరమపదమును చేరగలడను ధర్మమును మనసులో నిశ్చయించుకొనిన అ గర్గుడు వారిపై దయకలవాడై సాటిలేని మహిమ గల తులసీదళముతో కలిసి యున్న గంగాజలమును ఆ రాక్షసులపై చల్లెను. అవగింజంత గంగాజల బిందువుచే తడుపబడిన రాక్షసులు రాక్షస భావమును విడిచి దేవతలరూపమును పొందిరి. పుత్రునితో కూడియున్న బ్రాహ్మణి, సోమదత్తుడు కోటి సూర్య ప్రకాశముగలవారై దేవోత్తములయిరి. శంఖచక్రగదా చిహ్నములతో హరి సారూప్యమును పొంది ఆ బ్రాహ్మణుని బాగుగా స్తుతించుచు హరి మందిరమును చేరిరి. కల్మషపాదుడగు మహారాజు కూడా నిజరూపమును పొంది, సోమదత్తుడు బ్రాహ్మణి ఆమె పుత్రుడు మోక్షమును పొందుట చూచి తాను పొందలేనందుకు విచారించుచుండెను. అట్లు రాజు చింతించుచుండగా రహస్య రూపమున సరస్వతీదేవి ధర్మమూలమైన మహా వాక్యమును స్పష్టమైన, గాఢరూపములోనున్న వాక్కుచే ఇట్లు పలికెను. “మహానుభావుడవైన ఓ రాజా! దుఃఖించదగవు. నీవుకూడా కర్మభోగములను అనుభవించిన తరువాత గొప్ప మేలును (ముక్తిని) పొందగలవు. సత్కర్మలచే పాపములు తొలగిన హరిభక్తి పరాయణులు పరమపదమును పొందెదరు. ఈ విషయమున సంశయించవలసిన పనిలేదు. అన్ని ప్రాణులయందు దయగలవారు ధర్మమార్గమున ప్రవర్తించువారు, గురుపూజా పరాయణలు పరమ పదమును పొందగలరు.” ఇట్లు సరస్వతీదేవి చెప్పిన మాటలను వినిన రాజు మనసులో తృప్తిని పొంది గురువుగారి మాటలను తలచెను.

గురువగు వసిష్ఠ మహర్షిని బ్రాహ్మణశ్రేష్ఠుడగు అ గర్గుని, శ్రీహరిని స్తుతించుచు మిక్కిలి సంతోషముతో మొదట జరిగిన వృత్తాంతమును అంతటిని ఆ బ్రాహ్మణునకు తెలియజేసెను. తరువాత మిత్రసహ మహారాజు కాళింగునికి నమస్కరించి శ్రీహరినామ సంకీర్తనమును చేయుచు వెంటనే వారాణసీ పట్టణమునకు వెళ్ళెను. ఆ పట్టణమున ఆరుమాసములు నివాసముచేసి గంగలో స్నానము చేసి సదాశివుని దర్శించి బ్రాహ్మణీ శాపమైన శాశ్వత రాక్షసత్వమునుండి విముక్తుడాయెను. ఆ తరువాత తన నగరమును చేరి మహానుభావుడైన వసిష్ఠ మహర్షిచే రాజ్యమున ప్రతిష్ఠింపబడి తన రాజ్యమును పరిపాలించెను. సమస్త భూమండలమును పరిపాలించి స్త్రీభోగమును తప్ప అన్ని భోగములను అనుభవించి, వసిష్ఠ మహర్షివలన సంతానమును పొంది మోక్షమును పొందెను. ఇది వింతయేమియును కాదు. వారాణసి గుణములను శ్రీమహావిష్ణువు గుణములను కీర్తించుచు, వినుచు, స్మరించుచు గంగా జలమును పానముచేయుచు మానవుడు మోక్షమును పొందును. కావున ఓ బ్రాహ్మణోత్తమా! గంగా మాహాత్మ్యమును వివరించుటకు ఇంద్రుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుకూడ శక్తులుకారు. గంగా నామస్మరణ మాత్రముననే మానవుడు పాతక రాశులనుండి విముక్తుడై బ్రహ్మలోకమును పొందును. ఈ విషయమున ఎట్టి సంశయము లేదు. ఒకసారైనా “గంగా గంగా” అని గంగా నామమును ఉచ్చరించినచో వెంటనే అన్ని పాపముల నుండి విముక్తుడై బ్రహ్మలోకమున ప్రకాశించును. (1/9)