నారద మహా పురాణము
హరిభక్తి లక్షణము
నారదమహర్షి పలికెను: సర్వజ్ఞా! మహాముని! సర్వయోగాంగములను చక్కగా వివరించితిరి. ఇపుడు కూడా నేను అడిగిన విషయములను చెప్పుడు. భక్తి గల వారికే యోగము సిద్ధించును అని మీరు చెప్పితిరి. సర్వేశుడు సంతోషించినప్పుడే భక్తి స్థిరముగా ఉండునని చెప్పితిరి. సర్వేశుడు దేవదేవుడగు జనార్దనుడు ఎట్లు సంతోషించునో దయానిధివగు నీవు నాకు చెప్పుము.
సనక మహర్షి పలికెను: ముక్తిపై కోరిక ఉన్నచో సచ్చిదానంద విగ్రహుడు పరదేవుడు అగు నారాయణుని సర్వ విధములా సేవించుము. విష్ణుపరాయణుడగు మానవుని శత్రువులు హింసింపజాలరు. గ్రహములు బాధించజాలవు. రాక్షసులు చూడజాలరు. దేవదేవుడగు జనార్దనునియందు దృఢమగు భక్తి కలవారికి అన్ని శ్రేయస్సులు సిద్ధించును. అందరికంటే భక్తిమంతులే అధికులు. శ్రీహరి మందిరమునకు వెళ్ళు పాదములు సఫలములు. శ్రీహరిని పూజించు కరములు సఫలములు. శ్రీహరిని దర్శించు నేత్రములు సఫలములు. హరినామమును కీర్తించు దానినే సజ్జనులు జిహ్వాఅందురు. చేతులు పైకెత్తి ముమ్మారులు సత్యమును చెప్పుచున్నారు. గురువుతో సమమగు తత్త్వమును, హితమును, సారమును చెప్పుచున్నాను. నిస్సారమైన ఈ సంసారమున సారము హరి సమర్చనము మాత్రమే. సుదృఢము మహామోహ ప్రదాయకము అగు సంసారపాశమును హరి భక్తి అను గొడ్డలిచే ఛేధించి అత్యంత ఆనందమును పొందుము. విష్ణువుయందు లగ్నమైనదే మనస్సు. విష్ణునామ సంకీర్తన పరాయణమైనదే వాక్కు. విష్ణు కథాసారపూరితములైనవే శ్రోత్రములు. ఆనందము అక్షరము, అవస్ధాత్రయశూన్యము ఆకాశమధ్యగతము పరదైవతమగు శ్రీహరిని సర్వకాలములలో సేవించుము. ఆత్మజ్ఞానము లేనివారు శ్రీహరి స్థానమును, స్వరూపమును చూచుటకు నిర్దేశించుటకు వీలుకాదు. సర్వాంతర్యామి సనాతనుడగు దేవదేవుడు సమస్త కరణములచే కూడి ఉన్నచో మేలుకొని ఉన్నాడందురు. అంతకరణములతో కూడి స్వేచ్ఛగా సంచరించుచున్నపుడు ‘స్వపితి’ అని (పడుకొని ఉన్నాడు) అందురు. ‘స్వాప’ విసర్జితుడై బాహ్యాంతఃకరణ రహితుడై స్వరూపరహితుడై పుణపాప వివర్జితుడై ఉన్నపుడు సర్వోపాధి వినిర్ముక్తుడు ఆనంద స్వరూపుడు నిర్గుణుడు విభువు పరబ్రహ్మస్వరూపుడగు దేవుడు సుషుప్తావస్థలో (నిద్రావస్థలో) ఉండెనందురు. ఈ స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతయూ భావనామయమే. మెరుపువలె చంచలము. కావున జనార్దనుని సేవించుము. అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము కలవానియెడ శ్రీహరి సంతోషించును. సర్వభూతదయాపరుడు బ్రాహ్మణపూజా పరాయణుడు అగువాని విషయమున మధుకైటభమర్దనుడగు శ్రీహరి సంతోషించును. సత్కథను విని సంతోషించువాడు, సత్కథను చెప్పువాడు, సత్సంగమును చేయువాడు, అహంకార రహితుడు అగువానికి శ్రీహరి ప్రీతి చెందును. ఆకలి దప్పులలో, ప్రమాదములలో, సర్వకార్యములలో, సర్వావస్థలలో శ్రీహరి నామ సంకీర్తనమును చేయువారికి శ్రీహరి సంతోషించును. పతిప్రాణ, పతిపూజాపరాయణయగు స్త్రీ విషయమున జగన్నాథుడు సంతోషించి తన పదమును ప్రసాదించును. అసూయారహితులకు అహంకార వర్జితులకు దేవపూజపరులకు శ్రీహరి ప్రసన్నుడగును.
