రుక్మాంగద ధర్మాంగద సంవాదము

సౌతి పలికెను: రుక్మాంగద మహారాజు ఇహలోకమున మానుష భోగములను అనుభవించి, పీతాంబరధరుడగు శ్రీహరిని బహువిధములుగా పూజించి, రణశీలులగు శత్రువుల శిరస్సున పాదమును ఉంచి యమలోక మార్గమును శూన్యము గావించి, యముని గెలిచి, వైకుంఠమార్గమును మానవులతో సంపూర్ణము గావించి, సమయమును చూచి తనయుడగు ధర్మాంగదుని పిలిచి ఇట్లు పలికెను. ఓ పుత్రుడా?   సమగ్రముగా వసు సంపూర్ణమగు సమస్త భూమండలమును ధర్మబుద్ధి కలవాడవై నీ పరాక్రమముతో పరిపాలించుము. సమర్థుడు అగు పుత్రునికి రాజ్యమును ఈయని వాని ధర్మము, కీర్తి నశించును. సమర్థుడగు పుత్రునివలస సుఖమునుపొందని తండ్రి ఈ మూడు లోకములందు మహాపాతకి అగును. తండ్రి భారమును భరించగల సామర్థ్యము ఉండి కూడా తండ్రి భారమును వహించని వాడు తల్లికడుపుకు బాధకలిగించు, విషరహితమగు సర్పము. తండ్రికంటే అధికమగు కీర్తిని సంపాదించిన పుత్రుడు సూర్యుడు తన కిరణములతో ప్రకాశింప చేయునటుల ఈ లోకమును ప్రకాశింపచేయును. పుత్రుని అవినీతివలన రాత్రిపూట తండ్రి నిదురించనిచో ఆ పుత్రుడు ప్రళయకాలము వఱకు నరకమున వసించును. తండ్రిమాటను ఆదరముతో ఇంటిలో ఆచరించు పుత్రుడు దేవతలచే స్తుతించబడుచు దేవ సాయుజ్యమును పొందును. కావున పుత్రా!  నేను ప్రజారక్షణార్థము భూమండలమున కర్మలలో ఆసక్తుడనై నిదురించ లేదు. భుజించలేదు. స్వేచ్ఛగా పాలనలో ఉంటిని. నీవు అసమర్థునిగా ఉన్నపుడు నేను సుఖమును పొందలేదు. విష్ణు వాసరమున భుజించువారిని నిగ్రహించుటలో ప్రయత్నించితిని. ప్రజలలో కొందరు శివభక్తి పరాయణులు, కొందరు సూర్య భక్తులు, కొందరు బ్రహ్మ భక్తులు, మరికొందరు పార్వతీ భక్తులు. ప్రాతఃకాలము సాయంకాలము ఆసీనులై అగ్నిహోత్రములను ఆచరించుచు ఉండిరి. బాలుడుకాని, వృద్ధుడు కాని, వృద్ధురాలుకాని, కుమారికాని, రోగికాని, అంగవికలులుకాని ఉపవసించ లేరు అని చెప్పువారిని నిరసించి పురాణవచనములచే చాలాదినములు బోధించి ప్రబోధించి, ప్రజా సుఖము కొరకు, నిగ్రహించి హరివాసరమున నిరాహారులను చేయుచున్నాను. విద్వాంసులను శాస్త్రదృష్టిచే, దండన పూర్వకముగా మూర్ఖులను శాసించి హరివాసరమున అందరిని నిరాహారులను చేసితిని. కావున ఈ భూమి మండలమున నేను సుఖమును అనుభవించలేదు. అయిననూ ప్రజలను కష్టముల పాలుచేయరాదు. తనవారినుండి ఇతరుల నుండి వచ్చు కష్టములనుండి ప్రజలను కాపాడు రాజునకు అన్ని లోకములు అక్షయములని పురాణములలో చెప్పబడినది. కావున నేను ప్రజలకొరకే వ్యవహరించితిని. నా సుఖముకొరకు కాదు. ఇప్పుడు వేట మొదలగు విహారములవలన కలుగు ఆనందమును అనుభవించదలచితిని. అంతేకాని పానమును ద్యూతమును నేనెపుడూ అభిలషించను. పానద్యూతములలో అసక్తుడగు మానవుడు త్వరలో నాశమును పొందును. కావున నీ ప్రతివలన ఇపుడు నేను వేట అనుమిషతో పర్వతములను అడవులను నదులను, బహువిధ సరస్సులను చూచుచు తిరుగుచు ఆనందమును అనుభవించదలచితిని. ఇట్లు నా హృదయమునకల అభిప్రాయమును సమగ్రముగా తెలిపితిని. ఇట్లు చేసినచో నీకు గొప్ప కీర్తి, చేయనిచో నరకప్రాప్తి ఉండును.

