శ్రాద్ధ క్రియా వర్ణనము

సనక మహర్షి పలికెను: ఓ మునిశ్రేష్ఠా! ఉత్తమమైన శ్రాద్ధవిధిని వినుము. ఈ విధిని వినినచో సర్వపాప నివృత్తి కలుగును. సంశయము లేదు. మృతదినమునకు ముందురోజు స్నానము చేసి ఏకభుక్తముగా ఉండవలయును. క్రింద పరుండవలయును. బ్రహ్మచర్యమును అవలంబించ వలయును. రాత్రిపూట బ్రాహ్మణుని నిమంత్రణ చేయవలయును. దంత ధావనము, తాంబూలము, తైలాభ్యంగనము, రతి, ఓషధి పరాన్నములను శ్రాద్ధకర్త పరిత్యజించవలయును. ప్రయాణమును, కలహమును, క్రోధమును స్త్రీ సంగమమును, బరువు మోయుటను, పగటి నిద్రను శ్రాద్దకర్త, భోక్త పరిత్యజించవలయును. శ్రాద్ధమున నియంత్రణ చేయబడిన విప్రుడు స్త్రీ సంగమును చేసినచో బ్రహ్మహత్యాపాపమును పొందును. నరకమునుపొందును. శ్రాద్ధమునందు శ్రోత్రియుడు, విష్ణు తత్పరుడు, స్వాచార నిరతుడు, ప్రశాంతుడు, సత్కులోద్భవుడు, రాగద్వేష రహితుడు పురాణార్థ విశారదుడు త్రిమధు త్రిసువర్ణరజ్ఞానము కలవాడు, సర్వభూత దయాపరుడు, దేవపూజా రతుడు, స్మృతి తత్త్వ విశారదుడు వేదాంతతత్త్వ సంపన్నుడు సర్వలోక హితా కాంక్షి, కృతజ్ఞుడు గుణ సంపన్నుడు, గురుశుశ్రూషారతుడు, సచ్ఛాస్త్ర కథనములతో పరోపదేశ నిరతుడు అయిన విప్రుని నిమంత్రణ చేయవలయును. ఇక ఇపుడు శ్రాద్ధమున నిమంత్రణకు యోగ్యులు కానివారిని, చెప్పెదను వినుము. న్యూగాంగుని, అధికాంగుని, లుబ్ధుని, రోగిని, కుష్ఠువ్యాధిగ్రస్తుని, కునఖుని, లంబకర్ణుని, వ్రతభ్రష్టుని, జ్యోతిష్కుని, శవదాహకుని, కువాదిని, పరికేత్తను, దేవకుని, ఖలుని, నిందకుని, అమర్షా గ్రస్తుని, ధూర్తుని, గ్రామ యాజకుని, అసచ్ఛాస్త్రాభినిరతుని, పరాన్ననిరతుని శూద్రస్త్రీ పుత్రుని పోషించువానిని, శూద్రస్త్రీ పతిని, భర్త ఉండగా స్త్రీకి జారునివలన కలిగినపుత్రుని, భర్త చనిపోయిన తరువాత ఇతరుని వలన కలిగిన పుత్రుని, యజ్ఞము చేయదగిన వానిచే యజ్ఞమును చేయించు వానిని, దంభాచార పరుని, నిష్ప్రయోజనముగా ముండనము చేసుకొనువానిని, పరస్త్రీలను పరుల ధనమును ఆశించువారిని, విష్ణుభక్తి విహీనుని, శివభక్తి పరాఙ్ముఖుని, వేద విక్రయము చేయు వానిని, వ్రతమును విక్రయించువానిని, స్మృతి విక్రయకుని, మంత్ర విక్రయకుని, గాయకుని, కావ్యకర్తను, వైద్యముచే జీవించువానిని, వేదనిందాపరుని, గ్రామ అరణ్య ప్రదాహకుని, అతికాముకుని, రస విక్రయకారకుని కూటయుక్తిరతుని ప్రయత్నముతో శ్రాద్ధమున పరిత్యజించవలయును.

