నారద మహా పురాణము
పంచరాత్రి వ్రతము
సనకమహర్షి పలికెను: ఓ నారదా! మరియొక వ్రతమును చెప్పదను వినుము. అన్ని లోకములలో హరి పంచకమను పేరుతో ప్రసిద్ధి పొందినది, స్త్రీలకు పురుషులకు అన్ని దుఃఖములను నివారిం చునది, అగు ఈ వ్రతము ఓ మునిసత్తమా ధర్మార్ధకామ మోక్షములకు మూలము. సర్మాభీష్ట ఫల ప్రదము సర్వవ్రత ఫలప్రదము. మార్గశీర్ష శుక్ల దశమినాడు ఇంద్రియ జయము కలిగి దంతధావన పూర్వకముగా స్నానాదికమును చేయవలయును. దేవార్చనను పంచమహా యజ్ఞములను నిర్వర్తించ వలయును. ఏకాదశీ తిథిన ప్రాతః కాలమున లేచి ఆచారానుగుణముగా స్నానాదికమును నిర్వర్తించి గృహమున శ్రీహరిని అర్చించవలయును. అప్పుడు పంచామృతముతో దేవదేవునికి అభిషేకము చేయ వలయును. ఉత్తమ భక్తితో యథాక్రమముగా గంధపుష్పాదులచే అర్చన చేయవలయును. ధూపదీపనైవేద్య తాంబూల ప్రదక్షిణాదులచే చక్కగా అర్చించి ఈ మంత్రమును ఉచ్చరించ వలయును. “నమస్తే జ్ఞానరూపాయ జ్ఞానదాయ నమోఽస్తుతే, నమస్తే సర్వరూపాయ సర్వ సిద్ధి ప్రదాయినే”. (“జ్ఞాన స్వరూపునికి, జ్ఞాన ప్రదునికి, సర్వరూపునికి, సర్వసిద్ధి ప్రదాయకునకు నమస్కారము.” అని దీని అర్ధము) ఇట్లు వాసుదేవునికి నమస్కరించి ముందు చెప్పబోవు మంత్రముతో ఉపవాసమును సమర్పించవలయును. ‘పంచరాత్రం నిరాహారో హ్యద్య ప్రభృతి కేశవ! త్వదాజ్ఞయా జగత్స్వామిన్మహాభీష్టప్రదో భవ’ అని (“ఓ కేశవా! ఈ దినమునుండి అయిదు రాత్రులు నీ ఆజ్ఞచే నిరాహారముగా ఉందును. నా అభీష్టమును ప్రసాదించుము”) ఇట్లు ఇంద్రియ జయముతో ఉప వాసమును దేవదేవునికి సమర్పించి రాత్రిపూట జాగరణ చేయవలయును. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ తిథులలో జాగరణ చేయవలయును. ఈ అయిదు దినములలో పంచామృతాది పూజ సమానమే. పూర్ణిమాదినమున శక్తి ననుసరించి పాలతో శ్రీ మహావిష్ణువునకు అభిషేకమును చేయవలయును. అట్లే తిలహోమమును తిలదానమును చేయవలయును. ఆరవ దినమున తమ తమ ఆశ్రమాచారములను ముగించుకొని పంచగవ్యప్రాశనమును చేసి యథావిధిగా శ్రీహరిని పూజించవలయును. సంపదలున్నచో తప్పక బ్రాహ్మణ భోజనమును జరిపించవలయును. తరువాత మౌనముతో బంధువులతో తాను భుజించవలయును. ఇట్లే పుష్యమాసము మొదలు కార్తికమాసము వరకు శుక్లపక్షమున పూర్వోక్త విధితో వ్రతము ఆచరించవలయును. ఇట్లు సర్వపాప హరమగు వ్రతమును ఒక సంవత్సరము ఆచరించవలయును. మరల మార్గశీర్షమాసమున ఉద్యాపన చేయవలయును. మొదటివలె ఏకాదశీ తిథిలో నిరాహారముగా ఉండవలయును. ద్వాదశీ తిథిన పంచగవ్య ప్రాశనమును చేయవలయును. ధూపదీప గంధపుష్పాదులచే దేవదేవుడగు జనార్దనుని చక్కగా పూజించి ఇంద్రియ నిగ్రహముతో బ్రాహ్మణునకు ఉపాయనమును సమర్పించ వలయును. నేయి తేనె కలిసిన పాయసమును పండ్లతో సుగంధ జలములతో దక్షిణతో కూడిన జల కుంభమును పంచ రత్నములతో కూడియున్న జలకుంభమును వస్త్రముతో ఆచ్ఛాదనమునుచేసి అధ్యాత్మ జ్ఞానము కల బ్రాహ్మణునకు సమర్పించవలయును. “సర్వాత్మ స్సర్వభూతేశ సర్వవ్యాపిన్సనాతన పరమాన్న ప్రదానేన సుప్రీతో భవ మాధవ” అను మంత్రముచే పాయస దానమును చేసి బ్రాహ్మణ భోజనమును జరుపవలయును. (“సర్వాత్మా! సర్వభూదాధిపతీ! సర్వవ్యాపీ! సనాతన! మాధవా! పరమాన్న దానముచే నాకు ప్రీతుడవుకమ్ము” అని పై మంత్రమునకు అర్థము) శక్తి కొలది బంధువులతో కలిసి తానుకూడా మౌనముతో భుజించవలయును. హరి పంచకమను ఈ వ్రతమును ఆచరించిన వారు బ్రహ్మ లోకమునుండి తిరిగిరారు. సమస్త పాపారణ్య దవానలము ఉత్తమము అయిన ఈ వ్రతమును మోక్షమును కోరువారు నాచరించవలయును. ఈ పంచరాత్ర వ్రతముచే ఉపవాసముచే వేయి కోట్ల గోదాన ఫలము లభించును. నారాయణుని మీద భక్తిచే ఈ వ్రతవిధానమును వినిన వారికి మహాఘోరములైన పాతకకోట్లు నశించును. (1/21)