నారద మహా పురాణము
కార్తవీర్యమాహాత్మ్య మంత్ర దీపకథనము
సనత్కుమార మహర్షి పలికెను: ఓ నారదా! నీ సందేహమును తొలగించుటకు కార్తవీర్యార్జునుడు ప్రాణులచే సేవించదగినవాడు ఎట్లు అయ్యెనో తెలిపెదను. వినుము. కార్తవీర్యార్జునుడు సుదర్శన అవతారము. దత్తాత్రేయుని ఆరాధించి గొప్ప తేజస్సును పొందెను. ఆ కార్తవీర్యార్జునుని స్మరించుట మాత్రముననే యుద్ధమున శత్రువులను జయించును. నష్ట వస్తువులు లభించును. కావున కార్త వీర్యార్జునుని మంత్రమును పూజాదికము అన్ని తంత్రములలో రహస్యముగా రక్షించబడి ఉన్నది. ఇట్లు సర్వసిద్ధి ప్రదాయకమగు కార్తవీర్యార్జున మంత్రాదికమును నీకు తెలిపెదను. ‘వహ్నితాయుతా రౌద్రి అగ్నీందు శాంతియుత మగు లక్ష్మి, వేధాధరేందు శాంత్యాఢ్యము నిద్రాయాశాగ్ని బిందు యుతము, పాశము మాయాంకుశము పద్మా వర్మాస్త్రములు కార్తవీర్యపదము, అనన్తాసనము వహ్నిజములు కర్ణసంస్థితములు. దీర్ఘ సహితమగు మేషము, పవనుడుగు, హృదంతిమమగు మంత్రము ఇది. ఈమంత్రము పందొమ్మిది వర్ణములు గలది. తారాది సఖ వర్ణకము. దత్తాత్రేయుడు ముని. అనుష్టుప్ ఛందస్సు కార్తవీర్యార్జునుడు దేవత. బీజశక్తి ధ్రువ హృదయము శేషాఢ్య బీజ యుగ్మముచే అధోభాగమున హృదయన్యాసము గావించవలెను. శాంతియుక్త చతుర్ధమగు కామాద్య ముచే శిరోంగన్యాసమును కావించవలెను. ఇంద్వాఢ్యమగు నామకర్ణాద్యము వీశయుక్తముచే న్యాసము చేయవలెను. అంకుశ పద్మములచే శిఖను, వాక్సహితములచే అస్త్రమును, శేషవర్ణములచే వ్యాపకమును ఆచరించవలెను. హృదయమున, జఠరమున, నాభియందు, గుహ్యదేశమున, దక్షిణపాదమున, వామపాదమున, సక్థియందు, జానువున, జంఘలయందు, ప్రణవ ద్వయమధ్యన ఉన్న బీజదశకమును న్యాసించవలెను. తారాదులగు శేషవర్ణము లను మస్తకమున, లలాటమున, కనుబొమలలో, కర్ణములలో, నేత్రములలో, నాసికయందు, వక్త్రమున, గళమున, భుజమున, సర్వమంత్రములచే సర్వాంగమున ఆదరముచే వ్యాపకము ఆచరించి సకలాభీష్టసిద్ధి కొఱకు ఉద్యదర్క సహస్రసన్నిభుని సర్వభూతపతివందితుని అయిదువందల దక్షిణబాహువులచే బాణములను, అయిదువందల వామ బాహువులచే ధనువులను ధరించినవానిని, స్వర్ణమాలాశోభితుని, రక్తవస్త్ర సమా వృతుని, శ్రీవిష్ణుచక్ర అవతారము అగు కార్తవీర్యార్జున చక్రవర్తిని ధ్యానించవలెను. మనమును ఒక లక్ష జపించవలెను. దశాంశమును తండులమిశ్రములగు నువ్వులచే, పాయసముచే హోమమును ఆచరించవలెను. విష్ణు పీఠమున పూజించవలెను. షట్కోణములందు షడంగములను, దిక్కులందు విదిక్కులందు చోరమద విభంజనుని, మారీమద విభంజనుని, అరిమద విభంజనుని, దైత్యమద