యముని బ్రహ్మలోకగమనము

ఋషులు పలికిరి :శ్రీహరి సంతోషించి సమీహితమునిచ్చు శ్రీమహావిష్ణువు ఆరాధనను సవిస్తరముగా తెలుపుము. లక్ష్మీపతి, జగన్నాధుడు సకల పాపనాశనుడు యే పూజతో ప్రీతి చెందునో తెలుపుము. శ్రీహరి ప్రీతితో చరాచర జగత్తు ప్రీతి చెందును.

సౌతి పలికెను: ఓ మహారాజా!  హృషీకేశుడు భక్తిచే గ్రహించబడును. ధనములచే శివుడు కాడు. భక్తిచే పూజించినచో శ్రీ మహావిష్ణువు మనోరథములను ప్రసాదించును. కావున సర్వ కాలములందు శ్రీహరి యొక్క భక్తి కలిగి యుండవలెయును. ఎవరు పూజించిననూ జగన్నాథుడు క్లేశములను హరించును. దప్పిగొనినవాడు నీటితో సంతోషించినట్లు పూజచే శ్రీహరి సంతోషించును. ఈ విషయమును ఒక పాపనాశకమగు అఖ్యానముకలదు. రుక్మాంగద మహారాజునకు గౌతమ ఋషికి జరిగిన సంవాదము కలదు. రుక్మాంగదుడను మహారాజు క్షమశాలి. శ్రీమన్నారాయణ ప్రియభక్తుడు, ఏకాదశీ వ్రతము నాచరించువాడు. శ్రీహరికంటే ఇతర దైవములను చూడనివాడు. రుక్మాంగద మహారాజు ఏకాదశీ దినమున ఏనుగుపై భేరినుంచి ఇట్లు చాటించెడివాడు. "ఎనిమిది సంవత్సర ములు పైబడిన వారి నుండి ఎనబది యైదు సంవత్సరముల వయసు కలవారు ఎవరైన శ్రీహరి వాసరమగు ఏకాదశినాడు భుజించినచో వారు శిక్షాపాత్రులు, వధ్యులు, నగరమునుండి బహిష్కృ తులగుదురు. అట్లు భుజించువాడు తండ్రియైననూ, సోదరుడైననూ, పుత్రుడైననూ, భార్య అయిననూ, మిత్రుడైనను దొంగవలె నిగ్రహించదగువాడగును. ఏకాదశినాడు బ్రాహ్మణులకు దానములనిండు. గంగాజలమున స్నానము చేయుడు. ఇట్లు నా ఆజ్ఞను పాలించి నారాజ్యమును అనుభవించుడు” ఇట్లు శుక్ల పక్షమున కృష్ణపక్షమున బంగారు తొడుగు తొడిగిన భేరిపై భూమండల మంతటా చాటించుటచే శ్రీహరిలోక మార్గము వెళ్ళువారిచే సంకులమాయెను. రుక్మాంగద రాజ్యమున మరణించువారందరు శ్రీ విష్ణు లోకమునకు చేరుచుండిరి. రాజాజ్ఞ అను భయముచే లేదా మిషచే నైననూ ద్వాదశీ వ్రతము ఆచరించుచున్ననూ శ్రీహరిమందిరమును చేరుచుండిరి. ఏకాదశినాడు భుజించువాడు పృధివియందుగల పాపమును భుజించువాడే. ఏకాదశినాడు భుజించనివాడు భూమియందుగల ధర్మము నంతటిని పొందుచున్నాడు. బ్రాహ్మణుని చంపరాదు అనునది వైదిక స్మృతి. శుక్ల కృష్ణ పక్షములలోని ఏకాదశులందు భుజించరాదు అనునది రుక్మాంగదస్మృతి. కావున సూర్య పుత్రుడగు యమధర్మరాజు వికారమును పొందెను. చిత్రగుప్తుడు కూడా వ్రాయుట నాపి విశ్రాంతి తీసుకొనెను. పూర్వమున చేసిన కర్మల వలన కలుగు పాపములను వ్రాసి కూడా ఇపుడు తుడిచివేసెను. మానవులు స్వధర్మాచరణతో క్షణకాలమున విష్ణు లోకమునకు వెళ్ళుచుండిరి. నరకములు అన్నియూ పాపప్రాణిరహిత ములై శూన్యము అయ్యెను. ద్వాదశాదిత్యుల తాపముతో యమలోక మార్గము భగ్నమాయెను. జనులందరూ గరుడ వాహనారూఢులై శ్రీహరి లోకమునకు వెళ్లుచుండిరి. దేవ లోకములు కూడా శూన్యములు అయ్యెను. పితృయజ్ఞములు, దేవపూజలు, తీర్థపూజలు, దేవతాసత్కారములు సన్నగిల్లెను. రుక్మాంగద రాజ్యములోని ప్రజలు ద్వాదశీ వ్రతమును తప్ప ఇతర పూజలను వ్రతములను తెలియకుండిరి. ఇట్లు స్వర్గము నరకము శూన్యముకాగా నారదమహర్షి యమధర్మరాజు సమీపమునకు వెళ్ళి ఇట్లు పలికెను.

