దేవపూజా విధి

సనత్కుమార మహర్షి పలికెను: సాధకునికి అభీష్టసిద్ధిని ప్రసాదించు దేవపూజను ఇప్పుడు చెప్పెదను. దేవాగారమున వామభాగమున త్రికోణాకారముగా కాని చతురస్రాకారముగా కాని వేదికను ఏర్పరిచి, చక్కగా పూజించి అస్త్రముచే సంక్షాళనము గావించి హృదాధారము నుంచి, అచట అగ్ని మండలమును కాని పాత్రను కాని అస్త్రముచే ప్రక్షాళనము గావించి, ఆధారమున నమస్సును ఉంచి, రవిమండలమున తరువాత చంద్రమండలమును పూజించి మొదట చెప్పిన విధముగా సర్వ తీర్థములను అవాహనగావించి, గోముద్రచే అమృతమును చేసి, కవచముచే అనగుంఠమును చేయవలెను. ప్రణవమును అస్త్రముచే సంక్షాళనము చేసి ప్రణవము మీద ఎనిమిది మార్లు జపము గావించవలెను. ఇదియే నరులకు సర్వసిద్ధి ప్రదాయకమగు సామాన్యార్ఘము. ఆ జలమును కొద్దిగా తీసుకొని సాధకుడు ప్రోక్షిణితో వేరువేరుగా తనను యాగవస్తువులను సంప్రోక్షణ గావించవలెను. తనకు వామాగ్రభాగమున షట్కోణాంతమును దానిలో త్రికోణమును ఏర్పరచవలెను. చతురస్రముతో చుట్టి, అర్ఘ్యోదకముచే చక్కగా క్షాళనము గావించి సాధకుడు శంఖముచే స్తంభనము గావించవలెను. ఆగ్నేయాది కోణ చతుష్టయమున హృదయా చతుష్టయమును అంగన్యాసమును కావించవలెను. త్రికోణ మధ్య భాగమున ఉన్న ఆధారశక్తిని మూలఖండత్రయముచే చక్కగా పూజించి, అస్త్రసంక్షాలితమగు దానిని హృదయముచే ప్రతిష్ఠించి, ఈ మంత్రముచే త్రిపదికను పూజించవలెను. దశకళాత్మకుడగు వహ్ని మండలాంతర్వర్తియగు వానికి మం అను బీజమును, అముకార్ఘ్యమని పాత్రాంతమున, అంతిమమున సనాప హృదయముగా ఆధారార్చన యందు మంత్రము ఇరువది నాలుగు వర్ణములు కలిగి ఉండును. స్వమంత్ర క్షాళితమగు శంఖమును స్థాపించి పూజించ వలెను. కర్మమహత్వముకల నీకు తారము, జలచరునికి వర్మ, ఫట్ హృదయమును, పాంచ జన్యమునకు హృదయము మనువు. అచట ద్వాదశాంతమున కళాత్మకుడగు అర్క మండలమునకాని, అముకార్ఘ్యమని పాత్రాంతమున, నమోంతముగా త్ర్యక్షి వర్ణము గలదిగా పూజించి క్రమముగా ద్వాదశార కళలను పూజించి, శుద్ధజలముచే మూలమంత్రమును విలోమమాతృకముగా పఠించి, శంఖమును పూరించవలెను. ఈ మంత్రముచే పూజించవలయును. షోడశాంతమున కళాత్మకుడగు సోమ మండలమునకు అముకార్ఘ్యా మృతమునకు అర్ఘ్యపూజనమున హృదయ మంత్రము, అచట పదునారు చంద్ర కళలను పూజించవలెను. తరువాత పూర్వమువలే “గంగేచ” ఇత్యాది మంత్రముచే తీర్ధములను ఆవాహన గావించి, గోముద్రచే అమృతమును గావించి మత్స్యముద్రచే అచ్ఛాదించవలెను. కవచముచే అనగుంఠనముగావించి మరల అస్త్రముచే కక్షగావించవలెను. ఇష్టదేవుని ధ్యానించి ముద్రలను ప్రదర్శించవలెను. శంఖమౌశల చక్రముద్రలను