నారద మహా పురాణము
ధ్వజారోపణము
సనక మహర్షి పలికెను: ధ్వజారోపణము అను మరియొక వ్రతమును చెప్పెదను. ఈ వ్రతము అన్ని పాపములను తొలగించును. శ్రీహరికి ప్రీతిని కలిగించును. శ్రీవిష్ణుదేవాలయమున ధ్వజా రోపణము చేసినవారిని బ్రహ్మాదులు కూడా పూజింతురు అనిన ఇకఏమి చెప్పవలయును. పెద్ద కుటుంబము కల బ్రాహ్మణునకు పదివేల కిలోల బంగారమును (భారసహస్రము) దానము చేసినచో ధ్వజారోపణముతో సమానమగును. ధ్వజారోపణముతో సమానమగునది గంగాస్నానము లేదా తులసీసేవనము, లేదా శివలింగ పూజనము. ఈ ధ్వజారోపణము అపూర్వము. ఆశ్చర్యావహము. సర్వపాపహరము. ధ్వజా రోపణ వ్రతమున చేయవలసిన కార్యములను నేను చెప్పెదను వినుము. కార్తిక శుక్ల ద్వాదశినాడు వ్రతమును స్వీకరించదలచిన మానవుడు నియమముతో ప్రాతఃకాలమున దంతధావనమును చేసుకొని స్నానమును చేయవలయును. పరిశుభ్రమైన వస్త్రములను ధరించి శుద్ధుడై, ఒకపూట మాత్రమే భుజించి, బ్రహ్మచర్యమును అవలంబించి శ్రీమన్నారాయణుని ముందు నారాయణునే తలచుచు నిద్రించవలెను. ప్రొద్దునలేచి యథావిధిగా స్నానము చేసి ఆచమించి నిత్యకర్మలను ముగించుకొని శ్రీ మహావిష్ణువును పూజించవలయును. నలువురు బ్రాహ్మణులతో స్వస్తి వాచనమును గావించి నాందీ శ్రాద్ధమును చేయవలయును. వస్త్రములను చుట్టిన ధ్వజ స్తంభములను గాయత్రీ మంత్రముచే ప్రోక్షించవలయును. భక్తితో సూర్యుని, గరుడుని, చంద్రుని పూజించ వలయును. ధ్వజదండమున ధాతృవిధాతృలను అర్చించవలయును. పసుపు, అక్షతలు, గంధము, తెల్లని పూలు మొదలగు వాటితో విశేషముగా అర్చించవలయును. తరువాత గో చర్మమాత్రము స్ధండిలమును ఏర్పరిచి తన గృహ్య సూత్రప్రకారము అగ్న్యాధానము గావించి యథాక్రమముగా ఆజ్యభాగాదికమును హోమమును కావించవలయును. నేతితో కలిపిన పాయసమును అష్టోత్తర శతాహుతులను ఈయవలయును. మొదట పురుష సూక్తముచే, పిదప ‘విష్ణోర్నుకం’ అను మంత్రముచే, ‘ఇరావతీం’ అను మంత్రముచే హోమమును చేయవలయును. తరువాత గరుడునికి స్వాహకారముతో అష్టాహుతులను ఈయవలయును. తరువాత ‘సోమో ధేనుం’ ‘ఉదుత్యం’ అను మంత్రములచే హోమమును చేయవలయును. అట్లే సౌరమంత్ర జపమును చేయవలయును. శక్తి కొలది సూక్తమును పఠించవలెను. పవిత్రుడై శ్రీహరి సమీపమున రాత్రిపూట జాగరణము జేయవలెను. తరువాత ప్రాతఃకాలమున లేచి నిత్యకర్మను ముగించుకొని గంధ పుష్పా దులచే శ్రీహరిని యథా పూర్వకముగా అర్చించవలయును. అపుడు ధ్వజమును మంగళవాద్యములచే సూక్త పాఠములచే నృత్యగీతములతో, స్తోత్ర పాఠములతో విష్ణ్వాలయమునకు తీసుకొని వెళ్ళ వల యును. దేవాలయమున ద్వారదేశమున కాని శిఖరమున కాని ఆనందముచే స్థాపించవలయును. ధూపదీపగంధ పుష్పాక్షతాదులచే భక్ష్యభోజ్యాదినైవేద్యములచే శ్రీహరిని పూజించవలయును. ఇట్లు దేవాలయమున శోభనముగా ధ్వజమును స్థాపించి ప్రదక్షిణమును చేసి ఈ స్తోత్రమును పఠించ వలయును.