నారదమహర్షి పలికెను: ఓ రాజా?   నరకమున ఆక్రందనలు వినవచ్చుటలేదు. చిత్రగుప్తుడు పాపాత్ముల పాపములను వ్రాయుటలేదు. మునివలె మౌనముగా కూర్చొని ఉన్నాడు. పాపులెవరూ నీ లోకమునకు వచ్చుటలేదు. మాయా కర్మపరులు దుష్టకర్మరతులు ఎవరూ వచ్చుటలేదు. ఏమి కారణము?   అని ఇట్లు నారద మహర్షి అడుగగా యమధర్మరాజు కొద్ది దైన్యముతో నిట్లు పలికెను.

యమధర్మరాజు పలికెను: ఓ నారదా!  ఇపుడిక భూ మండలమున ఉన్న రాజు పురాణ పురు షోత్తముడగు శ్రీహరియందు భక్తి కలవాడు. అతను పటహముతో ప్రజలను ఏకాదశినాడు భుజించ రాదని బోధించుచున్నాడు. భుజించినవారిని దండించెదనని హెచ్చరించుచున్నాడు. అతని భయ ముతో ప్రజలందరు ద్వాదశీ వ్రతమును ఆచరించుచున్నారు. మిషతో అయినను ద్వాదశీ వ్రతమును ఆచరించుటచే నరకమునకు రాక విష్ణు లోకమునకు వెళ్ళుచున్నారు. ద్వాదశీ సేవనము వలన హరి మందిరమునకు వెళ్ళుచున్నారు. కావున ఆ రాజు ఇప్పుడు నాలోక మార్గమును లోపింపచేసెను. దేవలోకములను నరకలోకమును శూన్యము చేసెను. వారికి విశ్రాంతి కలిగినది. వ్రాసిన దానిని తుడిచి వేయుచున్నారు. ఇది అంతయు ఏకాదశ్యుప వాసమహిమయే. బ్రహ్మహత్యాది పాపములను అనుభవించకుండగనే ఏకాదశీ ఉపవాసము లచే హరి మందిరమునకు వెళ్ళుచున్నారు. ఇపుడు నేను కాష్ఠ మృగమువలె అయితిని. నేత్ర హీనుడును కర్ణహీనుడను అయితిని. సంధ్యాహీనుడుగు ద్విజునివలె అయితిని. స్త్రీ జితుడగు పురుషునివలె నపుంసకుడగు స్త్రీపతివలె కామనలను వదిలి ఇటువంటి లోకపాలత్వమును వహించుచున్నాను. కావున నా దుఃఖమును తెలుపుటకు బ్రహ్మ లోకమునకు వెళ్ళుచున్నాను. ఒక కార్యమున నియమించబడినవాడు వ్యాపార శూన్యునిగా స్వామి ధనమును అనుభవించినచో అతను నరకమునకు వెళ్ళును.

