యక్షిణీ మంత్ర సాధన నిరూపణము

సనత్కుమార మహర్షి పలికెను: ఇంతవరకు నీకు సరస్వతీ అవతారములను చెప్పితిని. ఇక ఇప్పుడు సర్వసిద్ధి ప్రదములగు లక్ష్మ్యవతారములను చెప్పెదను. వాణీ మన్మథ శక్తి నామములతో మూడు బీజములు చెప్పబడినవి. దక్షిణామూర్తి ఋషి, పంక్తి ఛందస్సు, బాలాత్రిపుర దేవత. మధ్యాంతములందు శక్తి బీజములు ఉండును. నాభి నుండి పాదముల వరకు మొదటిది. హృదయము నుండి నాభి వరకు రెండవది. శిరస్సు నుండి హృదయము వరకు మూడవది. ఈ మూడిటియందు మూడు బీజములను ఉంచవలెను. మొదటి దానిని వామకరమున దక్షిణ కరమున, రెండవది రెండు కరములందు, మరల బీజ త్రయన్యాసమును శిరస్సున గుహ్యమున, వక్షస్థ్సలముననుంచి నవయోని న్యాసమున తొమ్మిది మార్లు మంత్ర న్యాసమును గావించవలయును. కర్ణములందు, చిబుకమునందు, శంఖములందు, ముఖ పంకజమునందు, నేత్రములందు, నాసికయందు, స్కంధములందు, ఉదరమునందు, కూర్పరములందు, నాభియందు, జానువులందు, లింగమునందు, మస్తకమునందు, పాదములందు, గుహ్యమునందు, పార్శ్వములందు, హృదయమునందు, స్తనములందు, కంఠమునందు, వామాంగాదులందు న్యాసము గావించవలెను. వాగ్భవాద్యమగు రతిని గుహ్యమున, ప్రీతి మత్యాదికమును హృదయమున, కామబీజాదికములను భ్రూమధ్యమున మనోభవమును న్యాసము గావించవలెను. మరల వాగాది వ్యాస త్రయమును గావించవలెను. అమృతేశి, యోగేశి, విశ్వయోని అను మువ్వురిని శిరస్సున వక్త్రమున హృదయమున, గుహ్యమున, పాదము లందు ఉంచవలెను. పంచ బీజాఢ్యమగు వామే శిని మన్మధుని నుండి పంచన్యాసమును గావించవలెను. మాయ, కా, వాక్, లక్ష్మి, కామేశి అనునవి అయిదు బీజములు కలవి. మనోభవ, మకరధ్వజ, కందర్ప, మన్మధ, కామదేవ, స్మరులు వ్యాససిద్ధిదులుగా చెప్పబడిరి. శిరస్సున పాదములందు, ముఖమున, గుహ్యమున హృదయమున ద్రావిణీ మొదలగు బాణ దేవతలను బాణేశా బీజ పూర్వకముగా న్యాసము గావించవలెను. ద్రాం ద్రీం, క్లీం, సం, కం అనునవి బాణేశ బీజములు, ద్రావిణీ, క్షోభిణీ, వశీకరణీ, ఆకర్షణీ, సంమోహినీ అనునవి అయిదు బాణ దేవతలు. మూడవది వాఙ్మధ్యమ మగు కామ బీజముచే షడంగములను కల్పించవలెను. షడ్దీర్ఘ స్వర యుక్తముచే దేవిని ధ్యానించవలెను. రక్త పద్మమున నుండునది రక్తవస్త్ర త్రిలోచన, ఉద్యదర్కనిథ, విద్యాస్వరూపిణి, మాలా భయవరధారిణియగు దేవిని ధ్యానించవలెను. మూడు లక్షలు జపించవలెను. దశాంశమును మోదుగు పూవులచేకాని, హయారి పుష్పములచే కాని మధుర మిశ్రితములుగా హోమము గావించవలెను. నవయోన్యాత్మక యంత్రమును లిఖించి, బయట అష్టదల పద్మమును లిఖించి కేసరములందు స్వరములను, దళములందు అష్టవర్గలను న్యాసముగావించవలెను. దళాగ్రములందు త్రిశూలములను, పద్మమున మాతృతా వృతిని లిఖించిన యంత్రమున షట్ శక్తులకు పూజించవలెను. ఇచ్ఛా, జ్ఞానాక్రియా, కామినీ, కామదాయినీ, రతీ, రతిప్రియ, నందా, మనోన్మని అనునవి తొమ్మిది పీఠశక్తులు. ఈ శక్తులను పూజించి పీఠమంత్రముచే పీఠమును నిర్దేశించవలెను. “సదా శివాయ మహా ప్రేత