గంగామాహత్మ్యము

సనకమహర్షి పలికెను: ఆ బాహుమహారాజు భార్యలిరువురు ఇట్లు ఔర్వమహర్షి ఆశ్రమమున భక్తిభావముతో ప్రతిదినము శుశ్రూష చేయుచుండిరి. ఆరు నెలలు గడిచిన తరువాత బాహు మహారాజు చిన్నభార్య సంపదను (గర్భమును) చూచి పెద్ద భార్య మనసులో ఈర్ష్య కలిగెను. ఆ ఈర్ష్యతో చిన్నభార్యకు విషమునిచ్చెను. అయినను ఔర్వమహర్షిని భక్తితో సేవించుచుండుట వలన ఆ విషము తన ప్రభావమును చూపలేకపోయెను. ప్రతిదినము అలుకుట, ముగ్గులుపెట్టుట మొదలగు సేవలను ఎంతో భక్తితో చిన్న భార్య చేయుచుండెను. ఆ పుణ్యము విషమును కూడా ఆరగించెను. మూడునెలల తరువాత శుశ్రూష వలన పాపములను పోనాడిన చిన్నభార్య శుభముహూర్తమున విషసహితముగా కుమారుని ప్రసవించెను. లోకమున సజ్జన సాంగత్యము ఏ పాపమును నశింపచేయదు? పుణ్యకర్మలను చేసిన నరులకు లభించని ఆనందమేముండును? మహాత్ముల పరిచర్య, తెలిసీ తెలియక చేసిన పాపములను ఇతరులు చేసెడు ద్రోహములను నశింపచేయును. సత్సంగతి వలన జడుడు కూడా పూజ్యతను పొందును. చంద్రుడు ఒక కళారూపముగా ఉన్ననూ శంకరునిచే స్వీకరించబడెను కదా!

సజ్జన సాంగత్యము ఎప్పుడూ మానవులకు ఉత్తమ వృద్ధినే ఇచ్చును. ఇహలోకమున, పరలోకమున మంచియే జరుగును. కావుననే సత్పురుషులు పూజ్యతములు, ఓ మునీశ్వరా! మహాత్ముల గుణములను ఎవరు చెప్పగలరు? గర్భమును చేరిన విషము మూడునెలలు ఉన్ననూ జీర్ణము కాక అట్లే యుండెను.

తేజోనిధియైన ఔర్వమహర్షి విషముతో పుట్టిన కుమారుని చూచి జాతకర్మచేసి ‘సగరుడు’ అని నామకరణము చేసెను. సగరుని తల్లి ప్రేమతో ఆ బాలుని పోషించుచుండెను. ఔర్వమహర్షి చౌలమును ఉపనయనమును చేసెను. రాజులకు యోగ్యములైన శాస్త్రములను చదివించెను. శైశమును దాటి సమర్థుడైన సగరుని చూచి మునీశ్వరుడు మంత్రములతో సర్వ శస్త్రాస్త్రములను ప్రసాదించెను. ఇట్లు ఔర్వ మహర్షిచే చక్కగా అన్ని విద్యలను నేర్చిన సగరుడు బలవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞుడు, గుణవంతుడు, మంచి బుద్ధి కలవాడు, ధర్మములను తెలిసినవాడు అయెను. ధర్మజ్ఞుడు కావున సగరుడు మహర్షికి సమిధలను, దర్భలను, జలమును, పుష్పములను ప్రతిదినము తెచ్చి ఇచ్చుచు సేవించుచుండెను. ఒకనాడు గుణనిధియైన సగరుడు తల్లి వద్దకు వచ్చి నమస్కరించి చేతులు జోడించి వినయముతో ఇట్లు పలికెను.