విభంజనుని, దుష్టనాశకుని, దుఃఖనాశకుని, దురితములను ఆపదలను నశింపచేయు వానిని, పూజించి, దిక్కులయందు అసితప్రభలగు అష్టశక్తులను పూజించవలెను. క్షేమకరి, వశ్యకరి, శ్రీకరి, యశస్కరి, ఆయుఃకరి, ప్రజ్ఞాకరి, విద్యాకరి, ధనకరి అనునవి అష్టశక్తులు. తరువాత అస్త్రసంయు తులను లోకేశులను పూజించవలెను. ఇట్లు సాధించ బడిన మంత్రము ప్రయోగార్హమగును. ఇక ఇప్పుడు కార్తవీర్యార్జునుని పూజా యంత్రమును చెప్పెదను.
స్వబీజానంగధ్రువవాక్కర్ణికముగా అష్టదళపద్మమును లిఖించవలెను. తారాది వర్మాంత దళమును, శేష వర్ణములను మధ్య దళములనుగా, ఊష్మంత్య స్వరములు కింజల్కములుగా శేషార్థపరివేష్టితముగా కోణములందు అలంకరించబడిన భూతవర్ణ గృహముగా కార్తవీర్యార్జున యంత్రమును పరిశుద్ధ భూమియందు అష్టగంధములతో లిఖించి, ఆ యంత్రమున కుంభమును ప్రతిష్ఠించి, కుంభమున అవాహన గావించి రాజును అర్చించవలెను. కుంభమును స్పృశించి జితేంద్రియుడై ఒక వేయి జపించవలెను. ఆ కుంభోదకముచే అభిషేకము చేసినచో సర్వాభీష్టములు సిద్ధించును. పుత్రులు, కీర్తి రోగనాశము, ఆయుష్యము, స్వజనరంజనము, వాక్సిద్ధి, చక్కని నేత్రములు కుంభోద కాభిషేకముచే లభించును. శత్రువులవలన ఉపద్రవము సంభవించినపుడు, గ్రామమున ఉపద్రవములు సంభవించినపుడు శత్రు భీతి నివృత్తి కొరకు ఈ యంత్రమును స్థాపించవలెను. ఆవాలు, మినుములు, ఉల్లి, పత్తి వీటిచే హోమము గావించినచో శత్రుసంహారము జరుగును. ఉమ్మెత్తచే శత్రుస్తంభనము, నిమ్మకాయలచే ద్వేషము, పద్మములచే వశ్యత కలుగును. ఉచ్చాటనలో విభీతక సమిధలచే, చండ్ర సమిధలచే హోమమును చేయవలయును. కటు తైల మహిష్యాజ్యములను హోమద్రవ్యములుగా కూర్చుకొనవలెను. యవ హోమముచే శ్రీప్రాప్తి, తిలలచే నేతిచే పాపనాశము, తిలతండుల సర్షపములచే (తెల్ల ఆవాలు) రాజవశ్యత, ఉత్తరేణి దూర్వల (గడ్డి)చే హోమము చేసిన లక్ష్మీప్రదము పాపనాశము. ప్రియంగు (ఇందుగ చెట్టు) హోమము స్త్రీ వశకరము. మురహోమము భూతశాంతి ప్రదము. రాగి, మేడి, జువ్వి, మట్టి మారేడు సమిధలచే హోమము గావించిన పుత్రులకు ఆయుష్యము, ధనము, సుఖము లభించును. నిర్మోకముచే, హోమముచే, ఆవాలచే, లవణములచే హోమము గావించినచో చోర నాశము జరుగును. రోచనాగోమయములచే స్తంభనము, శాలిహోమముచే భూప్రాప్తి కలుగును. అంతట ఆయాకార్యలాఘవ గౌరవములను అనుసరించి హోమ సంఖ్యను వేయి నుండి పదివేల వరకు బుద్ధిమంతులు నిర్ణయించుకొనవలెను. పండితులు కార్తవీర్యార్జున మంత్ర లక్షణము ఇట్లు చెప్పుదురు. “అన్ని మంత్రములలో ‘కార్తవీర్యార్జునాయ’ అని చెప్పవలయును. స్వబీజము ఆద్యముగా ఈ మంత్రము