కృష్ణాదిమంత్ర భేద నిరూపణము

శ్రీసనత్కుమార మహర్షి పలికెను: ఓ మునీశ్వరా! ఇపుడు శ్రీకృష్ణపరమాత్మ మంత్ర భేదములను చెప్పెదను. ఈ మంత్రములను ఉపాసించి మానవులు తమ ఇష్టములను సాధించుకొనుచుందురు. శక్తిశ్రీమారపూర్వము, శ్రీశక్తి స్మరపూర్వకము, మారశక్తి రమా పూర్వము అని దశాక్షర మంత్రములు మూడు విధములు. ఈ మంత్రములకు నారద మహర్షిముని. గాయత్రీ ఛందస్సు, శ్రీకృష్ణ పరమాత్మ దేవత. ఈ మూడు మంత్రములకు పూర్వమువలె చక్రములచే అంగకల్పన చేయవలెను. తరువాత కిరీట మంత్రముచే వ్యాపకము ఆచరించవలెను. సుదర్శన మంత్రముచే దిగ్బంధమును చేయవలెను. ధ్యానార్చనాదిక మంతయూ వింశాక్షర మంత్రమునకువలె ఆచరించవలెను. రెండవ మంత్రమున దశాక్షర మంత్రమునకు చెప్పబడిన ధ్యాన పూజాదికమును ఆచరించవలెను. తృతీయమంత్రమున సావధానుడై శ్రీహరిని ధ్యానించ వలెను. శంఖచక్రధనుర్భాణ పాశాంకుశధరుడు, వేణువును మ్రోగించువాడు అగు కృష్ణ దివాకరుని ధ్యానించి అయిదులక్షలు సిద్దించిన తరువాత కామ్యములను సాధించుకొనవలెను. “శ్రీ కృష్ణాయ గోవిందాయ నమస్స్వాహా" అనునది ద్వాదశ అక్షర మంత్రము. బ్రహ్మముని గాయత్రీ ఛందస్సు. కృష్ణపరమాత్మ దేవత. 3, 4, 2, వర్ణములచే బీజములచే షడంగములను కల్పించవలెను. వింశాక్షర మంత్రమునకు చెప్పబడిన జపధ్యానహోమ అర్చనాదికమును ఆచరించవలెను. ఇంకనూ ఏమి చెప్పవలయును. ఈ మంత్రము సర్వాభీష్ట ప్రదాయకము. శక్తి స్మర పూర్వము పార్వతి శక్తిరమాంతికము. దశాక్షర మంత్రము మొదటనే చెప్పబడినది. ఇట్లు షోడశాక్షరి ద్వాదశాక్షర మంత్రములను చక్రములచే అంగములను కల్పించవలెను. వరదాభయ హస్తములచే ప్రియురాళ్ళను ఆశ్లేషించుచున్నవాడు, పద్మోత్పల కరములచే శంఖ చక్రములను ధరించువాడగు కృష్ణుని ధ్యానించి పది లక్షలు జపించవలెను. దశాంశమును నేయిచే హోమము గావించి మంత్రము సిద్ధించిన తరువాత మంత్ర నాయకులుకావలెను. ఈ మంత్రమును సర్వకామ ప్రదములు సర్వసంపత్సౌ భాగ్యప్రదములు, కామాంతమగు అష్టాదశాక్షరి మంత్రము సుతధన ప్రదము. ఈ మంత్రమునకు నారదమహర్షి ముని గాయత్రీ ఛందస్సు, శ్రీకృష్ణ భగవానుడు దేవత. కామబీజము. స్వాహాశక్తి షద్వీర్యాధ్య బీజముచే షడంగములను ఆచరించవలెను. దక్షిణ హస్తమున పాయసమును, వామహస్తమున నవనీతమును ధరించి దిగంబరుడుగా ఉన్న గోపీపుత్రుడు కాపాడు గావుత. ఇట్లు ధ్యానించి ముప్పది రెండు లక్షలు జపించవలెను. దశాంశమును శర్కరపాలు కలిపిన అన్నముచే హోమమును గావించవలెను. పూర్వోక