మార్గశీర్ష పౌర్ణిమనాడు చేయు లక్ష్మీనారాయణ వ్రతము

సనకమహర్షి పలికెను: ఓ మునిసత్తమా! ఇంకొక ఉత్తమవ్రతమును చెప్పెదను. ఈ వ్రతము అన్ని పాపములను నశింపచేయును. పరమ పవిత్రమైనది. అన్ని దుఃఖములను తొలగింపచేయును. బ్రాహ్మణక్షత్రియ వైశ్య శూద్రులకు స్త్రీలకు అన్ని కోరికలను తీర్చును. ఈ వ్రతమును ఆచరించినచో అన్ని వ్రతములను ఆచరించిన ఫలము లభించును. దుస్స్వప్నములను నశింపచేయును. ధర్మమును ప్రసాదించును. దుష్టగ్రహములను నివారింపచేయును. ఈ పూర్ణిమా వ్రతము అన్ని లోకములలో ప్రసిద్ధి చెందినది. ఈ వ్రతమును నిర్వర్తించినచో పాపరాశినశించును. మార్గశీర్ష శుద్ధపూర్ణిమనాడు పవిత్రుడై నియమముగా ప్రాతఃకాలమున దంత ధావనముచేసుకొని ఆచారానుగుణముగా స్నానము చేసి తెల్లని వస్త్రములను ధరించి శుద్ధుడై ఇంటికి వచ్చి మౌనము వహించి, పాదప్రక్షాళనమును చేసుకొని, ఆచమనమును చేసుకొని, ప్రభువైన నారాయణుని స్మరించుచు నిత్య విధియైన దేవార్చనను చేసి తరువాత సంకల్ప పూర్వకముగా భక్తి భావముతో లక్ష్మీనారాయణ దేవుని అర్చించవలయును. వ్రతమును స్వీకరించినవాడు అవాహన ఆవాసన గంధపుష్పాదులచే ‘నమో నారాయణాయ’ అని భక్తి తత్పరుడై పూజించవలయును. గీత నృత్యవాద్యములచే పురాణ పఠనాదులచే కాని స్తోత్రములచే కాని ఆరాధించవలయును. లక్ష్మీనారాయణుని పురోభాగమున చతురస్ర స్ధండిలమును ఏర్పరచి, గృహ్యసూత్రాను సారముగా ఆ స్ధండిలమున అరంగుళముల ప్రదేశమున అగ్నిని స్థాపించవలయును. అజ్య భాగాంతము వరకు పురుష సూక్తముచే, పొంగలిచే (చరువు) నువ్వులచే నెయ్యిచే హోమమును చేయవలయును. సర్వపాపనివృత్తి కొఱకు ప్రయత్నముచే ఒకమారు, రెండుమార్లు మూడు మార్లు కాని హోమమును చేయ వలయును. తమతమ గృహ్యసూత్రానుసారముగా ప్రాయశ్చిత్తాదిక మంతటిని ముగింపచేసి, హోమమును సమాప్తిని గావించి శాంతి సూక్తమును పఠించవలయును.

మరల దేవుని సమీపించి మరల పూజను సలుపవలయును. భక్తిగలవాడై లక్ష్మీనారాయణునికి ఉపవాసమును అర్పించవలయును. ఓ దేవా! నీ ఆజ్ఞచే పౌర్ణమీ తిథిన నిరాహారముగా నుండి మరుసటి దినమున భుజింతును. నాకు రక్షకుడవు కమ్ము. ఇట్లు విజ్ఞాపన చేసి స్వామికి అర్ఘ్యమును ఈయవలయును. అట్లే భూమిపై మోకాళ్ళనుంచి తెల్లని పూవులను అక్షతలను చేతిలో తీసుకొని “క్షీరోదార్ణవ సంభూత! అత్రిగోత్రసముద్భవ! గృహాణార్ఘ్యం మయాదత్తం రోహిణీ నాయకప్రభో!” అను మంత్రముచే అర్ఘ్యమును చంద్రునకు ఇచ్చి చేతులు జోడించి ప్రార్థించవలయును. (“పాల సముద్రమున పుట్టినవాడా! అత్రిగోత్రమున అవతరించినవాడా! రోహిణీ పతీ! నేనిచ్చిన అర్ఘ్యమును స్వీకరించుము” అని పై మంత్రమునకు అర్థము) తూర్పు ముఖముగా నిలచి, చంద్రుని చూచుచు, తెల్లని కిరణములు కలిగిన, ద్విజరాజువైన రోహిణీ పతివి, లక్ష్మీదేవి సోదరుడవు అయిన నీకు నమస్కారము అని ప్రార్థించి పురాణ శ్రవణాదులచే జాగరణమును చేయవలయును, పవిత్రుడై ఇంద్రియ జయముకలిగి పాషండులదృష్టి సోకక ఉండవలయును. తరువాత ప్రొద్దున స్వాచారాను గుణముగా యథావిధిగా నిత్యకృత్యములను నిర్వర్తించి, విభవానుగుణముగా విస్తరముగా మరల స్వామిని పూజించవలయును. బ్రాహ్మణులకు భోజనము పెట్టి, వినయముతో బంధుమిత్ర భృత్యపరి వారముతో మౌనముగా తాను భుజించవలయును.

ఇట్లే పుష్యాది మాసములలో పూర్ణిమా తిథిన ఉపవసించి వికారరహితుడగు శ్రీమన్నారాయణుని భక్తితో పూజించవలయును. ఇట్లు ఒక సంవత్సరము వ్రతము నాచరించి కార్తీక పూర్ణిమనాడు ఉద్యాపనమును చేయవలయును. ఆ విధానమును చెప్పెదను వినుము. కళ్యాణకరమగు చతురస్ర మండపమును చేయవలయును. ఆ మండపమును పుష్పమాలాదులచే ఛత్రచామర ధ్వజములచే అలంకరించవలయును. చాలా దీపములను ఉంచవలయును. గంటలు అమర్చవలయును. అద్దము లతో కలశములతో కూర్చవలయును. ఆ మధ్యన పంచవర్ణములతో సర్వతో భద్రమును లిఖించ వలయును. దానిపై జలపూరిత కుంభమును ఉంచవలయును. కలశమును వస్త్రముతో కప్పి, బంగారముతోకాని, వెండితోకాని, రాగితోకాని చేసిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రముపై ఉంచ వలయను. ఆ ప్రతిమను పంచామృతముతో అభిషేకించి క్రమమును అనుసరించి గంధాదులతో అర్చించవలయును. ఇంద్రియ నిగ్రహము కలవాడై భక్ష్య భోజ్యములను నివేదన చేయవలయును. శ్రద్ధతో చక్కగా జాగరణ చేయవలయును. మరుసటి దినమున ప్రాతః కాలమున యథావిధిగా పూర్వము వలె విష్ణువు అర్చించవలయును. ఆ ప్రతిమను సదక్షిణగా ఆచార్యునకు దానము చేయ వలయును. సంపదలున్నచో కాదనక బ్రాహ్మణులను భుజింపచేయ వలయును. శక్తి ననుసరించి సావధానముగా తిలదానమును చేయవలయును. వివేకము కలవాడై విధిపూర్వకముగా తిల హోమమును చేయవలయును. ఇట్లు చక్కగా లక్ష్మీనారాయణ వ్రతమును ఆచరించిన వారు ఇహ లోకమున పుత్ర పౌత్రాదులతో మహాభోగములను అనుభవించి అన్ని పాపముల నుండి విముక్తిని పొంది పదివేల తరములతో యోగులకు కూడా దుర్లభమగు విష్ణుభవనమును చేరుదురు. (1/18)