పద్మాసనాయ నమః” అనునది పీఠ మంత్రము. ఈ మంత్రము పదునారు అక్షరములు కలది. తరువాత మూల మంత్రముచే మూర్తిని కల్పించి దేవిని ఆవాహన గావించి వివిధ ఉపచారములచే పూజించి జపించవలెను. త్రికోణ రూపమగు మధ్య యోని యందు రతి పూర్వీక అగు దేవిని పూజించి, వామ కోణమున రతిని, దక్షిణ కోణమున ప్రీతిని ముందు మనోభవను, యోన్యంతర్భాగమున వహ్నికోణాదులందు అంగములను, అగ్నియొక్క విదిక్కులందు కూడా పూజించవలెను. మధ్యయోనిబయట పూర్వాదిదిక్కులందు అగ్రభాగాన స్మరులను, అష్టయోనులందు బాణ దేవులను, శక్తులను అట్లే పూజించవలెను. సుభగా, భగా, భగసర్పిణీ, భగమాలా, అనంగా, నగాకుసుమా, అనంగ మేఖలా, అనంగమదనా అనునవి అష్టశక్తులు. పత్రములందు పద్మకేసర గతులగు బ్రాహ్మీ ముఖులగు భైరవులను పూజించవలెను. దళాగ్రములందు అష్ట పీఠములు ఉంచవలెను. మొదటిది కామరూపము మలయము, కోల్లగిరి, చౌహారము, కులాంతము, జాలంధరము, ఉన్నసము, కోట పీఠము అనునవి అష్ట పీఠములు. భూ గృహమున దశ దిక్కులందు హేతుకుని, త్రిపురాంతకుని, వైతాళుని, అగ్నిజిహ్వుని, కమలాంత, కపాలులను, ఏకపాదుని, భీమరూపుని, విమలుని, హాటకేశ్వరుని పూజించి వారి వారి దిక్కులందు శక్రాదులను సాయుధులను పూజించ వలెను. దాని వెలుపల బటుకుని యోగినిని క్షేత్ర నాయకుని పూజించవలెను. విదిక్కులందు గణేశుని వసువులను, సూర్యులను, శివులను అర్చించవలెను. ఇట్లు బాలా త్రిపురను సేవించువాడు విద్యాధనములకు అధిపతి కాగలడు. రక్త పద్మములచే హోమముచేసిన స్త్రీలు వశమగుదురు. ఆవాలచే హోమము చేసిన రాజులు వశమగుదురు. నంద్యా వర్తములచే రాజవృక్షములచే, మల్లెలచే, పాటల చంపకములచే, పుష్పకములచే బిల్వ ఫలములచే హోమముచేసిన లక్ష్మి స్థిరమగును. పాలుకలిపిన గుడూచిచే హోమముగావించిన అపమృత్యువును జయించును. దూర్వాహోమముచేత అర్చించిన రోగములులేని ఆయుష్యము కలుగును. చంద్రా గురుసురములచే హెూమము గావించిన జ్ఞానమును కవిత్వమును పొందును. మోదుగు పూవులచే హోమము చేసిన వాక్సిద్ధి, అన్నహోమముచే అన్నము లభించును. ఆవుపాలు కలిపిన పేలాలచే హోమమును చేసిన రోగములను జయించును. రక్తచందన కర్పూర కర్పూరాగురు చందనకేసర మాంసీ చయమును క్రమముగా భాగములను చేయవచ్చును. 1, 1, 1, 9, 4, 8, 7, 4 సంఖ్యలతో భాగములు చేయవచ్చును. శ్మశానమున నల్లటి రాత్రియందు నీహార సౌధమును కుమారిచేత మర్దన చేయించి మంత్రముచే అభిమంత్రించి తిలకమును ధరింప చేయవలెను. ధరించినవానిని చూచిన జనము వశమగును. గజ సింహాది భూతగణము రాక్షసీ గణము శాకినీ గణము కూడా వశమగును. ప్రయోజన సిద్ధి కొఱకు దేవీ శాపమును వర్తింపచేసి ఉత్కీలమును గావించి తరువాత, ఈ జపమును ఆరించవలెను. మొదట జపమున వరాహ భృగు పావకములను జపించి, మధ్యమాది యందు సభోహంసలను, మధ్య మాంతమున పావనుని, ఆద్యంతములలో తృతీయ క్రమముచే ధూమ్రకేతనుని నూరు మార్లు జపించినచో ఈ మంత్రము శాపహీనమై ఫలప్రదమగును. లేదా ఆది బీజమున చరమ బీజమున రేఫా వియోగమును చేయరాదు.