కావున ఓ దేవర్షీ! నా మాటను వినుము. ఎప్పుడూ శ్రీహరినే సేవించుము. మెరుపు వలె చంచలమైన సంపదచే అహంకరించకుము. ఈ శరీరము మృత్యువుతో కలిసి ఉండునది. జీవితము అతి చంచలము. ధనము రాజ తస్కరాదులచే అపహరించబడును. సంపదలు క్షణ భంగురములు. ఓ దేవర్షే! సగము ఆయుష్యము నిద్రలో గడుచుటను నీవు చూచుట లేదా? భోజనాది వ్యహారములచే ఎంత ఆయుష్యము గడుచుచున్నది. బాలభావముచే కొంత వృద్ధాభావముచే కొంత వ్యర్థము అగుచున్నది. మరికొంత యౌవనమున విషయ భోగములచే వ్యర్థము అగుచున్నది. ఇక ధర్మములను ఆచరించునది ఎప్పుడు? బాల్యమున వార్థక్యమున అచ్యుతార్చన చేయజాలరు. కావున యౌవనముననే అహంకారమును విడిచి ధర్మాచరణమును చేయుము. సంసార గహ్వరమున మునిగి నశించకుము. ఈ శరీరము నాశనమునకు నిలయము. ఆపదలకు స్థానము. ఈ శరీరము భోగ నిలయము. మలమూత్రాదులచే పరిదూషితము. కావున శాశ్వతమని భావించి మానవుడేల పాపమునాచరించవలయును? నానా దుఃఖములతో కూడుకొని నిస్సారమైన సంసారమున విశ్వాసమునుంచరాదు. ఎప్పుడు మృత్యువు గ్రహించునో తెలియదు. కావున ఓ మునీంద్రా! నేను ఈ సత్యమను చెప్పుచున్నాను. వినుము. దేహసంబంధ నివృత్తి కొఱకు వెంటనే అభిమానమును కామక్రోధలోభములను విడిచి శ్రీహరిని భజించుము. మానవత్వము చాలా దుర్లభము. కొన్ని వేల కోట్ల జన్మలు స్థావరాదులలో భ్రమించిన తరువాత అతి కష్టముతో మనుష్యత్వము లభించును. ఆ మానవ జన్మలో దైవతాబుద్ధి భోగబుద్ధి కలుగుట పూర్వజన్మ తపః ఫలమే. మానుష్యమును పొంది కూడా శ్రీహరిని సేవించినచో అతనికంటే అజ్ఞాని మందబుద్ధి మూర్ఖుడు మరియొకడుండడు. దుర్లభమైన మానుష్యమును పొంది శ్రీహరిని కోరిన ఫలములను ఇచ్చును. సంసారాగ్నిచే దహించబడిన వాడు ఎవ్వడు శ్రీహరిని ఆరాధించడు? విష్ణుభక్తికలవాడు చండాలుడైనను, ద్విజుని కంటే శ్రేష్ఠుడే. విష్ణుభక్తి హీనుడగు ద్విజుడు కూడా చండాలుని కంటే అధముడే. కావున కామాదులను విడిచి అవ్యయుడగు శ్రీహరిని సేవించవయలును. శ్రీహరి సర్వగతుడు. కావున శ్రీహరి సంతోషించినచో విశ్వమంతయూ ప్రీతి చెందును. హస్తిపదమున పాదమంతయూ లీనమగునట్లు చరాచర ప్రపంచమంతయూ శ్రీహరిలో లీనమగును. స్థావర జంగమాత్మకమగు ప్రపంచము అంతయూ ఆకాశముచే వ్యాపించబడి ఉన్నట్లు ఈ ప్రపంచమంతయూ శ్రీహరిచే వ్యాపించబడి ఉన్నది. జన్మ నుండి మరణము సంభవించును. జన్మమే మృత్యుసాధనము. జన్మ మరణములు అతి సన్నిహితములు. శ్రీహరి సేవచే జన్మమరణములు నశించును. శ్రీహరిని ధ్యానించిననూ, స్మరించిననూ, పూజించిననూ, ప్రణామములు ఆచరించిననూ సంసారపాశమును ఛేదించును. కావున శ్రీహరిని పూజించనివాడెవ్వడు? శ్రీహరి నామోచ్చారణముచే సర్వపాపములు నశించును. పూజించినచో మోక్షమే లభించును. శ్రీహరి నామము ఉండగా జనులు సంసారమున ఉండుట ఎంత ఆశ్చర్యము! ఎంత ఆశ్చర్యము! అందువలననే మరల మరల చెప్పుచున్నాను. ఇది సత్యము, వినుము. యమభటులు తీసుకొని పోవుచున్నప్పుడు ధర్మాచరణను చేయజాలవు. ఇంద్రియవైకల్యము, వ్యాధులు కలుగునపుడే ముక్తిని కోరువారు శ్రీహరిని పూజించవలయును.
