విష్ణు ఆరాధనా విధానము శరీర ధర్మము

శౌనక మహర్షి పలికెను: ఓ సాధుపురుషా! సూతమహర్షీ! నీవు చాలాకాలము జీవించుము. నీవు సర్వశాస్త్ర విశారదుడవు కావున మాకు కృష్ణ కథామృతమును రుచి చూపితివి. భగవత్ర్పియుడగు నారదుడు సనందుని నుండి మోక్ష ధర్మములను వినిన తరువాత మరల ఏమి అడిగెను. సనకాది మునీశ్వరులు బ్రహ్మమానస పుత్రులు, లోకములను ఉద్ధరించ సంకల్పించి సిద్ధులై లోకసంచారమును చేయుచుందురు. నారదమహర్షి కూడా నిత్యము శ్రీకృష్ణపరాయణుడు. వారిద్దరి కలయికలో, లోకపావనమగు కథలు ఏవి చెప్పబడినవి?

సూత మహర్షి పలికెను: ఓ మహానుభావా! నీవు లోకోపకార పరాయణుడవై చక్కగా అడిగితివి. నారదమహర్షి అడిగినదంతయూ నీకు చెప్పెదను. సనందన మహర్షి చెప్పిన మోక్షధర్మములను వినిన నారదమహర్షి మరల వారిని ఇట్లడిగెను.

నారదమహర్షి పలికెను: సర్వదేవేశ్వరుడగు విష్ణువు వేదమున, తంత్రశాస్త్రమున కీర్తించబడెను. అన్ని పురుషార్ధములను కోరువారందరు అతనినే ఆరాధించవలయును. భగవంతుడగు శ్రీమహావిష్ణువును ఏ మంత్రములచే ఆరాధించవలయును? విష్ణుభక్తులు ఏ ఏ దేవతల నారాధించవలయును? గురు శిష్యులకు ప్రయోజనకారియగు భాగవతతంత్రమును, దీక్షను, ప్రాతఃకాలమున మొదట చేయవలసిన దానిని తెలుపుడు. ఏ ఏ మాసములలో ఏ ఏ కర్మలచే, ఏ ఏ జపములచే, ఏ ఏ హోమములచే పరమాత్మ ప్రీతి చెందునో నాకు తెలుపుడు.

సూత మహర్షి పలికెను: మహానుభావుడగు నారదుడు పలికిన ఈ మాటలనువిని సూర్య తేజస్కుడగు, పూజ్యుడగు సనత్కుమార మహర్షి ఇట్లు పలికెను.

సనత్కుమారుడు పలికెను: ఓ నారదా! నీకు భాగవత తంత్రమును చెప్పెదను వినుము. దీనిని తెలిసినచో అవ్యయుడగు విష్ణువును స్వచ్ఛమైన భక్తిచే సాధించగలరు. మహాతంత్రము త్రిపదార్ధము చతుష్పాదమని చెప్పబడును. భోగము, మోక్షము, క్రియా, చర్య అనునవి నాలుగు పాదములు. ఇక పదార్ధములు పశుపతి, పశువు, పాశము అనునవి మూడు. ఈ మూటిలో ప్రతి ఒక్కడూ శివుడే. జీవులు పశువులు. స్వరూపమును తెలియనీయక మోహాదులు ఉన్నంతవరకు జీవులకు పశుత్వము ఉండును. ఈ విషయమును ద్వైతబుద్ధితో చూడవలయును. ఇచట పాశములు అయిదు విధములు. వాటిలో ఒక్కొక్కదానికి విడిగా లక్షణములున్నవి. పశువులు మూడు విధములు. కాలము అను సంజ్ఞ కలవగును. అవి ‘తలప’, ‘ఆకలి’, ‘సకలము’ అనునవి ఆ మూడు విధములు. వీటిలో మొదటిదగు ‘తలప’ అనునది మలసంయుక్తము, మలకర్మలతో కూడియుండునది. రెండవది, ఇక మూడవది మలముచే మాయచే కూడి ఉండును. వీటిలో మొదటిది మరల రెండు విధములు. సమాన కలుషమని, అసమానకలుషమని. రెండవది కూడా పక్వము, అపక్వమలము అని రెండు విధములు. ఈ రెండు పరిశుద్ధమైన మార్గమున వెళ్ళుచు విజ్ఞానమును ప్రళయమును