తీర్ధ యాత్రా వర్ణనము

మోహిని పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! కురుక్షేత్రమున ఉన్న వనములేవి ? నదులెన్ని? ఎన్ని తీర్ధములు కలవు ? వాటి నన్నిటిని గూర్చి నాకు క్రమముగా తెలుపుము. నాకు ఉత్తమ గతిని ప్రసాదించు గురువు నీవేకదా!

వసువు పలికెను: ఓ మోహినీ! పుణ్యప్రదమగు కురుక్షేత్ర యాత్రా విధానమును చెప్పెదను. వినుము. ఈ యాత్రను ఆచరించినవారు ఉత్తమ గతిని పొందెదరు. ఈ క్షేత్రమున ఏడు వనములు కలవు. పుణ్యప్రదములగు ఆ వనముల పేర్లను చెప్పెదను. కామ్యకవనము, అదితివనము, వ్యాస వనము, ఫలకీవనము, సూర్యవనము, మధువనము, సీతావనము. ఈ వనములన్నియూ మానవ కల్మష నాశకములు. ఈ ఏడు వనములలో అనేక తీర్ధములు కలవు. సరస్వతీ నదీ, వైతరణీ నది, గంగానది, మధుస్రవా, దృషద్వతీ, కౌశికీ, హైరణ్వతీ అని కలవు. వీటిలోఒక సరస్వతి తప్ప మిగి లిన నదులన్ని ఈ వర్షకాలము ప్రవహించు నవి. ఈ నదుల జలములు స్పర్శకు పానమునకు స్నానమునకు పవిత్రములు. పుణ్యక్షేత్ర ప్రభావమువలన ఈ నదులకు కలుషితత్త్వములేదు. మొదట రంతుక క్షేత్రమునకు వచ్చి అచట మహాబలుడు యక్షుడగు ద్వారపాలునికి నమస్కరించి యాత్రను ప్రారంభించ వలయును. తరువాత పుణ్యప్రదమగు అదితి వనమునకు వెళ్ళవలయును. ఇచటనే అదితి సంతానము కొరకు గొప్ప తపమును ఆచరించినది. ఇచట స్నానమాడి దేవమాత అగు అదితిని చక్కగా పూజించిన స్త్రీ సర్వలక్షణయుతుడు, మహాశూరుడగు పుత్రుని ప్రసవించును. తరువాత పరమోత్తమమగు విష్ణు స్థానమునకు వెళ్ళవలయును. ఇదియే విమల తీర్థము. ఇచట ఎపుడూ శ్రీమహావిష్ణువు సన్నిహితముగా నుండును. విమలా తీర్థము స్నానమాడి విమలేశ్వరుని దర్శించి నిర్మలుడై దేవదేవుడగు శ్రీహరిలోకమును పొందును. శ్రీకృష్ణుని బలరాముని ఒకే స్థానమున ఉండగా చూచినవారు సర్వపాపముల నుండి విముక్తులగుదురు. తరువాత లోకప్రసిద్ధమగు పారి ప్లవమునకు వెళ్ళవలెను. ఇచట స్నానమాడి అచమనముచేసి వేదపారగుడగు బ్రాహ్మణుని దక్షిణాదులచే సంతోష పరిచిన బ్రహ్మయజ్ఞ ఫలము లభించును. పాపనాశకమగు కౌశికీ సంగమ మున భక్తిచే స్నానమాడినవాడు ప్రియసమాగమమును పొందును. తరువాత క్షమతో పృథివీ తీర్థమును చేరి భక్తితో స్నానమాడి ఉత్తమగతిని పొందును, ఇచట స్నానమాడినవాడు చేసిన సమస్త పృథివీగత దోషములను ఇచటి దేవి క్షమించును.

