నారద మహా పురాణము
దీపవిధి నిరూపణము
సనత్కుమార మహర్షి పలికెను: ఇక హనుమంతుని దీపవిధిని సరహస్యముగా చెప్పెదను. ఈ విధిని తెలిసినవారు సిద్ధిని పొందెదరు. దీపపాత్ర ప్రమాణము తైలమానము, ద్రవ్య ప్రమాణము ఈ మూడింటిని మానమందురు. స్థానభేదము మంత్రము, దీపదాన మంత్రమును గూర్చి వివరించెదను. పూనూనెచే దీపముంచినచో సర్వాభీష్టప్రదము. సంపదను పొందుటకు నువ్వుల నూనెచే దీపమును ఉంచవలెయును. ఇతరులను వశపరుచు కొనుటకు అవిశనూనెచే దీపముంచవలెను. రోగనాశమునకు ఆవనూనె, మారణ కర్మకు రాణికతైలము కాని విభీతకతైలముకాని, ఉచ్చాటనలో కరంజతైలము, విద్వేషమున ఇప్పనూనెచే ఉంచవలెను. ఈ తైలములు లభించనిచో నువ్వులనూనె ప్రశస్తము. గోధుమలు, నువ్వులు, మినుములు, పెసలు, తండులములు ఈ అయిదు ధాన్యములు హనుమన్నిత్య దీపవిధిలో ఉపయోగించవలెను. ఈ అయిదు ధాన్యముల పిండి ఉత్తమముగా పేర్కొనబడినది. ఇట్లు దీపము ఉంచుటలో ఈ పిష్టములను వాడుట సర్వాభీష్ట ప్రదమని చెప్పబడినది. వశమున చేసుకొనుటకు బియ్యపుపిండి, మారణకర్మకు మినుప పిండి, ఉచ్చాటనకు నల్లనువ్వుల పిండి, దేశాంతరమునకు వెళ్ళినవాడు వచ్చుటకు గోధుమ లేక బియ్యపుపిండి, మోహనమున ఆఢకపిష్టము, విద్వేషమున ఉలువపిండి, యుద్ధమున కేవలము మినుములు దీపపాత్రలో ఉపయోగించవలెను. సంధి విషయమున మూడు పిష్టములను, సంపద కొఱకు కస్తూరి భవమును వాడవలెను. ఏలా లవంగ కర్పూర కస్తూరీ భవములను కన్యాప్రాప్తికి, రాజవశ్యతకు, స్నేహమునకు ఉపయోగించవలెను. ఈ వస్తువులు లభించనిచో పంచధాన్యములు ఉత్తమములు. ఎనిమిది పిడికిళ్ళు, కించిత్ అగును. ఎనిమిది కించిత్తులు పుష్కలము. నాలుగు పుష్కలములు ఆఢకమనబడును. నాలుగు అఢకములు ద్రోణమగును. నాలుగు ద్రోణములు భారీ అగును. నాలుగు ఖారీలు ప్రస్థమగును. ఇచట ఇంకొక విధముగా మానము చెప్పబడినది. రెండు పలములు ప్రసృతము. రెండు ప్రసృతములు కుడవము. నాలుగు కుడవములు ప్రస్థము. నాలుగు ప్రస్థములు ఆఢకము. నాలుగా ఢకములు ద్రోణము. నాలుగు ద్రోణములు ఖారీ. ఈ క్రమమున షట్కర్మ సంభవమగు పాత్రయందు మానములను తెలియవలెను. అయిదు, ఏడు, తొమ్మిదిగా యథాక్రమముగా ఈ ప్రమాణములు ఉండును. సుగంధ విషయమున మాననియమముండదు. అభిరుచికి అనుగుణముగా తెలియవలెను. నిత్య పాత్రయందు వత్తిని బట్టి తైలనియమము ఉండును. సోమకారమున ఆ ధాన్యమును నీటితో తడుపవలెను. తరువాత కుమారీ హస్త పోషణ ప్రమాణము తెలియవలెను. అనగా కుమారీ హస్తములచే విసరిన ఆ పిండిని ఈ నదీతోయముచే ముద్దగాచేసి శుద్ధపాత్రలో