నారద మహా పురాణము
వామన పురాణాను క్రమణ వర్ణనము
బ్రహ్మ పలికెను: వత్సా ! ఇపుడు త్రివిక్రమ చరిత్రచే శోభితమై పదివేల శ్లోకములుగల వామన పురాణమును గూర్చి చెప్పెదను వినుము. ఈ పురాణమున కూర్మ కల్పమున జరిగిన అఖ్యానములను చెప్పెను. త్రివర్గమును తెలుపు కథలు కలది. రెండు భాగములు కలది. చెప్పువారికి వినువారికి శుభములను కలిగించునది. మొదట పురాణ ప్రశ్నము, తరువాత బ్రహ్మశిరచ్ఛేదము, కపాల మోచనాఖ్యానము, దక్షయజ్ఞ హింసనము, హరునకు కాలరూప నామము, కామదహనము, ప్రహ్లాద నారాయణ యుద్ధము, దేవాసుర సంగ్రామము, సుకేశ్యర్క సమాఖ్యానము, భువనకోశము, కామ్య వ్రతాఖ్యానము, శ్రీ దుర్గాచరితము, తపతీ చరితము, కురుక్షేత్ర వర్ణనము, సాటిలేని సత్యా మాహాత్మ్యము, పార్వతీ జన్మ కీర్తనము, పార్వతీ తపస్సు, పార్వతీ వివాహము, గౌర్యుపాఖ్యానము, కౌశిక్యుపాఖ్యానము, కుమార చరితము, అందక వధాఖ్యానము, సాధ్యోపాఖ్యానము, జాబాలి చరితము, అరజాకథా, అంధకేశ్వర యుద్ధము, అంధకునకు గణత్వము, మరుత్తుల జన్మ కథనము, బలి చరితము, లక్ష్మీచరితము, త్రివిక్రమ చరితము, ప్రహ్లాద తీర్థయాత్రా సందర్భమున వివిధ కథలు, ధుంధు చరితము, ప్రేతోపాఖ్యానము, నక్షత్ర పురుషాఖ్యానము, శ్రీదామచరితము, త్రివిక్రమ చరిత్రాంతమున బ్రహ్మకృతస్తవము, సుతల లోకమున ప్రహ్లాద బలి సంవాదమున హరి స్తోత్రము, ఇవి పూర్వభాగమున చెప్పిన విషయములు. ఈ పురాణమున ఉత్తర భాగమునకు బృహద్వామనమను నామము కలదు. మహేశ్వరీ, భాగవతీ, సౌరీ, గాణేశ్వరి, అను నాలుగు సంహితలు ఒక్కొక్కటి విడిగా సహస్ర శ్లోకములు కలది. మాహేశ్వరి సంహితమందు కృష్ణ కీర్తనము, కృష్ణ భక్తుల కీర్తనము, భాగవతీ సంహితయందు అద్భుతమగు జగన్మాతావతార కథ, సౌరీ సంహితమగు పాపనాశకమగు సూర్యమహిమ, గాణేశ్వరి సంహితయందు గణేశ చరితము చెప్పబడినది. ఇట్లు బహు విచిత్రములుకల వామన పురాణమిది. పులస్త్య బ్రహ్మ నారద మహర్షికి చెప్పినది. నారదుని నుండి వ్యాసమహర్షి, వ్యాసుని నుండి వ్యాస శిష్యుడగు రోమహర్షణుడు, రోమహర్షణుడు నైమిశారణ్య వాసులగు విప్రులకు చెప్పెను. ఇట్లు వామన పురాణము పరంపరాప్రాప్తము. దీనిని చదువువారలు, వినువారలు పరమ పదమును పొందెదరు. ఈ పురాణమును వ్రాసి ఘృతధేను సమన్వితముగా వేదజ్ఞుడగు విప్రునికి ఇచ్చువాడు తన పితరులను నరకము నుండి స్వర్గమును చేర్చును. ఇహమున భోగములను అనుభవించి అంతమున విష్ణు పదమును చేరును. (4/105)