వైష్ణవ పీఠమున అష్టాదశాక్షర మంత్ర విధానముచే పూజించవలెను. పద్మస్థుడగు కృష్ణుని పూజించి అతని ముఖాంబుజమున తర్పణము గావించవలెను. క్షీరములచే అరటి పండ్లచే దధిచే, నవనీతముచే పుత్రులను కోరువాడు తర్పణము గావించినచో సంవత్సర కాలములో పుత్రుని పొందును. కోరిన దంతయూ తర్పణము వలననే సిద్ధించును. “ఓం కృష్ణాయ గోవిందాయ నమః" అనునది దశాక్షర మంత్రము. దీనికి ద్వాదశాక్షర మంత్రమును జోడించినచో ద్వావింశత్యక్షర మంత్రము కాగలదు. ఈ మంత్రము వాగీశత్వప్రదము. నారదుడు ఋషి, గాయత్రీ ఛందస్సు, విద్యా ప్రదుడగు గోపాలుడు దేవత. కామబీజము వాగ్భవశక్తి, విద్యాప్రాప్తికి వినియోగము. వామోర్ధ్వ హస్తమున ఉత్తమ విద్యా పుస్తకమును ధరించువానిని, దక్షిణోర్ధ్వ హస్తమున మాతృకామయమగు స్ఫటికాక్షమాలను ధరించువానిని, అధఃపాణి ద్వయముచే శబ్ద బ్రహ్మమయమగు వేణువునూదుచున్నవానిని, గాయత్రీ గీతవసనుని, శ్యామలుని, కోమల కాంతిని, బర్హావతంసుని, సర్వజ్ఞుని, మునిపుంగ సేవితుని, ప్రమదావేశ విలాసుని, భువనేశ్వరుని ధ్యానించి నాలుగు లక్షలు జపించవలెను. దశాంశమును కింశుకములచే హోమము గావించి వింశాక్షర మంత్రమునకువలె పూజించవలెను. ఇట్లు సేవించినవాడు వాగీశ్వరుడగును. అదృష్ట శాస్త్రములు కూడా గంగా తరంగములవలె దృష్టములగును. "ఓం కృష్ణ! కృష్ణ! మహాకృష్ణ! సర్వజ్ఞ! త్వం ప్రసీద మే శ్రీమారమణ! విద్యేశ విద్యామాశు ప్రయచ్ఛ మే” అనునది ముప్పది మూడక్షరముల మంత్రము మహావిద్యా ప్రదము. నారదమహర్షి ముని. అనుష్టుప్ ఛందస్సు. శ్రీకృష్ణుడు దేవత. సర్వ పాదములచే పంచాంగములను రచించి శ్రీహరిని ధ్యానించవలయును. దివ్యోద్యానమున సూర్య సన్నిభ మణిమయమగు మండపమున, యోగ పీఠ మధ్యమున, సర్వవేదాంతమయ సురతరువు మూలమున కూర్చొని ఉన్న ముకుందుడు, కల్పవృక్ష రూపములగు వేదములచే శిఖరిశత సమాలంబితములగు నాలుగు కోశములచే న్యాయతర్క పురాణములచే స్మృతులచే అటువంటి అమరాదులచే అభివృతుడు, శంఖమురళీ పుష్ప బాణేక్షు చాపములను, అక్షమాలను, పూర్ణకుంభములను ధరించినవాడు, స్మరలలిత శరీరుడు, దివ్య భూషాంగ రాగుడు, వామహస్తమున వ్యాఖ్యాముద్రను ధరించిన, స్ఫుట రుచిరపదుడు విశ్వమాత్రమున శబ్దబ్రహ్మోద్భవమగు వేణువుచే ఊదువాడు, శ్రీధరుడు, అరుణరుచి, గోపికావల్లభుడు కాపాడుగావుత యని ధ్యానించి, లక్ష జపించవలెను. దశాంశమును పాయసముచే హోమము గావించవలెను. ఈ మంత్రమునకు అష్టాదశాక్షర మంత్రమునకువలె పూజా దినమును ఆచరించవలెను.