ఉంచవలెను. అపుడు పరిశుద్ధుడై ఏకాగ్రమనస్కుడై దీపపాత్రను సిద్ధము చేయవలెను. దీపపాత్ర వెలుగుచుండగా హనుమత్కవచమును పఠించవలెను. పరిశుద్ధమైన భూమియందుంచి మంగళవారమున దీపదానము గావించవలెను. సాధ్యనామముతో కూడిన మూలమంత్ర వర్ణముల సంఖ్యలో వత్తియందు దారములు ఉండవలెను. లేదా ఆ వర్ణములలో ముప్పదియవ భాగమును ఉంచవలెను. వార్యము గొప్పదైనపుడు మొత్తముగా ఉంచవలెను. నిత్యమగు సామాన్య విశేష కార్యములందు కూడా తుల్యర్తులు ఉండవలెను. కూటగమనగా ఏకాదశ సంఖ్య. దీపపాత్ర విషయమున నియమములేదు. మార్గముననున్నపుడు ఇరువదియొక్క తంతువులు ఉండవలెను. హనుమంతునికి దీపదానము చేయునపుడు ఎఱ్ఱని దారమును ఉంచవలెను. ఉచ్చాటన విషయమున కృష్ణ సూత్రము, ద్వేషమున అరుణ సూత్రము, మారణకర్మలో కూడా అరుణ సూత్రము ఉంచవలెను. గురు కార్యమున పదకొండు పలముల తైలమును ఉంచవలెను. నిత్యకర్మయందు పంచపలముల తైలమును, లేదా మనసునకు తోచినంత యుంచవచ్చును. హనుమంతుని ప్రతిమ సన్నిధిలో కాని, శివాలయమున కాని, నిత్యనైమిత్తిక స్థలములలో కాని దీపదానము చేయవలెను. ఈ విషయమున హనుమంతుని సంబంధమున కొంత విశేషము గలదు. దానిని చెప్పెదను. హనుమంతుని ప్రతిమ ముందు సంతోషముచే గ్రహ భూతగ్రహ విషయమున చతుష్పథమున షట్పాత్రలందు దీపప్రదాపనము చెప్పబడినది. హనుమంతుని సన్నిధిలో, స్ఫాటిక లింగమున, శాలగ్రమ సన్నిధిలో నానాభోగ సంపదల కొఱకు హనుమంతునికి దీపదానము విధించబడినది. విఘ్నములు మహాసంకటములు నశించుటకు గణేశ సన్నిధిలో, ఘోరమగు విషవ్యాధి భయమున హనుమంతుని సన్నిధిలో దీపదానము చెప్పబడినది. వ్యాధిలో నష్టము జరిగినపుడు, దుష్టులదృష్టి తగిలినపుడు చతుష్పధమున దీపదానము గావించవలెను. బంధముక్తికి రాజద్వారమున కాని కారాగారమున కాని దీపదానము చేయవలెను. సర్వ కార్యసిద్ధి కొఱకు అశ్వత్థ మూలమున కాని వటవృక్ష మూలమున కాని దీపదానము కావించవలెను. వశీకరణలో, భయమున, వివాదమున, వేశ్మసంగ్రమ సంకటములందు, ద్యూతమున, దృష్టిస్తంభనమున విద్వేషమున మారణమున, మృతకోత్థాపనమున, ప్రతిమాచాలనమున విషప్రయోగమున, వ్యాధియందు, జ్వరమునందు, భూతగ్రహముల విషయమున, కృత్యా విమోచనమున, క్షతగ్రంధియందు, మహారణ్యమున దుర్గమున, వ్యాఘ్రగజాది క్రూర జంతువుల విషయమున, బంధ విమోక్షణమున, పధికా గమనమున, దుస్థ్సానమున, రాజమోహన మున, ఆగమమున, నిర్గమమున రాజద్వారమున దీపదానము ప్రశస్తముగా చెప్పబడినది. ఈ విషయమున విచారించవలసిన పనిలేదు. పదకొండు కాని ఇరువది ఒకటి కాని పిండి ముద్దలు చేసి మూడు