నారద మహా పురాణము
నారదకృత విష్ణుస్తుతి
మహానుభావుడైన నారదునికి సనత్కుమారుడు సకలధర్మములను ఎట్లు చెప్పెను? వారిర్దరెట్లు కలిసిరి? ఓ సూతమహర్షీ! ఆ ఇద్దరు బ్రహ్మవాదులు ఏ ప్రదేశములో ఉండిరి? హరికథాగానము నెట్లు చేసిరో అది మాకు చెప్పుము అని శౌనకాది ఋషులు సూతుని అడిగిరి.
సనకాదులు బ్రహ్మమానసపుత్రులు. వారందరు జితేంద్రియులు. అహంకార మమకార రహి తులు. వారి పేర్లను తెలిపెదను వినుడు. సనకుడు, సనందనుడు, సనత్కుకుమారుడు, సనాతనుడు. వీరందరూ విష్ణుభక్తులు, మహాత్ములు. బ్రహ్మధ్యానము చేయువారు. వేయిసూర్యుల కాంతిగలవారు. సత్యసంధులు, మోక్షమును కోరువారు. ఒకప్పుడు సనకాదులు బ్రహ్మ సభ అయిన మేరుపర్వత శిఖరమునకు బయలుదేరిరి. వీరలు మార్గమధ్యమున తమకు ఇష్టమైన విష్ణుపాదమునుండి పుట్టిన గంగానదిని చూచిరి. ఆ నదిని చూచి ఆ చల్లని నీటిలో స్నానము చేయుటకు సిద్ధపడిరి. ఓ బ్రాహ్మణోత్తములారా! ఇంతలో దేవర్షియైన నారదుడు తనకు అన్నలగు సనకాదులను చూచి అచటికి వచ్చెను. స్నానము చేయుటకు సిద్ధముగానున్న అన్నలను చూచి చేతులు జోడించి నమస్క రించి, ప్రేమతో భక్తితో శ్రీమన్నారాయణుని నామసంకీర్తనమును చేయుచుండెను. నారాయణ! అచ్యుత! అనన్త! వాసుదేవ! జనార్దన! యజ్ఞేశ! యజ్ఞపురుష! కృష్ణా! విష్ణూ! నీకు నమస్కారము. పద్మాక్ష! కమలాకాంత! గంగాజనక! కేశవ! క్షీరసాగర శయన! దేవేశ! దామో దర! నీకు నమస్కారము! శ్రీరామ! శ్రీ విష్ణూ! నరసింహ! వామన! ప్రద్యుమ్న! సంకర్షణ! వాసుదేవ! అజ! అనిరుద్ధ! అమరుక్! మురారీ! నీవు మమ్ములను అన్ని భయములనుండి కాపాడుము. అని ఇట్లు శ్రీహరి నామములను కీర్తించుచు తన అగ్రజులకు నమస్కరించి వారితో కలిసి కూర్చొని, ప్రీతితో గంగలో స్నానము చేసెను.
లోకముల పాపములను నశింపచేయు చల్లని గంగాజలమునందు సనకాదులు స్నానము చేసి దేవ, ఋషి పితృదేవతలకు తర్పణములనిచ్చి కల్మషములను పోనాడి నదిని దాటి తీరముచేరి సంధ్యాపాసన చేసి తమ ఆచారములను ముగించుకొని నారాయణుని గుణములను వర్ణించు కథ లను సంభాషించసాగిరి. సుందరమైన గంగాతీరమున తమ విధులను పూర్తి చేసుకొని నారాయణ కథలను చెప్పుచుండగా నారదమహర్షి మధ్యలో ఇట్లు ప్రశ్నించెను.
ఓ మునిశ్రేష్ఠులారా! మీరందరూ అన్నియూ తెలిసినవారు. భగవంతునియందు భక్తిపరులు. జగన్నాథులు, పూజింపతగినవారు సనాతనులు. లోకమును ఉద్ధరించుటలో అసక్తి కలిగి, దీనుల యందు మైత్రిని చూపు మిమ్ములను అడుగుచున్నాను. జ్ఞానులైన మీరు నాకు భగవంతుని లక్షణమును తెలుపుడు. ఈ స్థావరజంగమాత్మకమగు ప్రపంచమంతయు ఎవనివలన పుట్టినది? గంగ పాదోదక మైన శ్రీహరి ఎట్లు తెలియబడును? మానవులుచేయు కాయిక, వాచిక, మానసిక కర్మలు ఎట్లు సఫలమగును? జ్ఞానలక్షణమును తపోలక్షణమును తెలుపుడు. శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడు అగు అతిథిపూజను గూర్చి తెలుపుడు. శ్రీమన్నారాయణునికి ప్రీతికలిగించు ఇటువంటి రహస్యము లను నాయందు అనుగ్రహము ఉంచి చెప్పుడు.
పరదేవునికి, పరములన్నిటికి పరుడైనవానికి నమస్కారము. పెద్దవాటిలోను చిన్నవాటిలోను సమానముగా నివసించువానికి సగుణునకు, నిర్గుణునకు నమస్కారము. మాయావశ్యుడు కానివానికి అత్మ అను పేరుగల వానికి, మాయారూపునకు విశ్వరూపునకు యోగీశ్వరునకు, యోగరూపునకు, యోగముచే తెలియబడువానికి విష్ణువునకు నమస్కారము. జ్ఞానస్వరూపునకు, జ్ఞానముచే తెలియబడు వానికి అన్ని జ్ఞానములకు కారణమైనవానికి, జ్ఞానప్రభువునకు, తెలియదగువానికి, అన్నియూ తెలిసినవానికి, విజ్ఞానసంపద కలవానికి నమస్కారము. ధ్యానరూపునకు, ధ్యానముచే తెలియబడు వానికి, ధ్యానము చేయువారి పాపములను హరించువానికి, ధ్యానేశ్వరునికి, ఉత్తమ బుద్ధి స్వరూపు నకు ధ్యేయస్వరూపము ధ్యాతృస్వరూపము గలవానికి నమస్కారము. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, విధాత, దేవతలు, సిద్ధులు, యక్షులు, అసురులు, నాగసంఘములు ఎవని శక్తిచే శక్తిమంతులో, అట్టి అజునికి, పురాణునికి, సత్యస్వరూపునికి, స్తుతినాథునికి అన్నివేళలా నమస్కరించుచున్నాను. బ్రహ్మ రూపముతో జగత్తును సృజించువాడు, విష్ణు రూపముతో జగత్తును రక్షించువాడు, ప్రళయ కాలమున రుద్రరూపముతో జగమును సంహరించువాడు, పడుకొని తన పాదమును పానము చేయువాడు అయిన శ్రీమన్నారాయణుని నమస్కరించుచున్నాను. శ్రీమన్నారాయణునికి నామ సంకీర్తనముచే గజేంద్రుడు మకర బాధనుండి విముక్తుడాయెను. తన నివాసమైన పరమపదమునందు ప్రకాశించు అది దేవుడైన శ్రీహరికి నమస్కరించుచున్నాను. శివ భక్తులకు శివ రూపుడుగా, విష్ణు భక్తులకు విష్ణు రూపుడుగా సంకల్ప మాత్రముచే దేహములను ధరించు ఆ శ్రీహరిని అన్ని వేళలా శరణు పొందుచున్నాను. కేశి అనురాక్షసుని, నరకాసురుని సంహరించినవాడు, బాలుడుగా ఉండి చేతితో పర్వతమును ధరించినవాడు, భూభారమును తొలగించుట వినోదముగా భావించువాడు అయిన దేవునికి ఎల్లప్పుడూ నమస్కరించెదను. ఉగ్రనరసింహరూపముతో అవతరించి, కఠిన శిలవలె ఉన్న హిరణ్యకశ్యపుని వక్షస్థ్సలమును చీరి, తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించిన దేవునికి నమస్క రించుచున్నాను.
ఆకాశాదులచే భూషించబడి ఉన్న, ఆత్మ అనబడువానిని, ఏ సంబంధము అంటనివానికి, ఇంతటి తత్త్వమిది అని కొలవలేని స్వరూపముగలవానికి, జగత్తును సృష్టించుచున్నను కర్మ చేయని వానికి, పరుడు, పురాణ పురుషుడైన వానికి శ్రీహరికి నమస్కరించుచున్నాను. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, వాయువు, మానవులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, దేవతలు అను భేదమును తన శరీరముచే పొందుచున్ననూ ఒకనిగా ఉండు ఆది ఆత్మస్వరూపుని సేవించెదను. ఈ ప్రపంచ మంతయు ఎవని వలన వేరుపడి, పుట్టి, నిలచి, ఎవనిలో లీనమగునో ఆ దేవుని శరణు వేడు చున్నాను. విశ్వరూపముతో ఉండి అన్నిటితో సంగమున్న వానివలె తోచుచు ఏ సంగము లేక పరిపూర్ణుడుగా ఉన్నవానిని శరణు వేడుచున్నాను. అందరి హృదయాలలో అంతర్యామి రూపమున ఉన్ననూ, మాయా మోహితులకు తెలియని పరుని, శుద్ధునిశరణు వేడుచున్నాను. అన్ని సంగములను వదిలినవారికి, ధ్యానయోగమునందు ఆసక్తికల మనసు కలవారికి అంతటా జ్ఞానరూపునిగా భాసించు వానిని శరణువేడుచున్నాను. క్షీరసముద్రమును