తరువాత పుణ్యప్రదమగు దక్షాశ్రమమున దక్షేశ్వరుడగు శివుని దర్శించి అశ్వమేధ యజ్ఞ ఫలమును పొందును. తరువాత శాలకినీ తీర్థమునకు వెళ్ళి అచట స్నానమాడ వలయును. వాంఛి తార్థలాభమునకు హరునితో కలిసియున్న శ్రీహరిని పూజించవలెను. ఇచటినుండి నాగ తీర్థమునకు వెళ్ళి యధావిధిగా స్నానమును ఆచరించి అచ్చటి నాగులకు పెరుగును, నేతిని తినిపించి సర్పములనుండి అభయమును పొందును. తరువాత సాయంకాలము రంతుక తీర్థమున కొచ్చి ఒక రాత్రి నివసించి మరునాడు ద్వార పాలకుని పూజించవలయును. గంధాద్యుపచారములచే బ్రాహ్మణుని పూజించి, భుజింప చేయవలెను. తరువాత లోకత్రయ ప్రసిద్ధమగు పంచనద తీర్థమునకు వెళ్ళవలయును. ఇచట శంకరుడు రాక్షసులను భీతిల్లజేయు పంచనాదములను గావించెను గాన దీనికి పంచనదమను పేరు కలిగెను. ఈ తీర్థము సర్వపాతక నాశనము. ఇచట స్నానముచే దానముచే నరుడు నిర్భయుడగును. తరువాత కోటి తీర్థమునకు వెళ్ళవలయును. ఇచట స్వయముగా రుద్రుడు కోటి తీర్థములను సంగ్రహించి స్థాపించెను. ఈ తీర్థమున స్నానమాడి కోటీశ్వరుడగు శివుని దర్శించి, పంచయజ్ఞ భవపుణ్యమును ఇప్పటి నుండి ఎపుడూ పొందును. ఇచటనే దేవతలందరూ వామనదేవుని ప్రతిష్టించిరి. కావున ఇచట వామనుని పూజించి అగ్నిష్టోమ ఫలమును పొందును. తరువాత అశ్వితీర్థమును చేరి శ్రద్ధ కలిగి జితేంద్రియుడై స్నానమాచరించి యశస్వి రూపవంతుడగును. తరువాత వారాహతీర్ణమును చేరి శ్రద్ధ కలిగి జితేంద్రియుడై స్నానమాచరించి యశస్వి రూపవంతు అగును. తరువాత చేరి విష్ణు ప్రకల్పిత తీర్థమున శ్రద్ధచే స్నానముచేసి సద్గతిని పొందును. తరువాత చంద్రుడు తపమును ఆచరించి ఆరోగ్యమును పొందిన సోమ తీర్థమునకు వెళ్ళి స్నానమాడవలెను. ఇచట గోదానమును చేసినవారికి రాజసూయఫలము లభించును. ఇచటనే భూతేశ్వరుని జ్వాలామాలేశ్వరుని తాపలింగమును పూజించినవారు మరల సంసారమును పొందరు. ఏకహంసమున స్నానమాడినవారు సహస్రగోదాన ఫలమును పొందును. కృతశౌచమున స్నానమాడినవారు పుండరీక ఫలమును పొందును. తరువాత శంకర దేవుని ముంజవట తీర్థమును చేరి, ఒకరాత్రి ఉపవసించి ఈశుని పూజించి గణాధిపత్యమును పొందును. ఇచట ఉపవసించి ద్వారమున ఉన్న యక్షిణిని ప్రార్థించి స్నానమాడి బ్రాహ్మణులను పూజించి మహాపాతక శాంతి కొఱకు భుజింప చేయవలెను. ప్రదక్షిణ మాచరించి పుష్కరమునకు వెళ్ళవలెను. ఇచట స్నానమాడి పితృదేవతలను పూజించి కృతకృత్యుడగును. ఇచట కార్తిక పూర్ణిమరోజున కన్యాదానమును ఆచరించిన వాడు దేవతాను గ్రహమున అభిమత ఫలమును పొందును. ఇచట మహాయక్షు డగు కపిలుడు ద్వారపాలకునిగా ఉండును. పాపములకు విఘ్నములను కల్పించి సుకృతమును ప్రసాదించును. కపిలపత్ని ఖలమేఖల కలదు. దుందుభిని మ్రోగించుచు నిత్యము తిరుగుచుండును. పాపులను స్నానము చేయనీయక వారించును. సుకృతులను తీసుకొని వచ్చును. తరువాత రామహ్రదమునకు వెళ్ళవలయును. ఇచట యథావిధిగా స్నానమాచరించి దేవతలను పితరులను ఋషులను పూజించి భుక్తిని ముక్తిని పొందును. శ్రద్ధతో రాముని పూజించి స్వర్ణ దానమును గావించి ధనవంతుడగును.

