శిక్షా నిరూపణము

మాంధాత పలికెను: పుత్రుని మాటలను విని రుక్మాంగద మహారాజు ఏమి చేసెను? రుక్మాంగదుని ప్రియురాలగు మోహిని కూడా ఏమి చేసినది? మీరు అమృతము వంటి రుచిగల ఆశ్చర్యమును కలిగించు, సర్వ సందేహములను తొలగించు, పవిత్రమగు అఖ్యానమును చెప్పుచున్నారు.

వసిష్ఠ మహర్షి పలికెను: కుమారుని మాటలను వినిన రుక్మాంగద మహారాజు సంతోషించి ప్రియురాలితో పాటు లేచి ఆ సంపదలను చూచెను. విష్ణు భక్తుడగు మహారాజు ఒక క్షణకాలము సంతోషమున పరవశించెను. వరుణ పుత్రికతో పాటు నాగకన్యలందరిని ప్రేమతో పుత్రునికి భార్యలుగా ఇచ్చెను. మిగిలిన దానవ కన్యలను కూడా ఇచ్చెను. రత్నరాశులను సంపదలను మోహినికి కానుకగా ఇచ్చెను. ఇట్లు ధర్మాంగదుడు సంపాదించిన సంపదను రుక్మాంగద మహారాజు విభాగము చేసి, సకాలమున పురోహితుని పిలిచి ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణోత్తమా? నా పుత్రుడు ఈ కన్యలను పాణిగ్రహణము చేయవలెను. సర్వకామప్రదము శుభకరమగు వివాహ లగ్నమున బ్రాహ్మణులకు గోకాంచన వస్త్రాభరణములను ఇచ్చి, స్వస్తివాచనము గావించి, నా పుత్రుడగు ధర్మాంగదునకు వివాహమును చేయుడు. తండ్రి మందబుద్ధియై పుత్రుని వివాహమును చేయనిచో పదివేల యుగములు నరకమున ఉండును. కావున ధర్మాత్ముడగు తండ్రి పుత్రునకు వివాహమును చేయవలయును. పుత్రుని స్థాపించినచో తనను స్థాపించుకొనువాడే అగును. పుత్రుని వివాహమును జరిపించినచో సర్వ యజ్ఞ ఫలము లభించును. ధర్మమును కోరు తండ్రి గుణవంతుడైనను, గుణ రహితుడైనను పుత్రుని వివాహమును చేయవలెను. పుత్రునకు భార్యలను ధనము నీయని తండ్రి పురుషుడుగా పరిగణించబడడు. ఇహపరములలో నిందించబడును. కావున తండ్రి పుత్రునకు వివాహమును చేయవలెను. పుత్రులు ఆనందయుక్తులుగా నుండునట్లు చూడవలెను. ఇట్లు రుక్మాం గదుని మాటలను వినిన పురోహితుడు సంతోషముతో ధర్మాంగద వివాహమును జరుపుటకు ఉద్యుక్తుడాయెను. ధర్మాంగదుడు బిడియముచే స్త్రీ సౌఖ్యమును కోరకున్ననూ తండ్రి ఆజ్ఞచే వారిని వరుణ కన్యకతో పాటు మనోహరలగు నాగ కన్యలను వివాహము చేసుకొనెను. యధావిధిగా వారిని వివాహమాడి సంతోషముతో గోరత్న ధనములను బ్రాహ్మణులకు దానము గావించెను. ఇట్లు వివాహమాడి తల్లిదండ్రులకు పాదిభివందనమును గావించెను. అపుడు తల్లియగు సంధ్యా వలితో ధర్మాంగదుడు ఇట్లు పలికెను. ఓ తల్లీ! తండ్రి ఆజ్ఞచే నాకు వివాహము జరిగెను. వివాహము చేసుకొన వలెనని నా మనసులో లేకుండెను. జ్ఞాని అవ్యయుడు అగు తండ్రిని సేవించ వలెను అనియే నా కోరిక. నాకు దివ్య భోగములపైకాని స్వర్గముపైకాని ఆశలేదు. నేను రాత్రిం బవళ్ళు తండ్రికి మీకు సేవలు చేయుచుందును. ఇదియే నా కోరిక.