భాగములుచేసి నలుబది రోజులు చేయుట ఒక పద్దతి. పంచ, సప్త, నవ అనునది లఘుమానము. పాలచేకాని, పెరుగుచేకాని, నవనీతము చేకాని, గోమయముచే కాని దీపదానవిషయమున హనుమంతుని దక్షిణాభి ముఖముగాచేసి ఋక్షవిన్యస్త పాదుని, కిరీట విరాజితునిగా భిత్తియందుకాని, పటమునందుకాని, పీఠమునకాని హనుమంతుని చిత్రమును లిఖించిమాలా మంత్రముచే దీపదానము చేయవలెను. ద్వాదశాక్షర విద్యచే నిత్య దీపము ఉంచవలెను. దీపదానమున ఉన్న విశేషమును తెలియును. షష్ట్యాది యందు ద్వీతీయాదియందు ఈ దీపమును గ్రహించుము అనిపలుకవలయును. కూటాదులయందు నిత్యదీపవిధియందు ద్వాదశాక్షర మంత్రమును పఠించవలెను. ఆయా కార్యములందు మూలమంత్రముచే దీపదానమును చేయవలెను. గోమయముచే అలికిన భూమియందు రేఖా సమన్వితముగా షట్కోణమును అష్టదళమును లిఖించవలెను. షట్కోణములందు బీజయుక్త షడంగములను లిఖించవలెను. ఆ మధ్యలో సౌమ్యుడగు మారుతిని వ్రాసి పూజించి, షట్కోణములందు షడంగములను నామములను పూర్వోక్తవిధిగా వసుపత్రములందు క్రమముగా ఈ ఎనిమిది మంది వానరులను పూజించవలయును. సుగ్రీవుని, అంగదుని, సుషేణుని, నలుని, నీలుని, జాంబవంతుని, ప్రహస్తుని, సువేషుని చక్కగా పూజించి తరువాత షడంగ దేవతను పూజించవలయును. మొదట వాయుపుత్రుని, తరువాత జానకీ జీవనుని, రామదూతను, బ్రహ్మాస్త్ర నివారకుని దేశకాల సంకీర్తనము చేసి చక్కగా పూజించవలయును. కుశోదకమును తీసుకొని దీపమంత్రమును పఠించవలయును. ఉత్తరాభిముఖుడై జపించి సాధించవలెను. ఆ మంత్రమును పదకొండు మార్లు జపించి జలమును భూమిమీద విడువవలెను. తరువాత అంజలి బద్ధుడై శక్త్యానుసారముగా జపించవలెను. ఉత్తరాభి ముఖముగా ఉన్న ఈ దీపరాజులు నా కోరికలు తీరునట్లు చేయుము.” అని చెప్పవలెను. ఇట్లు పదమూడు ద్రవ్యములను గోమయము, మృత్తికా, మషీ, లత్తుక, దరదము, రక్తచందనము, చందనము, తేనె, కస్తూరి, దధి, క్షీరము, నవనీతము, ఘృతము వీటిని ఉపయోగించవచ్చును. గోమయము గోభవము, మహిషీభవము అని రెండు విధములు. నశించిన ద్రవ్య ప్రాప్తికి మాహిష గోమయమును ఉపయోగించవచ్చును.
దేశాంతరము వెళ్ళినవాడు చాలా దూరము నుండి రావలసి ఉన్నప్పుడు, మహాదుర్గమును రక్షించవలసి ఉన్నపుడు, బాలాదులను రక్షించవలసి ఉన్నపుడు, చోరాదుల వలన కలుగు భయమును తొలగించవలసి ఉన్నపుడు, స్త్రీలను వశము చేసుకొనవలసి ఉన్నప్పుడు గోమయము ప్రశస్తము. గోమయమును భూమి మీద పడిన తరువాత గ్రహించరాదు. ఆకాశమున ఉండగనే పాత్రలో తీసుకొనవలయును. శ్వేతము, పీతము, అరుణము, అసితము అని మృత్తిక నాలుగు