నారద మహా పురాణము
అగ్ని పురాణానుక్రమణీ నిరూపణము
బ్రహ్మ పలికెను: అగ్ని దేవుడు వసిష్ఠ మహర్షికి ఈశాన కల్ప వృత్తాంతమున చెప్పిన అగ్ని పురాణమును ఇపుడు నీకు చెప్పెదను. చదువువారికి వినువారికి సర్వపాపహరములగు అత్యాశ్చర్యమును కలిగించు నానా చరితములు కలది. పదిహేను వేల శ్లోకములు కలది. ఈ పురాణమున మొదటి సర్వావతారకథలు కలవు. తరువాత సృష్టి ప్రకరణము, విష్ణు పూజాదికము, అగ్ని కార్యము, మంత్ర ముద్రాది లక్షణములు సర్వదీక్షా విధానము, అభిషేక నిరూపణము, మండలాది లక్షణములు, కుశాపామార్జనము, పవిత్రారోపవిధి, దేవాలయ విధి, శాలగ్రామాది పూజ, వేరు వేరు మూర్తుల చిహ్నములు, న్యాసాది విధానము, ప్రతిష్ఠా పూర్తకము, వినాయకాది పూజా, నానా దీక్షా విధి, సర్వదేవ ప్రతిష్ఠ, బ్రహ్మాండ నిరూపణము, గంగాది తీర్థ మాహాత్మ్యము, ద్వీప వర్షాను వర్ణనము, ఊర్థ్వాధో లోక రచన, జ్యోతిశ్చక్రమ నిరూపణము, జ్యోతిష శాస్త్రము, యుద్ధ జయార్ణ శాస్త్రము, కర్మ షట్కము, మంత్ర మంత్రౌషధీ గణము, కుబ్జికాది సమర్చన, షడ్విధ న్యాస విధి, కోటి హోమ విధానము, మన్వంతర నిరూపణము వ్రత దాన నిరూపణము, బ్రహ్మ చర్యాది ధర్మములు, శ్రాద్ధ కల్పవిధి, గ్రహ యజ్ఞము వైదిక స్మార్త కర్మలు, ప్రాయశ్చిత్తాది కథనము, ఆయా తిథుల వ్రతాది కములు. వారవ్రతాను కథనము, స్తోత్ర వ్రత కథనము, మానసిక వ్రత నిర్దేశము, దీపదానవిధి, నవ వ్యూహార్చనము, నరక నిరూపణము, నాడీ చక్ర సముద్దేశము ఉత్తమోత్తమమగు సంధ్యావిధి, గాయత్ర్యర్థ నిర్దేశము, లింగస్తోత్రము, రాజ్యాభిషేక మంత్రోక్తి, రాజ ధర్మకృత్యములు, స్వప్నాధ్యాయము, శకునాది నిరూపణము, మండలాదిక నిర్దేశము, రత్నదీక్షా విధి, కామోక్త నీతి నిర్దేశము, రత్న లక్షణము, ధనుర్విద్యా, వ్యవహార ప్రదర్శనము, దేవాసుర యుద్ధము, ఆయుర్వేద నిరూపణము, గజాది చికిత్స, గజాది శాంతి, గోనరాది చికిత్స, నానా పూజలు, వివిధ శాంతులు, ఛందశ్శాస్త్రము, సాహిత్య శాస్త్రము, ఏకార్ణాది సమాఖ్యానములు, సిద్ధశబ్దానుశిష్టి, సర్గాది వర్గకోశము, ప్రళయ లక్షణము, శారీరిక నిరూపణము, నరక వర్ణనము, యోగశాస్త్రము, బ్రహ్మజ్ఞానము, పురాణ శ్రవణ ఫలము ఇవి అగ్ని పురాణమున చెప్పబడినవి. ఈ అగ్నిపురాణమును వ్రాసి బంగారు కమలములతో తిలధేనుయుతముగా మార్గశీర్ష పూర్ణిమనాడు యథావిధిగా, పురాణార్థములు తెలిసిన బ్రాహ్మణునకు దానము చేసినచో స్వర్గలోక ప్రాప్తి నిశ్చయము. ఈ అగ్నిపురాణమును వినువారికి, చదువు వారికి ఇహ పరలోకములందు ముక్తిని ప్రసాదించును. అగ్నిపురాణానుక్రమణిని వినువారలకు చదువు వారలకు కూడా ఈ ఫలమే కలుగును. (4/99)