తల్లి గర్భము నుండి బయటపడిన వెంటనే మృత్యువు ప్రాణి సన్నిహితము అగును. కావున ధర్మపరుడు కావలయును. వినశ్వరమగు శరీరమును పొంది ధర్మము ఆచరించకపోవుట ఎంత కష్టము? ఎంత కష్టము! చేతులు పైకెత్తి ఇది ముమ్మాటికి నిజమని మరల చెప్పుచున్నాను. దంభాచాఖాచారమును విడిచి వాసుదేవుని పూజించవలయును. చేతులు పైకెత్తి మరల హితమును చెప్పుచున్నాను. సర్వవిధములా విష్ణువును పూజించవలయును. అసూయను అనృతమును వదిలి పెట్టుము. క్రోధము వలన మనస్తాపము కలుగును. క్రోధమువలన సంసారబంధము కలుగును. క్రోధము ధర్మమును క్షీణింపచేయును. కావున క్రోధమును విడువలయును. ఈ జన్మ కామమూలము. కామమే పాపమునకు కారణము. కామము కీర్తిని క్షీణింపచేయును. కావున కామమును పరిత్యజించవలయును. సమస్త దుఃఖజాలములకు మాత్సర్యమే కారణము. నరకసాధకము కావున మాత్సర్యమును విడువవలయును. మానవుల బంధ మోక్షములకు మనసే కారణము. కావున ఆ మనసును పరమాత్మయందు లగ్నము చేసి సుఖమును పొందవలయును. జగన్నాథుడగు శ్రీమహావిష్ణువు ఉండగా భజింపకపోవుటకు మానవులకెంత ధైర్యము! సర్వదాత, అచ్యుతుడు అగు జగన్నాధుని సేవించక సంసారసాగరమున మునిగిన వారు ఎట్లు తీరమును చేరెదరు. అచ్యుతానంత గోవింద నామోచ్చారణ ఔషధము వలన అన్ని రోగములు నశించును. నేను నిజమును చెప్పుచున్నాను. నారాయణ జగన్నాథ వాసుదేవ జనార్దన అని కీర్తించువారు అంతటా వందితులు అగుదురు. ఇప్పటికీ బ్రహ్మదులచే కూడా తెలియశక్యముకాని ప్రభావముగల శ్రీహరిని శరణువేడుము. హృదయపద్మములో నివసించి ఉన్న శ్రీహరిని తెలియలేని దుర్జనుల మూఢత్వము ఎంత వింత? ఓ మునిశ్రేష్ఠా! నేను మరలమరల చెప్పుచున్నాను. వినుము. శ్రద్ధగల వారియెడ శ్రీహరి సంతుష్టుడు అగును. కాని ధనములచే బంధుత్వముచే కాదు. విష్ణుభక్తి గల వారికి ప్రతిజన్మలో బంధువులు ఐశ్వర్యము పుత్రులు వృద్ధి చెందెదరు. ఈ దేహము పాపమూలము. పాపకర్మరతము. ఈ విషయమును తెలిసి జనార్దనుని పూజించుము. హరిపూజాపరాయణులకు పుత్రమిత్ర కళత్రాది బహుసంపదలు కలుగును. సంశయమే లేదు. ఇహపరములలో ఆనందమును కోరువారు సర్వ కాలములలో శ్రీహరిని పూజించవలయును. ఇహపరములలో దుఃఖమును కోరువారు పరనిందాపరులు కావలయును. దేవదేవుడగు జనార్దనుని యందు భక్తిలేని వారి జన్మము వ్యర్థము. సత్పాత్ర దానములేని ధనము వ్యర్థము. ఓ మునిసత్తమా! కర్మక్షయమును కలిగించు శ్రీమహావిష్ణువుకు నమస్కరించని వాని శరీరము సర్వపాపములకు నిలయము. సత్పాత్రదానశూన్యమగు ధనమును కాపాడుట శ్రీమహావిష్ణువునకు నమస్కరించని వాని శరీరము సర్వపాపములకు నిలయము. సత్పాత్రదానశూన్యమగు ధనమును కాపాడుట చౌర్యముచేసిన ధనమును కాపాడుట వంటిదని తెలియుము. మెరుపువలె చంచలమైన సంపదలచే మదించిన క్షణభంగురులు ప్రాణులు. సంసార పాశవిమోచకుడగు విశ్వేశుని పూజించరు. ‘దైవి’, అసురి అని సృష్టి రెండు విధములు. హరిభక్తికల సృష్టి ‘దైవి’ అని, హరిభక్తి లేని సృష్ఠి ‘అసురి’ అని తెలియవలయును. సుదుర్లభమైన హరిభక్తి కలవారు సర్వశ్రేష్ఠులు. అంతటా ప్రసిద్ధులు. అసూయా రహితులు, విప్రరక్షణను చేయువారు కామాది రహితులైన వారి విషయమున శ్రీహరి సంతోషించును. విష్ణ్వాలయమున సమ్మార్జనాది శుశ్రూష చేయువారు సత్పాత్రదాననిరతులు పరమపదమును చేరెదరు. (1/34)