కలిగించునవి. కలాది తత్త్వముచే నియతమగు సకలమనునది అంతటా పర్యటించును. ఆయా లోకములలో నుండు కర్మలను అనుసరించి పొందిన శరీరములు కలవారిలో అయిదు పాశములుండును. వాటిలో మొదటి రెండు మలకర్మల వలన కలుగునవి. మాయేయము అనునది తిరోధాన శక్తి వలన కలుగును. మూడవది బిందుజము ఒకటి అయిననూ అనేక శక్తులు కలది. దర్శనక్రియను కప్పివేయునది. కోమలమైనది. ధాన్యమునకు పొట్టు, శరీరమునకు వస్త్రము వంటిది ఆత్మకు శరీరమును కలిగించునది, విచిత్రములైన ఫలానుభవమును కలిగించునది ధర్మ అధర్మాత్మకమైన కర్మయే. ఈ కర్మ, శరీరము అనునది ప్రవాహమువలె నిత్యము. అనగా ప్రవాహములో ఎపుడూ ఒకే నీరుండదు. వచ్చిన నీరు పోవుచుండును. కొత్త నీరు వచ్చుచుండును. ప్రతి ప్రదేశమున ఎప్పుడూ నీరుండును. అట్లే ఆత్మకు ఒకే శరీరముండదు. వచ్చిన శరీరము పోవును. కొత్త శరీరము వచ్చును. శరీరము మాత్రము ఎప్పుడూ ఉండును. దీనినే ప్రవాహనిత్యత అందురు. అట్లే కర్మ ముందుండునా, శరీరము ముందుండునా అను విచారము కూడా బీజాంకుర న్యాయముతో సమాధానపరచవలయును. అనగా బీజము మొదటిదా, అంకురము మొదటిదా? అను విచారమునకు రెండూ అనాది సిద్ధములే అనునట్లు శరీరము కర్మ అనాది సిద్ధములని చెప్పవలయును కాని ముందు వెనుకల విచారమును చేయరాదని భావము. ఇట్లు శరీరము, కర్మ అనునవి మొదటి రెండు. ఇక మాయేయము బిందుజము మొదలగు వాటిని చెప్పెదను వినుము. సచ్చిదానంద విభవము కలవాడు సనాతనుడగు పరమాత్మ ఒక్కడే. ఈ పరమాత్మయే అందరికి అన్నిటికీ బీజము. ఇతడే విభుస్వరూపుడు. అనగా సర్వవ్యాపకుడు మనసులో సంకల్పము కలుగును కాని ఉదయించదు. నివృత్తిని ప్రసాదించును. దర్శన క్రియను ప్రవర్తింపచేయును. అదియే శంభుని తేజస్సు. ఇదియే సర్వత్కృష్టము. ఇతడే పార్వతితో కలిపి శక్తి స్వరూపుడగును. శ్రీహరి యందు భోగ రూపమున ఉండును. జీవగణమునకు ముక్తిని ప్రసాదించును. ఈ శక్తిని ఆద్యము, ఏకము, చిద్రూపము అని అందురు. ఆ శక్తిచే విజృంభింపచేయబడిన బిందువే దిక్రియా స్వరూపముగా శివనామముచే వ్యవహరించబడును. ఈ శివుడే సమస్త తత్త్వములకు కారణము. విభువు, అవ్యయము, సమస్తములగు ఇచ్ఛాశక్తులు ఇతని యందే లీనమగును. తమతమ కార్యములను చేయును. ఈ శివుడే అందరిని అనుగ్రహించువాడు. స్థావర జంగమములను అనుగ్రహింపగోరి ప్రపంచమును సృజించదలచిన ఇతని మొదటి ఉన్మేషమే నాదస్వరూపము. ఇదియే శాంతి మొదలగు భువన స్వరూపము. ఈ శక్తి తత్త్వము సావయవమగును. దీని నుండియే జ్ఞానక్రియా శక్తులయొక్క ఉత్కర్షప కర్షముల యొక్క ప్రసారము ఉండును. ఏదీ లేని సామాన్యతత్త్వము సదాశివ అనబడును. దృశ్శక్తి విడివడినపుడు క్రియాశక్తి విశిష్టమగును. ఈ క్రియా