నారద మహా పురాణము
గయామాహాత్మ్యము
వసువు పలికెను: అయిదవ రోజు గదాలోల తీర్థమున పూర్వమువలె స్నానాదికమును ఆచరించి సపిండకముగా శ్రాద్ధమును ఆచరించవలెను. తరువాత అక్షయ వటమున శ్రాద్ధాదికమును ఆచరించి పితరులను బ్రహ్మపురమును చేర్చెదరు. తరువాత బ్రహ్మ కల్పితులగు బ్రాహ్మణులను పూజించి భుజింపచేయవలయును. ఈ ప్రయత్నముచేతనే అక్షయ వటమున శ్రాద్ధము గావించి సావధానముతో వటేశుని దర్శించి, నమస్కరించి పూజించి పితరులను అక్షయము సనాతనమగు బ్రహ్మ పురమును చేర్చెదరు. గదాప్రక్షాళనము కావించిన శ్రేష్ఠమగు గదాలోల మహాతీర్థమున స్వర్గ ప్రాప్తికి అక్షయమునకై శుద్ధి కొరకు స్నానమును చేయుచున్నాను. వటాగ్రమున ఏకాన్తమున బాల రూపమున యోగనిద్రచే శయనించు యోగశాయికి నమస్కారము. సంసార వృక్షశాస్త్రము అశేష పాపక్షయకరము, అక్షయ బ్రహ్మదాతయగు అక్షయ వటమునకు నమస్కారము. కలియుగమున మహేశ్వర లోకములు కావున గదాధరుడు లింగరూపిగా యున్న ప్రపితా మహునికి నమస్కారము. పితామహునికి నమస్కరించి రుద్రపదమునకు పితరులను చేర్చును. హేతి యను రాక్షసుని వధించి అతని శిరమును రెండుగా చేసిన గద ఈతీర్థమున కడుగబడెను. కావున ఈ తీర్థము గదాలోలమని ప్రసిద్ధి నొందెను. బ్రహ్మపుత్రుడగు హేతి యను రాక్షసుడు అద్భుతమగు గొప్ప తపమును ఆచరించెను. తపసుచే ప్రీతులగు బ్రహ్మాదులను దైత్యాదులచే వివిధ శస్త్రాదులచే మనుజులచే కృష్ణేశానాది చక్రాదులచే అవధ్యుడుగా వరమును పొందెను. బ్రహ్మాదులు అట్లేయని అంతర్ధానము నందిరి. అంతట హేతి దేవతలను జయించెను. ఇంద్రత్వమును పొందెను. అపుడు బ్రహ్మేశ్వరాదులు దేవతలు హరిని ఆశ్రయించి హేతిని చంపుమని కోరిరి. అంతట హరి హేతి సురాసురులచే అవధ్యుడు నాకు బ్రహ్మాస్త్రమును ఇచ్చిన హేతిని చంపెదననెను. అపుడు దేవతలు విష్ణువునకు ఈ గదనిచ్చిరి. హేతిని చంపుమనిరి. అట్లు దేవతలు పలుకగా శ్రీహరి ఆ గదను ధరించి యుద్ధమున గదచే హేతిని చంపి దేవతలతో కలసి త్రిదివమునకు వెళ్ళెను.
