యమ విలాపము

యమధర్మరాజు పలికెను: ఓ త్రిభువనార్చితా శ్రీహరిలోక మార్గము. ఎల్లప్పుడు నడుచు మానవులచే సందడిగా ఉన్నది. శ్రీ మహావిష్ణు లోకమునకు ఇంత అని ప్రమాణము లేదనుకొనుచున్నాను. ప్రపంచములోని జన సమూహముతో నిండులేదు. స్వకర్మ నిరతులు, స్వకర్మ భ్రష్టులు, పవిత్రుడు, అపవిత్రులుకూడా రుక్మాంగదాజ్ఞచే ఏకాదశినాడు ఉపవసించి విష్ణులోకమునకు వెళ్ళుచున్నారు. ఆ రుక్మాంగదుడు నాకు గొప్ప శత్రువు. మీకు విశేషించి శత్రువు. అతనిని అరికట్టవలెను. ఈ విషయమున సంశయము లేదు. అతను వేయి సంవత్సరములు భూమండలమును పరిపాలించు చున్నాడు. అసంఖ్యాక జనమును చతుర్భుజములతో గరుడ వాహనముతో పీతాంబరధారణతో, చిత్రమాల్యానులేపనములతో శ్రీ విష్ణులోకమును చేర్చుచున్నాడు. రుక్మాంగద మహారాజు ఈ భూమిపై ఉన్నచో భూమండల వాసులు అందరిని విష్ణులోకమును చేర్చును. ఇదిగో ఈ శిక్షాదండము, కర్మల వివరముల పట్టికను శ్రీ పాదముల వద్ద విడుచుచున్నాను. ఆ రుక్మాంగదుని గర్భమున ధరించిన స్త్రీ ధన్యురాలు. గుణాధికుడు తల్లి సర్వ దుఃఖములను నశింపచేసెను. తల్లికి కష్టమును కలిగించుటకు మాత్రమే పుట్టిన పుత్రుడు నిష్ప్రయోజకుడు. జ్యేష్ఠ మాసములో సూర్యునివలె శత్రువులను తపింప చేయనివాని జన్మము వ్యర్థము. మేఘములో మెరుపువలె కీర్తి విస్తరించినచో, విద్యచే కాని, బలముచే కాని పితృపక్షమును ఉద్దరించని వాడు తల్లి కడుపులో విపరీతముగా సంచరించువాడు మాతృఘాతకుడు అగును. అతని జీవితము వ్యర్థము. ఈ ప్రపంచమున నా వ్రాతను తుడిచి వేయుటకు పుట్టిన రుక్మాందుడు తప్ప ఏ రాజు కూడా నా పటమార్జనమును చేసినట్లు విని ఉండలేదు. చూసి ఉండలేదు. ఇంతవరకు ఎపుడూ ఈ లోకమున హరిసేవలో ఉండుచు, ఘోర మగు పటహమును మ్రోగించుచు, నా లోకపు మార్గమును లోపింపచేయు రాజును నేను తెలియను. (II/5)