వశమూల తీర్థమును చేరి స్నానముచేసి తన వంశమును ఉద్దరించును. కాయ శోధనక తీర్థమున స్నానమాడి శుద్ధదేహుడై శ్రీహరిని చేరును. తరువాత లోకోద్ధార తీర్థమునుచేరి స్నానమాడి జనార్దనుని పూజించి సనాతనమగు శ్రీ విష్ణులోకమును చేరును. తరువాత శ్రీ తీర్థమును చేరి స్నానము ఆచరించి పరమోత్తమమగు సాలగ్రామమును పూజించి నిత్యము తన సమీపముననే శ్రీహరిని చూడగలుగును. తరువాత కపిలా హ్రదమును చేరి స్నానమాడి పితరులను దేవతలను పూజించి సహస్ర కపిలాదాన పుణ్యమును పొందును. ఇచట విశ్వేశ్వరుడుగు కపిలుని యథావిధిగా పూజించి దేవతా సత్కారమును పొందుచు శివలోకమును చేరును. తరువాత సూర్య తీర్థమున ఉపవసించి సూర్యుని పూజించవలయును. ఇట్లు చేసిన అగ్నిష్టోమయజ్ఞ ఫలమును పొంది స్వర్గమును చేరును. ఇచట పృథివి వివరద్వారమున ఉన్న గణపతిని స్వయముగా దర్శించి పూజించి యజ్ఞ ఫలమును పొందురు. దేవీతీర్థమున స్నానమాడిన వారు ఉత్తమ తీర్థమును పొందును. బ్రహ్మావర్తమున నరుడు స్నానమాడి బ్రహ్మజ్ఞానమును పొందును. సుతీర్థకమున నరుడు స్నానమాడి దేవతలను, ఋషులను పితరులను మానవులను చక్కగా పూజించి అశ్వమేధ యజ్ఞఫలమును పొందును. కామేశ్వర తీర్థమున శ్రద్ధా సమన్వితుడై స్నానమాచరించి సర్వవ్యాధి వినిర్ముక్తుడై శాశ్వత బ్రహ్మను పొందును. మాతృ తీర్థమున స్నానముచేసి శ్రద్ధగా పూజించిన వారికి ఏడు తరములవరకు కులమున సంపదలు పెరుగును. తరువాత సీతావనమునకు వెళ్ళి దర్శించినంతనే ఇరువది యొకటి తరములను పావనము చేయును. ఇచట కేశములను విడిచి పాపములనుండి వినిర్ముక్తుడై పరిశుద్దుడగును. ఇచట లోకత్రయ ప్రసిద్ధమగు దశాశ్వమేధిక తీర్థముకలదు. ఈ తీర్థమును దర్శించినంతనే నరుడు పాపములనుండి పరిముక్తుడగును. తరువాత మానుషాహ్వ తీర్థమున స్నాన మాచరించ వలయును. ఇట్లు చేసిన మరల మానవ జన్మ కలుగును. మానుష తీర్థమునకు ఒక కోసు దూరమున ఆపణా తీర్థము కలదు. ఇచట స్నానము ఆచరించి బ్రాహ్మణులకు పాలతో సిద్ధముచేసిన శ్యామాకమును భుజింపచేయవలయును. శ్రాద్ధకర్తకు పాపము నశించును. భాద్రపద కృష్ణపక్షమున పితృపక్ష మహాలయమున చతుర్దశినాడు మధ్యాహ్నమున పిండప్రదానము చేయువారికి ముక్తి లభించును. ఇటనుండి బ్రహ్మస్థానమగు బ్రాహ్మాదుంబరకమును చేరి ఇచట బ్రహ్మర్షి కుండమునందు స్నానమును ఆచరించి సోమయాగ ఫలమును పొందును. వృద్ధ కేదారక తీర్థమున దండి సమన్వితుడగు స్థాణువును చక్కగా పూజించి ఇచ్ఛానుకూలముగా అంతర్ధానమును పొందగలడు. తరువాత కలశీ తీర్థమునకు వెళ్ళి స్నానమాడి అంబికా దేవిని పూజించి సంసార సాగరమును దాటగలడు. కృషిసరమునందు మహేశ్వరుని దర్శించి శివలోకమును పొందును. సరకతీర్థమున మూడు కోట్ల తీర్థములు కలవు సరోమధ్యమున రుద్రకోటి కలదు. సరసునందు స్నానమాడి రుద్రకోటిని స్మరించినచో రుద్రకోటిని పూజించినవాడు అగును. ఇచటనే పాప ప్రణాశనమగు ఈ హాస్పద తీర్థముగలదు. ఈ తీర్థమును దర్శించినంతనే ముక్తిని పొందును. ఇచట ఉన్న దేవతలను పితరులను పూజించి దుర్గతికి దూరుడగును. మనసున కోరినది లభించును.