తరువాత మహానదిగా ఉన్న గాయత్రీ తీర్థమున ఉపవసించి, గాయత్రీ అగ్రభాగమున స్నానమాచరించి సంధ్యోపాసన చేయవలెను. సపిండకముగా శ్రాద్ధముచేసి కులమునకు బ్రాహ్మణత్వమును కూర్చవలెను. సముద్యత తీర్థమున సావిత్రిముందు స్నానమాచరించి మధ్యాహ్నమున సంధ్యోపాసన గావించి పితరులను బ్రహ్మ లోకమునకు చేర్చును. సరస్వతీ అగ్రభాగమున ప్రాచీ సరస్వతిలో స్నానము గావించి సాయం కాలమున సంధ్యోపాసన గావించి కులమును సర్వజ్ఞులను చేయును. బహు జన్మలలో చేసిన సంధ్యాలోప పాపమునుండి విముక్తుడగును. విశాలాతీర్థమున భరతాశ్రమమున పదాంకితమగు ముండపృష్ఠమున గదాధరుని సమీపమున, ఆకాశగంగా తీర్థమున, గిరికర్ణాదులందు శ్రాద్ధమును ఆచరించువాడు, పిండప్రదానము చేయువాడు పితృశతమును బ్రహ్మ లోకమునకు చేర్చును. గోదా వైతరణిలో స్నానమాచరించి ఇరువది యొక్క తరములను ఉద్ధరించును. గంగానదిలో గో ప్రచారమున, మానస పదమున, పుష్కరిణియందు, గదాలోల తీర్థమున, అమరక క్షేత్రమున, కోటితీర్థమున, రుక్మ కుండమున, పిండ ప్రదానము గావించినచో పితరులను స్వర్గమునకు చేర్చును. మార్కండేయేశ కోటీశులకు నమస్కరించి పితృ తారకుడగును. పుణ్యోదయమగు పాండు శిలాదర్శన మాత్రముననే పవిత్రులై నరకములో నున్నవారు స్వర్గమును చేరెదరు అని పలికి పాండవుడు శాశ్వత పదమును చేరెను. ఘృతకుల్య, మధుకుల్యా, దేవికామహానది ఈ శిలయందు సంగతయై మధుస్రవగా ప్రసిద్ధిగాంచినది. ఈ మధుస్రవలో స్నానమాచరించిన వాడు పదివేల అశ్వమేధయాగముల ఫలమును పొందును. పితృ తర్పణము గావించి, సపిండ శ్రాద్ధమును ఆచరించి సహస్ర కులమును ఉద్ధరించి విష్ణు పదమును చేర్చును. ఉద్భిజ్జములు, స్వేదజములు, అండజములు జరాయుజములగు ప్రాణులలో ఏ ప్రాణి అయిననూ మధుస్రవా తీర్థమున మరణించినచో విష్ణు లోకమును పొందును. ఈ దశాశ్వమేధము నిచ్చు హంస తీర్థమున శ్రాద్ధము నాచరించిన స్వర్గమును పొందును. దశాశ్వమేధ హంస తీర్థములకు నమస్కరించి శివలోకమును పొందును. మతంగ పదమున శ్రాద్ధమును ఆచరించువాడు బ్రహ్మ లోకమును పొందును. బ్రహ్మవిష్ణ్వాదులతో కలిసి శమీగర్భమున అగ్నిమధనముచేసిన ప్రదేశము మంధో కుండమను తీర్థము. ఈ తీర్థము పితరులకు ముక్తిని ప్రసాదించును. ఇచట తర్పణము పిండదానము స్నానమును చేసినవాడు ముక్తిని పొందును. రామేశ కరకేశ్వరులకు నమస్కరించి పితరులను స్వర్గమున చేర్చును. గయాకూపమున పిండదానమువలన అశ్వమేధ ఫలమును పొందును. భస్మకూటమున భస్మ స్నానముచే పితరులను తరింపచేయును.