మొదటి దినమున కాని మృతాహమున కాని పిలువవలయును. నిమంత్రణ చేయబడిన విప్రుడు బ్రహ్మచారియై జితేంద్రియుడై ఉండవలయును. “శ్రాద్ధమున క్షణము చేయవలయును ప్రసన్నులు కండు” అని పలుక వలయును. జితేంద్రియుడై దర్భపాణియై ప్రాజ్ఞుడైన ద్విజుని నిమంత్రణ చేయవలయును. తరువాత ప్రాతఃకాలమున లేచి ప్రాతః కృత్యమును ముగించుకొని కుతపకాలమున విద్వాంసుడు శ్రాద్ధమును ఆచరించవలయును. దినములోని ఎనిమిదవ భాగమున, సూర్యుడు మందగించిన సమయమును, కుతపకాలము అందురు. అపుడు పితరుల కర్పించినది అక్షయమగును. అపరాహమున పితరులకు దత్తమైనది అక్షయమగునని బ్రహ్మ చెప్పెను. కావున ద్విజులు ఆ సమయమునే ఈయ వలయును. ఆకాలమున కవ్యము అర్పించినచో దానిని రాక్షసమని అందురు. అది పితృ దేవతలకు చెందదు. సాయంకాలమున దత్తమైన కవ్యము రాక్షసమనబడును. ఆ సమయమున ఇచ్చినవాడు, భోక్తకూడ నరకమును చెందుదురు. మృతాహ తిథి దండ పరి మితముగా ఉన్నచో అపరాహవిద్ధి ఉన్నచో ఆ సమయముననే శ్రాద్ధము ఆచరించ వలెను. మృతాహ తిథి రెండు దినములలో ఆపరాహమున ఉన్నచో పూర్వ దినమున క్షయకర్మ చేయవలయును. రెండవ దినమున వృద్దికార్యమును చేయవలయును. పూర్వ దినమున మృతాహ తిథి రెండు ముహూర్తములుండి ద్వితీయ దినమున సాయంకాలము వరకున్నచో రెండవదినమున కవ్యమును చేయవలయును. రెండు ముహూర్త కాలము ఉన్నచో పూర్వ దినముననే చేయవలయునని కొందరి మతముకాని ఇది అందరి మతముకాదు. నియంత్రణ చేయబడిన విప్రులు వచ్చిన వెంటనే కర్త ప్రాయశ్చిత్తముతో విశుద్ధుడై వారి నుండి అనుజ్ఞను పొందవలయును. విశ్వేదేవస్థానమునకు ఇద్దరు విప్రులను పితృ స్థానమునకు ముగ్గురు విప్రులను నియంత్రణ చేయవలయును. లేదా విశ్వేదేవులను ఒకరిని, పితృదేవతలకు ఒకరిని కూడా నియంత్రణ చేయవలయును. బ్రాహ్మణునకు చతురస్రమును, క్షత్రియునకు త్రికోణమును, వైశ్యునకు వర్తులాకారముగను శూద్రునకు ప్రోక్షణమును చేయ వలయును. బ్రాహ్మణులు లభించనిచో సోదరుని కాని, పుత్రుని కాని చివరకు తన వారిని నియోగించుకొనవలయును. కాని వేదవర్జితుడగు విప్రుని మాత్రము నియోగించరాదు. బ్రాహ్మణులకు పాదప్రక్షాళనము చేసి ఆచమనమును చేయించి కూర్చుండ నియమించి, నారాయణస్మరణ చేయుచు యథావిథిగా అర్చన చేయవలయును. బ్రాహ్మణుల మధ్య దేశమున ద్వారదేశమున ‘అపహృతా’ అను ఋక్కుచే కర్త నువ్వులను చల్లవలయును; యవలచే దర్భలచే విశ్వేదేవతలకు ఇది ఆసనమని ఆసనమును ఇచ్చి మరల క్షణమును ఈయవలయును. అక్షయ్య ఆసనములు ఇచ్చునప్పుడు షష్ఠీవిభక్తిని ఆవాహనలో ద్వితీయ విభక్తిని, అన్న దానమున చతుర్థీ విభక్తిని ఇతర విషయములలో సంబుద్ధిని ఉపయోగించవలయును. దర్భశాఖా సమన్వితమైన పాత్ర ద్వయమును ఆసాదించి ఆ పాత్రలను “శం నో దేవీ” అను మంత్రముచే జలమున ప్రోక్షించవలయును. ‘యవోసి’ అను మంత్రముచే యవలను చల్లవలయును. మౌనముగా గంధపుష్పములచే అర్పించవలయును. “విశ్వేదే వాస్స” అను మంత్రముచే విశ్వేదేవతలను ఆవాహనము చేయవలయును “యా దివ్యా” అను మంత్రముచే సావధానమనస్కుడై అర్ఘ్యము నీయవలయును. ధూపదీప గంధపుష్పాదులచే పూజించ వలయును. విశ్వేదేవులు అనుమతిని పొంది పితృదేవతలను పూజించవలయును. పితృదేవతలను తిలయుక్త దర్భలను ఆసనముగా నీయవలయును. మూడు పాత్రలను ఆపాదించవలయును. పూర్వమువలె ఆర్యాదులను ఈయవలయును. ‘శం నో దేవీ’ అను మంత్రముచే జలమును ప్రోక్షించి ‘తిలోఽసి’ అను మంత్రముచే తిలలను చల్లవలయును. “ఉశన్త” అను మంత్రముచే ఆవాహన చేయవలయును. ‘యా దివ్యా’ అను మంత్రముచే పూర్వమువలె ఆర్ఘ్యముపే ఈయవలయును. ధూపదీపగంధపుష్పవస్త్రాభరణములచే విభవాను సారముగా పూజించవలయును. తరువాత వివేకము కలవాడై, ఘృతయుక్తమైన అన్నాగ్ర మును తీసుకొని ‘అగ్నౌ కరిష్యే’ అని అనుజ్ఞను అడిగి, ‘కురుష్య’ ‘క్రియతాం’ ‘కురుష్వ’ “క్రియతాం” కురు” అని అనుజ్ఞనీయవలయును. స్వగృహ్యోక్త విధానమును అనుసరించి ఉపాసన అ ఆదానము చేసుకొని “సోమాయ చ పితృమతే స్వధా నమ” అని కాని ఉచ్చరించవలయును. స్వాహాంతముగానైనను పితృయజ్ఞమువలె హోమము చేయవలయును. ఈ ఆహుతులచే మాత్రమే పితృ దేవతలకు అక్షయతృప్తి కలుగును. ఉపాసనాగ్ని లేనియెడల బ్రాహ్మణుని హస్తమున హోమము చేయవలయును.