దశాక్షరము, మిగిలిన మంత్రములు నవ ఏకాదశాక్షరములు. ఆద్యబీజ ద్వయముచే ఇదియే రెండవ మంత్రము అగును. స్వకామములచే తృతీయ మంత్రము అగును. స్వభ్రువులచే చతుర్థము, స్వపాశములచే పంచమము. స్వమాయచే షష్టము. స్వాంకుశములచే సప్తమము, స్వరములచే అష్టమము, స్వవాగ్భవములచే నవము, వర్మాస్త్రములచే దశమము. రెండవ మంత్రము నుండి తొమ్మిదవ మంత్రము వరకు బీజవ్యతి క్రమము జరుగును. దశమ మంత్రమున వనవర్మాస్త్ర మధ్యగములు ఈ మంత్రములలో తమకు అనుకూలమగు మంత్రమును సేవించవలెను. ఆ మంత్రములలో మొదటి మంత్రముల విరాట్ఛన్దస్సు, మిగిలిన తొమ్మిదింటిలో త్రిష్టు ప్ఛందస్సు గలవు. ఈ దశమంత్రములు ప్రణవాదికము లైనచో మొదటి మంత్రము ఏకాదశాక్షరి, మిగిలిన మంత్రములు ద్వాదశాక్షరులు అగును. ప్రణవాదికమైన పుడు మొదటి మంత్రము త్రిష్టుప్ఛందస్సు మిగిలిన వాటిలో జగతీ ఛందస్సు ఉండును. ఇట్లు ప్రణవ రహితములు పది, ప్రణవాదిమములు పది మొత్తము ఇరువది మంత్రములకు పూజాదిక మంతయు పూర్వమువలె ఆచరించవలెను. ఈ మంత్రములకు దీర్ఘాఢ్యమగు మూలబీజముచే షడంగ కల్పన చేయవలెను. తారము, హృదయము, కార్తవీర్యార్జునాయ అనునది కవచము. ఠ ద్వయము అస్త్రము. ఈ మంత్రము పదునాలుగు అక్షరములు కలది. దీని పూజాదిక మంతయు పూర్వమువలె ఆచరింపవలయును. 1, 3, 2, 3, 3 వర్ణములచే పంచాంగ కల్పన చేయవలెను. “ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ హుం ఫట్ స్వాహా” అనునది పదినెనిమిది అక్షరములు గలది. 3, 4, 7, 2, 3 వర్ణములచే పంచాంగ కల్పన చేయవలెను. “నమో భగవతే శ్రీకార్తవీర్యార్జు నాయ సర్వదుష్టాంతకాయ తపోబలపరాక్రమ పరిపాలిత సప్తద్వీపాయ సర్వరాజన్య చూడామణయే మహాశక్తిమతే సహస్ర దహన హుం ఫట్” అనునది మహామంత్రము. అరువదిమూడు వర్ణములు కలది. ఈ మంత్రమును స్మరించినంతనే సర్వవిఘ్నములు తొలగిపోవును. రాజన్య చక్రవర్తీ, వీరః శూరః, మాహిష్మతీపతిః, రేవాంబు పరితృప్తః, హస్తప్రచాదిత దశాస్యః అను ఈ ఆరు పదములకు చతుర్థీ విభక్యంతములుగా షడంగకములను కల్పించవలెను. నర్మదా నదీ జలములలో యువతులచే నీరు చల్లబడగా ఆడుచున్న హస్తములచే జల ప్రవాహమును అరికట్టుచున్న మదించిన రాజశ్రేష్టుని ధ్యానించవలెను. ఇట్లు ధ్యానించి మంత్రమును పదివేలు జపించవలెను. మిగిలినదంతయూ పూర్వమువలె నాచరించవలెను. మొదటి మంత్రమును లక్ష జపించవలెను. పూజాధ్యానాదికము పూర్వము వలెనే కార్తవీర్యార్జునుడను పేరుగల రాజు వేయి చేతులు కలవాడు. అతని స్మరించినంత మాత్రముననే, హరించబడినది నశించబడినది లభించును. ఈ మంత్రము ముప్పది రెండు