"ఓం నమో భగవతే నందపుత్రాయ ఆనందవపుషే శ్రీకృష్ణాయ గోవిందాయ స్వాహా" అనునది ఇరువది ఎనిమిది అక్షరములుగల మంత్రము. సర్వాభీష్టప్రదము.

"నందపుత్రాయ శ్యామలాంగాయ బాలవపుషే కృష్ణాయ గోవిందాయ శ్రీకృష్ణాయ గోవిందాయ స్వాహా" అనునది ముప్పది రెండక్షరములు గల మంత్రము. ఈ రెండు మంత్రములకు నారద ఋషి. ఉష్ణిక్ అనుష్టుప్ ఛందస్సులు. నందపుత్రుడు దేవత. అఖిలాప్తికి వినియోగము. చక్రములచే పంచాంగ కల్పనము. సాయుధులగు దిక్పాలాదులను పూజించవలెను. దక్షిణ హస్తమున రత్న చషకమును, వామ హస్తమున సౌవర్ణ నేత్రమును ధరించినవాడు, ప్రియాక్లిష్ట దేహుడగు కృష్ణుని ధ్యానించవలెను. లక్ష జపించవలెను. దశాంశమును పాయసముచే హోమము గావించవలయును. ఇట్లు ఈ మంత్రములు సిద్ధించిన తరువాత అభీష్టములను సాధించుకొనవలెను.

"ఓం నమో భగవతే నందపుత్రాయ బాలవపుషే స్వాహా" అనునది పందొమ్మిది అక్షరముల మంత్రము. బ్రహ్మముని అనుష్టుప్ఛందస్సు. బాలవపుడగు కృష్ణుడు దేవత. ఈ మంత్రమును పండితులు సర్వ సంపత్తి సిద్ధికొఱకు ఉపాసింతురు. "ఓం నమో భగవతే రుక్మిణీవల్లభాయ స్వాహా” అను మంత్రము షోడశాక్షరి నారద ఋషి. అనుష్టుప్ఛన్దస్సు. రుక్మిణీవల్లభుడుదేవత. 1, 2, 4, 6, 2 వర్ణములచే పంచాంగ కల్పన చేయవలెను. తరువాత సురేశ్వరుని ధ్యానించవలెను. తాపింఛకాంతి గల శ్రీకృష్ణుడు తన అంకమున నున్న స్వర్ణకాంతి గల పద్మమాలను కంఠమున ధరించిన ప్రియురాలిని వామభుజముచే ఆలింగనము చేసుకొని, ప్రియురాలిచే కూడా ఆలింగనము చేయబడి, ఇతర హస్తమున సౌవర్ణనేత్రమును ధరించి, పరిశుద్ధ పీతాంబరధారి నానాభూషణ భూషితుడగు శ్రీహరి కాపాడుగాత అని ధ్యానించి ఒక లక్ష జపించవలెను. దశాంశమును రక్త పద్మములచే త్రిమధువులను కలిపి హోమమును గావించవలెను. పూర్వోక్త పీఠమున శ్రీహరిని పూజించవలెను. అంగములను నారద ముఖ్యులను, సాయుధులగు లోకేశులను పూజించవలెను. ఇట్లు మంత్రము సిద్ధించినచో సర్వాభీష్టములను ఇచ్చును. "లీలాదండ! పదాబ్జ! జనసంసక్తదోర్దండ! ధరాదీశ! మేఘశ్యామ! భగవాన్! విష్ణో! ఫట్" అనునది ఇరువది తొమ్మిది అక్షరములుగల మంత్రము. నారద ఋషి. అనుష్టుప్ ఛందస్సు. లీలాదండ హరి దేవత. 9, 4, 4, 3, 4 మంత్రాక్షరములచే అంగకల్పన గావించవలెను. నిజవాయకర స్థితదండముచే గోపయువతులను, ఇతర సుందరీమణులను మోహింపచేయుచు, నిజ ప్రియమిత్రుని భుజముపై దక్షిణ హస్తమును ఉంచినవాడు, కంసుని సంహరించినవాడు, ఉరుక్రముడు మమ్ములను కాపాడుగావుత. ఒక లక్ష జపించవలెను. దశాంశమును త్రిమధు మిశ్రితములగు తిలతండులములచే హోమమును కావించవలెను. తరువాత అంగకల్పన గావించి సాయుధులైన దిక్పాలకులను పూజించవలెను. లీలాదండ ధరుడగు శ్రీహరిని ప్రతినిత్యము ఆదరముతో పూజించువాడు అందరిచే పూజించబడును. అతనింటిలో