సగరుడు పలికెను: “ఓ తల్లీ! నా తండ్రి పేరేమి? ఏ వంశమునాడు? ఎచటికి వెళ్ళెను? ఇది యంతయు వినవలయునని నాకు చాలా కుతూహలముగా ఉన్నది. కావున తెలియునట్లు చెప్పుము. ఈలోకమున తండ్రిలేనివారు బ్రతికియున్ననూ మరణించినవారితో సమానుడే. దరిద్రుడైనను తండ్రి ఉన్నచోవాడు కుబేరునితో సమానుడే తల్లిదండ్రులు లేనివారికి సుఖముండదు. ధర్మమును విడిచిన మూర్ఖునివలె ఇహపరములలో నిందించబడును. తల్లిదండ్రులు లేని వాని జన్మ, అజ్ఞానుని జన్మ, అవివేకి జన్మ, పుత్రుడు లేనివాని జన్మ, ఋణగ్రస్తుని జన్మ వ్యర్ధము. చంద్రుడు లేని రాత్రివలె, పద్మములు లేని సరస్సువలె, పతిలేని స్త్రీ వలె తండ్రిలేని శిశువు వ్యర్థుడు. ధర్మములేని జంతువువలె, కర్మచేయని గృహస్థునివలె, పశువులు లేని వైశ్యుని వలె, తండ్రిలేని పిల్లవాడు వ్యర్థుడు. సత్యములేని వాక్యము వలె, సాధుజనులు లేని సభవలె, దయలేని తపస్సువలె, తండ్రిలేని పిల్లవాడు వ్యర్థుడు. చెట్లులేని అడవివలె, నీరులేని నదివలె, వేగములేని అశ్వమువలె తండ్రిలేని పిల్లవాడు వ్యర్థుడు. యాచనాపరుడెట్లు అందరిలో చులకనౌనో అట్లే తండ్రిలేని పిల్లవాడు చాలా దుఃఖమును పొందును”.

ఇట్లు పుత్రుడైన సగరుడు పలుకగా విని తల్లి బరువుగా నిట్టూర్చి దుఃఖముతో జరిగినదంతయూ అతనికి తెలిపెను. తల్లి చెప్పిన దానిని వినిన సగరుడు కోపముతో ఎఱ్ఱబారిన కనులతో శత్రువులను చంపగలనని ప్రతిజ్ఞ చేసెను. ఔర్వమహర్షికి ప్రదక్షిణము చేసి తల్లికి నమస్కరించి ఔర్వమహర్షి సాగనంపగా బయలుదేరెను. సత్యవాక్కు, పవిత్రుడు అయిన సగరుడు ఔర్వమహర్షి ఆశ్రమమునుండి బయలువెడలి ప్రీతితో తమ కులగురువైన వసిష్ఠమహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను. మహాత్ముడైన వసిష్ఠమహర్షికి నమస్కరించి జ్ఞానదృష్టితో అంతా తెలిసియున్న మహర్షికి అంతయూ వివరించెను. వసిష్ఠమహర్షి దయతో సగరునకు ఐంద్రాస్త్రమును, వారుణాస్త్రమును, బ్రహ్మాస్త్రమును, ఆగ్నేయమును, వజ్రాయుధమంతటి ఖడ్గమును ధనువును ఇచ్చెను. మంచి మనసుగల సగరుడు వసిష్ఠ మహర్షికి నమస్కరించి ఆశీర్వాదములను, అనుజ్ఞను పొంది వెంటనే బయలుదేరెను. మహాశూరుడైన సగరుడు ఒక్క ధనువుతోనే పుత్రపౌత్రబంధు గణములతో కూడియున్న శత్రువులను స్వర్గవాసులను చేసెను. సగరుని ధనువునుండి వెలువడిన బాణాగ్నికి భయపడిన శత్రువులు కొందరు నశించిరి. కొందరు పారిపోయిరి. మరికొందరు కేశములను విరబోసుకొని పుట్టమీద నిలుచుండిరి. కొందరు గడ్డి పరకలను నోట్లో పెట్టుకొనిరి. మరికొందరు నగ్నముగా నీటిలో ప్రవేశించిరి (ఓడిపోయినవారు మేము నిస్సహాయులము అని తెలుపుటకు జుట్టు విరబోసుకొని పుట్టనెక్కుట, గడ్డి పరకలను నోట్లో పెట్టుకొనుట, నగ్నముగా నీళ్ళలో ప్రవేశించుట ప్రాచీన కాలమున పరిపాటి.) శకులు, యవనులు, ఇతర రాజులు ప్రాణములయందు ఆశతో వసిష్ఠమహర్షిని శరణువేడిరి. భూమిని గెలిచిన సగరుడు తన శత్రువులను గురుసమీపమును చేరిరని చారుల ద్వారా తెలుసుకొని గురువు సమీపమునకు వెళ్ళెను. సగరుడు వచ్చెనని తెలిసిన వసిష్ఠమహర్షి శరణాగతులను కాపాడవలయు నని తన శిష్యునికి హితమును చేయవలయునని నిశ్చయించుకొనెను. శబరులను తలవెంట్రుకలను గొరిగి, యవనులకు వెంట్రుకలను విరబోసి, ఇతర రాజులకు మీసములను తీసివేసి అందరిని వేదబహిష్కృతులను చేసెను. ఇట్లు వసిష్ఠముని చచ్చిన వారితో సమానముగా చేసిన శత్రువులను చూచి సగరుడు నవ్వుచు తపోనిధియైన తన గురువుతో ఇట్లు పలికెను.