పుండరీకాక్షా! నీకు నమస్కారము. విశ్వభావనా! నమస్కారము. ఓ మహాపురుషా! పూర్వజా! హృషీకేశా! నీకు నమస్కారము. ఈ ప్రపంచము నీచే పుట్టినది. నీ యందే నిలిచియున్నది. నీ యందే లయముకానున్నది. అట్టి నిన్ను శరణువేడుచున్నాను. బ్రహ్మాది దేవతలు కూడా నీ పరత్వమును తెలియలేరు. యోగులు చూడలేని జ్ఞానస్వరూపుడవైన నీకు నమస్కరించుచున్నాను. నీకు అంతరిక్షము నాభి. స్వర్గలోకము శిరస్సు. భూమి పాదము. దిక్కులు చెవులు. సూర్యచంద్రులు నేత్రములు. ఋగ్యజుస్సామములు నీనుండి ఆవిర్భవించినవి. నీ ముఖము నుండి బ్రాహ్మణులు, బాహువులనుండి క్షత్రియులు, ఊరువులనుండి వైశ్యులు, పాదములనుండి శూద్రులు పుట్టియున్నారు. మాయా సంగమముచే పుట్టుకలేని ఆత్మను పురుషునిగా వ్యవహరింతురు. వాస్తవముగా నీవు పరిశుద్ధుడవు, నిర్మలుడవు, వికారరహితుడవు, సంబంధము అంటనివాడవు. క్షీరసాగరమున శయ నించువాడవు అంతము పరాజయము లేనివాడవు. సద్భక్తవత్సలుడవు. భక్తి మాత్రముచే తెలియువాడవు. సర్వవ్యాప్తివి. అట్టి నీకు నమస్కారము. పృధివ్యాది పంచభూతములు పంచతన్మాత్రలు, ఇంద్రియములు, సూక్షములు, స్థూలములు నీ నుండి కలుగుచున్నవి. అట్టి నీకు నమస్కారము. సర్వలోకములలో ఉత్తమలోకము నీ ధామము. నిర్గుణుడు, పరముడు, సూక్ష్ముడు అయిన నిన్ను శరణు వేడుచున్నాను.
పుట్టుక వికారములు లేనివానిని, శుద్ధుని, సర్వతోబాహుని ఈశ్వరుని యోగీంద్రులచే సర్వకారణకారణునిగా ధ్యానించబడు వానికి సర్వప్రాణులకు అంతరాత్మగా ఉండు దేవునికి జగత్స్వరూపునికి నమస్కరించు చున్నాను. నిర్గుణుడు పరమాత్మ అగు విష్ణువు ప్రసన్నుడగు గావుత. మాయామోహితులకు హృదయమున ఉన్ననూ దూరముగా ఉన్నటుల భాసించును. జ్ఞానులకు సర్వాంతర్యామిగా తెలియబడు విష్ణువు నాకు ప్రసన్నుడగుగావుత. నాలుగు వర్ణముల వారిచే, నాలుగు ఆశ్రమములవారిచే, రాత్రింబవళ్ళచే, అయిదు విధముల మనుజులచే వాఙ్మ నస్సులచే పూజింపబడు విష్ణువు నాకు ప్రసన్నుడగుగావు. జ్ఞానులకు కర్మిష్టులకు, భక్తులకు ఉత్తమగతిని ప్రసాదించువాడు, ప్రపంచముచే అన్వేషించబడువాడు అయిన విష్ణువు ప్రసన్నుడగు గావుత. జగద్దితము కొఱకు లీలగా ధరించు దేహములను జ్ఞానులు అర్చింతురు. అట్టి విష్ణువు నా విషయమున ప్రసన్నుడగు గావుత. యోగులచే నిర్గుణుడుగా, గుణాధారుడుగా, సచ్చిదానంద విగ్రహుడుగా ధ్యానించబడు విష్ణువు ప్రసన్నుడగుగావుత అని ఇట్లు శ్రీ మహావిష్ణువును స్తుతించి నమస్కరించి బ్రాహ్మణులను పూజించవలయును. తరువాత వస్త్రదక్షిణాదులచే ఆచార్యుని పూజించవలయును.
భక్తిభావముతో బ్రాహ్మణులను భుజింపజేయవలయును. నారాయణ సంస్మరణ చేయుచు పుత్రమిత్ర కళత్ర బంధు పరివార సమేతుడై తాను మౌనముగా భుజించవలయును. ఉత్తమమైన ధ్వజారోపణమును చేసినచో కలుగు ఫలమును. చెప్పెదను వినుము. ధ్వజపటము ఎన్ని కదలుటలు చేయునో అన్ని పాపరాశులు నశించి తీరును. మహాపాతకములు ఉన్ననూ ఇతర పాతకములు ఉన్ననూ విష్ణ్వాలయమున ధ్వజారోహణమును చేసినచో అన్ని పాపములు తొలగిపోవును. విష్ణ్వాలయమున ఎన్ని దినములు ధ్వజముండునో అన్ని వేలయుగములు హరి సారూప్యమును పొందును. ధ్వజారోపణమును చూచి అభినందించినవారు మహాపాతకరాశుల నుండి విముక్తులగుదురు. విష్ణ్వాలయమున ప్రతిష్ఠించిన ధ్వజము తన పటమును ఎగురవేయుచు అరనిముషములో కర్త యొక్క పాపములన్నింటిని నశింపచేయును. విష్ణ్వాలయమున ధ్వజారోపణమును చేసి నిత్యము పూజించినవారు దివ్యవిమానముతో సుమతి మహారాజు వలె స్వర్గమును చేరెదరు. (1/19)