మార్కండేయ పురాణాను క్రమణీ కథనము

శ్రీ బ్రహ్మ పలికెను: ఓ మునిసత్తమా! ఇపుడు చదువు వారిని పవిత్రులను చేయు గొప్ప మార్కండేయ పురాణమును గురించి నీకు చెప్పెదను వినుము. పక్షులను ఉద్దేశించి ఇచట సర్వధర్మ నిరూపణము చేయబడినది. ఈ పురాణము తొమ్మిది వేల శ్లోకములు కలది. ఇచట మార్కండేయ ముని జైమిని మహర్షిని అడుగుట మొదట చెప్పబడినది. ధర్మ సంజ్ఞలు కల పక్షుల జన్మము ఈ పక్షుల పూర్వజన్మకథా, ఇంద్రుని వికారము, బలరాముని తీర్థ యాత్ర, ద్రౌపదేయ కథ, పవిత్రమగు హరిశ్చంద్రకథా, ఆడీ బక యుద్ధము, పితాపుత్ర సమాఖ్యానము, దత్తాత్రేయ కథా, కార్తవీర్యార్జున కథ, మదాలస కథ, అలర్క చరితము, నవ విధములగు సృష్టి సంకీర్తనము, కల్పాంతకాల నిర్దేశము, యక్ష సృష్టి నిరూపణము, రుద్రాది సృష్టి, ద్వీప చర్యాను కీర్తనము, మనువుల కథలు పాప పరిహారక కథలు చాలా చెప్పబడినవి. ఈ కథలలో అష్టమాంతరమున త్రయీతేజసముద్భవమగు ప్రణవోత్పత్తి, మార్తండుని జన్మము మార్తండ మాహాత్మ్యము, వైవస్వతమనువు వంశము, వత్స ప్రీచరితము, మహానుభావుడగు ఖనిత్రుని పవిత్ర కథ, అవిక్షిచ్చరితము, కిమిచ్చవ్రత విధానము, కరిష్య చరితము, ఇక్ష్వాకు చరితము, నలచరితము, రామచన్ద్ర సత్కథ, కుశవంశ సమాఖ్యానము, సోమవంశాను కీర్తనము, పురూరవుని కథ, అద్భుతమగు నహుష కథ, యయాతి చరితము, యదువంశాను కీర్తనము, పురూరవుని కథ, శ్రీకృష్ణబాల చరితము, మధురా నగర చరిత్రము, ద్వారకా చరితము, సర్వావతార కథలు, సాంఖ్య యోగము, ప్రపంచ సత్త్వ కీర్తనము, మార్కండేయ చరిత్రము, పురాణ శ్రవణ ఫలము నిరూపించబడినవి. ఈ మార్కండేయ పురాణమును ఆదరముతో వినువాడు ఉత్తమ గతిని పొందును. చెప్పినవాడు శివలోకమును పొందును. కార్తీక పూర్ణిమనాడు వ్రాసి బ్రాహ్మణునకు దానమును చేసిన పరమగతిని పొందును. ఈ పురాణక్రమణికను వినిననూ చెప్పిననూ మార్కండేయ పురాణ శ్రవణ ఫలమును పొందును. (4/98)