సగరుడు పలికెను: “గురువర్యా! దురాచారులగు వీరిని రక్షించుట వ్యర్థము. నా తండ్రి రాజ్యమును హరించినవారిని నేను తప్పక వధించెదను. ధర్మ శత్రువులను ఉపేక్షించుటయే సర్వనాశమునకు హేతువగును. సంశయముతో పనిలేదు. దుర్జనులు మదించి మొదట జగత్తును అంతటిని బాధింతురు. వారే దుర్బలులు అయినప్పుడు సాధు భావమును ప్రదర్శింతురు. కల్మష హృదయులైన దుర్జనులు వంచనచే తమ బలము పెరుగువరకు సేవచేసెదరు. శత్రువుల దాస భావమును, వేశ్యల అనురాగమును, పాముల సాధుత్వమును మేలుకోరువాడు నమ్మరాదు. తాము బలముతో ఉన్నప్పుడు పరిహసించుచు చూపిన దంతములనే బలహీనులు కాగానే దైన్యముతో చూపెదరు. లోభులు మొదట నాలుకతో పరుషముగా మాటలాడెదరు. వారే బలహీనులైనచో అదే నాలుకతో చాల దీనముగా మాటలాడెదరు. తన మేలు కోరువాడు, నీతిశాస్త్రార్థములను తెలిసివారు దుర్జనుల సాధుత్వమును సమభావమును నమ్మరాదు. నమస్కరించుచున్న దుర్జనుని కపట స్వభావము కల మిత్రుని, దుష్టురాలైన భార్యను నమ్మినవాడు బ్రతికియు చనిపోయినవానితో సమానమే. కావున గోరూపముతో నుండి పెద్దపులి పనులను చేయు వీరిని కాపాడకుడు. వీరిని అందరిని సంహరించు నీ అనుగ్రహముచే భూమిని సేవించెదను.”

వసిష్ఠమహర్షి పలికెను: “ఓ మహానుభావా! బాగు! బాగు! నీవు నిజమునే చెప్పుచున్నావు. అయిననూ నా మాట వినినచో ఉత్తమమైన శాంతిని పొందగలవు. నీ ప్రతిజ్ఞకు విరోధులైన వీరిని నేను మొదటనే చంపితిని. చంపినవారిని చంపుటలో ఏమి కీర్తిరాగలదో చెప్పుము. ఓ రాజా! అన్ని ప్రాణులు కర్మపాశముతో బంధించబడియుందురు. అయిననూ వారి పాపము వారిని చంపినది. వారిని మరల నీవెందుకు చంపెదవు. పాపము వలన కలిగిన దేహము మొదటే పాపముచే చంపబడినది. పూర్ణమైనందువలన అత్మనాశములేనిది. ఇది శాస్త్రనిశ్చయము. ప్రాణులు తాము చేసిన కర్మల ఫలములను అనుభవించుటకు నిమిత్తమాత్రములు. కర్మలకు మూలము దైవము. ఈ జగమంతయు దైవాధీనమే. దైవమే సాధువులను రక్షించునది. దుష్టులను శిక్షించును. కావున పరతస్త్రులైన మానవులు దేనిని సాధించగలరో చెప్పుము. పాపముచే పుట్టిన శరీరము పాపముచే ప్రవర్తించును. ఇదియంతయు పాపమూలమని తెలిసి చంపుటకేల సిద్ధపడెదవు. ఆత్మశుద్ధమైననూ, దేహమున ఉండుటచే దేహి అనబడుచున్నది. కావున ఈ శరీరము పాపమూలమే. సంశయములేదు. పాపమూలమైన శరీరమును చంపిన నీకు ఏమి కీర్తి కలుగును? కావున వీరిని హింసించకుము”. ఇట్లు గురువగు వసిష్ఠ మహర్షి చెప్పిన మాటలను విని సగరుడు తన కోపమును ఉపసంహరించుకొనెను. చేతిచే శరీరమును స్పృశించి మునులు సగరుని అభినందించిరి. తరువాత అధ్వర నిదియైన వసిష్ఠ మహర్షి ఇతరమునులతో కలిసి సగరునికి రాజ్యాభిషేకమును జరిపెను. ఆ సగరమహా రాజునకు విదర్భమహారాజైన కాశ్యపుని పుత్రికలు కేశిని, సుమతి అనువారు భార్యలైరి. సగరునికి రాజ్యపట్టాభిషేకము జరుగుట తెలిసి ఔర్వమహర్షి వనమునుండి వచ్చి మాట్లాడి వెళ్ళెను. ఒకసారి భార్గవ వంశజుడు మంత్రవేత్త అయిన ఔర్వమహర్షిని సగరమహారాజు భార్యలు కేశినీ సుమతులు ప్రార్థించగా సంతోషించిన మహర్షి వారికి పుత్రులు కలిగెదరని వరమిచ్చెను. మరల క్షణకాలము ధ్యానించి త్రికాలజ్ఞుడైన మహర్షి కేశినిని సుమతిని గూర్చి ఇట్లు పలికెను.

