నారద మహా పురాణము
మత్స్యపురాణానుక్రమణ కథనము
బ్రహ్మ పలికెను: ఈ భూ మండలమున ఏడు కల్పముల చరిత్రను చెప్పిన మత్స్యపురాణమును చెప్పెదను. వేదజ్ఞుడగు వ్యాస మహర్షిచే నారసింహోప వర్ణనమును ప్రారంభించి పదునాలుగువేల శ్లోకములు చెప్పబడినవి. మొదట మనుమత్స్య సంవాదము, బ్రహ్మాండ కథనము, బ్రహ్మ ఉత్పత్తి, దేవాసురోత్పత్తి, మారుతోత్పత్తి, మదన ద్వాదశీమహిమ, లోకపాల పూజనము, మన్వంత రోద్దేశము, వైశ్యరాజ్యాభి వర్ణనము, సూర్యోత్పత్తి, సూర్య వంశీయుల ఉత్పత్తి, బుధ సంగమనము, పితృ వంశాను కథనము, శ్రాద్ధ కల్పము, పితృతీర్థ ప్రచారము, చంద్రోత్పత్తి, చంద్రవంశ కీర్తనము, యయాతి చరితము, కార్తవీర్యచరితము, సృజించబడిన వంశముల కీర్తనము, భృగు మహర్షి విష్ణువును భూమిపై దశవిధ జన్మలను పొందునట్లు శపించుట, పూరు వంశ కీర్తనము, అగ్ని వంశ కీర్తనము, క్రియాయోగము, పురాణ కీర్తనము, నక్షత్ర పురుషవ్రతము మార్తండ శయనము, కృష్ణాష్టమీ వ్రతము, రోహిణీ చంద్రవ్రతము, తటాక విధి మాహాత్మ్యము, పాదపోత్సర్గము, సౌభాగ్య శయనము, అగస్త్య వ్రతము, అనంత తృతీయావ్రతము, రసకళ్యాణినీ వ్రతము, ఆనందకరీ వ్రతము, సారస్వత వ్రతము, ఉపరాగాభిషేకము, సప్తమీశయనము, భీమద్వాదశీ వ్రతము, అనంగ శయనము, అశూన్య శయన వ్రతము, అంగారక వ్రతము, సప్తమీ సప్తక వ్రతము, విశోక ద్వాదశీ వ్రతము,దశ విధ మేరు ప్రదానము, గ్రహశాంతి, గ్రహస్వరూప కథనము, శివచతుర్దశి, సర్వఫలత్యాగము, సూర్యవార వ్రతము, సంక్రాంతి స్నపనము, విభూతి ద్వాదశీవ్రతము, షష్టివ్రతమాహాత్మ్యము, స్నానవిధి క్రమము, ప్రయాగ మాహాత్మ్యము, ద్వీపలోకాను వర్ణనము, త్రిపుర ద్యోతనము, పితృ ప్రవర మాహాత్మ్యము, సురేంద్ర భవన వర్ణనము, త్రిపుర ద్యోతనము, పితృ ప్రవర మాహాత్మ్యము, మన్వంతర నిర్ణయము, చతుర్యుగ సంభూతి, యుగ ధర్మ నిరూపణము, వజ్రాంగ సంభూతి, తారకోత్పత్తి తారకాసుర మాహాత్మ్యము, బ్రహ్మదేవానుకీర్తనము, పార్వతీ సంభవము, శివతపోవన వర్ణనము, అనంగదేహ దాహము, రతిశోకము, గౌరీ తపోవనము, శివుడు పార్వతిని ప్రసన్నురాలిని చేసుకొనుట, పార్వతీ ఋషి సంవాదము, పార్వతీ కళ్యాణము, కుమార సంభవము, కుమార విజయము, తారకాసుర వధ, నరసింహోపవ్ణనము, పద్మోద్బవము, అంధకాసుర వధ, వారాణాసీ మాహాత్మ్యము, నర్మదా మాహాత్మ్యము, ప్రవరాను క్రమము, పితృగాధాను కీర్తనము, ఉభయముఖీ దానము, కృష్ణాజిన దానము, సావిత్ర్యుపాఖ్యానము, రాజ ధర్మములు, వివిధోత్పాత కథనము, గ్రహణాంతము, యాత్రానిమిత్త కథనము, స్వప్న మంగళ కీర్తనము, వామన మాహాత్మ్యము, వారాహ మాహాత్మ్యము, సముద్ర మధనము, కాలాకూటాభి శాంతనము, దేవాసుర యుద్ధము, వాస్తువిద్య, ప్రతిమా లక్షణము, దేవతాయతనము, ప్రసాద లక్షణము, మండప లక్షణము, రాబోవు రాజుల కథలు, మహాదానాను కీర్తనము, కల్పాను కీర్తనము ఇవి ఈ పురాణమున చెప్పబడినవి. ఈ పురాణము పరమ పవిత్రము, కళ్యాణ ప్రదము. ఆయుష్య కీర్తి వర్ధనము. ఈ పురాణమును చదివిననూ వినిననూ శ్రీ విష్ణు లోకమును చేరును. ఈ పురాణమును వ్రాసి బంగారు మత్స్యమును, గోవును కలిపి బ్రాహ్మణుని పూజించి దానము చేసినచో పరమపదమును పొందును. (4/107)