చూపి పరమీకరణమును గావించవలెను. బుద్ధిమంతుడు క్రమముగా మహాముద్రను యోనిముద్రను చూపవలెను. గారుడీ గాలినీ ముద్రలు ముఖ్యములు. దేవతాస్మరణా పూర్వకముగా గంధ పుష్పాదులచే పూజించవలయును. శంఖమునకు దక్షిణభాగమున ప్రోక్షణీ పాత్ర నుంచవలెను. ప్రోక్షిణి యందు ఆ జలమును కొంచెముగా ఉంచి, తనను మూడుమార్లు ప్రోక్షించుకొని ఆత్మ తత్త్వాత్మకు హృదయమును, విద్యాతత్త్వాత్మకునికి నమస్కారము, శివత్త్వాత్మకునకు హృదయము అని మంత్రములచే మూడుమార్లు ప్రోక్షణ గావించవలెను. విధివిధానముగా మండలమును పుష్పాక్షతలచే కాని మూలగాయత్రిచే కాని పూజా ద్రవ్యములను ప్రోక్షించవలెను. పాద్య అర్ఘ్య ఆచమనీయము కొరకు మధుపర్కము కొఱకు ముందు భాగమున ఆధారయుక్తముగా పాత్రలను స్థాపించవలెను. శ్యామాక, దూర్వ, అబ్జ విష్ణుక్రాంత జలములచే పాద్యము, పుష్ప, అక్షతయ వలచే, కుశ, అగ్నితిల సర్షపములచే అర్ఘ్యమును, గంధ దూర్వాదళములచే ఆచమనీయము చెప్పబడినది. జాతిఫలము, కంకోలము, జలాన్వితమగు లవంగము, తేనె, నేయి, పెరుగులతో కలిపిన దానిని మధుపర్కమందురు. ఒకదానియందుకాని, పాత్రయందుకాని పాద్యాదులను కల్పించవలయును. శంకరుని, సూర్యుని పూజించునపుడు శంఖమును ఉపయోగించుట ప్రశస్తము. శ్వేత, కృష్ణ, అరుణ, పీత, శ్యామ, రక్త, సిత, అసితలుగా రక్తాంబరా భయకరులుగా పీఠశక్తులను ధ్యానించవలెను, స్వర్ణాది లిఖిత యంత్రమున కాని, శాలగ్రామమున, మణియందు కాని, విధిగా స్థాపించిన ప్రతిమ యందు పూజించవలను. అంగుష్ఠ పరిమాణము నుండి వితస్తి పరిమాణము వరకు స్వర్ణాదిధాతువులచే నిర్మించబడిన ప్రతిమలు గృహమున పూజించుటకు ప్రశస్తములు. వక్రముగా ఉన్న, దగ్ధమైన, ఖండితమైన భిన్న మూర్థము, భిన్న నేత్రమును, అంత్యజాదులచే స్పృశించబడిన ప్రతిమను పూజించరాదు. సర్వలక్షణ లక్షితయగు బాణాదిలింగమున కూడా పూజించవచ్చును. మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి యథాప్రకారముగా దేవుని ధ్యానించి, ఆవాహన గావించి పరివార గణములతో కూడియున్న దేవుని ఆ మూర్తియందు పూజించవలెయును. శాల గ్రామమును ప్రతిష్ఠించినచో ఆవాహన విసర్జనలతో పనిలేదు. పుష్పాంజలిని తీసుకొని ధ్యానించి మంత్రమును ఉచ్చరించవలెను. ఆత్మస్థితుడు అజుడు శుద్ధుడు అగు నిన్ను, అరణియందు అగ్నినివలె మూర్తియందు ఆవాహించుచున్నాను. ఈ మహామూర్తి నీదే. ఆ మూర్తియందు సర్వగతుడవగు, భక్తి స్నేహ సమాకృష్ణుడవగు నిన్ను దీపమువలె ప్రతిష్ఠింతును. ఓ దేవా సర్వబీజమయుడవు, సర్వాంతర్యామినివి, శుభకరుడవు స్వాత్మస్ధుడవు అగు నీకు పరిశుద్ధమగు ఆసనమును