లక్ష్మి స్థిరముగా నిలుచును. సద్యారూఢస్మృతి తోయము కేశవాఢ్యధరా యుగము. భయాగ్నివల్లభా మంత్రము. అనగా “ఓం కేశవాయ స్వాహా" అను మంత్రము సప్తాక్షర మంత్రము. సర్వసిద్ధి ప్రదము. నారద ఋషి. ఉష్ణిక్ఛందస్సు. గోవల్లభుడు దేవత. పూర్వమువలె చక్రములతో పంచాంగ కల్పన గావించి. కపిలాగణ మధ్యస్థితుడు, గోపికలను గోవులను ఆహ్వానించుచు దక్షిణ హస్తమున వేణువును ధరించి అష్టనిపాశమును వామకరమున ధరించి, మేఘశ్యాముడు, మయూర పింఛాలంకృతుడగు శ్రీహరిని ధ్యానించవలయును. ఏడు లక్షలు జపము చేయవలయును. తరువాత పూర్వోక్త పీఠమున అంగములతో ప్రథమావరణ పూజను గావించవలెను. సువర్ణ పింగల, గౌరపింగల, రక్తపింగల, గుడపింగ, బభ్రువర్ణ, ఉత్తమకపిల, చతుష్కపింగల, పీతపింగల అను గోగణాష్టకమును పూజించి సాయుధులైన లోకపాలులను పూజించి మంత్రసిద్దిని పొంది కామనలను సాధించుకొనవలెను. ప్రతిదినము అష్టోత్తర సహస్రము పాలతో హోమముచేసినచో పదిహేనుదినములలో గోగణముతో ముక్తుడగును. దశాక్షర మంత్రమునకు కూడా ఇదియే విధి.

"ఓం నమో భగవతే శ్రీగోవిందాయ" అనునది ద్వాదశాక్షర మంత్రము, నారద ఋషి, గాయత్రీ ఛందస్సు. శ్రీగోవిందుడు దేవత. 1, 2, 4, 5 అక్షరములచే అంగకల్పన కావించవలెను. కల్పవృక్ష మూలమును ఆశ్రయించి మణులచే శోభించు దివ్య సింహాసనమున ఉన్నవాడు, మేఘశ్యాముడు, పీతాబరుడు అతి సుందరుడు, శంఖ నేత్రధరుడు, గోసహస్రపరివృతుడు, అమరపతి, ప్రౌఢహస్తమున ఉన్న కుంభము నుండి జారిపడుచున్నఅమృత ధారలచే స్నానము చేయబడువాడు అభినవాంభోజ పత్రనేత్రుడగు శ్రీహరిని ధ్యానించవలెను. పన్నెండు లక్షలు జపించవలయును. దశాంశమును పాలచే హోమము గావించవలెను. పూర్వమువలె గోష్ఠమున ఉన్నవానిని కాని ప్రతిమాదులందు గాని పూజించవలెను. పూర్వోక్త వైష్ణవ పీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి అచట శ్రీకృష్ణ పరమాత్మను ఆవాహన కావించి, గురుపూజన పూర్వకముగా పూజించవలెను. ఇరుప్రక్కల రుక్మిణీ సత్య భామలను, అగ్ర భాగమున ఇంద్రుని, పృష్ట భాగమున సురభిని కేసరములందు అంగములను, కాలి మొదలగు అష్ట భార్యలను, వసుపత్రములందు, పీఠకోణములందు బద్ధాది కింకిణిని, పృష్టభాగమున దామములను, ముందు వేణువును, శ్రీవత్స కౌస్తుభములను, అగ్రభాగమున వనమాలను, అష్టదిక్కులలో పాంచజన్యమును, గదను, చక్రమును, వసుదేవుని దేవకిని, నందగోపుని, యశోదను, గోగోపాల గోపికలను, బాహ్యభాగమున ఇంద్రాది దేవతలను, వజ్రాద్యాయుధములను, కుముద, కుముద్రాక్ష, పుండరీక, వామన, శంకుకర్ణ, సర్వనేత్ర, సుముఖ, సుప్రతిష్ఠి తాదులను, విష్వక్సేనుని పూజించి స్వాత్మను పూజించవలయును. ఒకమారు కాని మూడు మార్లు కాని గోవిందుని పూజించువాడు చిరాయువు నిర్బాధుడు ధనధాన్యాదిపతి అగును.