కేదార మహాతీర్థము సర్వకల్మష నాశనము. ఇచట స్నానముచేసిన పురుషుడు సర్వదాన ఫలమును పొందును. సరకతీర్థమునకు పూర్వ భాగమున అన్యజన్మ అను తీర్థము ప్రసిద్ధము. ఈ తీర్థము స్వచ్ఛజలము. ఇచట హరిహరులు సన్నిహితులుగా ఉందురు. ఇచట విష్ణువు చతుర్భుజునిగా, శివుడు లింగాకారముతో నుండును. ఇచట స్నానమాడి హరిహరులను దర్శించి స్తుతించి మోక్షమును పొందును. చైత్ర శుక్ల పక్షమున నాగహ్రదమునకు వెళ్ళి స్నానమాడి శ్రాద్ధమును ఆచరించువాడు ముక్తిని పొందును. యమలోకమును చూడడు. తరువాత దేవసేవితమగు త్రివిష్టప తీర్థమును చేరి అచట నున్న వైతరణీనది యందు స్నానమాడి శూలపాణియగు వృషధ్వజుని పూజించి సర్వపాప వినిర్ముక్తుడై ఉత్తమ గతిని పొందును. రసావర్తమున స్నానమాడి శూలపాణియగు వృషధ్వజుని పూజించి సర్వపాప వినిర్ముక్తుడై ఉత్తమ గతిని పొందును. రసావర్తమున స్నానమాడి ఉత్తమ సిద్ధిని పొందును. చైత్ర శుద్ధ పూర్ణిమనాడు విలేపక తీర్థమున స్నానమాడి భక్తిచే శివుని పూజించి సర్వపాప వినిర్ముక్తుడగును. తరువాత ఉత్తమమగు ఫలకీవనమునకు వెళ్ళవలయును. ఇచట గంధర్వులు దేవతలు పరమతపమును ఆచరింతురు. ఇచట దృషద్వతీ నదిలో యథావిథిగా స్నానమాడి దేవతలకు పితరులకు తర్పణము గావించి అగ్నిష్టోమ అతిరాత్ర ఫలమును పొందును. పూర్ణిమనాడు అమావాస్యనాడు ఇచట శ్రాద్ధమును ఆచరించువాడు గయాశ్రాద్ధ ఫలమును పొందును. అరణ్యమున శ్రాద్ధము ఆచరించిననూ ఫలకీవనమును స్మరించినచో పితరులకు తృప్తి కలుగును. తరువాత పాణిఘాత తీర్థమున పితరులకు తర్పణమును ఆచరించి రాజసూయ ఫలమును పొంది సాంఖ్య యోగమును పొందును. మిశ్రక తీర్థమున యధావిధిగా స్నానము నాచరించి సర్వతీర్థ ఫలమును పొంది ఉత్తమ గతిని పొందును. తరువాత వ్యాస వనమునకు వెళ్ళి అచటి మనోజన తీర్థమున స్నానమాడి మనిషివిభుని దర్శించి మనోభీష్టమును పొందును.

