భగవద్దర్శనము

వసిష్ఠ మహర్షి పలికెను: రుక్మాంగద మహారాజు పుత్రుని మాటలను విని, వికసించిన కమలమువలె ఉన్న సంధ్యావళీ ముఖమును చూచి, ఏకాదశిన భుజింపుము. పుత్రుని చంపకుము అని మోహిని పలికిన మాటలను వినుచుండెను. ఈ సమయముననే పుండరీకాక్షుడగు శ్రీహరి అంతర్ధానగతుడై రుక్మాంగదుని ధైర్యమును చూడగోరి ఆకాశమున నిలిచి యుండెను. మేఘశ్యాముడు నిరంజనుడగు భగవానుడు రుక్మాంగద ధర్మాంగద సంధ్యావళుల మధ్యన గరుడ వాహనారూఢుడై నిలిచియుండెను. భుజించుము భుజించుము అని మోహిని పలుకుచుండగా సుతుడగు ధర్మాంగదుని చంపుటకు నిర్మలమగు ఖడ్గమును స్వీకరించెను. సంతోషము నిండిన మనసుతో గరుడధ్వజునికి నమస్కరించెను. ధర్మాంగదుడు కూడా ఖడ్గమును ధరించిన తండ్రిని చూచి, తల్లిదండ్రులకు నమస్కరించి, చక్రధరునికి నమస్కరించి ధైర్యముతో ఉన్న తల్లి ముఖమును చూచి తన కంఠమును భూమి మీద వంచి ఉంచెను. అతని కంఠము శంఖము వంటిది, సమము, చక్కని వర్ణము కలది, కోమలము, బహు ౦ఖలు కలది, స్థూలము అయిన కంఠమును ఖడ్గ మార్గమున ఉంచెను. ధర్మాంగదునకు గల పితృభక్తి, మాతృభక్తి కంఠసమర్పణను ప్రేరేపించెను. ధర్మాంగదుడు కంఠము నిచ్చుటకు సంతోషముచే చంద్రవదనుడు కాగా, రుక్మాంగద మహారాజు ఖడ్గమును స్వీకరించగా భూమి పర్వతములతో అరణ్యములతో కంపించసాగెను. మూడు లోకములను ముంచుటకు సముద్రము ఉప్పొంగెను. ఆకాశ మధ్యమునుండి మెరుపులతో ఉరుములతో భూమిమీద ఉల్కలుపడెను. నేను దేవ కార్యమును చేయలేకపోతినని మోహిని వివర్ణ రూపము కలదాయెను. ఇపుడు నా పుట్టుక నిరర్థకమాయెను. జగద్విధాయియగు దైవమిట్లుచేసెను. అందరిని మోహింపచేయు ఈ రూపము విడంబకము మాత్రమే. రాజు భుజించలేదు. ఇపుడు స్వర్గమున నాస్థితి గడ్డి పరకతో సమానమాయెను. సత్త్వాది కుడగు రుక్మాంగద మహారాజు మోక్షమునకు వెళ్ళును. నేను పరమదారుణమగు నరకమునకు వెళ్ళెదను. రుక్మాంగద మహారాజు ఖడ్గమునెత్తగా మోహయుక్తయగు మోహిని భూమిపై మూర్ఛిల్లెను. రుక్మాంగద మహారాజు కూడా ధర్మాంగదుని మండలయుతము, చంద్రప్రకాశము, శోకించు వక్త్రము అగు శిరమును ఖండించుటకు ధైర్యాన్వితుడై ఖడ్గమును వేయునంతలో శ్రీ లక్ష్మీనాథుడు రుక్మాంగదుని హస్తమును తన కరముచే గ్రహించెను. సంతోషించితిని. సంతోషించితిని. ఇక సంశయమే లేదు. ఈ భూమిపై కీర్తిని స్థాపించి ప్రియురాలగు సంధ్యావలితో ధర్మాంగదునితో నా లోకమునకు వెళ్ళుము. నీ కీర్తిని మూడు లోకములలో పూజ్యముగా చేసి, స్వచ్ఛమును, శుక్లమును చేయుము. యమధర్మరాజు శిరమున పాదమునుంచి వెళ్ళుము. నా దేహమును చేరుము అని పలికెను. శ్రీహరి స్పృశించగనే రుక్మాంగదుడు ప్రియురాలితో పుత్రునితో పరిశుద్ధుడాయెను. వేగముగా మహానుభావుడగు రుక్మాంగదుడు భూమండలములోని సంపదను, దాసీ జనమును, ధనమును, భోగములను, గజాశ్వరథములను, దారవర్గమును, సృజనాదికములను విడిచి మధుసూదనుని దేహమును చేరెను. అకాశమునుండి పుష్పవర్షము కురిసెను. సంతోషించిన సురసిద్ధులచే మ్రోగించబడిన దేవదుందుభులు మ్రోగినవి. గంధర్వులు గానము చేసిరి. సంతోషించిన దేవాంగనలు నృత్యము చేసిరి. సూర్యపుత్రుడగు యమధర్మరాజు దారాపుత్రులతో రుక్మాంగద మహారాజు, తన లిపిని చెరిపి శ్రీహరిని ప్రవేశించుటను చూచి లోకములనన్నింటిని రాజు చూపిన దారిలో హరి మార్గము వైపు పయనింపచేయుటను చూచి భయపడుచు మరల బ్రహ్మను సమీపించి రోధించుచు బ్రహ్మతో ఇట్లు పలికెను. నేను నీ ఆజ్ఞను పాలించలేక పోయితిని కావున ఈ నియోగముతో నాకు పనిలేదు. ఇంకొక పనిని తెలుపుము. చేసెదను. దండించుట మాత్రము నాకొద్దు. (II/34)