“ఓం ధరానాథాయ నమః" అనునది అష్టాక్షర మంత్రము. బ్రహ్మముని. గాయత్రీ ఛందస్సు. శ్రీకృష్ణుడు దేవత. వర్ణద్వంద్వముచే పంచాంగకల్పన చేయవలెను. పంచవర్ష వయస్కుడు, అతిలోలుడు, అంగణమున పరుగిడువాడు అతిచంచలేక్షణుడు, కింకిణీవలయ హారనూపుర భూషితుడు అను గోపబాలునికి సమస్కరించుడు. ఇట్లు ధ్యానము గావించి ఎనిమిది లక్షలు జపించవలెను. దశాంశమును బ్రహ్మ వృక్ష సమిధలచేకాని పాయసముచే కాని హోమము గావించవలెను. పూర్వోక్త వైష్ణవ పీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, అచట అవాహనగావించి స్థిరమనస్కుడై అర్చించవలెను. కేసరములందు, నాలుగు దిక్కులందు విదిక్కులందు అంగ పూజను గావించవలెను. వాసుదేవుని, బలరాముని, దిక్కులందు ప్రద్యుమ్నా అనిరుద్ధులను, విదిక్కులందు రుక్మిణీ సత్యభామలను లక్షణం జాంబవతులను, సాయుధులగు లోకపాలకులను బయట పూజించవలెను. ఇట్లు చేసిన మంత్రము సిద్ధించును.

"ఓం శ్రీ భువన కామాయ శ్రీకృష్ణాయ శ్రీగోవిందాయ గోపీజన వల్లభాయ” అనునది ఇరువది అయిదక్షరముల మంత్రము. మున్యాదికమంతయు పూర్వోక్తమువలెనే ఉండును. సిద్దగోపాలుని స్మరించవలయును. మాధవీ మండపాసీనులు గరుడాభి పాలితులు, దివ్యక్రీడానిరతులు అగు రామకృష్ణులను స్మరించుచు జపించవలయును. విష్ణు భక్తులు ఈ మంత్రమునకు పూజనము పూర్వోక్తవిధిగా అనాచరించవలెను. శ్రీ అనునది ఏకాక్షరమంత్రము. కృష్ణ అనునది ద్వ్యక్షర మంత్రము. శ్రీకృష్ణ అనునది త్ర్యక్షర మంత్రము. శ్రీకృష్ణాయ అనునది చతురక్షరీ మంత్రము. కృష్ణాయనమః అనునది పంచాక్షర మంత్రము 'శ్రీకృష్ణాయనమః గోపాలాయ స్వాహా" అనునవి షడక్షర మంత్రములు. శ్రీకృష్ణాయ స్వాహా అనునది కూడా షడక్షరమంత్రము. కృష్ణాయ గోవిందాయ నమః అనునది నవాక్షర మంత్రము. ఓం శ్రీ గోవిందాయ నమః అనునది అష్టాక్షర మంత్రము. శ్రీధరాశ్యామలాంగాయ నమః అనునది దశాక్షరమంత్రము. బాలవపుషే కృష్ణాయ స్వాహా అనునది మరియొక దశాక్షరి. బాలవపుషే కృష్ణాయ నమః అనునది ఇంకొక దశాక్షరి. తరువాత గోపీ జన మనోహరుని స్వహృదయమున ధ్యానించవలెను. శ్రీబృందావన ప్రాంతమున వికసించిన పూలచేవంగిన తీగల సమూహములు కల పొదలందు పరస్పర సంఘర్షము వలన పరిమళవంతమగు వాయువుచే సేవించబడిన కాళిందీతీరమున విహరించుచున్నవాడు రాధ జీవమునకు ముఖ్యాధారుడు, నందకిశోరుడు, స్నిగ్ధాంబుదా డంబరుడు ఇందువదనుడగు శ్రీకృష్ణుని నమస్కరించుచున్నాను. ఈ మంత్రములకు పూర్వోక్తవిధానముచే పూజాదికము ఆచరించవలెను.