ఔర్వమహర్షి పలికెను: “మీ ఇద్దరిలో ఒకరికి వంశకరుడైన ఒక కుమారుడు కలుగును. ఇంకొకరికి అరవై వేలమంది కొడుకులు కలిగెదరు. ఎవరికెవరు కావలయునో కోరుకొనుడు”. ఔర్వమహర్షి మాటలను విని కేశిని ఒక కుమారుని కోరుకొనెను. సుమతి అరవైవేలమందిని కోరెను. అట్లే కేశినికి ఒక కుమారుడు, సుమతికి అరవై వేల మంది కుమారులు కలిగిరి. కేశిని కుమారుని పేరు అసమంజసుడు. అసమంజనుడు మదించిన వానివలె చెడుపనులను చేయుచుండెను. అసమంజసుని చూచి మిగిలిన సగరుని పుత్రులు అందరు చెడునడతను అలవాటు చేసుకొనిరి. అస మంజసుని బాలచేష్టలలో దౌష్ట్యమును చూచి సగరుడు చింతాక్రాంతుడు ఆయెను. లోకములో దుర్జన సాంగత్యము కష్టములను కలిగించును. ఇనుముతో సంయోగమును పొందిన అగ్నికి సమ్మెట పోటు తప్పదు కదా? అసమంజసునికి అంశుమంతుడను కుమారుడు కలిగెను. అంశమంతుడు అన్ని శాస్త్రములను తెలుసుకొనిన గుణవంతుడు, ధర్మజ్ఞుడు, తాత అయిన సగరుని హితమును కోరువాడుగా ఉండెను. చెడునడతగల సగరుని పుత్రులు అందరు లోకమునకు ఉప ద్రవమును కలిగించుచుండిరి. ధర్మమును అనుష్ఠించువారలకు విఘ్నములను కలిగించుచుండిరి. బ్రాహ్మణులు విధిపూర్వకముగా యజ్ఞములలో ఇచ్చిన హవిస్సులను దేవతలను కాదని తామే స్వీకరించుచుండిరి. స్వర్గము నుండి రంభాదిదేవతాస్త్రీలను బలవంతముగా జుట్టుపట్టుకొని తీసుకొని వచ్చి అనుభవించుచుండిరి. వారందరు మద్యపాన పరాయణులై స్వర్గమునుండి పారిజాతాది వృక్షములనుండి పుష్పములను తీసుకొనివచ్చి తమ దేహములను అలంకరించుకొనుచుండిరి. మంచి నడకగల వారిని అపహరించుకొని పోయిరి. సదాచారపరులను నశింపచేసిరి. బలవంతులు అత్యంతపాపులై మిత్రులతో యుద్ధము చేయనారంభించిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు వీరి దౌర్జన్యములను చూచి మిక్కిలి దుఃఖముతో ఆర్తులై వీరిని నశింపచేయుటెట్లు అని అలోచించసాగిరి. చివరికి ఒక నిశ్చయమునకు వచ్చిన దేవతలందరు పాతాళమున ఉన్న దేవదేవేశుడైన కపిలమహర్షిని రహస్యముగా చేరుకొనిరి. ఎప్పుడూ ఉత్తమమైన ఆనందరూపముతో నుండి మనసులో పరమాత్మను ధ్యానించుచున్న కపిలమహర్షికి నమస్కరించి స్తోత్రము చేయనారంభించిరి.