వర్ణములు కలది. సర్వపాదములచే పంచాంగ కల్పన చేయవలెను. ధ్యాన పూజాదిక మంతయు పూర్వమువలె ఆచరించవలెను. “కార్త వీర్యాయ విద్మహే మహావీర్యాయ ధీమహితన్న్వోర్జునః ప్రచోద యాత్” ఇది కార్తవీర్యార్జున గాయత్రి ప్రయోగాదులందు దీనిని జపించవలెను. అనుష్టుప్ మంత్రమును రాత్రిపూట జపించినచో చోరభయము నశించును. చోరులు ఆ ఇంటినుండి దూర ముగా పారిపోవుదురు. తర్పణము గావించినను హోమము గావించిననూ చోరులు పారిపోవుదురు. ఇక ఇపుడు కార్తవీర్యార్జునునకు ప్రీతికరమగు దీపవిధిని చెప్పెదను.
వైశాఖ శ్రావణ మార్గ శీర్ష కార్తిక అశ్వయుజ పౌష్య మాఘ ఫాల్గుణ మాసములలో దీపారం భమును ఆచరించవలెను. రిక్తవిహీనతిథియందు, శని మంగళ వారములు తప్ప మిగిలిన వారములలో, హస్త, ఉత్తర, అశ్విని, ఆరుద్ర, పుష్యమి, శ్రవణం, అనూరాధ, విశాఖ రోహిణీ నక్షత్రములలో దీపారంభము శుభావహము. చరమమునందు, వ్యతీపాతనందు, ధృతి, వృద్ధి, సుకర్మ ప్రీతి, హర్ష సౌభాగ్య, శోభన ఆయుష్మత్ యోగములందు, విష్టిరహిత కరణమునందు గ్రహణమున అర్ధోదయా యోగములందు రాత్రియందు కాని, పూర్వాహమున కాని దీపారంభమును చేసిన శుభావహము. కార్తిక శుద్ధ సప్తమీ నిశీధ కాలము అతిశుభప్రదము. ఆ దినమున ఆదివారము, శ్రవణా నక్షత్రము ఉండుట అత్యంత శుభప్రదము కాని ఇట్లు కలియుట అతిదుర్లభము. అత్యావశ్యక కార్యములందు మాసాదులను చూడవలసిన అవసరములేదు. మొదటి దినమున ఉపవసించి, నియమబద్ధుడై, బ్రహ్మచారియై, ప్రాతఃకాలమున స్నానమాచరించి గోమయోదకములచే అలికిన పరిశుద్ధమైన భూమియందు, ప్రాణాయామముచేసి సంకల్పముచెప్పి పూర్వోక్త న్యాసములు ఆచరించి రక్తచందన తండులములచే భూమియందు షట్కోణమును ఏర్పరిచి, దానిపై మన్మధుని లిఖించి షట్కోణములందు నవాక్షరములచే పరివేష్టించి, దాని వెలుపల త్రికోణమును లిఖించవలయును. ఇట్లు లిఖించిన యంత్రమునందు దీపపాత్రను ఉంచవలెను. బంగారు, వెండి రాగి, కంచు, మట్టులలో దేనితోనైనను దీపపాత్రను చేయవచ్చును. ఇనుపపాత్ర అధమాధమము. శాంతికొఱకు పెసరుపిండి, సంధి విషయమున గోధుమ పిండిని చేయవలెను (పాత్రగా ) వేయి పలముల నేయికి నూరు పలముల పాత్ర ఉండవలెను. పదివేల పలముల నేయికి అయిదొందల పలముల పాత్ర ఉండవలెను. మూడువేల పలముల నేయి ఉన్నచో పాత్ర వేయి పలముంది యుండవలెను. రెండు సహస్రముల ఫలముల నేయికి రెండొందల పలముల పాత్ర యుండవలెను. ఇట్లే ఇతర మానములను కూడా ఊహించవలెను. నిత్య దీపమున నాలుగు పలముల పాత్ర ఒక పలము నేయి ఉంచవలెను. ఇట్లు పాత్ర ప్రతిష్ఠచేసి సూత్రములనుండి ఏర్పరిచిన వత్తులను ఉంచవలెను. ఈ వత్తులు