కల్పించుచున్నాను. ఓ ప్రభూ! ఈ నీమూర్తి శక్తి నీకంటే వేరుగాదు. కావున భక్తానుగ్రహకారకుడవగు నీవు ఆ మూర్తిలో నిలువుము. అజ్ఞానమువలన గాని, మదించియుండుట వలన కాని, సాధన వైకల్యమువలన కాని కల్పము అసంపూర్ణమైనను నీవు అభిముఖుడవుకమ్ము. యజ్ఞశాల యందు అమృతమును వర్షించు నీదృష్టినిపూరించుచు యజ్ఞసంపూర్తి కొరకు మూర్తియందు నిలిచి ఉండుము. భక్తులుకాని వారి వాఙ్మనశ్చక్షుశ్రోత్రములకు అందని ప్రకాశము కలవాడా! నీ తేజః పుంజముతో అంతటా పరివేష్ఠితుడవు కమ్ము. దేవతలు కూడా తమ అభీష్ట సిద్ది కొరకు దర్శనము అభిలషించు పరమేశుడవగు నీకు స్వాగతము. నాకు కూడా స్వాగతము. నేను కృతార్థుడనైతిని. అనుగ్రహించబడితిని. నా జన్మ సఫలమైనది. దేవేశుడవగు నీవు వచ్చితివి. నీకు మరల సుఖాగమనము. కొద్ది భక్తి సంపర్కమువలననే పరమానందము సంభవించు నీపాదపద్మమునకు పాద్యమును కల్పించుచున్నాను. వేదములకు వేదము, దేవతలకు దేవతవు, శుద్ధుల శుద్ధికి హేతువగు నీకు ఆచమనమును కల్పించుచున్నాను. తాపత్రయరుడవు, దివ్యుడవు, పరమానన్దలక్షణుడవు అగు నీకు పాపనిర్ముక్తి కొఱకు నీకు అర్ఘ్యమును కల్పించుచున్నాను. సర్వ కాలుష్య రహితుడవు, పరిపూర్ణ గుణాత్ముడవగు నీకు మధుపర్కమును కల్పించుచున్నాను. ఉచ్ఛిష్టుడు కానని, అశుచియైనను స్మరణమాత్రముచేతనే శుద్ధిని ప్రసాదించు నీకు మరల ఆచమనమును సమర్పించుచున్నాను. ఓ లోకనాధా! మహాశయా, స్నేహమును అర్పించుచున్నాను. ఈశ్వరో పరమానంద బోధాబ్ధిలో నిమగ్నమగు మూర్తిగల నీకు సాంగోపాంగముగా స్నానమును కల్పించుచున్నాను. యథాశక్తిగా ఆదరముగా సహస్రమునుకాని శతమును కాని, గంధపుష్పాదులచే మంత్రముచే అభిషేకమును చేయవలెను. మాయ అను చిత్ర పటముచే కప్పబడియున్న రహస్య ప్రకాశము కలవాడవు, ఆవరణములేని విజ్ఞానము కలిగియున్న నీకు నేను వస్త్రమును కల్పించుచున్నాను. మహామాయ నీ ఆశ్రయము వల్లనే జగత్తును మోహింప చేయుచున్నది. అట్టి పరమేశుడవగు నీకు ఉత్తరీయమును కల్పించుచున్నాను. శక్తి అర్క విఘ్నేశ్వరులకు రక్త వస్త్రమును విష్ణువునకు పీతవస్త్రమును, శివునకు శ్వేతవస్త్రమును అర్పించవలెను. తైలాదిదూషితమగు, జీర్ణమగునది, ఛిద్రములు కలిగియున్న, మలినమైన వస్త్రమును అర్పించరాదు. ఎవని శక్తి త్రయముచే సకల జగత్తు ప్రీతి చెందుచున్నదో అట్టి యజ్ఞ సూత్ర స్వరూపునకు యజ్ఞసూత్రమును అర్పించుచున్నాను. స్వభావముచేతనే సుందరాంగుడు, నానాశక్త్యాశ్రయుడు అయిన నీకు విచిత్ర భూషణములను అర్పించుచున్నాను. పరమానంద సౌరభ్యపరిపూర్ణ దిగంతరములుకల నీకు పరమగంధమును కల్పించుచున్నాను. కృపతో