విధములు. గోపీ చందనము, హరితాలము, గైరికము, మషి, లాక్షారసోద్భూతము వర్ణములు విశిష్టములు. ఇతరములు స్పష్టములే. గోపీచందనముచే చతురస్ర గృహమును లిఖించి, ఆ గృహమధ్యమున మాహిష గోమయముచే హనుమంతుని మూర్తినిచేసి క్రోధబీజమును పుచ్చమునను సావధానముగా లిఖించి, తైలముచే స్నానము చేయించి, గుడముచే తిలకధారణచేసి శాలనిర్యాససంభవమగు ధూపమును పద్మసమముగా చేసి, అయిదు వత్తులచే తైలదీపమును ఉంచి, దధ్యోదనమును నైవేద్యముచేసి, మూడు వారములు కంఠదేశమున శేషవిషమును ఉచ్చరించు చుండవలయును. ఇట్లుచేసినచో నష్టములగు గేదెలు, గోవులు దాసదాసీజనములు త్వరలో లభింతురు. చోరాది దుష్టుల వలన సర్పాదులవలన భయము కలిగినపుడు తాలముచే నాలుగు ద్వారములుగల గృహమును లిఖించి పూర్వద్వారమున గజమును, దక్షిణ ద్వారమున మహిషమును, పశ్చిమ ద్వారమున సర్పమును, ఉత్తరమున వ్యాఘ్రము ఏర్పరిచి, ఇట్లే క్రమముగా ఖడ్గమును క్షురికను, దండమును ముదర్గమును లిఖించి, మధ్యలో మాహిష గోమయముచే మూర్తిని ఏర్పరిచి డమరు హస్తము చకితాక్షిని ప్రయత్మముచే ఏర్పరిచి, పాలచే స్నానము చేయించి, రక్త చందనముచే అనులేపనము గావించి, జాజి పూవులచే పూజించి శుద్ధ ధూపమును కల్పించవలెను. నేతిదీపము నుంచి పాయ సాన్నమును నివేదన చేయవలెను. దీపకేంద్వాఢ్య మగు గగనమును శాస్త్రమును ముందు జపించ వలెను. ఇట్లు ఏడు దినములు చేసినచో మహాభయము నుండి విముక్తుడగును. ఈ రెండు విధాన ములను మంగళవారమున ప్రారంభించవలెను. శత్రుసైన్యం భయము కలిగినపుడు గైరికాది ధాతువులచే మండలమును లిఖించవలెను. మధ్యభాగమున కొద్దిగా వంగియున్న తాలమును లిఖించవలెను. దక్షిణాభి ముఖముగా సుందరముగా, హృదయమున అంజలిని ధరించి జలముచే స్నానగంగ దాదులను యథాశక్తిగా అర్పించవలెను. నేయి కలిపిన నువ్వుల అన్నమును నివేదన చేయవలెను. రెండు వేలు జపించవలయును. ఇట్లు ప్రతిదినము చేసినచో తప్పిపోయిన వారు తిరిగివత్తురు. శ్యామపాషాణ ఖండముచే భూపతి గృహమును లిఖించి, నాలుగు ద్వారములచే కూడిన ప్రాకారము నేర్పరిచి, ఆ ద్వారములలో అన్యోన్యపుచ్చములుకల హనుమంతుని ఆకార త్రయము నేర్పరిచి గోమయముచే హనుమన్మూర్తినిచేసి, ఉమ్మెంత పూవులచే పూజించవలెను. జటామాంసీభవమగు ధూపమును, నూనె కలిపిన నేతి దీపమును, నువ్వుల నూనె కలిపిన కారము కలిపిన మినుప రొట్టెను నైవేద్యముచేసి, దక్షిణ హస్తమున రొట్టెను తినుచున్న హనుమంతుని ధ్యానించవలెను. వామహస్తముచే పాషాణములను విసరుచు శత్రు సైన్యమును భయపెట్టుచున్న వానిని, కనుబొమను