బ్రహ్మ వైవర్త పురాణాను క్రమణీ నిరూపణము

శ్రీ బ్రహ్మ పలికెను: నాయనా! ఇపుడు పదియవది, వేద మార్గానుదర్శకము అగు బ్రహ్మ వైవర్త పురాణమును చెప్పెదను వినుము. సావర్ణి మనువు దేవర్షియగు నారదునకుస్వయముగా చెప్పెను. ధర్మార్థ మోక్షముల సారము, హరి హరులయందు ప్రీతి, హరి హరుల అభేద సిద్ధి ఈ పురాణమున ప్రతి పాదించబడినది. శతకోటి విస్తృతమగు నాచే చెప్పబడిన పురాణము వివరించబడిన రథంతర కల్ప వృంతమును వేదవ్యాస మహర్షి సంక్షేపముగా చెప్పెను. వ్యాసుడు బ్రహ్మవైవర్త పురాణమును నాలుగు భాగములుగా పదునెనిమిది వేల శ్లోకములు కలదానినిగా నిర్మించెను. ఈ పురాణమున బ్రహ్మ ప్రకృతి విఘ్నేశ కృష్ణ ఖండములు కలవు. మొదటిదగు సృష్టి ప్రకరణమున నూతర్షి సంవాదమున పురాణోషక్రమము చేయబడినది. తరువాత నారద బ్రహ్మల వివాదము ఇద్దరి పరాభవము, తరువాత శివలోక గమనము, జ్ఞానలాభము, శివ వాక్యముచే కలుగుట, మరీచి నారదులు జ్ఞానము కొరకు సిద్ద సేవితము, పరమ పావనము, త్రైలోక్యాశ్చర్య కరమగు సావర్ణి ఆశ్రమమునకు వెళ్ళుట ఇవి బ్రహ్మ ఖండమున ప్రతిపాదించబడినవి. తరువాత సావర్ణి నారదుల సంవాదము, కృష్ణమాహాత్మ్యం, యుతము నానాకథా సమన్వితము, ప్రకృతి అంశ భూతములుకల చరితమును వర్ణించుట, మాహాత్మ్యములు పూజాదికములు విస్తృతముగా వర్ణించబడినవి. ఇది ప్రకృతి ఖండము. సర్వభూతి ప్రదాయకము. గణేశ జన్మ వృత్తాంత ప్రశ్న, సుపుణ్యక మహా వ్రతము, పార్వతీ దేవికి కుమారస్వామి గణపతులు పుట్టుట, కార్తవీర్యార్జునుని పరశురాముని చరిత్రము, జామదగ్న్య గణేశుల వివాదము, ఇది సర్వపాప వినాశకమగు విఘ్నేశ ఖండము. శ్రీ కృష్ణ జన్మవృత్తాంత ప్రశ్నము. అద్భుతమగు శ్రీకృష్ణజన్మ, గోకుల గమనము, పూతనాదివధ, పలు విధములగు బాల్య కౌమార లీలలు, శరద్రాత్రి గోపికలతో రాసక్రీడ, రహస్యముగా రాధతో క్రీడించుట బహువిస్తృతముగా వర్ణించబడినది. అక్రూరునితో కలిసి శ్రీకృష్ణుడు మధురా నగరమునకు వెళ్ళుట, కంసాదులను వధించుట, కృష్ణునికి ఉపనయన సంస్కారము, సాందీపని వద్ద విద్యా భ్యాసము, కాలయవన వధ, ద్వారకాగమనము, అచట నరకాది వధ. ఇవి అన్నియు కృష్ణ ఖండమున చెప్పబడినవి. ఈ కృష్ణ ఖండము మానవులు సంసార ఖండమును చేయును. ఈ అలౌకికము అగు బ్రహ్మ వైవర్త పురాణమును చదివిననూ, వినిననూ, ధ్యానము చేసిననూ, పూజించిననూ, అభివందనము చేసిననూ ముక్తిని పొందును. విజ్ఞాన జ్ఞానములను శమింపచేయు పరమ ఘోరమగు సంసారసాగరము నుండి చదువువారు వినువారు విముక్తులు అగుదురు. మాఘ పూర్ణిమనాడు ఈ పురాణమును వ్రాసి బ్రాహ్మణునకు దానము చేసినచో అజ్ఞాన బంధము నుండి విముక్తుడై బ్రహ్మ లోకమును పొందును. బ్రహ్మ వైవర్తక పురాణాను క్రమణిని చదివిననూ వినిననూ శ్రీ కృష్ణ ప్రసాదమువలన కోరిన ఫలము లభించును. (4/101)