దేవతలు పలికిరి: “యోగివి సాంఖ్య యోగమునందు ప్రీతిచెందువాడవు. అయిన నీకు నమస్కారము. నరరూపముతో దాగియున్న విష్ణువునకు జయశీలునకు నమస్కారము. పరమాత్మ భక్తుడవు, లోకానుగ్రహకారణము, సంసారము అను అరణ్యమునకు దావాగ్నివి, ధర్మపాలనకు సేతువు అయిన నీకు నమస్కారము. రాగద్వేషములు లేని మహానుభావుడవైన నీకు నమస్కారము. సగరపుత్రులచే పీడించబడి నిన్ను శరణువేడిన మమ్ములను కాపాడుము.”

కపిల మహర్షి: “ఓ సురోత్తములారా! తమ కీర్తిని, బలమును, ధనమును, ఆయుష్యమును నశింపచేసుకోన కోరువారే లోకులను బాధింతురు. ఈ విషయమున ఆశ్చర్యముతో పనిలేదు. నిరపరాధులైన జనులను బాధించకోరువాడు అన్ని లోకములలోను పాపభోగమునకు ఆశపడు వాడని తెలియవలయును. కర్మతో, మనసుతో, మాటతో ఎప్పుడూ ఇతరులను బాధించువానిని దైవమే త్వరలో నశింపచేయును. ఈ విషయమున విచారించవలసిన పనిలేదు. కొద్ది రోజులలోనే సగరపుత్రులు నశింతురు.” అని ఇట్లు కపిల మహర్షి చెప్పిన మాటలను వినిన దేవతలు కపిల మహర్షికి నమస్కరించి స్వర్గమునకు చేరిరి.

ఇంతలో సగర మహారాజు వసిష్ఠాది మహర్షులతో సాటిలేని అశ్వమేధయాగమును చేయుటకు ప్రారంభించెను. ఆ యజ్ఞమున ఏర్పరచిన యజ్ఞాశ్వమును ఇంద్రుడు అపహరించి పాతాళలోకమున కపిలమహర్షి ఉన్న ప్రాంతమున ఉంచెను. రహస్యరూపముతో ఇంద్రుడు అపహరించిన అశ్వమును వెతుకుటకు సగరపుత్రులు భూలోకాదిలోకములను తిరిగిరి. ఎచటను అశ్వము కనిపించనందున పాతాళమునకు వెళ్ళుటకు నిశ్చయించిరి. ఒక్కొక్కరు ఒక్కొక్కయోజన ప్రాంతమును భూమిని త్రవ్విరి. త్రవ్విన మట్టిని సముద్ర తీరప్రాంతమున చల్లిరి. ఆ మార్గమున సగరాత్మజులందరూ పాతాళమునకు వెళ్ళిరి. మదముతో పిచ్చివారై, జ్ఞానహీనులై సగరపుత్రులు అచట గుఱ్ఱమును వెతుకుచు కోటి సూర్యకాంతితో ధ్యానములో ఉన్న మహానుభావుడైన కపిలమహర్షిని, అతని సమీపమున యజ్ఞాశ్వమును చూచిరి. అపుడు వారందరూ తొందరపాటుతో చాలావేగముగా కపిల మహర్షిని చంపుటకు సిద్ధపడి సమీపించిరి. “ఇతనిని కొట్టండి! చంపండి. పట్టుకోండి, పట్టుకోండి” అంటూ పలికిరి. అశ్వమును అపహరించి సాధువువలె, కొంగవలె ధ్యానములో మునిగి ఉన్నాడు. లోకమున కొందరు దుర్జనులు కపటముతో ఆడంబరముగా ప్రవర్తింతురు” అని ఇట్లు పలుకుచు కపిల మహర్షిని పరిహసించిరి. ఇంద్రియములను మనసును అత్మలో నియమించి సమాధిలో ఉన్న కపిలమహర్షికి వారిప్రయత్నములు తెలియలేదు. బుద్ధినశించి, మృత్యువు సమీపించిన ఆ సగరపుత్రులు కపిలమహర్షిని పాదములతో కొట్టుచే, చేతులను పట్టుకొనిరి. అపుడు సమాధిని వదిలిన కపిలమహర్షి ఆశ్చర్యముతో లోకోపద్రవమునుచేయు నగరపుత్రులను గూర్చి గంభీర భావముతో ఇట్లు పలికెను.