మధువనమునకు వెళ్ళి శుచియై దేవీ తీర్థమున స్నానమాడి దేవతలను ఋషులను పూజించి ఉత్తమసిద్ధిని పొందును. కాశీకీ సంగమతీర్థమున దృషద్వతీ నదిలో స్నానమాడి, నియమబద్ధుడై నియతాహారమును భుజించి సర్వపాప వినిర్ముక్తుడగును. వ్యాసమహర్షి పుత్రశోకాభిభూతుడై దేహ త్యాగమునకు నిశ్చయించి దేవతలచే మరల స్వస్థతను పొందించబడిన వ్యాసస్థలికి వెళ్ళినవారు. దుఃఖమును పొందజాలరు. కిందుశూ కూపమును చేరి తిలప్రస్థ దానమును గావించిన పరమ స్థితిని పొందును. ఇచట మరణించిన వాడు ముక్తిని పొందును. ప్రసిద్ధములగు ఆహ్నముదిత తీర్థము లందు స్నానముచేసిన సూర్య లోకమును పొందును. మృగముచ్యమునకు వెళ్ళి గంగకు నమస్కరించి మహాదేవుని పూజించిన అశ్వమేధ ఫలమును పొందును. కోటితీర్థమునకు వెళ్ళి స్నానమాడి కోటీ శ్వరుడగు శివుని దర్శించి స్తుతించిన యెడల కోటియజ్ఞ ఫలమునుపొందును. బలియజ్ఞమును హరించుటకు వామనుడు అవతరించిన లోకత్రయ ప్రథితమగు వామనకమునకు వెళ్ళి విష్ణుపదమున స్నానమాడి వామనుని పూజించిన సర్వపాప విశుద్ధాత్మయై విష్ణులోకమున వీరాజిల్లును. ఇచటనే సర్వ పాతకనాశనమగు జ్యేష్ఠాశ్రమము కలదు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశీ నాడు ఉపవసించి, మరునాడు ఇచట యధావిధిగా స్నానమాడిన నరశ్రేష్ఠుడగును. ఇచట శ్రాద్ధము ఆచరించిన పితరులకు మిక్కిలి ప్రీతి కలుగును. ఇచటనే లోకత్రయ ప్రసిద్ధమగు కోటి తీర్థము కలదు. ఇచట స్నానమాడిన కోటియజ్ఞఫలమును పొందును. ఇచట కోటీశ్వరుడు అను మహేశ్వరుని యధావిధిగా పూజించి గణాధిపత్యమును పొందును.

ఇచటనే ఉన్న సూర్య తీర్థమున స్నానమాడి సూర్య లోకమును చేరును. కులోత్తారక తీర్థమునకు వెళ్ళి స్నానము ఆచరించవలయును. స్వకులమును తరింపచేసి స్వర్గమున కల్పాంతము వరకు నివసించును. పవన హ్రదమున స్నానమాడి దేవుడగు మహేశ్వరుని దర్శించి సర్వపాప వినిర్ముక్తుడై శివలోకమును చేరును. హనుమతీర్ధమున స్నానముచేసి ముక్తిని పొందును. రాజర్షియగు శాలిహోత్రుని తీర్థమున స్నానమాడి పాపరహితుడు అగును. శ్రీకుంభము అను సరస్వతీ తీర్థమున స్నానమాడిన యజ్ఞ భాక్కు అగును. నైమిశకుండమున స్నానమాడిన నైమిశ పుణ్యమును పొందును. వేదవతీ తీర్థమున స్నానమాడిన స్త్రీ సతీత్వమును పొందును. బ్రహ్మతీర్థమున స్నానమాడినవాడు బ్రాహ్మణ్యమును పొందును. బ్రహ్మ లోకమును పొంది దుఃఖరహితుడు అగును. సోమతీర్థమున స్నాన మాడినవాడు సద్గతిని పొందును. సప్తసారస్వత తీర్థమున చేరిస్నానమాడి ముక్తిని పొందును. ఇచటనే ఏడు సరస్వతీ నదులు ఐక్యమును పొందినవి. సుప్రభా, కాంచనాక్షి, విశాలా, మనోహరీ, సునందా, సువేణు, విమలోదక అనునది సప్త సరస్వతులు. నోశనసతీర్థమున స్నానమాడిన పాతక ములనుండి ముక్తుడగును. కపాలమోచన తీర్థమున స్నానమాడిన బ్రహ్మ హంతకుడు కూడా శుద్ధి పొందును. విశ్వామిత్ర తీర్థమున స్నానమాడిన బ్రాహ్మణ్యమును పొందును. పృధూకమున స్నానమాడి సంసార బంధముక్తుడగును. అవి కీర్ణతీర్థమున స్నానమాడిన యెడల బ్రహ్మచర్య ఫలమును లభించును. మధుప్రసవ తీర్థమునకు వెడలి స్నానమాడి పాతక విముక్తుడగును. వాషిష్ఠతీర్థమున స్నానమాడిన వసిష్ఠ లోకమును పొందును. అరుణా