శక్తియే ఈశ్వర నామముచే వ్యవహరించబడును. ఇదియే సర్వార్ధములకు కర్త క్రియా శక్తి విడిగా ఉన్నప్పుడు జ్ఞానము అను పేరుచే ఉద్రిక్తమగును. ఈ తత్త్వమునే విద్య అందురు. ఇదియే జ్ఞానరూపము. సర్వ ప్రకాశకము. నాదము, బిందువు, సకలము అనునవి సత్తత్త్వమును ఆశ్రయించి ఉండును. విద్యాధిపులు మరియు, ఆధిపత్యము మంత్రములు, విద్య ఈ తత్త్వములు శుద్ధాధ్వ అని వ్యవహరించబడును. ఈ జగత్తునకు సాక్షిన్నిమిత్తము ఈశ్వరుడు కావున ఉపాదానము అనబడును. ఈ ఉపాదానమే బిందు రాజము. ఈ అయిదింటికి కాల నియమము లేదు కావున క్రమము కూడా ఉండదని సిద్ధాంతము. వ్యాపారమును అనుసరించి వీటికి కల్పన విధించబడినది. వాస్తవమగు తత్త్వము శివాఖ్య మొక్కటే. ఇదియే చిత్రములగు వివిధ శక్తులు కలది. ఇట్టి శక్తులు గల తత్త్వమే వృత్తి భేదమును అనుసరించి బహుకల్పనలు గలదైనది. ఈ కల్పనలే స్థావర జంగమములను అనుగ్రహించుటకు ధరించిన బహు రూపములు. ఈ రూపములచే అనాది కులము ఆవరించబడిన జీవులను అనుగ్రహించును. అందరికీ భోగమును, మోక్షమును, తన వ్యాపారములో సామర్ధ్యమును కలిగించి చూపును. అందరిని, అన్నిటిని అనుగ్రహించు శివుడు జగవర్గమునకు వ్యాపార సామర్ధ్యమును, చేతన వర్గమునకు భోగ, మోక్షములను ప్రసాదించును. శివుడు అనునది సామాన్య రూపము. మోక్షమనగా చేతనులను అనుగ్రహించుట.

శివుడు అనాది అగుట వలన ఆయా కర్మలను అనుభవించవలసిన అవసరము లేకుండును. అయిననూ చేతనులను అనుగ్రహించు స్వభావము కల శమ్భుడు ఆయా భోగములకు సమర్ధుడగును. అనుభవించిననూ అవ్యయుడే అగును. శంభుడు కష్టము లేకుండగానే సూక్ష్మ కరణములను ప్రపంచమును ఉత్పత్తి చేయును. కర్తృత్వము, ఉపాదానత్వము, కరణత్వము లేనిచో కార్యమున కనపడడు కదా! ఈ సృష్టిలో శక్తులు కరణము, వీటికి మాయ ఉపాదానమగును. ఈ మాయ నిత్యము, ఏకము, శివాభిదము శక్తిచే అద్యంతములు లేనిది అగును. నరులకు సాధారణ రూపము. ప్రపంచమునకు కారణము అగును. జీవులు తాము తెలిసి, తెలియక చేసిన కర్మలచే మాయ స్వభావ సిద్ధముగా మోహమును కలిగించును. ఈమాయ సర్వవ్యాపకము అతిసూక్ష్మము. అన్నిటి కంటే పరము వికృతముల కంటే పరము. జగన్నాధుడు విద్యాధిపతి జీవుల కర్మలను పరిశీలించి తన శక్తులచే మాయను క్షోభింపచేసి జీవుల అనుభవము కొఱకు కరణ కళేబరములను సృజించును. మొదట నానాశక్తిమయమగు కాలతత్త్వమును సృజించును. జరుగబోవు దానిని, జరిగిన దానిని, జరుగుచున్న దానిని కాలమే ప్రపంచమున కలిపి ఉంచును. తరువాత మాయ నియమించు శక్తిని సృజించును. అన్నింటిని నియమించును కావున దీనిని నియతి అందురు. తరువాత ఈ మాయ నిత్యము. విశ్వమును మోహింప చేయునది, అద్యంతములు లేనిది అగును