నిఃక్షీరాసంగమమున స్నానము చేయుట వలన పాపములు నశించును. రామపుష్కరిణిలో శ్రాద్ధమును ఆచరించిన పితరులను బ్రహ్మ లోకమునకు చేర్చును. సుషుమ్నా మహానదిలో స్నానము గావించినచో ఇరువది ఒక్కతరములను ఉద్ధరించును. వసిష్ఠ తీర్థమున స్నానము గావించి, వసిష్ఠేశునికి నమస్కరించిన అశ్వమేధ ఫలమును పొందును. ధేనుకారణ్యమున కామధేను పదమున స్నానము చేసి అచటి దేవునికి నమస్కరించి అశ్వమేధ ఫలమును పొందును. ధేనుకారణ్యమున కామధేను పదమున స్నానముచేసి అచటి దేవునికి నమస్కరించి పిండప్రదానము గావించిన పితరులను బ్రహ్మ లోకమున చేర్చును. కర్ధమాల తీర్థమున, గయానాభియందు ముండపృష్ఠ సమీపమున స్నానము గావించి చండికకు సమస్కరించి శ్రాద్ధము గావించిన పితరులను స్వర్గమున చేర్చును. ఫల్గుచండీశుడను పేరుగల సంగమా ధీశుని అర్చించిన ఈ ఫలమే లభించును. గయా గజము, గయాదిత్యము, గాయత్రీ, గదాధరుడు, గయ, గయాశిరము అను ఆరుగయలు ముక్తి దాయకములు. గయయందు వృషోత్సర్జనము గావించి ఇరువది యొక్క తరములను ఉద్ధరించును. జితేంద్రియుడగు విప్రుడున్న ప్రదేశమున అద్యుడగు గదాధరుని ధ్యానించి శ్రాద్ధమును, పిండ ప్రదానమును ఆచరించవలెను. నూరు కులములను ఉద్ధరించి పితరులను బ్రహ్మలోకమును చేర్చును. తరువాత జనార్దన దేవుని యధావిధిగా పూజించి దధ్యోదనమును నైవేద్యము నిడి తచ్ఛేషముతో శ్రీరామచంద్రుడు అరణ్యమునకు వెళ్ళగా భరతుడు పర్వతము నధిరోహించి ఉండెను. తండ్రికి పిండాదికములనిచ్చి అచట రామేశుని స్థాపించి స్నానముచేసి రామేశునికి నమస్కరించి సీతారాములను చేరెను. కావున నరుడు అచటికి వెళ్ళి స్నానమాచరించి సావధానముతో రామేశునికి నమస్కరించి, రాముని సీతకు నమస్కరించి శ్రాద్ధమును పిండ ప్రదానమును గావించి విష్ణు లోకమును చేరును. తానేకాక నూరు కులములను ఉద్ధరించి పితరులతో విష్ణులోకమును చేరును. శిలాదక్షిణ హస్తమున కుండపృష్ఠమువైపు శ్రాద్ధాదులను ఆచరించి పితరులను బ్రహ్మపురమును చేర్చును. సీతాద్రియొక్క దక్షిణ పర్వతమున కుండుడు తపమును ఆచరించెను. పుణ్యముగ మతంగపదమున పిండప్రదుడు పితరులను స్వర్గమును చేర్చును. శిల యొక్క రామహస్తమున అంతకగిరి ధరించబడినది. మహాత్ముడగు అగస్త్యుడు ఇచటికి ఉదయాద్రిని తెచ్చెను. ఇచట పిండ ప్రదుడు పితరులను స్వర్గమున చేర్చును. తన తపస్సునకు కుండము చేయుచుండిరి. ఇచట బ్రహ్మ సావిత్రి కుమారులతో ఉండెను. హాహా హూహూ మొదలగు గంధర్వులు గీత వాద్యములను చేయుచుండిరి. మధ్యాహ్నమున అగస్త్యతీర్థమున స్నానమాడి సావిత్రిని ఉపాసించి కోటి జన్మలు వేద పారగుడు ధనాఢ్యుడగు విప్రునిగా పుట్టును. అగస్త్య తీర్థమున స్నానమాడి పిండములనిచ్చు వాడు పితరులను స్వర్గమున చేర్చును. ఇక బ్రహ్మయోనిని ప్రవేశించి వచ్చువాడు పునర్జన్మ రహితుడై పరబ్రహ్మను పొందును. గయా కుమారునికి నమస్కరించి బ్రాహ్మణ్యమును పొందును. సోమకుండమున అభిషేకాదులే పితరులను సోమలోకమునకు చేర్చును.
