పురుషోత్తమ మాహాత్మ్యము

వసువు పలికెను: శ్రీ పురుషోత్తమ క్షేత్రమున మహాపుణ్య ప్రదమగు మరియొక తీర్థ వ్రజమును గూర్చి చెప్పెదను వినుము. ఈ తీర్థరాజ సందర్శనము పాపనాశకము. ఇచట అనంత నామములతో ఉన్న వాసుదేవుని దర్శించి భక్తితో నమస్కరించినవాడు సర్వపాప వినిర్ముక్తుడై పరమపదమును చేరును. శ్వేతగంగలో స్నానమాడి శ్వేతమాధవుని దర్శించువారు ఉత్తమ గతిని పొందెదరు. మత్స్య నామముతో ఉన్న మాధవుని దర్శించినవారు శ్వేతద్వీపమును పొందెదరు. తుషారప్రతిముడు, శంఖచక్ర గదాధరుడు, సర్వలక్షణ సంయుక్తుడు, పుడరీకాయతేక్షణుడు, శ్రీవత్సవక్షుడు, సుప్రసన్నుడు, చతుర్భుజుడు, వనమాలా కృతోరస్కుడు, ముకుటాంగదధారి, పీతవస్త్రుడు, సుపీనాంసుడు, కుండలా లంకృతుడు, అగు మత్స్యనామ మాధవుని దర్శించవలయును. శ్వేతగంగా జలమును కుశాగ్రముచే స్పృశించిననూ సావధానులగు విష్ణుభక్తులు స్వర్గమును చేరెదరు. ఇచట శశిప్రభగలది శంఖ గోక్షీర సంకాశము, సకల పాపవినాశిని అగు ఈ ప్రతిమను దర్శించి ఒకసారి భక్తిచే నమస్కరించిన వాడు సర్వ కామనలను విడిచి విష్ణు లోకమున విరాజిల్లును. అచటనే అన్ని మన్వంతరములు దేవకన్యలచే కూడి గంధర్వ గానములతో సిద్ధి విద్యాధర పూజితుడై యధేష్టముగా దేవతలతోకలిసి సకలభోగములను అనుభవించును. పుణ్యక్షయమున అట నుండి భూలోకమున కొచ్చి మానవులలో బ్రాహ్మణునిగా పుట్టును. వేదవేదాంగములను తెలిసినవాడు. ధీమంతుడు, భోగి, దీర్ఘాయుష్యము కలవాడు. గజాశ్వరధ వాహనములపై వెళ్ళువాడు, ధనధాన్య సమన్వితుడు, పవిత్రుడు, రూప వంతుడు, బహు భాగ్యవంతుడు, పుత్రపౌత్ర సమన్వితుడుగా నుండును. మరల పురుషోత్తమ క్షేత్రముచేరి సాగరమున నున్న వటవృక్ష మూలమున శ్రీహరిని స్మరించుచు దేహమును విడిచి శాంతిధామమును చేరును. శ్వేతమాధవుని చూచి, తత్సమీపమున రోహిత రూపమును ధరించి వేద హరణము కొరకు రసాతలమున నుండెను. భూమిపై ఈ స్థానమున మత్స్య రూపముగా ఉన్న స్వామిని ధ్యానించి తరుణ రూపముతో మత్స్య మాధవునిగా నున్న మత్స్యుని భక్తిచే నమస్కరించి సకల కష్టములనుండి విముక్తుడగును. సాక్షాత్తుగా శ్రీహరియున్న పరమ పదమును చేరును. యధాకాలమున మరల ఇటకొచ్చి భూమండలమున రాజుగా పుట్టును. మరల మత్స్య మాధవమును చేరి దురాధర్షుడగును. దాత, భోక్త, యోద్ధ, విష్ణుభక్తుడు, సత్యపాలకుడు అగును. తరువాత శ్రీహరి యోగమును పొంది మోక్షమును పొందును. ఇట్లు నీకు మత్స్య మాధవ మాహాత్మ్యమును వివరించితిని. ఈ క్షేత్రమును దర్శించిన వారు సర్వాభీష్టములను బడయగలరు.