సౌతి పలికెను: యమధర్మరాజు ఇట్లు పలికి నారదునితో, చిత్రగుప్తునితో కలిసి బ్రహ్మలోకమునకు వెళ్ళెను. అచట యమధర్మరాజు మూర్తిమంతులకు మూర్తిరహితులకు ప్రీతిపాత్రుడు, వేదప్రియుడు, జగద్బీజభూతుడు, అందరికి ప్రపితామహుడు, స్వయంభూ, భూత నిలయుడు, ఓంకారాఖ్యుడు, కల్మషరహితుడు, శుచి, శుచిపదుడు, హంసరూపుడు, దర్భలాంఛనుడు లోకపాలురచే దిక్పాలురచే సేవించబడువాడు, ఇతిహాసములు, పురాణములు, వేదములు, సముద్రములు, నదులు, సరో వరములు, అశ్వత్థాది వృక్షములు, వాపీకూపతటాకాదులు, పర్వతములు, ఆహోరాత్రములు, పక్ష ములు, మాసములు, సంవత్సరములు, కలాకాష్ఠ నిమేషములు, ఋతువులు, అయనములు, యుగ ములు, మన్వంతరములు, కల్పములు, నిమేషములు, ఉన్మేషములు, ఋక్షములు, యోగములు, కరణములు, పౌర్ణములు, అమావాస్యలు, సుఖములు, దుఃఖములు, ద్వంద్వములు, అన్నింటి ఆకారములను ధరించి సేవించుచుండగా, ధర్మపాలకుడుగా ఉన్నవాడు, కర్మవిత్తులగు పురుషులచే, అనురూపులచే సేవించబడువాడు, సత్వరజస్తమో గుణములచే సేవించ బడుచు, ఆనందముతో విశ్వాత్మ, పరమ ధర్మమును ఆశ్రయించి ఉన్నవాడు, లోకకర్త, కటు కావ్యాది దురుక్తులు మూర్తిమత్తులై ఉపాసించుచుండగా విరాజిల్లు బ్రహ్మను, అసీనుని సందర్శించెను. వారిమధ్యకు సిగ్గుపడుచున్న పెళ్ళి కూతురువలె ప్రవేశించెను. క్రింద చూచుచు తలవంచుచు చూచుచుండెను. అట్లు చిత్రగుప్తుడు నారదుడు వెంటరాగా ప్రవేశించిన యముని అచటి వారు చూచి ఆశ్చర్యము చెంది ఏమిటి?   యముడు ఇచట ఉన్నాడు అనుకొనిరి. లోకకర్తయగు బ్రహ్మనుచూడవచ్చెను. ఇతను వ్యాపార రహితముగా ఒక క్షణముకూడా ఉండడు. ఎపుడూ కార్య వాపృతుడుగా ఉండును. అటువంటి వాడు ఎందుకొచ్చెను? దేవతలు కుశలముగా ఉన్నారా? అట్లే చిత్రగుప్తుడు కూడా వ్రాసినదానిని తుడిచి దీనముగా వచ్చియున్నాడు. ఇతని పటమును ఇంతవరకు ఎవ్వరూ తుడిచి ఉండలేదు. ఇదివరకు చూడనిదానిని వినని దానిని చూచుచున్నాము అని ఇట్లు అనుకొనుచున్నవారు, చూచు చుండగా యమధర్మరాజు మూలమును ఛేదించిన వృక్షము వలె కాపాడుము, కాపాడుము" నాకు పరాభవము జరిగినది. నా పటములోని వ్రాతను తుడిచి వేసిరి. నీవు నాథుడవు ఉండగా దిక్కులేని వానినైతిని. అని ఇట్లు అనుచు బ్రహ్మముందు పడెను. ఇట్లు నిశ్ఛేష్టునిగా యమధర్మరాజు ఉండుటను చూచి సభలో కోలాహలము మొదలాయెను. ఇతను స్థావర జంగమాత్మకములగు సకల లోకములను ఏడిపించువాడు ఈనాడు ఎందువలన తానే రోదించుచున్నాడు. 'జనులకు సంతాపమును కలిగించువాడు తానే స్వయముగా పరితపించును, అనుమాట యథార్థముగా ఉన్నది. దుష్కృతమును చేయువాడు మంచిని పొందజాలడు కదా?   అనుకొనిరి. అంతట వాయువు వారిని వారించెను. సమచిత్తులగు లోకుల, బ్రహ్మ అభిప్రాయమును తెలుసుకొని అట్లు చేసెను. శంకను వారించి యమధర్మ రాజును మెల్లగా లేపి ఉదారబుద్ధి అగు వాయువు పారిపోవుచున్న భయపడుచున్న, యమధర్మరాజును బలిష్ఠములైన తన భుజములచే స్థానమున కూర్చుండబెట్టెను. మరియు వ్యోమ మూర్తి కాయస్థుడు అగు సూర్యపుత్రుని గూర్చి ఇట్లు పలికెను. నిన్నెవరు అవమానించిరి. ఎవరు నిన్ను స్థానభ్రష్టునిచేసిరి?   నీ లోకపటమును ఎవరు తుడిచివేసిరి?   దీనినంతటిని వివరముగా చెప్పుము. సర్వనాధుడు నీకు మరల ఉన్నతిని ప్రసాదించగలడు. నీ హృదయములోని దుఃఖమును నశింపచేయగలడు అని ఇట్లు వాయువు ఓదార్చగా యమధర్మరాజు అతని ముఖమును చూచుచు జగద్గురువుతో మెల్లగా ఇట్లు పలికెను. (II/3)