నారద మహా పురాణము
గణేశ మంత్ర విధాన నిరూపణము
శ్రీ సనత్కుమార మహర్షి పలికెను: సకలాభీష్టదాయకములగు గణేశ మంత్రములను ఇపుడు చెప్పెదను. ఈ మంత్రములను ఉపాసన చేసి సాధకుడు భుక్తి ముక్తులను పొందును. అవ్యయుడు, లక్ష్మి, పార్వతి, మన్మధుడు, స్మృతి, చంద్రుడు, మనువు సహితయైన దేవత చంద్రశేఖర జ్ఞేన్తము గణపతి, తోయము, భుజంగుడు, వరణి అని సర్వాంతమున జనము ఉచ్చరించి తరువాత నావశమునకు తెమ్ము. ఈ మంత్రము ఇరువది యెనిమిది అక్షరములు కలది. ఈ మంత్రములకు ముని గణకుడు. గాయత్రీ ఛందస్సు గణేశుడు దేవత. షష్ఠ శక్తి బీజము. శ్రీ మన్మహాగణపతి ప్రీతికి వినియోగము. శిరస్సున ఋషిని వక్త్రమున ఛందస్సు, హృదయమున దేవతను, గుహ్యమున బీజమును, పాదములయందు శక్తిని న్యాసము చేయవలెను. షడ్దీర్ఘాఢ్య బీజముతో ‘యం’ను బీజాదిచే జాతి యుక్తములగు షడంగములను న్యాసము చేయవలెను.
షడంగములయందు శైవ షడంగముద్రను ఉంచవలెను. మొదట భూ లోకమును గామాదిగా నాభ్యన్తముగా పాదములయందు ఉంచవలెను. ‘గీం’ ఆదిగా భువర్లోకమును నాభినుండి కంఠాంతము వరకు ఉంచవలెను. ‘గూం’ ఆదిగా స్వర్లోకమును కంఠాది మస్తకావధిగా ఉంచవలెను. వ్యాపకమును మూల మంత్రముచే న్యాసము చేయవలెను. ఈ వ్యాసమును భువనన్యాస మందురు. మూల మంత్రమును ఉచ్చరించి మాతృకావర్ణమును ఉచ్చరించవలెను. తగంతమున మరల మూల మంత్రము ఉండవలెను. మాతృకా స్ధలమున నమోంతముగా పలుకవలెను. మూల మంత్రముచే క్షాంతముగా న్యాసముచేసి వ్యాపకమును రచించవలెను. దీనిని వర్ణన్యాస మందురు. ఇక పద న్యాసమును చెప్పెదను. పంచ, త్రి, బాణ, వహ్నీన్దు చంద్రాక్షి నిగమములతో క్రమముగా విభాగముచేసి మూల గాయత్రిచే హృదంతముగా అష్ట పదములతో ఫాల దేశమున, ముఖమున కంఠమున, హృదయమున, నాభిలో, ఊరువులలో, జానువులలో, పాదములలో ఉంచి మూల మంత్రముచే వ్యాపకమును ఆచరించవలెను. “తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నో దంతిః ప్రచోదయాత్” ఇది సర్వ సిద్ధి ప్రదాయినియగు మూల గాయత్రి. ఇట్లు న్యాసవిధిని పూర్తిచేసి, దేవుని హృదయ పద్మమున ధ్యానము చేయవలెను. ఉదయంచు సూర్యుని కాంతిగల, లోక రక్షా సంహార కారణుడగు, శక్తితో కూడియున్న, భూషణ ధారియగు, శంఖ చక్రాద్యాయుధము లను ధరించిన దేవుని ధ్యానించవలెను. ఇట్లు ధ్యానము చేసి మంత్రమును నాలుగు లక్షల ఇరువది నాలుగు వేల మార్లు జపించవలెను. తరువాత అష్ట ద్రవ్యములతో దశాంశము సంస్కరించిన అగ్నిహోత్రమున హోమము చేయవలెను. ఇక్షువు, సక్తు, అరటిపండ్లు, చిపిటములు, తిలలు, మోదకములు, నారీకేళములు, పేలాలు అనునవి అష్ట ద్రవ్యములు. పీఠమును, ఆధారశక్తి నుండి పరతత్త్వాంతము వరకు అర్పించవలెను.