“ఐశ్వర్య మదముతో మదించిన వారికి, ఆకలి గొన్నవారికి, కాముకులకు, అహంకారముచే మూఢులైనవారికి వివేకము కలుగదు. నిధికి ఆధారమగుటచేతనే భూమి మండుచుండును. ఆ నిధినే మానవులు అనుభవించి మండుటలో ఆశ్చర్యమేమున్నది? దుర్జనులు సుజనులను బాధించుటలో వింతేమున్నది? నదీవేగము ఒడ్డున ఉన్న చెట్లను పడవేయునుకదా! ఐశ్వర్యము, యౌవనము, తెలివి, ఉన్నచోట దారిద్య్రము, వార్ధక్యము, మూర్ఖత్వము కూడా వెంటనే ఉండును కదా! కనకపు మాహాత్మ్యమును ఎవ్వరు చెప్పగలరు? కనకము అను నామ సామ్యముండుటచే ఉమ్మెత్త కూడా మదమును కలిగించును కదా? అగ్నికి వాయువు మిత్రుడైనట్లు, పామునకు విషము ఉండునట్లు, దుర్జనునకు సంపద కలిగినచో లోకవినాశము జరుగును. ధనమదముతో గుడ్డివాడైనవాడు చూచుచున్ననూ చూడడు. ఆత్మహితమును చూచువాడే నిజముగా చూచువాడు.” అని ఇట్లు కోపించిన కపిలమహర్షి ఇట్లు పలికి కనులను నుండి అగ్నిని సృష్టించెను. ఆ అగ్ని నగర పుత్రుల అందరిని క్షణ కాలములో భస్మముచేసెను. కపిలమహర్షి కన్నులనుండి వెలువడిన అగ్నినిచూచి పాతాళమున నివసించువారు అకాల ప్రళయమని భావించి శోకముతో ఆక్రోశించిరి. కపిల మహర్షి నేత్రాగ్నితో తపించిపోయిన రాక్షసులు సర్పములు త్వరగా సముద్రమున ప్రవేశించిరి. సత్పురుషులు కోపము సహించరానిది కదా!

అపుడు యజ్ఞముచేయ నిశ్చయించి ఉన్న (యజ్ఞము చేయుచున్న) సగర మహారాజు వద్దకు దేవదూత వచ్చి జరిగిన దంతయూ వివరించెను. సగరమహారాజు అంతయూ విని మిక్కిలి సంతోషముతో “దుష్టులను దైవమే శిక్షించెను” అని పలికెను. తల్లి అయిననూ, తండ్రి అయిననూ, సోదరుడైననూ, పుత్రుడైనను అధర్మము చేసినవాడు శత్రువే. అధర్మమునందు ఆసక్తుడై లోకులందరితో విరోధమును తెచ్చుకొనువాడు శత్రువే అగును అని శాస్త్ర నిర్ణయము. ఓ మునీశ్వరా! పుత్ర నాశమైననూ సగరమహారాజు దుఃఖించలేదు. దుర్జనుల నాశము సత్పురుషులకు ఉత్సాహమును కలిగించును. పుత్రులు లేనివారికి యజ్ఞము చేయుటకు అధికారములేదని శాస్త్రము చెప్పుచున్నందున మనమడైన అంశు మంతుని సగర మహారాజు పుత్రునిగా చేసుకొనెను. మంచిబుద్ధిగలవాడు, మాటలను తెలియు వారిలో శ్రేష్ఠుడయిన అసమంజసపుత్రుని యజ్ఞాశ్వమును తెచ్చుటకు నియమించెను. అంశుమంతుడు బిలద్వారములోనికి వెళ్ళి తేజోనిధియైన కపిలమహర్షిని చూచి సాష్టాంగ ప్రణామముచేసెను. చేతులు జోడించి వినయముతో ఎదుట నిలచి దేవదేవుడు సనాతనుడు శాతమనస్కుడైన కపిల మహర్షిని గూర్చి