కాకశిలయందు కాకులకు చేయు బలి క్షణకాలమున మోక్షము నిచ్చును. స్వర్గ ద్వారేశ్వరునికి నమస్కరించి స్వర్గమునుండి బ్రహ్మలోకమును పొందును. ఆకాశగంగ యందు పిండ ప్రదానము చేయువాడు నిర్మలుడై పితరులను స్వర్గమునకు చేర్చును. శిలాదక్షిణ హస్తమున భస్మకూటమును ధరించెను. కావున అచట హరుడు భస్మకూటాద్రి అని నామకరణమును చేసెను. ఇచట వటుడు, వటేశ్వరుడు ప్రపితామహుడు అచట నివసించును. భస్మకూటాద్రి అగ్రభాగమున రుక్మిణీ కుండము, పశ్చిమ భాగమున కపిలానది కలదు. కపిలానదీ తీరమున కపిలేశుడు కలడు. ఇచటనే ఉమాసోమన మాగమము కలదు. కపిలానది యందు స్నానముచేసి కపిలేశునికి నమస్కరించి పూజించవలెను. ఇచట శ్రాద్ధప్రదుడు స్వర్గమును పొందును. మహేశ కుండమున గౌరి మంగళ సర్వ సౌభాగ్య ప్రద అర్చింపబడవలెను. భస్మ కూటమునగల జనార్దన హస్తమున పిండప్రదుడు స్వస్వమంత్రములతో ఇతరులకు సత్యముగా తిలలు లేక దథిసంమిశ్ర పిండప్రదానము గావించిన వారందరు విష్ణు లోకమును పొందెదరు. ఓ జనార్దనా! నా హస్తమున ఈ పిండమును నేనిచ్చుచున్నాను. నేను మరణించినపుడు గయా శ్రాద్ధమున నీవు నాకు పిండమును చేయవలెను. నేను నీకు ఎవరెవరి కొరకు పిండము నిచ్చితినో వారు మరణించినపుడు వారికి నీవు పిండముల నిమ్ము, పితృ రూపియగు జనార్ధనా! నీకు నమస్కారము ఓ పితృపాత్రా ముక్తి హేతువగునీకు నమస్కారము. గయయందు పితృరూపముగా జనార్దనుడే స్వయముగా ఉండెను. ఆ పుండరీకాక్షుని దర్శించినవాడు ఋణత్రయ విముక్తులు అగుదురు. ఓ పుండరీకాక్షా! ఋణత్రయ విమోచనా నీకు నమస్కారము. లక్ష్మీకాంత! పితృమోక్షప్రదాః నీకు నమస్కారము. జనార్దనుడుగు పుండరీ కాక్షుని పూజించి స్వర్గమును పొందును. వామ జానువును వంచి భూమి మీద నుంచి జనార్దనునికి నమస్కరించి సపిండకముగా శ్రాద్ధమును చేసి సోదరులతో విష్ణులోకమును చేరును. శిలావామ భాగమున ప్రేతకూటరి కలదు. ప్రేత శిలామయము పాపాఢ్యమగు ఈ పర్వతమును యమధర్మరాజు తన పాదముచే శిలాపాదభాగము నుండి దూరముగా పడవేసెను. ధానుష్క రూపముతో విఘ్నకరులగు చాలా మంది ప్రేతలు ఇచట విడివిడిగా ఉండిరి. ఈ తీర్థము పితృవిముక్తి కొరకు శ్రాద్ధమును చేయువారి సంపర్కముతో ప్రేతో కూటము పవిత్రత నందెను. ఇచటనే ప్రేత కుండము కలదు. ఇచట ప్రతి పదమున దేవతలు నివసించియున్నారు. ఇచట స్నానముగావించి శ్రాద్ధ పిండాదికములను ఇచ్చినచో పితరులు ప్రేతత్వ విముక్తులు అగుదురు. కీకటములందు గయ పవిత్రమైనది. రాజు గృహము వనము ఇవి అన్నియూ పుణ్య ప్రదములు. ఈ తీర్థములలో శ్రాద్ధమును పిండ ప్రదానమును గావించినచో పితరులను బ్రహ్మా పురమునకు చేర్చును.