“దేవకీసుత! గోవిన్ద! వాసుదేవ! జగత్పతే! దేహి మే తనయంకృష్ణ త్వామహం శరణం గతః" అనునది ముప్పది రెండక్షరముల మంత్రము. నారదుడు ముని గాయత్రీ అనుష్టుప్ ఛందస్సులు.

సుతప్రదుడగు శ్రీకృష్ణుడు దేవత. అన్ని పాదములచే అంగన్యాసము కావించ వలయును. అర్జునునితో కలిసి రథముమీద కూర్చొని సముద్ర మధ్యమునకు వెళ్ళి, మరణించిన బ్రాహ్మణ పుత్రులను తెచ్చి ఇచ్చిన శ్రీకృష్ణుని ధ్యానించవలెను. ఒక లక్ష జపము చేయవలెను. దశాంశము మధుర మిశ్రితములగు తిలలచే హోమమును గావించవలెను. పూర్వోక్త పీఠమున అంగ సాయుధ దిక్పాల పూజ గావించవలెను. ఇట్లు మంత్ర సిద్ధిని పొందినచో గొడ్రాలియందు కూడా పుత్రులను పొందును.

“(ఓం) ‘సోఽహం హంస స్స్వాహా నమః" అనునది అష్టాక్షర మంత్రము. పంచ బ్రహ్మాత్మకమగు ఈ మంత్రములకు బ్రహ్మఋషి. గాయత్రీ ఛందస్సు. పరంజ్యోతి పరబ్రహ్మ దేవత. ప్రణవము బీజము. స్వాహాశక్తి, స్వాహా అనునది హృదయము. సొఽహం వా అనునది శిరస్సు. హంస అనునది శిఖా. 'నమః' అనునది కవచము. ప్రణవము నేత్రము. హరిహరి అనునది అస్త్రము. అతనే బ్రహ్మ అతనే శివుడు, అతనే హరి, అతనే ఇంద్రుడు, అతనే సర్వరూపుడు, సర్వనాముడు, అతనే అక్షరుడు పరముడు, స్వరాట్. ఇట్లు ధ్యానించి ఎనిమిది లక్షలు జపించవలయును. దశాంశము హోమము గావించవలయును. పూర్వోక్త ప్రణవ పీఠమున సాంగావరణ పూజ గావించవలెను. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత సాధకునికి "తత్త్వమసి" ఇత్యాది వాక్యములు నిర్వికల్పక జ్ఞానము కలుగును.

"శ్రీ హృషీకేశాయ నమః" అనునది అష్టాక్షర మంత్రము. బ్రహ్మ ఋషి, గాయత్రీ ఛందస్సు, హృషీకేశుడు దేవత. అఖిలాప్తికి వినియోగము. కామబీజము ఆయ అనునది శక్తి. బీజముచేతనే షడంగములను కల్పించి ధ్యానించవలయును. పురుషోత్తమ మంత్రమునకు చెప్పినదంతయూ ఇచట ఆచరించవలెను. లక్ష జపము పదివేలు నేయిచే హోమమును గావించవలెను. సంమోహినీ పుష్పములచే తర్పణము గావించిన సర్వాభీష్టములు సిద్ధించును.