ఈ శాపోద్ధారమునకు మరియొక విధానముకూడా కలదు. ఆద్యము అద్యము, తృతీయము, కాముడు, కాముడు, వాగ్భవము, అంత్యాంత్యము, అనంగుడు, బాలా త్రిపుర శాపము నివృత్తియగును. చైతన్య హ్లాదినీ మంత్రములు జపించినచో నిష్కీలము అగును. మూడు స్వరములు, చేతనా, శాంతి, అనుగ్రహము, తారాది మూడు మంత్రములచే సుదీప్తములను గావించి, మొదట ఆ మంత్రములను జపించవలయును. “వదవద” సుదీర్ఘాంబు స్మృతి కాలములు అనుగాములుగా సనేత్ర సత్యము వాగ్వర్ణాద్యములు క్లేదిని క్లిన్నము కాగా వైకుంఠము, దీర్ఘము, స్వము, సద్యోగాంతిమము, సచంద్రా, నిద్రా, ఈ మంత్రము ఏకాదశాక్షరి. ఇది మధ్యదీపిని. తారము మోక్షమును చేయును. ఇది వర్ణాస్య దీపిని కాదు. దీపిని లేనిదే బాలత్రిపుర మంత్రమును సాధించి ననూ సిద్ధించదు. శత్రుక్షోభ కొఱకు వాగంత్య కామములను జయించవలెను. త్రైలోక్యమును వశము చేసుకొనుటకు కామవాగంత్య బీజములను జపించవలెను. మోక్షము కొఱకు కామాంత్యవాణీ బీజములను జపించవలెను. బాలాత్రిపుర పూజారంభమున త్రివిధ గురువులను పూజించవలెను. దివౌఘము, సిద్ధౌఘము, మానవౌఘమని గురువులు త్రివిధము పరప్రకాశుడు, పరమేశానుడు, పరశివుడు కామేశ్వరుడు, మోక్షము, కామము, అమృతము ఈ ఏడుగురే దివ్యౌఘము. ఆనందప్రద పశ్చిమములు. ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడను అయిదుగురు సిద్ధౌఘులు. స్వగురు సంప్రదాయమును అనుసరించి మానవౌఘములను తెలియవలయును. నవయోన్యాత్మక యంత్రమును మధ్యయోని నుండి లేఖనము ప్రారంభించ వలెను. ప్రదక్షిణా క్రమముచే బీజములను మూడుమార్లు వ్రాయవలెను. గాయత్రియొక్క మూడు మూడు వర్ణములను అష్టపత్రములందు వ్రాయవలెను. వెలుపల మాతృకావేష్టనము గావించి, దాని వెలుపల భూపురద్వయమును వ్రాయవలెను. కామ బీజ లసత్కోణమున పరస్పర వ్యతి భిన్నముగా పత్రమున త్రైపురము జప సంపాత సాధితమును కావించవలెను. అట్లు సాధించిన పత్రమును చేతిలో ధరించినచో ధనమును, కీర్తిని, సుఖమును, సుతులను ఇచ్చును. కామాంతమున “త్రిపురాదేవీం విద్మహే” కనిషంభహింబకం ఖడ్గే సమారూడ సనేత్రాగ్నిం ధీమహి తన్నః క్లిన్నే ప్రచోదయాత్” అనునది బాలాత్రిపుర గాయత్రి సర్వసిద్ధి ప్రద. సుసేవిత.