కాలతత్త్వమును సృజించును. ఈ మాయ ఒక ప్రక్క మానవుల మలమును ఒకచోట కూర్చి కర్తృశక్తిని వ్యక్తము చేయును కావున దీనినే ‘కలా’ అందురు. ఈ మాయయే కాలముతో కలిసి నియతముగా సజనాత్మకశక్తిని తన వ్యాపారమును భూలోకము వరకు వ్యాపింపచేయును. ఈ మాయయే జీవులకు ‘కలా’ నామముతో విషయములను తెలియజేయుటకు ప్రకాశనామకమగు విద్యాతత్త్వమును సృజించును. విద్య తన కర్మచే జ్ఞానశక్తి యొక్క ఆవరణమును భేదించుకొని ఆత్మాంశ కారణము కావున విషయములను చూపును. ఈ కలయే పరమగు కరణముచే విషయములను తెలియజేయుటకు ప్రకాశ నామకమగు విద్యాతత్త్వమును సృజించును. విద్య తన కర్మచే జ్ఞానశక్తి యొక్క ఆవరణమును భేదించుకొని ఆత్మాంశకారణము కావున విషయములను చూపును. ఈ కలయే పరమగు కరణముచే విషయములను అనుభవింపచేయును. శక్తి ఉద్బుద్ధముగకాగా పురుషుడు మహదాదికమును ప్రేరేపించి భోగ్యమునందు, భోగమును, భోక్తను భోగోపకరణమును కల్పించును. విషయాకారముతో సుఖాది రూపమగు బుద్ధియే సంగ్రహముగా భోగము అనబడును. భోక్తము తనచేతనే భోగ్యత్వబుద్ధి కలుగుటకు కరణము అగును. ఈ బుద్ధి సూర్యునివలె ప్రకాశము కలది. అయిననూ కర్మరూపమగుటచే కరణాంతర సాపేక్షమగును. అపుడే ఇతరములను గ్రహించకలుగును. కారణాదుల సంబంధము వలన భోగమునందలి ఔత్సుక్యముచే ప్రేరేపించబడుట వలన, చేష్టాఫల సంయోగము వలనను జీవునకు కర్తృత్వము సిద్ధించును. జీవునకు కర్తృత్వమును అంగీకరించనిచో, భోక్తృత్వము వ్యర్ధమగును. అంతియేకాదు ప్రధానచరిత మంతయూ వ్యర్థమగును. కరణాదుల ప్రయోజకత్వము లేకుండుటకు కారణము కాదగిన కర్తృత్వ అభావము పురుషునిలో చెప్పినచో అనుభవము అసంభవము కావున జీవుడే ప్రవర్తకుడు అగును. ఈ జీవునకు విద్యచేతనే కరణాది ప్రయోక్తృత్వము సంభవించును. తరువాత ఈ కలా భేదాంగరూపమగు రాగమును సృజించును. ఈ రాగముచే పురుషునిలో భోగ్యతాబుద్ధి కలుగును. ఈ బుద్ధిచే క్రియా ప్రవృత్తి కలుగును. కావు ననే దీనిని రాగమందురు. ఈ తత్త్వములచే కలిసి భోక్తృత్వ దశలో నిత్యమగు ఈ ఆత్మ పురుష నామమును పొందును. ఈ కలయే పురుషుని భోగ్యము కొరకు అవ్యక్తమును సృష్టించును. ఈ అవ్యక్తము సప్తగ్రంధి విధానమగు గౌణమునకు కారణమగును. ఈ ఆధారమున గుణముల విభాగ ముండదు. భూమ్యాది భాగములు మాత్రము కలిగియుండును. భూమ్యాది విభాగమునకు ఆధారమగుదానినే అవ్యక్తము అందురు. ఈ అవ్యక్తము నుండియే గుణత్రయము సంభవించును. ఈ మూడు గుణములే సత్త్వము, రజస్సు, తమస్సు అను పేర్లను పొంది వ్యాపారమును నియమించును. గుణమువల్లనే బుద్ధి విషయాధ్యవసాయ స్వరూపము కలది అగును. ఈ బుద్ధి కూడా గుణము వల్లనే కర్మానుసారము త్రివిధమగును. మహత్తత్వము నుండి సంరంభవృత్తిగల