శిలాదక్షిణ పాదమున గృధ్రకూటగిరి కలదు. ఈ గిరిని యమధర్మరాజు తన స్థైర్యమునకు ఈ గిరిని ధరించెను. ఇచట తాను స్వయముగా తన స్థిరతకు గృధ్రరూపమున తపమును ఆచరించి సిద్ధిని పొందెను. కావుననే ఈ గిరికి గృధ్రకూటమని పేరు. ఇచట గృద్ధేశ్వరుడు శివుడు. ఇచట స్నానముచేసి గృధ్రేశ్వరుని దర్శించి శివపురమును చేరును. అచట గృధ్రపురమునకు వెళ్ళి సమయము వచ్చినపుడు స్వర్గమును చేరును. ఋణమోక్షమును పాపమోక్షమును శివుని దర్శించిశివుని పొందును. ఈ పర్వతము తన ఆదిపాదముతో శిలోదనము ఆక్రమించబడినది. ఇచట విఘ్ననాశకుడగు విఘ్నేశుడు గజరూపముతో ఉండెను. ఈ విఘ్నేశుని దర్శించి విఘ్న వినిర్ముక్తుడగును. పితరులను శివపురము చేర్చును. ఇచట స్నానముచేసి గాయత్రిని గయాదిత్యుని దర్శించి స్వర్గము చేరును. ఆది పాదమున నున్న బ్రహ్మను దర్శించి పితృతారకుడగును. నాభియందు పిండప్రదుడు పితరులను బ్రహ్మపురము చేర్చును. ముండ పృష్ఠమునకు శోభ కొరకు ఉత్తమారవిందము ఏర్పడెను. ముండ పృష్ఠార విందములను చూచి పాపముల నుండి విముక్తుడగును. శృంగులచే, దంష్ట్రులచే, వ్యాలములచే, విషముచే, వహ్నిచే, స్త్రీలచే, జలములచే, సంగమమును చాలా దూరమున విడువవలెను. సర్పములకు అపకారమును చేయుచు మరణించిన వాడు, విద్యుత్తుచే మరణించినవాడు, రాజుచే శిక్షించబడినవాడు (శౌర్యమున పరదారలను రమించుచు వారి పతులచే ద్వేషముచే చంపబడినవాడు) అసమానులచే, సంకీర్ణులచే, చండాలులచే విరోధమునుచేసి వారిచే చంపబడినవారు, చాండాలాదులను ఆశ్రయించిన వారు, గోవులకు అగ్నిని విషమును ఇచ్చినవారు, పాఖండులు, క్రూరబుద్ధులు, క్రోధముచే విషమును, అగ్నిని, శస్త్రమును, ఉద్బంధమును, జలమును ప్రయోగించినవారు. పాఖండులు, క్రూరబుద్ధులు, క్రోధముచే విషమును, అగ్నిని, శస్త్రమును, ఉద్బంధనమును, జలమును ప్రయోగించినవారు, గిరుల నుండి వృక్షములనుండి పడినవారు, కుశిల్ప జీవులు, పంచసూనాధికారులు, యజ్ఞములలో సభలలో దీనప్రాయులు, నపుంసకులు, బ్రహ్మదండ హతులు, బ్రాహ్మణహతులు, మహాపాతకులు. వీరంతా పతితులు అనబడుదురు. వీరు గయాకూప భస్మ స్నానముచే శుద్ధిని పొందెదరు. ఇది గయా మాహాత్మ్యము. ఇట్లు నీకు చెప్పితిని. ఈ మాహాత్మ్యము సర్వపాప ప్రశమనము. పితృముక్తి దాయకము. శ్రాద్ధమున కాని, పర్వకాలమున కాని, ప్రతి నిత్యము ఈ మాహాత్మ్యమును భక్తిచే వినువారు, వినిపించువారు బ్రహ్మలోకమును పొందెదరు. ఈ గయా మాహాత్మ్యము, శుభములకు నిలయము, పరమపావనము, ధన్యము, నరులకు స్వర్గతిదాయకము, యశస్కరము, ఆయుష్యకరము, పుత్రపౌత్ర వివర్ధనము. కావున దీనిని చదువవలెను. వినవలయును. (II/47)