షట్కోణము లోపల త్రికోణమును, బయట అష్టదళమును లిఖించవలెను. దాని వెలుపల భూపురము నేర్పరచి అచట గణేశుని పూజించవలెను. తీవ్రా, జ్వలిని, నందా, భోగదా, కామరూపిణి, ఉగ్రా, తేజోవతీ, సత్యా, విఘ్ననాశినీ అని తొమ్మిది శక్తులు “సర్వాది శక్తి కమలాసనాయ హృదయాంతికః” అనేది పీఠ మంత్రము. ఈ మంత్రముచే ఉత్తమ ఆసనమును అర్పించవలెను. ఆ ఆసనముపై గణేశుని ఆవాహించి, మధ్య భాగమున ప్రయత్న పూర్వకముగా పూజించవలెను. త్రికోణ బహిర్భాగమున క్రమముగా పూర్వాది దిక్చతుష్టయమున అర్పించవలెను. లక్ష్మీదేవిని, లక్ష్మీపతిని, పార్వతిని, పార్వతీ పతిని, రతిని, రతీపతిని, మహాదేవిని, పోత్రిని క్రమముగా బిల్వవట, అశ్వత్థ, ప్రియంగు (ఇందుగు) వృక్షముల క్రింద అర్చించవలయును. లక్ష్మీదేవి రెండు పద్మములను ధరించి, శ్రీహరి శంఖ చక్రములను ధరించి, పార్వతిదేవి పాశాంకుశములను ధరించి శివుడు టంకశూలములను ధరించి, రతి పద్మమును, మన్మధుడు పుష్పబాణ చాపములను, భూమి శూక వ్రీహులను, పోత్రి చక్రగదలను ధరించి ఉండును. దేవాగ్ర భాగమున లక్ష్మీసహితమగు వినాయకుని పూజించవలెను. ఆరు కోణములయందు ప్రియాసహితులగు ఆమోదాదులను పూజించవలెను. సిద్ధితో కూడియున్న ఆమోదుని మొదట పూజించవలెను. ఆగ్నేయ కోణమున సమృద్ధి సహితుడగు ఆమోదుని పూజించవలెను. ఈశాన్య కోణమున కీర్తి సహితుడైన సుముఖుని పూజించవలయును. పశ్చిమ భాగమున మదనావతితో కూడి ఉన్న దుర్ముఖుని, నైఋతి దిగ్భాగమున మదద్రవాయుతుడగు విఘ్నుని, వాయవ్య భాగమున ద్రావిణితో కూడిన విఘ్నకర్తను పూజించవలెను. పాశాంకుశ అభయకరులను, తరు భాస్కర సమతేజులను, గండస్ధలముల నుండి స్రవించుచున్న మదజలమునందలి ఆశతో వచ్చు తుమ్మెదలచే శోభించువారిని పూజించవలెను. షట్కోణమునకు రెండు పార్శ్వములందు క్రమముగా నిజశక్తులతో కూడియున్న శంఖ పద్మ నిధులను పూజించవలెను. కేసరములందు షడంగములను, పత్రములందు అష్టమాతృకలను ఇంద్రాదులను వజ్రాదులను భూగృహమునందు పూజించవలెను. ఇట్లు విఘ్నేశుని ఆరాధించి తన మనోరథములను సాధించుకొనవలెను. గజముఖుని నాలుగు వందల నలభై నాలుగు మార్లు శుద్ధ జలములతో తర్పణ చేయవలెను. పద్మములతో రాజులను, వారి పత్నులను కలువలతో, కుముదములతో మంత్రులను, శుభకరములగు అశ్వత్ధ సమిధలచే సేనానాయకులను వశము చేసుకొనవలయును. మేడి సమిధలచే రాజులను, జువ్వి సమిధలచే వైశ్యులను, మట్టి సమిధలచే అంత్యజులను వశము చేసుకొనవలయును. నేతితో హోమము చేసినచో సంపదలను, తేనెతో చేసినచో సువర్ణము, ఆవుపాలతో గోవులు, పెరుగుతో చేసినచో సర్వసమృద్ధులు కలుగును. అన్నహోమముచే అన్నము, వేతన సమిధలచే జలము, కుసుంభ కుసుమములచే హోమము చేసినచో వస్త్రములు లభించును.