ఇక ఇపుడు శుభప్రదమగు మార్కండేయహ్రదమున చేయదగిన మార్జనమును వివరించెదను. ఈ మార్జనము భక్తిచే తన్మనస్కులై పుణ్యమును ముక్తిని ప్రసాదించు పురాతనమగు మార్జనమును చేయవలయును. మార్కండేయ హ్రదమున అన్ని కాలములందు స్నానము విశేషఫలప్రదముగా చెప్పబడినది. విశేషించి చతుర్దశీ స్నానము సర్వపాప ప్రణాశనముగా పేర్కొనబడినది. ఇట్లే సముద్ర స్నానముకూడా సర్వకాలములందు విశేష ఫలప్రదమే. పౌర్ణమిన సముద్రస్నానము అశ్వమేధ యాగ ఫలప్రదము. జ్యేష్ఠ పూర్ణిమనాడు జ్యేష్ఠానక్షత్ర యోగమున్ననాడు విశేషించి ఈ తీర్థరాజమునకు వెళ్ళవలెను. కాయవాజ్మానసములచే పరిశుద్ధుడై, రాగమును వీడి, మాత్సర్యమును వదిలి, రమ్యమగు వటకల్ప వృక్షమును సాక్షాత్తుగా జనార్దన రూపమున ఉన్న దానిని సావధానముతో మూడు మార్లు ప్రదక్షిణమును ఆచరించవలెను. ఈ కల్పవృక్ష దర్శన మాత్రమున ఏడు జన్మల పాపములు నశించును. విపులమగు పుణ్యము, ఉత్తమగతి లభించును. ఈ కల్ప వృక్షమునకు ప్రతియుగమున ప్రసిద్ధిని పొందిన నామములను చెప్పెదను. వటము, వటేశ్వరము, శాంతము, పురాణ పురుషుడు, ఈ నామముల కృతాది యుగములందు చెప్పబడినవి. యోజనము, పాదహీనయోజనము, యోజ నార్థము, తదర్థము, కృతాది యుగములలో వట వృక్ష విస్తార ప్రమాణములు. పూర్వోక్త మంత్రముచే వటవృక్షమునకు నమస్కరించి, దక్షిణాభి ముఖముగా మూడు వందల ధనుః ప్రమాణ దూరమును వెళ్ళవలయును. అచట మనోహరమగు స్వర్గద్వార చిహ్నము సాగరాంతర్ధామమున ఆకర్షించబడు సర్వ గుణాన్వితమగు కాష్ఠము కనిపించును. ఆ కాష్ఠమునకు నమస్కరించి చక్కగా పూజించి నిలువవలయును. ఇట్లు ఆచరించినచో సర్వపాపములనుంచి పాపగ్రహాదుల నుండి విముక్తుడగును. పూర్వ కాలమున ఉగ్రసేనుడు స్వర్గద్వారముచే సాగరమును సందర్శించి వెళ్ళి ఆచమనముచేసి శుచియై పరుడగు నారాయణుని ధ్యానము గావించి హస్త శరీర భాగములందు అష్టాక్షర మంత్రన్యాసమును గావించవలెను. ‘ఓం నమో నారాయణాయ’ అను మంత్రము జపించిన వారికి మనోవిభవ కారకములగు ఇతర మంత్రములచే పనియేముండును. ‘ఓం నమో నారాయణాయ’ అను మంత్రమును సర్వార్థ సాధనము. జలములు నరసముత్పన్నములు కావున నారములు అనబడును. పూర్వము నారములే శ్రీ మహావిష్ణువునకు నివాస స్థానము కావున విష్ణువునకు నారాయణ నామము కలిగినది. వేదములు నారాయణ పరములు. బ్రాహ్మణులు నారాయణ పరులు. నారాయణ పరము జ్ఞానము. ప్రతికార్యము నారాయణ స్వరూపము. ధర్మము నారాయణ పరము. తపస్సు నారాయణ పరము. దానము నారాయణ పరము. వ్రతము నారాయణ పరము. సర్వ లోకములు నారాయణ పరములు. దేవతలు నారాయణ పరులే. నిత్యము నారాయణ పరము, ప్రతి స్థానము నారాయణ పరము. భూమి నారాయణ పరమే. జలము అగ్ని, ఆకాశము, వాయువు నారాయణ పరములే. మనస్సు నారాయణ పరమే. బుద్ధి, అహంకారములు నారాయణ పరములే. భూతభవ్యభవిష్యత్తులు, సకల జీవ సంజ్ఞకములు, స్థూలసూక్ష్మములు, పరము అంతయూ నారాయణాత్మకమే. ఈ సృష్టిలో నారాయణునికంటే పరమైనదేదియూ లేదు. దృశ్యాదృశ్యము చరాచరమంతయు నారాయణునిచే వ్యాపించబడి యున్నది. శ్రీ విష్ణువునకు నివాసము జలములు. కావున శ్రీమహావిష్ణువు జలాధిపతి. కావుననే జలములలో శ్రీహరి ఉండును. కావున నారాయణ స్వరూపములగు జలము సర్వపాప ప్రణాశకము. విశేషించి స్నానకాలమున జలమున శుచియై నారాయణుని స్మరించి ధ్యానముచేసి హస్తములందు శరీరమునందు న్యాసమును గావించవలయును. వామకటియందు ఓంకారమును, దక్షిణకటియందు నకారమును, నాభిదేశమున రాకారమును, వామ బాహువునందు యకారమును, దక్షిణ బాహువు నందు ణకారమును, శిరస్సునందు యకా రమును న్యాసమును చేయవలెను. అధోభాగమున, ఊర్థ్వ భాగమున హృదయమున, పార్శ్వ ములందు, పృష్ఠ భాగములందు, అగ్రభాగమున న్యాసమును కావించవలయును. తరువాత నారాయణుని ధ్యానముచేసి, కవచము ఆరంభించవలెను.