ఒకటి, మూడు, అయిదు, ఏడుకాని విషమ సంఖ్యలుగలవి, తిధి మానము ననుసరించి వేయివరకు తంతుసంఖ్య ఉండవచ్చును. శుద్ధ వస్త్రశోధితమగు గోఘృతమును ఆ పాత్రలో నుంచవలయును. కార్య గౌరవ లాఘవముల ననుసరించి వేయి పలముల నుండి నూరు పలముల వరకు నేయిని ఉంచవలెను. సువ వర్ణాదులచే చేయబడిన సుందరమగు పదునారంగుళముల శలాకనుకాని, ఎనిమిదంగుళముల శలాకనుకాని, నాలుగంగుళముల శలాకనుకాని సూక్ష్మాగ్రము, స్థూలమూలము గలదానిని పాత్ర మధ్యమున దక్షిణ భాగమున నుంచవలెను. పాత్ర దక్షిణ దిగ్భాగ మున అంగుల చతుష్టయమును వదిలి దక్షిణాధారముగా అధోగ్రముగా ఛూరికను భూమిలో నుంచవలెను. గణేశుని స్మరించుచు దీపమును వెలిగించవలెను. దీపమునకు పూర్వ దిగ్భాగమున సర్వతో భద్రమండలమున కాని తండ్రుల రచితమైన అష్టదల పద్మమున కాని యతావిధిగా కుంభమును ప్రతిష్ఠించవలెను. ఆ కుంభమున కార్తవీర్యార్జునుని ఆవాహనగావించి పూర్వమువలె పూజించవలెను. జలాక్షతలను తీసుకొని దీపసంకల్ప మును చేయవలెను. ఇది దీపసంకల్ప మంత్రము, ప్రణవము, పాశమాయలు, శిఖా తరువాత “కార్తవీర్యార్జునాయ మాహిష్మతీ నాధాయ సహస్ర బాహవే సహస్ర క్రతుదీక్షిత హస్తాయ దత్తాత్రేయ ప్రియాయ, ఆత్రేయా యానసూయాగర్భ రత్నాయ నమః” అని పలికి గ్రీవామకర్ణేన్దు స్థితములుగా పాశమును ఏర్పరచి, “ఇమం దీపం గృహాణ ఆముక్తం రక్ష రక్ష, దుష్టాన్నాశయ నాశయ పాతయ పాతయ, ఘాతయ ఘాతయ, శత్రూన్జహి జహి”అని పలికి మాయాతారము స్వబీజము “ఆత్మభూస్వాహా” అను మంత్రముచే పశ్చిమాభి ముఖముగా ఉన్న దీపరాజముచే “అముకం రక్ష అముకంప్రద” అనవలెను. మాయా ఆకాశద్వయము, వామనేత్ర చంద్రయుతము శివావేదాది కామ చాముండలు స్వాహా పూ, బిందుకా, ప్రణవము, స్వాహా కలిసిన మంత్రము నేత్ర బాణాధరక్షయము. ఈ మూల మంత్రమునకు దత్తాత్రేయుడు ముని. అమిత ఛందస్సు కార్తవీర్యార్జునుడు దేవత. అఖిలాభీష్టదుడు చాముండచే షడంగములను కల్పించవలెను. ఇట్లు కార్తవీర్య దేవుని ధ్యానించి మంత్రమును పఠించి జలమును విడువవలెను. గోవిందాఢ్యుడు గుహలి సేందువు, చాముండీ బీజము. తరువాత నవాక్షర మంత్రమున వేయి జపించవలెను. తారము అనంతము బిందుయుక్తము మాయాస్వము వామనేత్రయుతము కార్మాగ్రి శాంతి బింద్వాఢ్యములు స్వాహా అంకుశము ధ్రువము. పూర్వోక్త ఋషి అనుష్టుప్ఛందస్సు. మిగిలినది అంతయు పూర్వోక్తముగా చూడవలెను. మంత్రమును వేయి మార్లు జపించి కవచమును పఠించవలెను. ఇట్లు దీప ప్రదానము గావించినవాడు సకలాభీష్టములను పొందును. దీపము వెలుగుచున్న సమయమున అశుభమును మాటలాడరాదు. దీపము వెలుగుచున్నపుడు బ్రాహ్మణ దర్శనము