సంధ్యావలి పలికెను: ఓ పుత్రా! చాలా కాలము జీవించుము. నీకు నచ్చిన భోగములను అనుభవించుము. తండ్రి అనుగ్రహముచే దీర్ఘాయుష్మంతుడవై నా మనసునకు ఆనందమును కలిగించుము. గుణవంతుడవగు నీచే నేను సుపుత్రిణినైతిని. నేను అందరు సవతుల హృదయములలో నిలచితిని. ఇట్లు పలికి అలింగనము చేసుకొని, శిరసు మూర్కొని, పుత్రుని రాజ్య కార్యములను చూచుటకు పంపెను. ఇట్లు తల్లి ఆజ్ఞను పొంది, ఇతర మాతృ దేవతలకు కూడా నమస్కరించి, పిత్రాజ్ఞ పాలకుడై సకల రాజ్య తంత్రములను చూచుచుండెను. దుష్ట నిగ్రహమును శిష్ట పరిపాలన మును చేయసాగెను. అన్ని దేశములలో తిరుగుచు, అన్ని పనులను చూచుకొనుచు, ప్రతినెలకొకసారి అన్ని కార్యములను సమీక్షించుచుండెను. హస్త్యశ్వములను పోషించుచుండెను. చార చక్రమును సమీక్షించుచుండెను. వాద సంవీక్షణమును, తులామాన పరీక్షణమును ప్రతిదినము చేయుచుండెను. ప్రతి ఇంటిలోను ప్రతి నరుని కాపాడుచుండెను. పాలు త్రాగు శిశువులు పాలులేనివాడై ఏడ్చుటలేదు. కోడలిచే అవమానించబడి ఏ ఒక్క అత్తకూడా రోదించుట లేదు. సమర్ధుడగు పుత్రుడెవ్వరూ తండ్రిని యాచించుట లేదు. ధర్మాంగదుని రాజ్యమున ఏ ప్రాంతమున కూడా వర్ణసంకరము జరుగలేదు. ప్రజలెవరూ సంపదను దాచుకొనుట లేదు. ఎవ్వరూ ధర్మమును నిందించుట లేదు. ముత్తయిదువయగు స్త్రీ రవిక లేకుండగా ఉండుట లేదు. నా రాజ్యమున స్త్రీలు ఇంటి నుండి వీధిలోనికి రారాదు. భర్తృహీనలు సకేశలుగా, భర్తృమతులు వికేశలుగా ఉండరాదు. వ్రతము చేయువాడెవడు ఆక్రోశించరాదు. నగరమున యుద్ధములు జరుగరాదు. సామాన్య వృత్తులు కల వారెవ్వరూ దానములు చేయక నా నగరమున ఉండరాదు. గోపాలకుడు నగరమున ఉండరాదు. ఉపదేశము చేయువాడు గుణహీనునిగా ఉండరాదు. శాస్త్ర జ్ఞానములేని ఋత్విజులు నా నగరమున ఉండరాదు. నీలిని సిద్ధము చేయువాడు, నీలి రంగాతి సేచకుడు నానగరము నుండి బహిష్కృతులు కావలెను. అట్లే మద్యమును చేయువాడు కూడా నగరము నుండి వెడలగొట్టబడవలెను. నిష్ప్రయోజనముగా మాంసమును భుజించువానిని, పృష్ఠమాంస ప్రియుని, భార్యను విడిచినవానిని నా రాజ్యము నుండి వెడలగొట్టవలెను. శ్రీమహావిష్ణువును విడిచి ఇతర దేవతలను ఆరాధించువానిని, గర్భవతి యగు యువతిని సంగమించు వానిని, ప్రసవించిన యువతిని పొందువానిని దండించవలెను. వధించవలెను. (II/21)