పూర్వ దిక్కున గోవిందుడు, దక్షిణమున మధుసూదనుడు, పశ్చిమమున శ్రీధరుడు, ఉత్తరమున కేశవుడు కాపాడుగావుత! ఆగ్నేయమున విష్ణువు, నైరుతమున మాధవుడు, వాయవ్యమున హృషీకేశుడు, ఈశాన్యమున వామనుడు కాపాడు గావుత. భూతలమున వరాహస్వామి, ఊర్థ్వమున త్రివిక్రముడు కాపాడు గావుత. ఇట్లు కవచమును ఆచరించి తరువాత ఆత్మ స్వరూపమును చింతించవలయును. నేను శంఖ చక్ర గదాధరుడగు నారాయణ దేవుడను అని ఇట్లు ఆత్మ ధ్యానమును గావించి ఈ మంత్రమును పఠించ వలయును.

“త్వమగ్ని ర్ద్విపదాం నాధ రేతోధాః కామదీపనః

ప్రధానస్సర్వ భూతానాం జీవానాం ప్రభురవ్యయః

అమృతస్యారణి స్త్వంహి దేవయోని రపాం పతే

వృజినం హరమే సర్వం తీర్థరాజ నమోస్తుతే”

అనునది మంత్రము. ఓద్విపాత్ పతీ! నీవు అగ్నివి. కామదీపకమగు రేతో నివాసము నీవే. సర్వ భూతములలో ప్రధానుడవు. జీవులకు ప్రభువు నీవే. నీవు అవ్యయుడవు. అమృతమునకు ఉత్పత్తి స్థానము. నీవు దేవతలకు కారణభూతుడవు. జలాధిపతివి నీవే. కావున నా సర్వ పాపములను హరించుము. ఓ తీర్థ రాజా! నీకు నమస్కారము అని ఈ మంత్రమునకు అర్థము. ఇట్లు యధావిధిగా మంత్రమును ఉచ్చరించి తరువాత స్నానమును ఆచరించవలయును. ఇట్లు ఆచరించక చేసిన స్నానము సఫలము కాజాలదు. జలదేవతా మంత్రములచే అభిషేకమును, మార్జనమును ఆచరించి నీటిలో అఘమర్షణ మంత్రమును మూడు మార్లు జపించవలెను. అశ్వమేధ యాగము సర్వ పాపహరమగునట్లు అఘమర్షణ సూక్తము సర్వపాపహరము. తరువాత జలమునుండి తీరమునకు వచ్చి ధౌతములు నిర్మలమగు వస్త్రములను ధరించి, ప్రాణాయామమును ఆచరించి, ఆచమనము గావించి, సంధ్యావందనము చేసి సూర్యుని పూజించి, ఊర్థ్వమునకు పుష్ప జలాంజలిని చల్లి ఉపాసన గావించవలెను. ఇట్లు ఉపస్థానము గావించి, ఊర్థ్వ బాహువుగా నిలిచి సూర్యుని ఆ చిహ్నములతో సేవించి, పరమ పవిత్రమగు గాయత్రీ మంత్రమును నూట ఏనిమిది మార్లు జపించవలెను. సావధానముగా నిలిచి ఇతర సౌర మంత్రములను జపించి ప్రదక్షిణము నాచరించి, సూర్యునికి నమస్కరించి, కూర్చొని ప్రాజ్ఞుఖునిగా స్వాధ్యాయమును అధ్యయనము గావించి దేవతలకు, మానవులకు తర్పణము గావించవలెను. స్వఋషులను, పితరులను యధావిధిగా నామగోత్రములతో నువ్వులు కలిపిన జలముచే తర్పణము గావించవలయును. హవన కాలమున, శ్రాద్ధకాలమున ఒక హస్తముతో తర్పణము గావించవలెను. తర్పణమును మాత్రము రెండు హస్తములచే చేయవలెను. ఇదియే అన్ని వేళలలో విధి. సవ్యముగా అన్వారబ్దమగు దక్షిణ హస్తముతో నామ గోత్రములను ఉచ్చరించి తృప్తి చెందుగాక అని పలికి వాణ్నియమముచే, స్థిర కాయముచే తిలములచే తర్పణము గావించిన త్వజ్మాంస రుధిరాస్థులచే తృప్తి పొందెదరు. వీటిలో ఉండి భూమిపై నిచ్చిన తర్పణము, భూమిపైనుండి జలమున నిచ్చిన తర్పణము పితరులకు చేరదు. కావున భూమిమీద నిలిచి భూమి మీదనే తర్పణమును గావించవలయును. పితరులకు అక్షయ స్థానము భూమి అని బ్రహ్మ భూమిని ప్రదానము గావించెను. కావున పితరుల ప్రీతిని గోరువారు భూమి మీదనే తర్పణమును గావించవలయును. నీటిలో నుండియే భూమి పుట్టినది. భూమి యందే జలముండును. భూమియందే జలము లీనమగును. కావున జలమును భూమి యందే విడువవలయును. కొనలున్న దర్భలను భూమియందు పరిచి స్వస్వమంత్రములచే అవాహన చేయవలెను ప్రాచీనాగ్రములగు దర్భలందు దేవతలను, దక్షిణాగ్ర దర్భలందు పితరులను అవాహన చేయవలెను. (II/56)