ధర్మాంగదుడు పలికెను: ఓ తండ్రీ!  మీరు చెప్పినదంతయూ చేయగలను. మీకు నచ్చిన భోగ ములను అనుభవించుడు. మీరు వహించు రాజ్యభారమును నేను తీసుకొని మీ భారమును తొలగింతును. నాకు మీ ఆజ్ఞను పాటించుట కన్నా మరియొక ధర్మము తెలియదు. ఎన్ని ధర్మములను ఆచరించువాడైననూ పితృవాక్యమును పరిపాలించని వాడు అధోగతిని చెందును. కావున చేతులు జోడించి మీ ఆజ్ఞను పాటింతును. ఇట్లు ధర్మాంగదుడు పలుకగా రుక్మాంగ మహారాజు సంతోషిం చెను. చాలా మృగములున్న అరణ్యములను తెలుసుకొని వెళ్ళదలచెను. ధర్మాంగదుడు కూడా సంతోషముచే ప్రజలను పిలిచి ఇట్లు పలికెను. మీకు హితమును కూర్చి పరిపాలించమని తండ్రి గారిచే నియమించబడితిని. ధర్మమును కోరి నేను పితృవాక్యపరిపాలన గావించవలెను. ఓ ప్రజలారా! పుత్రునికి పితృవాక్య పరిపాలనను మించిన వేరొక ధర్మములేదు. నేను దండధరుడనై పాలించు చుండగా ఎచ్చటా యమధర్మరాజు కనపడకూడదు. ఈ విషయమును తెలిపి మీరు శ్రీహరిని స్మరించవలెను. బ్రహ్మార్పణ విధానముతో జనార్దనుని పూజించవలయును. మమకారమును విడిచి స్వస్వజాతి విహితములైన ధర్మములను అనుసరించి పూజించినచో మీకు అక్షయ లోకములు లభించును. ఈ పితృ మార్గమున కంటే ఉత్తమ మార్గమును మీకు చూపితిని. జ్ఞాన కోవిదులందరూ బ్రహ్మార్పణ క్రియలను ఆచరించుడు. హరివాసరమున భుజించరాదు. దీనివలన పితృ మార్గము శాశ్వతము కాగలదు. మీ బ్రహ్మ స్థితిని విశేషముగా సూచించితిని. కావున తత్త్వమును తెలిసినవారు పునరావృత్తి రహితమగు విధానమును అనుసరించుడు. హరివాసరమున తప్పక ఉపవసించవలెను. ఇట్లు ప్రజలందరికి బోధించి వారిని ఓదార్చి పంపెను. ధర్మాంగదుడు రాత్రికాని పగలుకాని నిదు రించుటలేదు. తన శౌర్యముతో భూమిని నిష్కంటకముగా చేయుచు అంతటా తిరుగుచుండెను. ఏనుగు కుంభస్థలముపైన భేరిని మ్రోగించుచుండెను. హరివాసరమున భుజించక మమకారరహితులై మనోవాక్కాయ కార్యములందు దేవేశుని చింతించుచుండవలెను. శ్రీహరియే హవ్యమును కవ్యములను వహించువాడు. సూర్యోదయ కాలమునుండి అన్ని కాలములలో శ్రీహరిని స్మరించవలెను. ధర్మార్థకామములను కోరువారందరు శ్రీహరిని స్మరించవలయును. స్వజాతి విహి తమగు ధర్మము కూడా ఇదియే. ఇదియే సన్మార్గముకూడా. శ్రీమన్నారాయణుడే భోక్త. భోగ్యముకూడా ఆ పురుషోత్తముడే. సర్వ కర్మలలో అతనికే వినియోగమును చేయవలయును. ఇట్లు బ్రాహ్మణోత్తములు భేరిపై చాటించుచుండిరి. ఇట్లు రుక్మాంగదుడు ధర్మాంగదుడు ఆచరించు ధర్మమును చూచి, క్రియా యుక్తుడగు పుత్రుని చూచి సంతోషముతో అపర లక్ష్మివలె ఉన్న భార్యను చూచి ఇట్లు పలికెను. ఓ సంధ్యావళీ! నేను ధన్యుడను. నీవు కూడా ధన్యురాలివి. మనిద్దరికి కలిగిన పుత్రుడు ఈ భూమం డలమున చంద్రునివలె స్వచ్ఛముగా ప్రకాశించుచున్నాడు. ఇంతవరకు ఎవరైననూ మోక్షమును చెవులతో వినిరే కాని కనులతో చూచియుండలేదు. కాని సత్పుత్రుని వలన ఆ మోక్షమును మనము పొందగలిగితిమి. పుత్రుడు వినయసంపన్నుడు చక్కని నడవడి శౌర్యము కలవాడు. ప్రతాపము కలవాడైనచో తండ్రికి ఇంటిలోనే మోక్షము కనబడును. ఆనందము బ్రహ్మ స్వరూపము. పుత్రునిచే శతానందమును సత్కర్మలను శుభకర్మలను చేయు తండ్రియే పొందును. స్థావర జంగమాత్మకమగు ఈ ప్రపంచమున తండ్రి భారమును వహించు పుత్రునితో సమాన మగునది వేరొకటిలేదు. కావున నేను ప్రజా రక్షణకొరకు పాప విముక్తుడనై సంతోషముతో మృగములను శిక్షించుటకు విహారశీలినై అరణ్యమునకు వెళ్ళెదను. స్వేచ్ఛగా అంతటా సంచరించెదను. (II/9)