వరాహపురాణాను క్రమణ వర్ణనము

శ్రీ బ్రహ్మ పలికెను: నాయనా ! విష్ణు మాహాత్మ్యమును సూచించునది రెండు భాగములుకల వారాహ పురాణమును చెప్పెదను వినుము. పూర్వము మానవ కల్ప ప్రసంగమున నేను చెప్పిన దానిని భూలోకమున వ్యాసునిగా అవతరించిన నారాయణుడే ఇరువది నాలుగు వేల శ్లోకములుగల వరాహపురాణమున వివరించెను. ఈ పురాణమున మొదట భూ వరాహ శుభ సంవాదము చెప్పబడినది. తరువాత ఆదికృత వృత్తాంతమున రంభుని చరితము, దుర్జయ చరితము, శ్రాద్ధకల్పము, మహా తపసుని చరితము, గౌర్యుత్పత్తి, వినాయకుని ఉత్పత్తి, నాగోత్పత్తి, సేనాన్యుత్పత్తి, ఆదిత్య ఉత్పత్తి, గణముల ఉత్పత్తి, దేవీ ఉత్పత్తి, ధనదుని ఉత్పత్తి, వృష చరితము, వ్రతాఖ్యాన సమన్వితముగా సత్యతపసుని చరితము. ఆగస్త్య గీత, రుద్రగీత, మహిషాసుర విధ్వంస మాహాత్మము శక్తి త్రయ సముద్భూతము, పర్వాధ్యాయము, శ్వేతోపాఖ్యానము, గోప్రదానికము, ఇవి ప్రథమ భాగమున చెప్పబడినవి. తరువాతి భాగమున భగవద్ధర్మ ప్రకరణమున వ్రత తీర్థ కథలు, ముప్పది రెండు అపరాధములకు ప్రాయశ్చిత్తము, సర్వతీర్థ మాహాత్మ్యము, విశేషముగా మధురా మాహాత్మ్యము, శ్రాద్ధాది విధి, ఋషిపుత్ర ప్రసంగమున యమలోక వర్ణనము, కర్మ విపాకము, విష్ణు వ్రత నిరూపణము, పాప నాశకమగు గోకర్ణ మాహాత్మ్యము చెప్పబడినవి. ఇట్లు ఆదికృత వృత్తాంతము, విష్ణు ధర్మములు అను రెండు భాగములచే ఈ పురాణమున పూర్వ భాగము నిరూపించబడినది. ఇక ఉత్తర భాగమున పులస్త్యకురు రాజ సంవాదమున వేరువేరుగా విస్తరముగా సర్వతీర్థ మాహాత్మ్యము, అఖిల ధర్మములు, పౌష్కర పర్వ, పుణ్యపర్వ చెప్పబడినది. ఇట్లు నీకు పాప నాశకమగు వరాహ పురాణము చెప్పబడినది. ఈ పురాణమును చదువువారికి వినువారికి భగవద్భక్తి పెరుగును. ఈ పురాణమును వ్రాసి తిలధేను సమన్వితముగా కాంచన గరుడునిచేసి బ్రాహ్మణునికి దానముచేసిన వాడు దేవర్సి గణవందితుడై విష్ణు ధామమును చేరును. వారాహపురాణాను క్రమణిని చదివిననూ వినినూ శ్రీ మహావిష్ణువునందు సంసార చ్ఛేదకారిణి యగు భక్తిని పొందును. (4/103)