అమృతము కొఱకు చిలుకునపుడు దేవతల హితము కొఱకు మందర పర్వతమును మూపున దాల్చిన కూర్మావతారునికి నమస్కారము. సముద్రమునుండి భూమిని తన కోరకొనతో ఉద్ధరించి సమస్త జగత్తును నిలిపిన వరాహావతారునికి నమస్కరించు చున్నాను. ప్రహ్లాదుని కాపాడుచు, శిలవలె కఠినమైన రాక్షసుని వక్షస్థలమును చీల్చిన నారసింహునికి నమస్కరించుచున్నాను. బలిచక్రవర్తి నుండి భూమిని పొంది, రెండు అడుగులతో బ్రహ్మ వరకు వ్యాపించియున్న ప్రపంచమును అతిక్రమించి, దేవతలకు ఇచ్చిన త్రివిక్రమ రూపునికి నమస్కరిం చుచున్నాను. కార్తవీర్యార్జునుని అపరాధముతో ఇరువది ఒక్కమారులు క్షత్రియవంశమును సంహ రించిన పరశురామునికి నమస్కరించుచున్నాను. నాలుగురూపములతో ఆవిర్భవించి వానరులతో కలిసి రాక్షససైన్యమును సంహరించిన రామచంద్రునకు నమస్కరించుచున్నాను. రెండురూపములను ధరించి భూభారమును తొలగించి తన కులమును సంహరించిన శ్రీకృష్ణుని సేవించెదను. మూడు లోకములను తన స్వరూపమును తనలో లీనము చేసికొనిన దోషరహితుడు, పరిశుద్ధుడు అయిన, ఈశ్వరుని తమలో చూచుచుండువానిని అతనిని సేవించెదను. యుగాన్తమునందు పాపులను, అపరిశుద్ధులను వాడియైన ఖడ్గధారచే ఖండించి కృతయుగారంభమున ధర్మమును స్థాపించిన శ్రీహరికి నమస్కారములు.
ఇటువంటి అనేక రూపములు కలవు. శ్రీమన్నారాయణుని అవతారములను రూపములను లెక్కపెట్టగలవారెవ్వరూ లేరు. కొన్ని సంవత్సరములు లెక్కించిననూ సరిపోవు. శ్రీమన్నారాయణుని నామమాహాత్మ్యమును సంపూర్ణముగా మహర్షులు కూడా తెలియలేరు. దేవతలు, రాక్షసులు, మనువులు తెలియజాలరు. అంతటి మహిమగల ప్రభువును క్షుద్రుడను నేను ఎట్లు భజించగలను? శ్రీమన్నారాయణుని పేరును వినినంతనే మహాపాపులైన మానవులు కూడా పవిత్రులగుదురు. అల్పబుద్ధినైన నేనెట్లు ఆ స్వామిని స్తుతించగలను? ఏదోవిధముగా శ్రీమన్నారాయణుని పేరును కీర్తించిననూ వినిననూ పాపులు పరిశుద్ధులగుదురు. పరిశుద్ధులు మోక్షమును పొందగలరు. దోషరహితులైన యోగులు మనసులో నిలిపి చూచు జ్ఞానరూపుడైన పరమాత్ముని శరణు వేడు చున్నాను. జ్ఞానులు అన్నిటిలో పరిపూర్ణుడైన శ్రీహరిని చూచెదరు. అట్టి జ్ఞానరూపుని ఆదిదేవుని పుట్టుకలేని శ్రీహరిని నేను భజించెదను. సర్వసత్త్వ స్వరూపుడు, శాంతుడు, అన్నిటిని చూచువాడు, అందరికి ప్రభువు, భావస్వరూపుడు, సహస్రశీర్షుడు అయిన శ్రీహరికి నమస్కరించు చున్నాను. జరిగినది, జరుగునున్నది, స్థావరము జంగమము, అయిన జగత్తును అతిక్రమించి దశాంగుల పరంతము వ్యాపించియున్న జగదీశ్వరుని, జరా రహితుని సేవించెదను. అణువులకన్నా అణువు, మహత్తుల కంటె మహత్తు, రహస్యములలో కెల్ల పరమరహస్యము అయిన ఆదిదేవుని మాటిమాటికి నమస్కరించెదను. ఒక మారు ధ్యానించినను, తలచినను, పూజించినను, వినినను, నమస్కరించినను తన లోకమునిచ్చు జగదీశ్వరుడగు పురుషోత్తమునికి నమస్కరించుచున్నాను అని ఇట్లు పరమాత్మను శౌనకమహర్షి స్తుతించుచుండగా నారదునితో గూడిన సనందనాదులు, ఇతర మునీశ్వరులు ఆనంద బాష్పములు చూపును అడ్డగించుచుండగా పరమానందమును పొందిరి. ఈ పురుషోత్తముని స్తోత్ర మును ప్రాతః కాలమునలేచి చదువువారు అన్నిపాపములు నశించి పరిశుద్ధులై విష్ణు లోకమును పొందెదరు. (1/2)