"శ్రీ శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ నమః" అనునది పదునాలుగు అక్షరముల మంత్రము. బ్రహ్మరుషి గాయత్రీ ఛందస్సు. శ్రీధరుడు దేవత. శ్రీ బీజము "ఆయ' శక్తి, బీజముచే షడంగ కల్పనము. ధ్యాన పూజాదిక మంతయు పురుషోత్తమ మంత్రమునకువలె చేయవలెను. లక్ష జపము దశాంశము నేయిచే హోమము. సుగంధ శ్వేత పుష్పములచే పూజను హోమాదికమును ఆచరించ వలెను. ఇట్లు చేసినవాడు సాక్షాత్తు శ్రీధరుడగును.

“అచ్యుతాయనమః”; అనంతాయనమః”; “గోవిందాయనమః” అనునవి మంత్ర రాజములు. శౌనక ఋషి వీరాట్ఛందస్సు. పరాశర వ్యాస నారదులు ఋషులు. విరాట్ ఛందస్సు పరబ్రహ్మాత్మకము అగు హరి దేవత. బీజ శక్తులు పూర్వోక్తములు. శంఖ చక్రధరుడు, చతుర్బాహుడు, కిరీటి, సర్వాయుధ యుతుడు, గరుడవాహనారూఢుడు, సనకాది మునీంద్రులచే సర్వదేవతలచే ఉపాసించబడు వాడు, శ్రీభూమి సహితుడు, ఉదయాదిత్య సన్నిభుడు, ఉద్యదాదిత్య సహస్ర సన్నిభ కుండలుడు, సర్వలోకరక్షణ కొఱకు అనంతస్థితుడు, భయప్రదుడు, వరదుడు, ముచాన్వితుడు అగు హరిని ధ్యానించి, వైష్ణవపీఠమున అర్చించవలెను. ప్రథమావరణమున శంఖ చక్ర గదా ఖడ్గములను, ముసల ధనుః పాశాంకుశములను ద్వితీయ ఆవరణమున, సనకాదిక శాక్తేయ వ్యాస నారద శౌనకులను తృతీయా వరణమున, చతుర్ధా వరణమున లోకపాలురను పూజించవలెను. లక్ష్మ జపము దశాంశము నేతితో హోమము గావించవలెను. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత ప్రయోగములను ఆచరించవచ్చును. బిల్వ వృక్షము క్రింద ఉన్న దేవుని ధ్యానించుచు రోగిని స్మరించుచు, లేదా రోగిని స్పృశించికాని పదివేలు జపించవలెను. మనసులో స్మరించికాని జపించవలెను. ఇట్లు నలుబది రోజులు చేసినచో రోగులకు రోగవిముక్తి లభించును. కన్యను కోరువాడు పేలాలచే హోమముగావించవలయును. ధనార్ధి బిల్వములచే హోమమును చేయవలెను. వస్త్రార్ధి గంధ కుసుమములచే ఆరోగ్యార్ధి తిలలచే హోమమును గావించవలెను. ఆదివారమున నాభి మాత్రము జలములో నుండి అష్టోత్తర సహస్రము జపించినచో జ్వరము నశించును. వివాహము కొఱకు ఒకమాసము చన్ద్రమండల మధ్యగతుడగు కృష్ణుని ధ్యానించిన కోరిన కన్యను పొందవచ్చును.

