మోహినీ ప్రశ్న

రాజు పలికెను: మందర పర్వతము మీద నాకు గౌతమ మహర్షి ఏకాదశినాడు భోజనము చేయవచ్చునని చెప్పెనని చెప్పితిని కదా! ఆ మాట పురాణములలో చెప్పనిది. క్షుద్రములగు శాస్త్రో పదేశముతో, రసలోలుపతచే చెప్పినది మాత్రమే. పురాణములలో పండితులు ఈ నిర్ణయమును చేసిరి. శంఖముచే జలము త్రాగరాదు. కూర్మమును, సూకరమును వధించ రాదు. శుక్ల కృష్ణ పక్షములలోని ఏకాదశులలో భుజించరాదు. పొందరాని స్త్రీని పొందుట, తినరాని దానిని తినుట, చేయరాని పనిని చేయుట వేయి గోవులను చంపుటతో సమానము. కావున తెలిసి తెలిసి నేనెట్లు ఏకాదశినాడు భుజించెదను? ఏకాదశినాడు పురోడాశము కూడా తినరాదే. అయినపుడు భోజనమెట్లు చేతును? జీర్ణశరీరులకు కంద మూలములు, ఫలములు, తినుటకు అనుకూలములు, మునీశ్వరులకు పాలు నీరు అను కూలములని చెప్పిరి కాని భోజనము అనుకూలమని చెప్పియుండలేదు. జ్వరము వచ్చిన వారు లంఘనము చేయవలెను. ధార్మికులు ఉపవాసము నాచరించవలెను. ఏకాదశినాడు ఉపవాసమే శుభకరము ఉత్తమగతి ప్రదమని చెప్పబడినది. జ్వరము మధ్యలో ఆహారము తీసుకొనిన మరణము సంభవించును. ఏకాదశినాడు భుజించిన నరకము ప్రాప్తించును. కావున నీవు పట్టు పట్టకుము. నాకు వ్రత భంగమగును. ఇది కాక నీకింకేది నచ్చిననూ దానిని తప్పక ఆచరించెదను. సంశయముతో పనిలేదు.

మోహినీ పలికెను: ఏకాదశినాడు భోజనము తప్ప నాకు మరొకటి నచ్చదు. నీవు నీ జీవితము ఇచ్చిననూ నాకు ప్రయోజనములేదు. ఏకాదశినాడు ఉపవసించవలెనని వేదములలో చెప్పలేదు. అగ్న్యాధనాము చేయు బ్రాహ్మణులు ఉపవాసమును అంగీకరించరు. అందుచే వేద బాహ్యమగు ధర్మమును నీవెట్లు ఆచరించ దలచితివి? ఇట్లు మోహినీ దేవి మాటలను వినిన వేదవిదుడగు రాజు మనసులో కోపించిననూ పైకి నవ్వుచున్నవానివలె ఇట్లు పలికెను. ఓ మోహినీ! నామాటను ఆలకించుము. ఈ వేదము పలువిధములుగా ఉన్నది. యజ్ఞకర్మ క్రియా వేదము. గృహస్థాశ్రమమున స్మృతి వేదము. ఇట్లు స్మృతి వేదము, క్రియా వేదము, పురాణములలో చెప్పబడినది. ఈ జగత్తంతయు పురాణపురుషుని నుండి పుట్టినట్లుగా ఈ వాఙ్మయ మంతయూ పురాణముల నుండి పుట్టినది. కావున వేదార్థమున కంటే పురాణార్థము అధికము. వేదములన్నియూ పురాణములందే ప్రతిష్ఠించబడియున్నవి. అల్పముగా తెలిసిన వానిని చూచి వీడు నన్ను మోసగించునని వేదము భయపడును. మరియు వేదములందు గ్రహసంచారము చెప్పియుండలేదు. కాలశుద్ధి చెప్పబడలేదు. తిధి వృద్ధులు, తిధి క్షయము చెప్పబడలేదు. పర్వ నిర్ణయము, గృహ నిర్ణయములు చెప్పబడలేదు. వీటి విషయమున పురాణములందే నిశ్చయము చేయబడినది. వేదములందు చూడబడని దంతయు స్మృతులందు కనపడును. శ్రుతి స్మృతులందు చూడబడనిది పురాణములలో చెప్పబడును. హత్యకు ప్రాయశ్చిత్తము, రోగార్తునకు ఔషధము తనకు కాని ఇతరులకు కాని పాపశుద్ధిని చేయజాలదు. వేదములలో చెప్పిన దానినే వేదాంగములు, ఉపాంగములు చెప్పును. పురాణములచే స్మృతులచే వేదమే చెప్పబడుచున్నది. అట్టి పురాణములు ఏకాదశినాడు భుజించరాదు, భుజించరాదు అని ఘోషించుచున్నవి. పురాణమును వేరుగా భావించువారు పశువుగా పుట్టెదరు. విజ్ఞుడైననూ, అంతర్నిగ్రహము కలవాడైననూ ఉత్తమగతిని పొందజాలడు. తండ్రికి నమస్కరించని వాడెవ్వడు? తల్లిని పూజించని వాడెవ్వడు? నదికి ఎవ్వరు వెళ్ళరు? ఏకాదశినాడు ఎవడు భుజించును. వేదమును ఎవరు దూషించును. విప్రుని ఎవడు చంపును? పరదారలను ఎవడు కోరును. ఏకాదశి నాడు ఎవరు భుజింతురు? ఏకాదశీ భోజనమంత పాపము మరియొకటి లేదు. ఏకాదశీ భోజనము ఆత్మనిపాత కారణము. నరక వాసము వచ్చును.