అహంకారము పుట్టును. ఈ అహంకార సంభేదము వలననే విషయము వ్యవహారయోగ్యమగును. ఈ అహంకారము మరల సత్త్వాది గుణభేదముచే మూడు విధములగును. తైజనము, రాజసము తామసము అని వాటి పేర్లు. ఈ మూడింటిలో తైజసము నుండి మనసుతో పాటు జ్ఞానేంద్రియములు కలిగి ప్రకాశముతో అన్వయించి బోధకములు అగును. క్రియా హేతువగు రాజసమునుండి కర్మేంద్రియములు పుట్టెను. తామసము నుండి భూతములకు కారణములగు పంచతన్మాత్రలు పుట్టెను. వీటిలో మనస్సు అనగా ఇచ్ఛారూపమగు సంకల్పవ్యాపారము కలదు. ఈ చిత్తము భోక్తృభోగోప పాదక రూపకముగా రెండు విధములు అగును. బయట కరణములుండుటచే తనకు ఉచితమైన వాటిచే ఎప్పుడూ ఆత్మవృత్తియగు సంకల్పముచే ఇంద్రియములకు సామర్ధ్యము కలుగును. లోపల ఉన్నదానిని చేయును కావున దీనినే అంతఃకరణమందురు. ఈ అంతఃకరణము మనస్సు, అహంకారము, బుద్ధి అనుపేర్లచే మూడు విధములు అగును. ఈ మూడింటికి వరుసగా ఇచ్ఛా, సంరంభము, బోధ అనునవి ప్రవృత్తులుగా ఉండును. శ్రోత్రము, త్వక్, చక్షువు, జిహ్వా, నాసిక అనునవి జ్ఞానేంద్రియములు. ఈ ఇంద్రియములచే గ్రహించబడు విషయములు శబ్దాదులు. శబ్దాదులనగా శబ్దస్పర్శ రూప రస గంధములు. వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ అనునవి కర్మేంద్రియములు, వచనము, ఆదానము, గమనము, మలవిసర్జనము ఆనందము అనునవి వీటి పనులు. ఇట్లు పురుషునకు కరణములు సిద్ధించినవి. కరణములు లేనిచో కృతి సంభవించును. ఇట్లు పది కరణములచే చేష్ట కార్యమును ఆవేశించి చేయించును. కార్యమును ఆధారముగా చేసుకొని కరణములు విభువులు కావున చేష్టను కలిగి ఉండును. తన్మాత్రములనగా ఆకాశ వాయు తేజో జల భూములు అను అయిదు. ఈ తన్మాత్రముల నుండే ఒకే గుణము కల పంచ భూతములు పుట్టును. అయిననూ శబ్దము అను గుణము అయిదు భూతములందు, స్పర్శ నాలుగు భూతములందు, రూపము మూడు భూతములందు, రసము రెండు భూతములందు, గంధము పృథివి యందు ఉండును. ఈ పంచభూతముల కార్యము, అవకాశము, వ్యూహకల్పనము, పాకము, సంగ్రహము, ధారణము అనునవి. శీతము జలముతో, ఉష్ణస్పర్వ అగ్నిలో ఉండును. అగ్నిలో భాస్వర శుక్ల రూపము, జలమున అభాస్వర శుక్లము, పృథివిలో శుక్లాద్యనేక రూపములు ఉండును. రూపము మూడు భూతములలో ఉండును. రసము జలములో ఉండును. ఈ రసము మధురాది భేదములలో ఆరు విధములుగా ఉండును. అనురఖి సురభి అను రెండు విధముల గంధము భూమిలో ఉండును. తన్మాత్రము, తద్భూత గుణము, కరణము, పోషణము అనునవి భూతముల వైశిష్ట్యము. భూతమూలము విశేష రహితముగా ఉండును. ఈ అయిదు భూతములు అంతట సన్నివిష్టములు అగును. స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తంతయు పంచ భూతాత్మకమే అని తెలియుము.