"వసుదేవ నిగడచ్ఛేద వాసుదేవాయ హుంఫట్ స్వాహా" అనునది మంత్రము. నారద ఋషి గాయత్రీ చందస్సు. శ్రీకృష్ణుడు దేవత, కవచము బీజము శిరము శక్తి మొదలగునవి అన్నియు దశాక్షర మంత్రమునకువలె చెప్పుకొనవలెను. "బాలాత్రిః వ్యాసాయ నమః" అనునది అష్టాక్షర మంత్రము. బ్రహ్మముని అనుష్టుప్ఛన్దస్సు సత్యవతీ పుత్రుడు దేవత. ఆద్య బీజము. నమశ్శక్తి దీర్ఘాఢ్యముచే అంగాదికము చేయవలెను. వ్యాఖ్యాముద్రచే శోభించు కరతలము కలవాడు. యోగపీఠస్థితుడు, వామజానుతలమున ఇతర హస్తమును ఉంచినవాడు, సువిద్యానిధి, విప్రస మూహావృతుడు, ప్రసన్న మనస్కుడు, పాధోరుహాద్యుతి, పుణ్యచరితుడు పరాశరపుత్రుడగు వ్యాసుని సిద్ధికొరకు స్మరించవలెను. ఎనిమిది వేలు జపించవలెను. దశాంశమును పాయసముచే హోమమును ఆచరించవలెను. పూర్వోక్త వ్యాస పీఠమున అంగపూజ గావించవలెను. ప్రాచ్యాది దిక్కులందు పైలుని, వైశంపాయనుని, జైమినిని, సుమంతుని, కోణభాగములందు శ్రీశుకుని రోమహర్షణుని, ఉగ్రశ్రవసుని, ఇతర మునులను, ఇంద్రాదికులను, వారి ఆయుధములను పూజించవలెను. ఇట్లు మంత్ర సిద్ధిని పొంది కవిత్వమును, ఉత్తమ సంతానమును, వ్యాఖ్యాన శక్తిని, కీర్తిని, సంపదలను పొందును. 'ఓం నృసింహాయ స్వాహా'; 'ఓం మాధవాయ స్వాహా'; 'ఓం లోహితాయ స్వాహా' అను మంత్రములు పంచాక్షరులు. విషహరములు, అనంతముని, పంక్తి ఛందస్సు, పక్షీంద్రుడు దేవత, ఓం బీజము, స్వాహా శక్తి స్వాహా అనునది హృదయము గరుడచూడానన స్వాహా అనునది శిరోమంత్రము స్వాహా అనునది శిఖ, గరుడ ప్రభంజయ ప్రభంజయ! ప్రభేదయ! ప్రభేదయ! విత్రాసయ విత్రాసయ! విమర్దయ విమర్ధయ! స్వాహా అనునది కవచమంత్రము. ఉగ్రరూపధర సర్వవిషహర భీషయ భీషయ సర్వం దహ దహ! భస్మీకురు! స్వాహా అనునది నేత్ర మంత్రము. అప్రతిహత బలాయ ప్రహతశాసన హుంఫట్ స్వాహా అనునది అస్త్ర మంత్రము. పాదకటి హృదయముఖ మూర్ధములందు వర్ణ వ్యాసమును చేయవలెను. తప్త సువర్ణ నిభుడు ఫణీన్ద్ర నికరములచే క్లుప్తాంగ భూషుడు, స్మరించువారల తాపమును చల్లార్చువాడు సమస్త జనుల విషమును హరించువాడు ముక్కుకొనను కదలించుటచే పాములకు భయమును కలిగించువాడు, పక్షములచే సామగానము చేయువాడు అగు పక్షిరాజును సేవించెదను అని ధ్యానముచేసి అయిదు లక్షలు జపించి దశాంశమును తిలలచే హోమమును చేయవలయును. మాతృకా పీఠమున వేద విగ్రహుడగు గరుడుని పూజించవలయును. పక్షిరాజాయ స్వాహా అనునది పీఠమంత్రము. కర్ణికామధ్యమున అంగమున పూజించి యంత్రములందు నాగులను పూజించవలయును. ఆ బయట లోకపాలురను వజ్రాదులను పూజించవలెను. ఇట్లు మంత్రసిద్దిని పొందినవాడు గరలమును నశింపచేయగలడు. దేహాంతమున శ్రీవిష్ణుపదమును పొందును. (3/81)