శుభ ప్రదము. శూద్ర దర్శనము మధ్యమము. మ్లేచ్ఛ దర్శనము వధ బంధాదికమును కలిగించును. ఎలుకను పిల్లిని చూచుట అశుభము. గోవును, అశ్వమును చూచుట శుభప్రదము. దీపజ్వాల సమముగా ఉన్నచో సిద్ధి కలుగును. వక్రముగా ఉన్నచో నాశకరము. ధ్వని కలిగినచో భయమును ఇచ్చును. చక్కగా ప్రకాశము ఉన్నచో సుఖమును ఇచ్చును. నలుపు వర్ణము కలదైనచో శత్రు భయమును కలిగించును. నేయిని కక్కుచున్నచో పశునాశకము. దీపము ఉంచినపుడు దైవవశమున పాత్ర భగ్నమైనచో పదిహేను రోజులలోపే యజమాని యమాలయము చేరును. దీపమున మరియొక వత్తి చేర్చినచో కార్యసిద్ధి విలంబమగును. ఆ దీపమున మరియొక దీపమును వెలిగించినచో కర్త నేత్రహీనుడగును. అపరిశుద్ధుడు స్పృశించినచో వ్యాధికలుగును. దీపము వెలిగినచో చోరభయము కలుగును. కుక్క, పిల్లి, ఎలుకలు స్పృశించినచో రాజభయము కలుగును. పాత్రారంభమున ఎనిమిది ఫలములచే చేసిన దీపము అఖిలాభీష్టప్రదము. కావున దీపమునకు విఘ్నము కలుగకుండ ప్రయత్నించి రక్షించవలెను. వ్రత సమాప్తివరకు బ్రహ్మచర్యమును, భూశయనమును అనుష్ఠించవలెను. స్త్రీ శూద్ర పతితులచే మాటాడరాదు. నవాక్షర మంత్ర రాజమును సహస్రము జపించవలెను. ప్రతిదినము స్తోత్రమును పఠించవలెను. నిశీధకాలమున పఠించినచో విశేష ఫలప్రదము. దీపము ముందర ఒంటి పాదముచే నిలిచి రాత్రిపూట మంత్రమును వేయిమార్లు జపించినచో అభీష్టమును త్వరగా పొందును. శుభదినమున సమాప్తిచేయు బ్రాహ్మణులకు భోజన దానము కావించి, మంత్రమును జపించుచు కుంభోదకముచే కర్తను అభిషేకించవలెను. కర్త బ్రాహ్మణులను సంతోషింప చేయుటకు సమృద్ధిగా దక్షిణ నీయవలెను. గురువు సంతోషించినచో కార్తవీర్యార్జునుడు ఇష్టమును ప్రసాదించును. గురువు ఆజ్ఞచే తాను కూడా చేయవచ్చును. లేదా గురువు చేయించవచ్చును. గురువునకు ధనాదికము నిచ్చి చేయించవలెను. గురువు ఆజ్ఞ లేనిదే స్వేష్ట సిద్ధి కొఱకు కర్త ఆచరించినచో కార్యసిద్ధి కలుగక నూనె కూడా మధ్యమమే అజాది ఘృతము అధమము. అస్యరోగము సంభవించి నపుడు సుగంధ తైలముచే దీపము నుంచవలెను. శత్రు నాశమునకు ఆవాల నూనెచే దీపమును ఉంచవలను. సహస్ర పలముల మృతముచే దీపమును వెలిగించిననూ కార్యసిద్ధి కలుగనిచో మూడు మార్లు దీపవిధి ఆచరించవలెను. అపుడు అతిదుష్కర మగు కార్యము కూడా సిద్ధించియే తీరును. కార్తవీర్యార్జునుడు దీప ప్రియుడు. సూర్యుడు నమస్కార ప్రియుడు. మహావిష్ణువు స్తుతి ప్రియుడు. గణేశుడు తర్పణ ప్రియుడు. దుర్గా అర్చనా ప్రియురాలు. శివుడు అభిషేక ప్రియుడు. కావున వారివారి సంతోషము కొఱకు అయా విధుల అర్చించవలెను. (3/76)