ఈ పంచభూతములు శరీరమున ఏ రూపమున ఉండునో తెలుపును. శరీరమున అస్థిమాంస, కేశ, త్వక్, నఖ, దంతములు పృథివీ రూపములు. మూత్రము, రక్తము, కఫము, స్వేదము, శుక్రము మొదలగు వాటియందు జలముండును. హృదయమున, పంక్తిలో నేత్రములలో పిత్తమున తేజోధర్మము కనపడుచున్నది కావున అగ్ని ఉండును. ప్రాణాదివృత్తి భేదముచే వాయువు ఉండును. అన్ని నాడులలో గర్భవృత్తియొక్క అనుషంగముతో ఆకాశముండును. ప్రయోక్తి నుండి మహివరకు ఉన్న సాధనము అండార్ధము అగును. ఇది ప్రతి ఆత్మలో నియతముగా ఉండును. భోగ భేదమును అనుసరించి నిశ్చయించబడును. ఇట్లు కలా మొదలగు తత్త్వములు ప్రతి జీవునిలో నియతముగా ఉండును. కర్మవశమున అన్ని దేహములలో సంచరించుచుండును. ఇదియే మాయము అనుపాశము. ఈ పాశముతో జగత్తంతయు ఆవరించబడి ఉన్నది. ఇది అశుద్ధము అగుటవలన ఇది మరొక భాగమున భూమినుండి కల వరకుండును. దానిలో భూమండలమున ఉన్నది స్థావర జంగమాత్మకముగా ఉండును. గిరి వృక్షాదులు స్థావరములు. జంగమములు జరాయుజములు, అండజములు, స్వేదజములు అని మూడువిధములు. చరాచర జగత్తులలో ఎనుబది నాలుగు లక్షల జీవరాశులు ఉన్నవి. జీవుడు ఆ జీవరాశులలో తిరుగుచు ఎపుడో ఒకప్పుడు మానవజన్మను పొందును. కర్మవశమున మాత్రమే ఈ జన్మలు లభించుచుండును. మానవజన్మ సర్వార్ధసాధకము. ఆ మానవజన్మ కూడా భారత ఖండమున బ్రాహ్మణాది కులములందు ఎంతో పుణ్యము చేసిననే జన్మించుట సంభవించును. లేనిచో దుర్లభమే అగును. స్త్రీ పురుషుల సంయోగమువలన శుక్రశోణిత యోగముచే పుట్టుక కలుగును. ఒకే బిందువు ద్వయాత్మకముగా గర్భమున ప్రవేశించును. ఆ బిందువులో రజస్సు అధికముగా ఉన్నచో స్త్రీగా, రేతస్సు అధికముగా ఉన్నచో పురుషుడుగా పుట్టును. మలకర్మాది పాశముచే నియంత్రితుడగు ఒక జీవాత్మ కలాతత్త్వముచే కూడి జీవ భావమును పొందును. ఆ గర్భమున తల్లి తీసుకొను అన్నపానాదులచే పోషించబడుచు పక్షమాసాది కాలవశమున శరీరము పెరుగుచుండును. మావిచే కప్పబడి దుఃఖాదులచే పీడించబడుచు గర్భమున నివసించి, పూర్వజన్మలో ఆచరించిన శుభాశుభ కర్మలను చింతించును. మాటిమాటికి పీడించబడుచు దుఃఖించు చుండును. కాలవశమున ఈ శిశువు తల్లిని పీడింపచేయుచు, తాను పీడించబడుచు తలక్రిందులుగా యోనియంత్రము నుండి బయటపడును. బయటపడిన తరువాత క్షణకాలము చేష్టారహితునిగా ఉండును. తరువాత ఏడ్చుటకు సంకల్పించును. తరువాత ప్రతిదినమున పెరుగుచు, బాల్యమును పౌగండమును పొంది తరువాత యౌవనమును పొందును. ఈ లోకమున జీవులకు దేహప్రాప్తి విధానమది. సర్వలోకములకు