సంగమమున స్నానము ఆచరించి మూడురాత్రులు ఉపవసించి మరల స్నానము చేసినవాడు ముక్తిని పొందును. ఇచట నాలుగు సముద్రములు కలవు. వీటిలో స్నానమాడినవాడు గోసహస్ర ప్రదాన ఫలమును పొంది. స్వర్గమున విరాజిల్లును. సోమతీర్థమున స్నానమాడి చైత్ర శుక్లషష్ఠినాడు శ్రాద్ధమును ఆచరించి పితరులను తరింపచేయును. ఇక పంచవటమున స్నానముచేసి యోగమూర్తిధరుడగు శివుని యథావిధిగా పూజించిన దేవతలతో కలిసి ఆనందించును. తరువాత కురుతీర్థమున స్నానమాడి సర్వసిద్ధిని పొందును. స్వర్గద్వారమున స్నానమాడిన వాడు స్వర్గమున నివసించును. అనరకతీర్థమున స్నానముచేసినవాడు సర్వపాతక ముక్తుడగును. తరువాత కామ్యకవనమునకు వెళ్ళవలయును. ఇచట ప్రవేశించినంతనే సర్వ చింతముల నుండి విముక్తుడగును. ఇక ఆదిత్య వనమును చేరి దర్శన మాత్రముననే ముక్తిని పొందును. ఇచట ఆదివారమునాడు కామితమును పొందును. యజ్ఞోపవీతిక తీర్థమున స్నానముచేసి స్వధర్మ ఫలమును పొందును. ఇచట ఆదివారము నాడు కామితమును పొందును. యజ్ఞోప వీతిక తీర్థమున స్నానముచేసి స్వధర్మ ఫలమును పొందును. తరువాత చతుప్రవాహత్మమున స్నానము చేసి సర్వతీర్థ ఫలమును పొంది స్వర్గమున దేవతలవలె ఆనందించును. విహార తీర్థమున స్నానమాడి సర్వ సౌఖ్యమును పొందును. దుర్గాతీర్థమున నరుడు స్నానమాడి దుర్గతిని పొందజాలడు. పితృ తీర్థమను పేరుగల సరస్వతీ తీర్ధమున స్నానమాడి దేవాదులను తృప్తిపరిచి ఉత్తమగతిని పొందును. ప్రాచీ సరస్వతియందు స్నానమాడి యథావిథిగా స్నానముచేసి, దుర్లభకామనలను పొంది, దేహాంతమున స్వర్గమును పొందును. శుక్ర తీర్థమున నరుడు స్నానమాడి శ్రాద్ధము ఆచరించినచో పితరులను తరింపచేయును. బ్రహ్మ తీర్థమున చైత్ర కృష్ణ అష్టమినాడు. కాని, చతుర్దశినాడు కాని ఉపవసించినచో ముక్తిని పొందును. స్థాణు తీర్థమున స్నానముచేసి స్థాణు వటమును దర్శించి ఘోరపాతకములనుండి ముక్తిని పొందునని పితామహుడు చెప్పెను. స్థాణులింగ దర్శనముచే యాత్ర పరిపూర్ణమగును. కురుక్షేత్రముతో సాటివచ్చు తీర్థము ఇంతకుమునుపు లేదు. ఇక ఉండదు. ఇచట ద్వాదశయాత్రలను చేసినవాడు మరలజన్మను పొందడు. ఇచట ఆచరించి ఇష్టాపూర్తములు తపస్సు, హోమము, యధావిధానము అన్నియూ అక్షయము లగును. మన్వాదిక, యుగాదిన, సూర్యచక్ర గ్రహణములలో, మహాపతమున, సంక్రమణమున, పవిత్రములగు ఇతర దినములందు కురుక్షేత్రమున స్నానమాడినవాడు అనంత ఫలమును పొందును. ప్రతి యుగమునకలుగు పాపములను నశింపచేయుటకే బ్రహ్మ కురుక్షేత్రమును కల్పించెను. ఇట్లు పాపప్రణాశిని పుణ్యప్రదము అగు ఈ కథను కీర్తించినవారు వినినవారు కూడా పాపములనుండి విముక్తులగుదురు. కురుక్షేత్రమున సూర్య గ్రహణ కాలమున దానముచేసిన దానినే ప్రతిజన్మలో పొందును. సంసారముక్తిని కోరువారు కురుక్షేత్రమునే సేవించవలెను. ఇదియే మహాపుణ్యము. ఇదియే మహాతపము. ఇదియే మహాజ్ఞానము. ఈ భూమండలమున కురుక్షేత్రము వంటి తీర్థము మరియొకటి లేదు. ఆచారవంతుడు ఆచార రహితుడు కూడా ఇచట ముక్తిని పొందును. ఇట్లు నీవడిగిన దంతయూ చెప్పితిని. సర్వపాపనాశకము, పుణ్యప్రదము మోక్షప్రదమగు కురుక్షేత్ర మాహాత్మ్యమును చెప్పితిని. ఇంకనూ ఏమి వినదలచితిరి ? (II/65)