ఆచారను గుణముగా హస్తమునందు కాని అగ్నియందు కాని హోమమును చేయ వలయును. పార్వణము వచ్చినపుడు ఉపాసనాగ్నిని దూరముగా ఉంచరాదు. అగ్ని సంధానముచేసి హోమమును చేసి విసర్జన చేయవలయును. పార్వణ సమయమున అగ్ని దూరముగా ఉన్నచో సోదరులచే కాని అగ్నితో కూడియున్న ద్విజులచే కాని శ్రాద్ధమును చేయించవలయును. మృతాహదినమున తన అగ్ని దూరముగా ఉన్నప్పుడు, సోదరులు లౌకికాగ్నితో ఉన్నపుడు, ఉపాసనాగ్ని దూరముగా ఉన్నపుడు, సోదరులు సమీపమున ఉన్నపుడు అగ్నిలో కాని హస్తములో కాని హోమమును చేసినచో వాడు పాతకి అగును. ఉపాసనాగ్ని దూరముగా ఉన్నపుడు అట్లు చేయవచ్చునని కొందరి మతము. హోమశేషాన్నమును శ్రీహరినిస్మరించుచు విప్రపాత్రలలో ఉంచవలయును. రుచికరమైన భక్ష్యభోజ్యలేహ్యములచే విప్రులను పూజించవలయును. అపుడు విశ్వేదేవ పితృదేవతాస్థలములలో అన్నత్యాగమును చేయవలయును. “ఆగచ్ఛంతు మహాభాగా విశ్వేదేవా మహాబలాః యే యత్ర విహితా శ్రాద్ధే సావధానా భవంతు తే” అను మంత్రముచే “యే దేవాస” అను ఋక్కుతో విశ్వేదేవత లను ప్రార్థించవలయును. (“మహానుభావులు మహాబలులైన విశ్వేదేవతలు ఇచటకురండు! శ్రాద్ధమున విధించబడిన వారు కావున సావధానులు కండు” అని పై మంత్రమునకు అర్థము) “యే చ హో” ‘ అను ఋక్కుతో పితృదేవతలను ప్రార్థించవలయును. “అమూర్తానాం చ మూర్తానాం పితౄణాం దీప్తతేజసామ్ సమస్యామి సదా తేషాం ధ్యానినాం యోగచక్షు షామ్” అను మంత్రముచే నారాయణ స్మరణముతో పితృదేవతను ప్రార్థించవలయును. (మూర్తి మంతులు మూర్తిరహితులు దీపతేజస్కులు, యోగచక్షువులు, ధ్యానరతులు అగు పితృదేవతలకు నమస్కారము” అని పై మంత్రమునకు అర్థము). దానము చేయబడిన దానిని హవిస్సును శ్రాద్ధ కర్మను శ్రీమహావిష్ణువునకు సమర్పించవలయును. అపుడు ఆ బ్రాహ్మణులు అందరూ మౌనముగా భోజనము చేయవలయును. నవ్వుచున్నవానికి మాటలాడు వానికి చేసిన దానము రాక్షసమగును. ఆచారాను గుణముగా మధుమంసాదులు వడ్డించ వలయును. వాఙ్మయముతో ఘృతపాత్రలను చేతబట్టుకొని పాకాదులను ప్రశంసించ వలయును. శ్రాద్ధమున నియోగించబడిన బ్రాహ్మణుడు ఘృతపాత్రను వదిలినచో శ్రాద్ధ ఘాతకుడై నరకమును పొందును. భోజనమును చేయుచున్న విప్రులు ఒకరినొకరు తాకినచో ఆ అన్నము విడువక భుజించి ఎనిమిది వందలు గాయత్రీ జపములను చేయవలయును. విప్రులు భోజనము చేయుచుండగా కర్త శ్రద్ధతో అనంతుడు అపరాజితుడు అగు నారాయణుని స్మరించవలయును. రక్షోఘ్నలగు వైష్ణవులను, విశేషించి పితృదేవతలను స్మరించవలయును. పురుషసూక్తమును నాచికేతోపాఖ్యానమును, మధుసూక్తమును, సుపర్ణ సూక్తమును పవమానసూక్తమును, యుజుర్వేద మంత్రములను సామవేద మంత్రములను పుణ్యప్రదములగు ఇతిహాస పురాణములను ధర్మ శాస్త్రము లను బ్రాహ్మణ భోజనము జరుగు వరకు జపించవలయును. బ్రాహ్మణుల భోజనము జరిగిన తరువాత వికిరాన్నమును చల్లవలయును. శేషాన్నమును భుజించవలయును. ప్రార్థించి మధుసూక్తమును పఠించ వలయును. కర్త పాదప్రక్షాళనము చేసుకొని చక్కగా ఆచమనముచేసి, బ్రాహ్మణ వచనము తరువాత పిండదానమును చేయవలయును. స్వస్తివాచనమును అక్షయోదక మును చేయవలయును. తరువాత సావధానుడై విప్రులకు అభివాదనము చేయవలయును, పాత్ర చాలనము చేయకనే స్వస్తి వాచనము చేసినచో వారి పితరులు ఒక సంవత్సరము ఉచ్ఛిష్ట భోజనము చేతురు. “దాతారో నోఽ భివర్ధంతాం’ ఇత్యాది స్మృతి వచనములచే బ్రాహ్మణుల నుండి ఆశీర్వాదమును పొందవలయును. తరువాత న్యుబ్జపాత్రను తీసుకొని పితృదేవతలను విసర్జించవలయును. శ్రాద్ధకర్త, భోక్త ఇరువురు ఆ రాత్రి స్త్రీ సంగమమును చేయరాదు. స్వాధ్యాయమును, ప్రయాణమును చేయరాదు.

ప్రయాణము చేయుచు దారిలో నున్నవాడు, రోగాది పీడితుడు, ధనహీనుడు ఆమశ్రాద్ధమును చేయవలయును, భార్య ఋతుమతిగా ఉన్నవాడు బంగారముతో శ్రాద్ధము చేయవలయును. ద్రవ్యములు, విప్రులు లేని పక్షమున అన్నమును మాత్రము వండించి పితృసూక్తముచే హోమమును చేయవలయును. పూర్తిగా వండుటకే పదార్థములు లేనివాడైనచో తన శక్తికొలది గోవులకు తృణమును ఈయవలయును. లేదా స్నానముచేసి యథావిధిగా తిలతర్పణము చేయవలయును, ఏమీ లేని వాడైనచో నిర్జనారణ్యమునకు వెళ్ళి నేను పరమదరిద్రుడను మహాపాపిని అని పలుకుచు పెద్దగా రోదించవలయును. శ్రాద్ధకర్త రెండవదినమున పితృతర్పణమును చేయనిచో ఆకులము నశించును, బ్రహ్మహత్యా పాపమును పొందును. శ్రద్ధతో శ్రాద్ధమును చేయు మానవులకు సంతతి చ్ఛేదము జరగదు. సంపన్నులగుదురు. శ్రాద్ధమున పితృ దేవతలను పూజించినచో శ్రీహరియే పూజించబడును. శ్రీహరి సంతోషించినచో దేవతలందరూ సంతోషింతురు. పితరులు, దేవతలు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, సిద్ధులు మనుజులు హరి స్వరూపులే. స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తం తయు శ్రీహరి వలననే పుట్టినది. కావున కర్త భోక్త శ్రీహరియే ఈ జగమున ఉన్నది లేని, కనపడునది కనపడనిది అంతా విష్ణుమయముగా తెలియుము. విష్ణువు కంటే ఇతరమైనదేదియు లేదు. ఈ ప్రపంచమునకు ఆధారభూతుడు, సర్వభూతాత్మకుడు, అవ్యయుడు సాటిలేని స్వభావము కలవాడు హవ్య కవ్య భోక్త భగవానుడే. పరబ్రహ్మధేయు డైనవాడు జనార్దనుడు ఒక్కడే కర్త కారయిత అంతా సనాతనుడగు శ్రీమహావిష్ణువే. ఓ ముని శ్రేష్ఠా! ఇట్లు ఉత్తమ శ్రాద్ధ విధి చెప్పబడినది. ఇట్లు చేసినవారి పాపము నశించును. శ్రాద్ధకాలమున ఈ ఉత్తమ విధిని పఠించినచో వారి పితరులు సంతోషించెదరు. సంతతి వృద్ధి చెందును. (1/28)