ఉపకారకము దుర్లభము అగు మానవజన్మను పొందికూడా ఆత్మను తరింపచేసుకొనని వానికంటే పాపాత్ముడు ఎవడు ఉండును? ఆహార నిద్రా భయ మైధునములు పశ్వాది సకల ప్రాణులకు సమానములని చెప్పబడినవి. ఈ నాలుగింటియందే అనురక్తుడగు వాడు ఆత్మఘాతకుడు అగును. మూర్ఖుడు అగును. తన బంధమును ఛేదించుకొనుట మానవధర్మము. దీక్ష చేతనే పాశబంధ విచ్ఛేదము జరుగును. కావున బంధనవిచ్ఛిత్తి కొఱకు మంత్రదీక్షను స్వీకరించవలయును. దీక్షాజ్ఞానమను శక్తిచే బంధనము ధ్వంసమై శుద్ధాత్మతత్త్వమను నామముచే ఈ జీవుడు నిర్వాణ పదవిని చేరును. స్వశక్త్యాత్మిక దృష్టిచే శివుని ధ్యానించును. దర్శించును. స్వహితమునకు పరహితమునకు జీవుడు శివ మంత్రములచే పూజించును. శివుడును సూర్యశక్తి కాంతిచే చేతన నేత్రములు సమర్ధములై ఆత్మగతావృత్తి కలవాడై శివశక్త్యాదులతో చూచును. బోధ అను అంతఃకరణవృత్తి ముఖ్య హేతువు. కావున శాస్త్రోక్త విధానముచే మంత్రదీక్షను స్వీకరించవలయును. తంత్రవిధిచే దీక్షితుడై స్వవర్ణాచారతత్పరుడై నిత్యనైమిత్తికాత్మకమగు అనుష్టానమును ఆచరించవలయును. దీక్షితుడైనను స్వవర్ణాశ్రమ ఆచారములను మనసునకూడా అతిక్రమించరాదు. ఏ ఆశ్రమములో నుండి దీక్షను స్వీకరించునో అతను ఆ ఆశ్రమములోనే ఉండి ఆ ధర్మములను పాలించవలయును. దీక్షను స్వీకరించిన తరువాత చేయు పనులు బంధనమును ఈయజాలవు. మంత్రానుష్ఠాన సంభవమగు కర్మ మాత్రమే ఫలమునిచ్చును. దీక్షితుడైనవాడు ఏ ఏ లోకముల భోగములను అభిలషించునో ఆ భోగానుభవము తరువాత మోక్షమును పొందును. దీక్షను పొందినవాడు నిత్యనైమిత్తిక ధర్మములను ఆచరించనిచో కొంతకాలము పిశాచత్వమును పొంది, అంతమున మోక్షమును పొందును. కావున దీక్షితుడు నిత్య నైమిత్తికములను ఆచరించి తీరవలయును. దీక్షను పొందినపుడు అనుష్ఠానము అనుమానించబడును. నిత్యనైమిత్తికాచారపాలకునికి దీక్ష ఫలించును. దీక్షలో వైకల్యము లేనిచో సద్యోమోక్షము లభించును. అందులో గురుభక్తునికి మరింత నిశ్చితము. దీక్షచే గురుమూర్తిలో ఉన్న శివుడు సర్వానుగ్రాహకుడు అగును. పైకి చూపుట కొరకు కృత్రిమమగు గురుభక్తి కలవానికి దీక్ష నాచరించిననూ నిష్ఫలమగును. ప్రతిక్షణమున ప్రాయశ్చిత్తమును చేయవలసివచ్చును. త్రికరణశుద్ధిగా గురుభక్తి కలవానికి ప్రాయశ్చిత్తమే ఉండదు. ప్రతిక్షణమున సిద్ది కలుగును. శిష్యుడు గురుభక్తి కలిగి తన సర్వస్వమును సమర్పించెడి యెడ వానికి గురువు మిధ్యా మంత్రోపదేశము చేసినచో గురువు ప్రాయశ్చిత్తమును ఆచరించ వలయును. (3/63)