అంతటా మోహినీ దేవి పరిచారకులతో వేద పారగులను తీసుకొనిరమ్ము వారి మాటతో రాజు భోజనము చేయును అనెను. అంతట పరిచారకుడు వేదజ్ఞులగు గౌతమాది బ్రాహ్మణులను మోహిని చెంతకు తెచ్చెను. ఆ వచ్చిన వేదవేదాంగపారంగతులగు బ్రాహ్మణులను చూచి రాజుతో కలిసి మోహిని కార్యతత్పరురాలై నమస్కరించెను. మండుచున్న నిప్పువంటి ఆ బ్రాహ్మణులందరూ బంగారు సింహాసనములపై కూర్చొనిరి. వారి మధ్యలో వయో వృద్ధుడగు గౌతముడిట్లు పలికెను. నానా శాస్త్ర విశారదులమగు మేము వచ్చితిమి. మేము అన్ని సందేహములను హరింతుము. మమ్ములను ఎందుకు పిలచితిరి అని అడిగెను. వారి మాటలను వినిన మోహిని వారితో ఇట్లు పలికెను.

మోహినీ దేవి పలికెను: సందేహము స్వల్పమే కాని ఈ జడమతి తన బుద్ధికి తోచినట్లే చెప్పుచున్నాడు. ఈ రాజు నేను ఏకాదశినాడు భోజనము చేయను అచున్నాడు. ఈ స్థావర జంగమాత్మకమగు ప్రపంచము అంతయూ అన్నాధారమే కదా? చనిపోయిన పితృ దేవతలు కూడా అన్నముతోనే తృప్తి చెందెదరు కదా? కరక్కాయంత పురోడాశమును హోమము గావించినచో దేవతలు భుజించ గోరెదరు. కావున అమృతము వంటిది అన్నము గదా . ఆకలిగొన్న చీమ కూడా ముఖముచే బియ్యపు గింజను తీసుకొని కష్టపడుచు బిలము చేరును. కావున అన్నము ఎవరికి రుచించదు? కాని ఏకాదశి వచ్చిన ఈ రాజు అన్నాదులను భుజించడు. స్వధర్మమును విడిచి పరధర్మమును ఆశ్రయించుచున్నాడు. విధవలకు యతులకు వ్రతములను ఆశ్రయించుట ఉచితము. స్వధర్మమున విముఖుడై పరధర్మములందు ఆసక్తి గలవాడు పదునాలుగు మంది ఇంద్రుల కాలము అంధకార బంధురమగు నరకమున నివసించును. రాజులకు ఉపవాసము ఎచటా విధించబడి ఉండలేదు. చతుర్వర్గ ఫలప్రదమగు ప్రజా సంరక్షణము మాత్రమే చెప్పబడినది. స్త్రీలకు పతిసేవ, పుత్రులకు పితృసేవ, శూద్రులకు బ్రాహ్మణసేవ, రాజులకు ప్రజాపాలన విధించబడి ఉన్నది. అజ్ఞానము వలన కాని, పొరబాటున కాని స్వకర్మను పరిత్యజించి ఇతరుల కర్మను ఆచరించినవాడు పతితుడగును. ఈనాడు ఈ మహారాజు యతి ధర్మము ఆశ్రయించుచున్నాడు. ఇతను సుబుద్ధి. ఆచారశీలుడే. కానీ వేదోక్త ధర్మమును విడుచుచున్నాడు. స్వేచ్ఛగా సంచరించుచు స్త్రీ, వినయ రహితుడగు పుత్రుడు, ఏకాంతమున ఉండగోరు రాజు, పనిచేయని సేవకుడు, ప్రతిష్ఠ లేనివాడు వీరందరూ నరకమును చేరుదురు. ఈ రాజు నియమమును ఆశ్రయించి శ్రీహరిని పూజించుచున్నాడు. బ్రాహ్మణుడు ప్రాణాపాయమున ఉండి అక్రోశించునపుడు ఇతను హరిపూజను విడిచి వెళ్ళనిచో బ్రహ్మహత్యా పాతకమును పొందును. క్షీణదేహుడైనపుడు ఏకాదశినాడు ఎట్లు ఉపవశించును? అన్నము నుండియే దేహము పుట్టును. దేహమువలన చేష్టలు కలుగును. చేష్టలచే శత్రువులు నశింతురు. చేష్టారహితుడు అవమానించబడును. ఇట్లు తెలిసిన నేను ప్రబోధించుచున్ననూ ఇతను తెలియుట లేదు. ప్రజాపాలనము ఒక్కటే రాజులకు వ్రతము. రాజునకు మరియొక వ్రతమే చెప్పబడలేదు. సంసార విషయములలో నున్న రాజునకు దేవ కార్యముతో ఏమి పని? స్వరాజ్యమున రక్త పాతము లేకుండుటయే దేవ కార్యము, యజ్ఞము, హోమము అన్నియును. (II/24)