ఇపుడు నరులకు సిద్ధనిచ్చు మహాలక్ష్మి యొక్క మరియొక అవతారమును చెప్పెదను. “ఓం గిరిజాయై భగవత్యై మహేశ్వర్యై అన్నపూర్ణాయై స్వాహా” అనునది ఇరువది అక్షరములు గల మంత్రము. ద్రుహిణఋషి, ధృతి ఛందస్సు. అన్నపూర్ణ దేవత. షడ్దీర్ఘాఢ్యమగు హృల్లేఖ బీజముచే షడంగ కల్పన గావించవలెను. ముఖనా సాక్షి వర్ణాంస గుదములను నవాంగములందు న్యాసమును చేయవలెను. తొమ్మిది పదములు. ఇపుడు ఆ వర్ణముల సంఖ్యను చెప్పెదను. 1, 11, 1, 2, 4, 4, 4, 2. ఇవి వర్ణ సంఖ్యలు. తరువాత సురేశ్వరిని ధ్యానించవలెను. స్వర్ణ కాంతులీను అంగములు కలది, త్రినయన, వస్త్రాలంకార శోభిత, భూమా సంయుత, స్వర్ణామత్ర కరాంబుజ యగు దేవిని ధ్యానించి ఒక లక్ష జపమును గావించి, పదివేలు నేయి కలిపిన పొంగలిచే హోమమును గావించవలయును. జయాది నవశక్తియుతమగు పీఠమును పూజను చేయవలెను. త్రికోణము, చతుష్పత్రము, అష్టపత్రము, షోడశ పత్రములు గల భూపుర యుతమగు యంత్రమున మాయచే మంత్రదానమును చేయవలెను. అగ్న్యాది కోణత్రి తయమున శివరాహ మాధవులను వారి మంత్రములచే పూజించవలెను. ఆ మంత్రములను ఇప్పుడు చెప్పెదను. మను చంద్రాఢ్యమగు ప్రణవము, గగనము హృదయము, శివా, మారుతము ఇది శివమంత్రము ఏడక్షరములు కలది. వారాహ నారాయణ మంత్రములను మొదట ఉచ్చరించవలెను. షడంగములను పూజించి వామ దక్షిణము లందు భూమిని లక్ష్మిని ఆయా మంత్రములచే అర్చించవలెను. ఇపుడా మంత్రములను చెప్పెదను. “అన్నం దేహి అన్నం మే దేహి అన్నాధిప! నయేమ మన్నం ప్రాణం నాపయ స్వాహా” అనునది ఇరువదిరెండు అక్షరముల మంత్రము. భూపూజయందు భూ సంపుటముచే జపించవలెను. లక్ష్మీ పూజయందు శ్రీపుటము స్మృతిల భాను చంద్రయుతము. భూ బీజము. శ్రీ బీజమును ముందే చెప్పితిని. మంత్రాదిలో నున్న నాలుగు బీజములు పూర్వములుగా పూజించవలయును. చతుప్పత్రములందు నాలుగు శక్తులుండును. పర, భువనేశ్వరి, కమల సుభగయని, అష్టపత్రములందు బ్రాహ్మి మొదలగు వారిని పూజించవలెను. షోడశ పత్రములందు మానదా, తుష్టి, పుష్టి, ప్రీతి, రతి, హ్రీ, శ్రీ, స్వధా, స్వాహా, జ్యోత్స్నా, హైమవతీ, ఛాయ, పూర్ణిమా, సంహతి, అమావాస్య అనువారిని మంత్రాధి దేవతలను ప్రాణ ప్రతిష్ఠాపూర్వకముగా పూజించవలెను. భూపురము నందు లోకపాలురు, వారిముందు వారి అస్త్రములు ఉండును. ఇట్లు జపాదులచే మంత్రము సిద్ధించినచో ధనరాశులచే కుబేర సదృశుడగును. జనులచే పూజించబడును.

ఇపుడు మరియొక లక్ష్మవతారమును చెప్పెదను. ప్రణవము శాంతి అరుణ క్రియాఢ్యమగు చంద్రభూషితములు బగళాముఖి సర్వాంతమున ప్రదినీయుతమగు ఇందిర జరాయుతమగు పీతా ప్రతిష్ఠ దీర్ఘేందు తరువాత బీజము ఓంకారము స్వాహా అనునది బలా మంత్రము నారదర్షి బృహతీ ఛందస్సు, 2, 5, 5, 9, 8 వర్ణములచే అంగములను కల్పించి, పీతాంబరను స్వర్ణాసనస్థను, హోమాభను, స్తంభినిని, ఇందు శేఖరను. ముద్గర పాశవజ రసనలను ధరించిన దేవిని ధ్యానించి లక్ష జపించ వలెను. బాలా పీఠమున ఈ దేవిని పూజించవలెను. చందనాగరు చంద్రాదులచే పూజించుటకు యంత్రమును లిఖించవలెను. త్రికోణ, షడ్దల, అష్టదల, షోడపత్ర పీఠమున పూజించ వలెను. మంగల, స్తంభినీ, జృంభిణి, మోహిని, వశ్యా, చలా, బలాకా, కల్మషా, ధాత్రీ, కలనా, కాలకర్షిణీ, భ్రామికా, మందగా, భోగస్ధా, భావికా, షోడశీ అను వారిని భూగృహముయొక్క నాలుగు దిక్కులందు పూజించవలెను. గణేశుని, బటుకుని, యోగినులను, క్షేత్రపాలకుని పూజించవలెను. వారి వెలుపల స్వాయుధ సముపేతులగు ఇంద్రాదులను పూజించవలెను. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత సాధకుడు దేవతాదులను స్తంభింపచేయవచ్చును. పీత వస్త్రమును ధరించి, పీతవర్ణాసనమున కూర్చుండి పీతమాల్యములను ధరించి, పీత చందనమును వ్రాసుకొని, పచ్చని పుష్పములచే పచ్చనిమాలలచే దేవినిపూజించి పసుపు కొమ్ములచే చేసిన జపమాలచే జపించవలెను. పాలమధ్యన ఉంచిన పీతవర్ణదేవిని ధ్యానించుచు పదివేలు జపించవలెను. మూడు మధువులు నేయి కలిసిన నువ్వులచే హోమము చేసిన నరులు వశమగుదురు. త్రిమధుర మిశ్రితములకు లవణములచే హోమమును గావించిన ఆకర్షణ కలుగును. నూనె కలిపిన నింబ పత్రములచే హోమము విద్వేష కారకము. హరిద్రలచే హోమము శత్రు స్తంభనము గావించును. రాత్రిపూట అంగార ధూమము, రాజులు, మహిష గుగ్గులులను శ్మశానాగ్నిలో హోమమును గావించిన త్వరలో శత్రునాశము జరుగును. గరుడ గృధ్రకాహకటుతైలము, విభీతకము గృహ ధూమము చితాగ్నిలో హోమము గావించినచో శత్రూచ్చాటకము జరుగును.