ఇపుడు సర్వాభీష్ట ప్రదమగు చతురావృత్తి తర్పణ విధానమును చెప్పెదను. మొదట మూల మంత్రముచే ఒక్కొక్కదానికి నాలుగుమార్లు తర్పణమును చేయవలెను. పూర్వమంత్రాక్షరములచే స్వాహాంత మంత్రములచే నాలుగు, నాలుగుమార్లు, మూల మంత్రములచే నాలుగు మార్లు తర్పణము గావించి, తరువాత మిధునాదులను పూర్వము వలె తర్పణము గావించవలెను. దేవునితో కూడియున్న శక్తిని, శక్తిచే కూడియున్న దేవుని ఇట్లు ఇరువది ఆరు విధములుగా మిధునములగును. తన నామాద్యక్షర బీజములను క్రమముగా తర్పణము కావించవలెను. ఇట్లు అన్నియూ కలిసి నాలుగు వందల నలుబది నాలుగు అగును. ఇట్లు సంతర్పణముగావించిన తరువాత పూర్వమువలె ఉపచారములతో సర్వాభీష్ట ప్రదుడగు దేవునికి నమస్కరించి ఉద్వాసన గావించవలెను. భాద్రపద బహుళ చతుర్ధి నుండి ప్రతి మాసమున ఏమరుపాటులేక సూర్యోదయమున ప్రారంభించి చంద్రోదయము వరకు, భూమిపై కూర్చొనక ఇంద్రియ జయముకలవాడుగా సావధాన మనస్కునిగా ఉండవలెను. చంద్రోదయమైన తరువాత గణనాయకుని పూజించవలెను. పూర్వోక్త విధిని అనుసరించి నానాపుష్పోపహారములతో పూజించి ఇరువది యొకటి మోదకములను నివేదన చేయవలెను. తరువాత ఇరువది యెనిమిది వేలమార్లు మంత్రమును జపించవలెను. తరువాత కర్పూర కాశ్మీర పుష్ప చందనములచే గణపతికి మూలాంతమున ఙేన్తమున అర్ఘ్యమును ఈయవలెను. “ఇదమర్ఘ్యం కల్పయామి హృదంతః” అనునది అర్ఘ్యమంత్రము. ఇట్లు స్తోత్రము గావించి నమస్కరించి తరువాత చంద్రుని పూజించవలెను. తరువాత గురువును పూజించి నాలుగుమార్లు అర్ఘ్యమును ఈయవలెను. నివేదనచేసిన మోదకములలో సగము మోదకములను బ్రాహ్మణులకు ఈయవలెను. తాను జితేంద్రియుడై, బ్రహ్మ చర్యముతో మిగిలిన సగము మోదకములను భుజించవలెను. ఇట్లు ఒక సంవత్సరము వ్రతము ఆచరించువాడు పుత్ర పౌత్రులను, సుఖమును, ధనమును, ఆరోగ్యమును పొందును. సూర్యోదయము నుండి చేయగల శక్తి లేనిచో సూర్యాస్తమయమున ప్రారంభించి చంద్రోదయము వరకు పూర్వోక్త విధి ననుసరించి వ్రతమును ఆచరించవలెను. ఇట్లు చేసినను, పూర్వోక్త ఫలము లభించును. ఏనుగు దంతముతో కాని, బంగారముతో కాని, యేనుగు భంగపరిచిన నింబముతో కాని, వెండితోకాని గణేశప్రతిమను చేసి, ప్రాణప్రతిష్ఠ చేసి గణేశుని అవాహించి విధి విధానముగా పూజించి చంద్రగ్రహణ సమయమున నిరాహారుడై స్పృశించి శిఖలో ధరించినచో ద్యూతమున, వివాదమున, యుద్ధమున వ్యవహారమున జయము లభించును. వరాహ బీజము బిందు సహితములగు మన్వింద్వాన్నములు కళలు, స్మృతి, మాసేందు, మన్వాగ్రములు కర్ణోచ్ఛిష్ట గణమున చెప్పబడవలెను. “బకస్సదీర్ఘపవనో మహాయక్షాయ యం బలిః” అనునది బలి మంత్రము. ఇట్లు లేనిచో వర్ణము అఖిలేష్టదముకాదు. ప్రణవము భువనేశ్వరి, స్వబీజాంతమున నవాక్షరి హస్తి పిశాచి అగ్ని సుందరి అని వ్రాయవలెను. ఈ నవాక్షర మంత్రము సేవించు వారికి సర్వాభీష్ట ప్రదము, పదములతో సమగ్ర మంత్రముతో పంచాంగములను కల్పించవలెను. మిగిలినదంతయూ పూర్వ మంత్రముతో సమానముగా ఉండును. ఇపుడు సాటిలేని వక్రతుండ విధానమును చెప్పెదను.