స్వీకరించుము. తురీయవన సంభూతమగు నానాగుణ మనోహరమగు, అధిక సౌరభయుక్తమగు ఈ పుష్పములను స్వీకరించుడు, జపాపుష్పమును, అక్షతలను, జిల్లేడును, ఉమ్మెత్త పుష్పములను శ్రీమహా విష్ణువునకు అర్పించరాదు. శక్తికి దూర్వ అర్క మందారములను, గణేశునకు తులసిని అర్పించరాదు. సరోజినీ దమనకములను, మరువకమును, కుశములను, విష్ణుక్రాంత, నాగవల్లి, దూర్వ, అపామార్గ, దాడిమ, పుష్పములను ధాత్రీమునియుతులగు దేవతలకు పత్రములచే అర్చనమును చేయవలెను. కదలి, బదరి, ధాత్రి, తింత్రిణీ, బీజ పూరకము, ఆమ్రము, దాడిమ, జంబీరము, జంబు, పనస వృక్షముల ఫలములతో దేవ పూజనము గావించవలెను. ఎండిన పత్ర పుష్ప ఫలములతో పూజించరాదు. ధాత్రీ ఖదిర బిల్వతమాల దళములు భిన్నములైనను ఛిన్నములైనను దోషము లేదని పండితులు చెప్పిరి. పద్మము, అమలకము మూడు దినములు శుద్ధముగా ఉండును. తులసీదళములు మారేడు దళములు సర్వ కాలములలో శుద్ధములే. పలాశ, కాశ కుసుమ తులసీ దళములు, ధాత్రీ దళములు, దుర్వా వీటిచే జగదంబికను అర్చించరాదు. పత్ర పుష్ప ఫలములను తలక్రిందులుగా దేవునికి అర్పించరాదు. పత్ర పుష్పాలు చెట్టుకు ఎట్లుండునో అట్లే అర్పించవలెను. దివ్యము, సుగంధభరితము, సుమనోహరము అయిన వనస్పతిరసమును భక్తిచే సమర్పించుచున్నాను. ఆ ధూపమును ఆఘ్రాణించుము. సర్వదా చీకటిని హరింపచేయు చక్కని ప్రకాశముకల నేతివత్తితో కూడియున్న దీపమును స్వీకరించుము. రుచిగలది షడ్రసోపేతము అగు నాలుగు విధముల అన్నమును ఆనందమునిచ్చు నైవేద్యముగా స్వీకరించును. పూగ ఖదిర చూర్ణముతో కూడియున్న నాగవల్లీ దళమును కర్పూరాది సుగంధ భరితమును నేనిచ్చిన దానిని స్వీకరించుము. తరువాత పుష్పాంజలినిచ్చి అవరణార్చన గావించవలెను. ఏ దిక్కునను అభిముఖుడై దైవపూజగావించునో ఆ దిక్కు తూర్పు దిక్కుగా తెలియవలెను. ఇతర దిశలు పది విదిశలగును. కేసరములందు అగ్నికోణాదిగా హృదయాదులను పూజించవలెను. అగ్రభాగమున నేత్రమును, దిక్కులందు అస్త్రమును యథాక్రమముగా అంగ మంత్రములచే శుక్ల శ్వేత నితశ్యామ కృష్ణ రక్త వర్ణములుగల, వరాభయకర్తలైన ఆయా దిగంత శక్తులను ధ్యానము చేయవలెను. ఈ ఆవరణాంతమున ఈ దేవతయని చెప్పవలెను. తరువాత సాలంకారులను, సపరిచారికలను, సవాహనులను, సాయుధులను సర్వోపచారములతో చక్కగా పూజించి తృప్తిపరిచి వరదులగుదురుగాక అని చెప్పవలెను. మూలాంతమున ఉచ్చరించి దేవతకు నివేదించవలెను. ఓ శరణాగత వత్సలా నాకు అభీష్టసిద్ధిని కలిగించుము. భక్తితో నీకు ఈ ఆవరణార్చనను సమర్పించుచున్నాను అని పలికి దేవమస్తకమున పుష్పాంజలిని సమర్పించవలెను. తరువాత