ముడిచి, భయపెట్టుచు, క్షోభింపచేయుచు శత్రువులను సంహరించుచున్న హనుమంతుని ధ్యానించవలెను. ‘భుగ్భుగ్’ అని వేయి మార్లు జపించ వలయును. ఇట్లు చేసినచో పరసైన్యమును నశింపచేయగలడు. దుర్గములకు చక్కని రక్షణ ఏర్పడును. ఇట్లు చాలా ప్రయోగము లను చెప్పితిని. ప్రతిదినము యథావిధిగా దీపదానము చేయువానికి మూడు లోకములలో సాధించలేనిదేదియు ఉండదు. దుష్టహృదయము కలవానికి, దుష్టాలోచన దుష్టబుద్ధి కలవానికి, వినయములేని శిష్యునకు, లోభికి, కృతఘ్నునకు ఈ మంత్రములను ఉపదేశించరాదు. చక్కగా పరీక్షించి ఉపదేశించవలెను. ఇంకనూ ఏమి చెప్పవలెను. హనుమంతుడు అన్నిటిని ఇచ్చును. ఇపుడు తత్త్వజ్ఞానము ఇచ్చు మరియొక మంత్రమును చెప్పెదను. “ఓం నమో హనుమతే జాఠరదన క్షోభం సంహర! సంహర! ఆత్మతత్వం ప్రకాశయ ప్రకాశయ! హుం ఫట్ స్వాహా” అను మంత్రము సార్ధ షడ్వింశత్యక్షరములు కలది. ముని వసిష్ఠ మహర్షి అనుష్టుప్ ఛందస్సు హను మంతుడు దేవత 7, 7, 6, 4, 8, 4 మంత్రాక్షరములచే షడంగములను కల్పించవలెను. హనుమంతుని ధ్యానించవలెను. వామబాహువును జానువున నుంచి, హృదయమున జ్ఞానముద్రను ఉంచి అధ్యాత్మచిత్తముతో ఆసీనుడై, కదళీవన మధ్య గతుడై, బాలార్కకోటి ప్రతిముడు, జ్ఞానప్రదుడగు హనుమంతుని ధ్యానించి, లక్ష జపించి, దశాంశమును నేయి కలిపిన నువ్వులచే హోమము గావించి, పూర్వోక్త పీఠమున పూర్వమువలె పూజించవలెను. ఈ మంత్రమును జపించినచో మన్మథ వికారములు నశించును. హనుమంతుని అనుగ్రహమువలన తత్త్వ జ్ఞానమును పొందును. భూతములను పారద్రోలు మరియొక మంత్రమును చెప్పెదను. “ఓం కాశీం కుక్షి వరాహాం జనా పవన పనపుత్ర ఆవేశి ఆవేశి” “ఓం శ్రీహనుమన్మంత్రరచ” అనునది మరియొక మంత్రము. బ్రహ్మ ముని గాయత్రీ ఛందస్సు హనుమంతుడు దేవత. కములా బీజము ఫట్ శక్తి షడ్దీర్ఘాఢ్య బీజముచే షడంగకల్పన చేయవలెను. పాటలాస్యుడు, స్వర్ణాద్రి సమవిగ్రహుడు, పారిజాత వృక్ష మూలస్థుడు అగు ఆంజనేయుని ధ్యానించవలెను. ఇట్లు ధ్యానించి, లక్ష జపించి, తేనె కలిపిన నువ్వులచే, దశాంశమును హోమముగావించి, పూర్వోక్త పీఠమున పూర్వమువలె పూజించవలెను. ఈ మంత్రముచే గ్రహగ్రస్తుని తుడువవలెను. ఇట్లు చేసినచో గ్రహము అరుచుచు అతనిని విడిచి పారిపోవును. ఈ మంత్రములను ఎప్పుడూ రహస్యముగా నుంచవలయును. అందరికీ తెలుపరాదు. చక్కగా పరీక్షించిన శిష్యునికి కాని, పుత్రునికి కాని ఉపదేశించవలయును. హనుమద్భజనాసక్తుడగు బుద్ధి మంతుడు కార్తవీర్యార్జుని విశేషముగా ఆరాధించి యథోక్త ఫలమును పొందును. (3/75)