దూర్వా గుడూచీ లాజములను మధుర త్రయ మిశ్రితములుగా చేసి హోమము గావించిన వానిని చూచిననూ అఖిల రోగ శాంతి కలుగును. పర్వతాగ్రమున, మహారణ్యమున, నదీసంగమమున, శివాలయమున బ్రహ్మచర్యా రతుడగుచు అఖిలసిద్ధి కొఱకు లక్ష జపించవలెను. ఒకే వర్ణముగల గోవు యొక్క పాలను శర్కరా మధు మిశ్రితముగా మూడు వందల మార్లు మంత్రించి పానము చేసినచో శత్రుపరాభవమును తొలగించును. తెల్లని మోదుగు చక్కతో సుందరమగు పాదుకలను సిద్ధముచేసి లత్తుకపూసి లక్ష జపముతో మంత్రించవలెను. ఆ పాదుకలను అధిరోహించినచో ఒక క్షణములో నూరు యోజనములు వెళ్ళ గలడు. పాదరసమును, శిలను, తాలపిష్టమును మధు మిశ్రితముగా చేసి లక్ష జపముతో మంత్రించి శరీరమంతట వ్రాసుకొనవలెను. అట్లు చేసినవాడు అదృశ్యమగును. ఈ ఆశ్చర్యమును చూడుము. సాధ్యనామ సమన్వితముగా షట్కోణ బీజమును వ్రాసి హరితాల నిశా చూర్ణములచే ఉమ్మెంత రసముచే కలిపి శేషాక్షరములచే తేబడి భూగృహమున స్థాపించబడి ప్రాణ ప్రతిష్ఠ గావించి, పీత సూత్రముచే వేష్టించివలెను. తిరుగుచున్న కుమ్మరి చక్రము మీదనున్న మట్టిని తీసుకొని సుందరమగు ఋషభమును చేసి యంత్ర మధ్యమున ఉంచి, ఆ ఋషభమును ప్రతిదినము పూజించవలెను పూజించే ముందు ఋషభమును హరితాళముచే లేపన గావించవలెయును. ఇట్లుచేసిన శత్రువుల వాక్కును, గతిని, కాశ్యపరంపరను స్తంభింప చేయును. వామహస్తముచే శ్మశాన భూమిలో ఉన్న కర్పరమున తీసుకొని, చితిలోనున్న అంగారముచే అచట యంత్రమును లిఖించి, మంత్రించి భూమిలో స్థాపించినచో శత్రుగతిని స్తంభింప చేయును. ప్రేతవస్త్రమున బొగ్గుతో యంత్రమును లిఖించి పీత సూత్రముచే పరివేష్టించి మండూక వదనమున ఉంచి, పచ్చని పూవులచే పూజించినచో శత్రువాక్కును స్తంభింపచేయును. దివ్యత్వమున్న భూమియందు యంత్రమును లిఖించవలయును. పాత్రలచే మార్జన చేసినచో దివ్యత్వమును స్తంభింప చేయును. ఇంద్ర వారుణికామూలమును ఏడుమార్లు మంత్రించి జలమున పడవేసినచో జలస్తంభనమును గావించును. ఇంకనూ ఏమి చెప్పవలయును? సాధకుడు మంత్రమును చక్కగా ఉపాసించినచో శత్రువుల గతి బుద్ధ్యాదులను స్తంభింపచేయవచ్చును. ఈ విషయమున సంశయము పొందపనిలేదు. (3/86)