కల్పోక్తావరణలను యథాక్రమముగా అర్చించవలెను. తరువాత సాయుధులైన ఇంద్రాదులను వారి వారి దిక్కులందు పూజించవలెను. ఇంద్రుడు వహ్ని, యముడు, నైఋతి, వరుణుడు, వాయువు, ఈశ్వరుడు, బ్రహ్మ అధోభాగమున ఆదిశేషుడు వీరు దిగీశులు, ఐరావతము, మేషము, మహిషము, ప్రేతము, తిమి, మృగము, అశ్వము, వృషభము, హంస, కూర్మము, ఇవి వారి వాహనములు. వజ్రము, శక్తి, దండము, ఖడ్గము, పాశము, అంకుశము, గద, త్రిశూలము, పద్మము చక్రము ఇవి క్రమముగా వారి ఆయుధములు. ఆవరణార్చనను పూర్తి గావించి దేవతారార్తికమును గావించవలెను. శంఖజలమును చుట్టుచల్లి, చేతులు పైకెత్తి భూమి మీద పడవలెను. దండమువలె పడిలేచి తన ఇష్టదైవమును ప్రార్ధించి, దక్షిణ భాగమున స్ధండిలము నేర్పరిచి అచట సంస్కారమును ఆచరించవలెను. మూలమంత్రముతో నేత్రమును, అస్త్రముచే ప్రోక్షణమును, మరల తాడనమును, దర్భలచే కవచమును ప్రోక్షించి అచట వసువు నుంచవలెను. ప్రదాపనము గావించి హోమమును చేయవలెను. ఇష్టదేవతను ధ్యానించి సమస్తములగు మహావ్యాహృతులచే చతుష్టయమును నేతితో కాని, తిలలచే కాని, పాయసముచే కాని నేతిని కలిపి ఇరువది మార్లు హోమమును గావించవలెను. మరల వ్యాహృతులచే, హోమమును గావించి గంధాదులచే అర్పించవలెను. మూర్తియందు దేవుని సంయోజన చేయవలెను. అపుడు అగ్నిని విసర్జన చేయవలెను. ఓ మహాశక్తి గల అగ్నిహోత్రమా, సర్వ కర్మ ప్రసాధకా! మరియొక కర్మ వచ్చినపుడు సాన్నిధ్యము నిమ్ము’ అని ఇట్లు విసర్జన గావించి అగ్నికి ఆచమనమును సమర్పించవలెను. మిగిలిన హవిస్సును గంధపుష్పాక్షతలతో కలిపి దేవతా ద్వారపాలకులకు పూర్వోక్తులకు బలినీయవలయును. రౌద్రులు, రౌద్రకర్ములు, రౌద్రస్థాన నివాసులు, యోగినులు, ఉగ్రరూపులు, గణాధిపులు, ఇతరులగు విష్ణుభూతులు దిక్కులలో విదిక్కులలో ఉన్న వారందరు ప్రీతితో కూడిన మనసు గలవారై ఈ పూజను స్వీకరింతురుగాక. ఇట్లు అష్టదిక్కులలో నుంచి మరల భూతబలిని గావించవలెను. గోముద్రచే జలమును అమృతమును గావించి దేవతా హస్తమున మరల ఆచమనీయమును ఈయవలెను. మూర్తిస్థుడగు దేవతను ఉద్వాసన గావించి, మరల అచటనే యోజన చేయవలెను. తరువాత వారి వారి ఉచ్చిష్ట భోజులకు నైవేద్యమును అర్పించవలెను. మహేశ్వరునికి చండేశుడు, శ్రీహరికి విష్వక్సేనుడు, సూర్యునికి చండాంశువు, గణేశునికి వక్రతుండుడు, శక్తికి చండాలి ఉచ్ఛిష్టభోజులు. తరువాత ఋష్యాదికమును స్మరించి మూల షడంగ న్యాసమును గావించి యధా శక్తిగా మంత్రమును జపించి దేవతకు నివేదించవలెను. గుహ్యాతిగుహ్యా గోప్తవగు నీవు మాచే చేయబడిన జపమును స్వీకరించుము. నీ అనుగ్రహము