జలము బ్రహ్మ అగ్నితో చంద్రునితో శ్రీహరి, సదీర్ఘుడగు దారకుడు, వాయువు వర్మాంతముగా ఉండునది ఇది ఆరు అక్షరములు కలది. ఈ మంత్రములకు ముని భార్గవుడు. అనుష్టుప్ ఛందస్సు. దేవత గణాధిపుడు, వక్రతుండ నామక బీజము. ‘వం’ అనునది శక్తి కవచము. తార హృదయ మధ్యగతములగు చంద్ర భూషితములగు మంత్ర వర్ణములచే షడంగన్యాసము చేసి మంత్ర వర్ణములను భ్రూమధ్యమున, కంఠమున, హృదయమున, నాభియందు, లింగమునందు, పదమునందుంచి, అబలముచే వ్యాపకమును ఆచరించవలెను. ఉదయించుచున్న సూర్యకాంతి గల, హస్తములందు పాశాంకుశ వరాభయము లను ధరించియున్న, రక్త భూషాంబరుడు అగు గజవక్త్రుని సేవించవలెను. దశాంశను అష్ట ద్రవ్యములచే హోమము చేయవలెను. తీవ్రాదులతో కూడియున్న పీఠమున అర్చించవలెను. మూర్తముచే మూర్తిని సంకల్పించి ఆ మూర్తియందు ఆవాహనచేసి పూజించవలెను. షట్ కోణములందు షడంగములు, పత్రములందు అష్ట శక్తులు ఉండును. విద్యను విధాత్రిని, భోగదము, విప్రఘాతినిని, నిధిప్రదీపను, పాపఘ్నిని, పుణ్యను, శశిప్రభను, పూజించవలెను. దశాగ్రములందు వక్రతుండ, ఏకదంష్ట్ర, మహోదర, గజాస్య, లంబోదర, వికట, విఘ్నరాట్ ధూమ్రవర్ణులను పూజించవలెను. తరువాత బాహ్యభాగమున ఆయుధదారులగు లోకపాలకులను పూజించవలెను. ఇట్లు ఆవరణములలో పూజించి అయిదుగురిలో గణనాయకుని పూజించినవారు వక్రతుండుని అనుగ్రహమువలన అన్ని కోరికలను తీర్చుకొనగలుగుదురు. దీక్షాసంస్కార పూర్వకముగా గురుముఖముగా మంత్రమును పొంది, బ్రహ్మచారియై, హవిస్సును మాత్రమే భుజించుచు, సత్య వాక్కు, జితేంద్రియుడుగా ఉండి పన్నెండువేలు ఆరునెలలు హోమము చేయుచు జపించవలెను. అట్లు చేసినచో దారిద్య్ర్యము తొలగిపోయి కుబేరుడంతటి ధనవంతుడు కాగలడు. చతుర్థి నుండి చతుర్ధి వరకు ఆదరముతో పదివేలు జపించవలెను. ప్రతిదినము అష్టోత్తరశతము హోమము చేయవలెను. ఇట్లు చేసిననూ పూర్వమువలె ఫలము లభించును. శుక్ల కృష్ణ పక్షములలోని చతుర్ధీ తిథిలో నూరు పర్యాయములు హోమమును అపూపములతో ఒక సంవత్సరము హోమము చేసినచో సర్వ సమృద్ధులు లభించును. అంగారక చతుర్ధిన విధి విధానముగా దేవుని పూజించి హవిస్సును, పాయసాన్నమును నివేదన చేసి, తరువాత గురువును పూజించి భోజనము చేయించ వలయును. నివేదిత ద్రవ్యముతో వేయి హోమమును గావించవలయును. ఇట్లు ఒక సంవత్సరము చేసినచో గొప్ప సంపదలను పొందును. ఇపుడు లోకముల హితమును కోరి మరియొక సాధకమును చెప్పెదను.