వలన నీయందున్న సిద్ధి నాకు కలుగును. తరువాత అర్ఘమును పరాఙ్ముఖముగా చేసి పుష్పములచే పూజించవలయును. బాహువులచే, పాదములచే, మోకాళ్ళచే, వక్షస్ధలముచే, శిరస్సుచే, నేత్రములచే, మనస్సుచే, వాక్కుచే అని ప్రణామము అష్టాంగముగా చెప్పబడినది. బాహువులచే, జానువులచే, శిరస్సుచే, వాక్కుచే, మనస్సుచే పంచాంగ ప్రణామముకూడా చెప్పబడినది. దైవ పూజలో ఈ రెండు ఉత్తమములే. మంత్రానుష్ఠానము చేయువాడు దండవత్ప్రణామము లాచరించి ప్రదక్షిణముల నాచరించవలెను. తరువాత భక్తి పూర్వకముగా స్తోత్రాది కమును పఠించవలెను. ఇప్పటి నుండి పూర్ణముగా ప్రాణ బుద్ధి దేహ ధర్మాధికారముల వలన జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలలో మనసుచే, వాక్కుచే, హస్తములచే, పాదములతో, ఉదరముతో, అక్కడి నుండి శిరస్సువంచి తలచినది, పలికినది, చేసినది అంతయూ బ్రహ్మార్పణమగు గాక. నన్ను, నాదైన సమస్తమును విష్ణువునకు సమర్పించుచున్నాను. తార స్వరముతో “తత్సదతో బ్రహ్మార్పణమస్తు” అనునది మంత్రము, ప్రణవము ఆదియందుగ అష్టాక్షరములుగల ఈ మంత్రముతో ఆత్పార్పణమును కావించవలెను. అజ్ఞానము వలన కాని ప్రమాదమువలన కాని సాధన వైకల్యము వలన కాని ఎక్కువ తక్కువలు ఉన్నచో దాని నంతను క్షమించవలెను. ద్రవ్యహీనము, క్రియాహీనము, మన్త్ర హీనముగాకాని, మరొకవిధముగా కాని నేనాచరించిన దానిని దయానిధివగు నీవు దయచే క్షమించుము. జాగ్రత్స్వప్నసుషుప్తి కర్మలలో నేను చేయు పనులన్నియూ నీ పూజయే అయి నాకు సంపదలను వృద్ధిపరచనీ. భూమిమీద కాలుజారినవానికి భూమియే ఆధారమగునటుల నీయందు అపరాధము చేసినవారికి నీవే రక్షణము కావలయును. ఇతరములైన రక్షకములు ఏవియూ లేవు. నీవే నాకు రక్షణము. కావున కారుణ్య భావముతో నన్ను క్షమించుము. నేను రాత్రింబవళ్ళు అపరాధ సహస్రముల నాచరించుచున్నాను. ఓ జగత్పతీ! నన్ను నీదాసునిగా భావించి క్షమించుము. నేను ఆవాహనమును తెలియను, విసర్జనమును తెలియను. పూజను తెలియను. కావున నీవే గతివి’ అని ఇట్లు ప్రార్ధించి మూలాంతమున శ్లోకమును పఠించవలయును. “గచ్ఛ గచ్ఛ పరం స్థానం జగదీశ జగన్మయ, యన్న బ్రహ్మదయో దేవ జానన్తి చ సదాశివః” అనునది శ్లోకము. ఓ జగదీశా! జగన్మయా బ్రహ్మాది దేవతలు సదాశివుడు కూడా తెలియని నీ పరస్థానమునకు వెళ్ళుము అని అర్థము. ఇట్లు పుష్పాంజలిని ఇచ్చి సంహారముద్రచే తన హృదయ పద్మమునందు సాంగముగా దేవుని ఉంచి సుషుమ్నామార్గముతో పుష్పమును ఆఘ్రాణించవలయును. శంఖ చక్ర శిలా లింగ విఘ్నేశ సూర్యద్వయమును, శక్తిత్రయమును ఒకేచోట పూజించరాదు. పూజించినచో దుఃఖకారణమగును.