గణపతిని అటుకులచే పాయన అపూపమోదకములచే హోమముచేసి నానాఫలములతో కూడా యజించి తరువాత మంత్రము తెలిసినవాడు పసుపును ఉప్పును శుద్ధిచేసి ప్రసృతియందు చూర్ణము చేసి, మంత్రాక్షరముల సంఖ్యలో సగభాగమును కాని, దానిలో సగభాగమును కాని మంత్రమును జపించవలయును. చూర్ణమును గోమూత్రమున ఉంచవలెను. అట్లు ఉంచిన దానిని వేయిసార్లు ప్రయత్నముతో మంత్రముతో మంత్రించి, ఋతుదినమున స్నానముచేసి పరిశుద్ధురాలై శుక్లాంబరధర, శుభయగు స్త్రీని గణేశునిముందు కూర్చుండ బెట్టి అఔషధమును త్రాగించవలెను. అట్లు చేసినచో గొడ్రాలు కూడా కొడుకును పొందును. మరియు పరమాద్భుతము పరమరహస్యమగు మరియొక సాధనమును చెప్పెదను వినుము. గోచర్మ మూత్రముచే భూమిని శ్రద్ధగా అలికి దానిపై ధాన్య జాలమును చల్లి, అచట ఘటమును ఉంచవలెను. ఆ ఘటమును శుద్ధోదకముతో నింపవలెను. ఆ ఘటముపై క్రొత్తది శుభకరమగు మూకుడును (మట్టిచిప్ప) కపిలగోవు నేతితో నిండుగా ఉంచి, షడక్షర మంత్రముతో కాని అష్టాక్షర మంత్రముతో కాని దీపమును వెలిగించవలెను. ఆ దీపమున గణేశుని ఆవాహనచేసి గంధపుష్పాదులతో పూజించవలెను. స్నానము చేసిన కుమారిని కాని, కుమారుని కాని పూజించ వలెను. కుమారిని లేదా కుమారుని దీపము ముందు కూర్చుండబెట్టి, గణేశుని ధ్యానించి మన్త్రమును జపించవలెను. దీపమును ఉంచిన తరువాత గణేశుని ద్విజరూపునిగా చూడవలెను. అడిగినపుడు సంపదలో కాని, నశించిన దానిని లభించని దానిని గూర్చి, కుమారి కాని కుమారుడు కాని ఇట్లు చెప్పవలెను. షడక్షరము హృదంతమైనచో అష్టాక్షర మగును. గణేశ తంత్రమున ఇతర మంత్రములు కూడా కలవు. కాని మూడు లోకములలోని సాధకులకు సాధ్యము కాని ఇరువది యెనిమిది అక్షరముల, షడక్షరముల మంత్రములను ఎపుడూ చూడరాదు. ఇట్లు గణేశ మంత్ర విధానమును చెప్పితిని. శఠులకు, పరశిష్యులకు వంచకులకు దీనిని చెప్పరాదు. ఇట్లు సర్వసిద్ధి ప్రదుడగు గణేశుని సేవించువాడు ఇహమున సకల భోగములను పొంది అంతమున మోక్షమును పొందును. (3/68)