శుభములను కలిగించు శ్రీ విష్ణుపాదోదకము అకాలమృత్యు హరణము, సర్వ వ్యాధి నివారణము. సర్వపాపక్షయకరము. ఆయాదేవతల భక్తులచే వారి వారికి సమర్పించిన నైవేద్యమును స్వీకరించవలెను. శివ నిర్మాల్యమును పత్ర పుష్ప ఫల జలములను గ్రహించరాదు. శాలగ్రామ శిలా స్పర్శవలన అన్నియూ పవిత్రములు అగును. ఈ విషయమున పూజ అయిదు విధములుగా చెప్పబడినది. ఆతురీ, సౌతికీ, త్రాసీ, సాధనాభావినీ, దౌర్బోధి అని వాటి పేర్లు, ఇప్పుడు క్రమముగా వీటి లక్షణములను వినుము.

రోగాదులు వచ్చినవారు స్నానము చేయరాదు. జపము చేయరాదు. పూజించరాదు. దేవ పూజను చూచి, మూర్తిని కాని, సూర్య మండలమును కాని చూచి నమస్కరించి, మన్త్రమును స్మరించుచు పుష్పాంజలిని సమర్పించవలెను. రోగము తగ్గిన తరువాత స్నానము చేసి గురువునకు నమస్కరించి పూజించవలెను. ఓ జగత్పూజ్యా! దయానిధే! నీ అనుగ్రహమువలన నాకు పూజావిచ్ఛేద దోషము కలుగకుండు గావుత అని దైవమును ప్రార్థించవలెను. బ్రాహ్మణులను కూడా పూజించి శక్త్యానుసారము సంతోషింపజేసి, వారి నుండి ఆశీర్వాదములను పొంది తరువాత మొదటివలె దేవ పూజను గావించవలెను. ఇది ఆతురీపూజ అనబడును. ఇపుడు సౌతికీపూజను చెప్పెదను. సూతకము రెండు విధములు. జాతసూతకము, మృతసూతకము అని. ఈ సూతకములలో స్నానము చేసి మానసిక సంధ్యా వందనమాచరించి, మనసుతోనే దైవపూజ గావించవలయును. మనసులోనే మంత్రమును జపించవలయును. సూతకము తొలగిపోయిన తరువాత, మొదటివలె గురువును, బ్రాహ్మణులను పూజించి, వారి ఆశీర్వచనములను పొంది, తరువాత నిత్యకృత్యములను నిత్యకర్మను ఆచరించవలయును. దీనిని సౌతిక పూజ అందురు. ఇపుడు త్రాసీ పూజను చెప్పెదను. దుర్జనుల వలన భయము కలిగినపుడు లభించిన ద్రవ్యములచే కాని మానసిక ద్రవ్యములచే కాని దైవపూజ గావించవలెను. ఇదియే త్రాసీ అనబడును. పూజాసాధన వస్తువులను కూర్చుకొను సామర్ధ్యము లేనపుడు పత్ర పుష్ప ఫలములతో కాని మానసికముగా కాని దైవపూజ గావించుటయే సాధనా భావినీ పూజ అనబడును. స్త్రీలు వృద్ధులు బాలలు, మూర్ఖులు వారికి తోచిన క్రమముచే తెలిసినంతలో చేసిన పూజ దౌర్బోధి అగును. సాధకుడు ఇట్లు ఏదో విధముగా పూజను చేయించవలెను. దేవపూజా విహీనుడు నరకమునకు వెళ్లును. వైశ్యదేవాదికమును చేసి బ్రాహ్మణులకు భోజనమును అర్పించవలెను. తరువాత దైవనివేదికమును చేసి బ్రాహ్మణులకు భోజనమును అర్పించవలెను. తరువాత దైవనివేది తమైన దానిని స్వగణముచే భుజించవలెను. ఆచమనముచేసి అసన శుద్ధిగావించుకొని క్షణములు ఉండవలెను. స్వజనులతో కలిసి పురాణమును కాని ఇతిహాసమును కాని వినవలెను. సర్వ కల్పములలో అనుకల్పమును ఆచరించువాడు దుర్మతి అగును. అతడు కల్ప ఫలమును పొందజాలడు. (3/67)