“ఓ మహర్షీ! మా పినతండ్రుల దుష్ప్రవర్తనను క్షమించుము. సజ్జనులు పరోపకారమునందు ఆసక్తులు. క్షమగలవారు. సజ్జనులు దుష్టప్రాణుల యందు కూడా దయ చూపెదరు. చంద్రుడు చండాల గృహమున వెన్నెలను ప్రసరించకుండునా? సజ్జనుడు బాధించబడుచున్ననూ అందరికి ఆనందమునే కలిగించును. దేవతలు ఆహారముగా తీసుకున్ననూ చంద్రుడు ఆహ్లాదమునే కలిగించును కదా! చీల్చిననూ, నరికినను, చందన వృక్షము అందరిని, అన్నిటిని పరిమళవంతమునే చేయును. సజ్జనుడును అట్లే చేయును. ఓర్పుతో, తపసుతో, ఆచారముతో నీ గుణములను తెలిసిన మునీశ్వరులు లోకములను పాలించుటకే నీవు అవతరించితివని తెలియుదురు. ఓ మునీశ్వరా! పరబ్రహ్మా! నీకు నమస్కారము. బ్రహ్మమూర్తివి, బ్రాహ్మణప్రియుడవు అయిన నీకు నమస్కారము. బ్రహ్మధ్యానరతుడవైన నీకు నమస్కారము” అని ఇట్లు అంశుమంతుడు స్తోత్రము చేయగా కపిలమహర్షి ప్రసన్నవదనముతో “నీకు ప్రసన్నుడనైతిని. వరమును కోరుము” అని పలికెను.

ఇట్లు కపిలమహర్షి పలుకగా అంశుమంతుడు నమస్కరించి “మాపితరులను బ్రహ్మ లోకమును పొందించుము” అని ప్రార్థించెను. ఆ మాటకు మిక్కిలి సంతోషించిన కపిల మహర్షి ఆదరముతో “నీ మనుమడు గంగను తీసుకొని వచ్చి నీ పితరులను స్వర్గమును చేర్చున”ని పలికి “నీ మనుమడు తీసుకొచ్చిన పవిత్ర జలములుగల గంగానది నీ పితరులను పాప రహితులనుచేసి పరమ పదమును చేర్చును. ఈ అశ్వమును నీ తాత వద్దకు చేర్చుము. ఈ అశ్వముతో యజ్ఞము పూర్తియగును. అనెను. అంశుమంతుడు ఆ అశ్వమును తాతవద్దకు తీసుకొనివెళ్ళి జరిగినది అంతయూ వివరించెను. సగర మహారాజు ఆ అశ్వముతో, బ్రాహ్మణులతో యజ్ఞమును విధి పూర్వకముగా పూర్చిచేసి, తపస్సుచే విష్ణువును ఆరాధించి పరమ పదమును పొందెను.

అంశుమంతునికి దిలీపుడను పుత్రుడు కలిగెను. ఆ దిలీపునికి భగీరథుడను కుమారుడు కలిగెను. ఈ భగీరథుడే స్వర్గమునుండి గంగను తీసుకొని వచ్చెను. భగీరథుని తపస్సునకు మెచ్చిన బ్రహ్మ గంగను వరముగా ఇచ్చెను. ఆ గంగను ఇచట ధరించగల వాడెవడని ఆలోచించి పరమశివుని ఆరాధించి శివుని ద్వారా దేవనదిని భూలోకమునకు తీసుకొని వచ్చి, ఆ గంగాజలముచే నగర పుత్రులను స్పృశింపచేసి పవిత్రులైన వారిని స్వర్గమునకు చేర్చెను. ఈ భగీరథుని వంశముననే సుదాసుడను రాజు పుట్టెను. సుదాసునికి మిత్రసహుడను పుత్రుడు కలిగెను. ఇతను అన్నిలోకములలో ప్రసిద్ధి చెందెను. వసిష్ఠమహర్షి శాపమువలన మిత్రసహుడు రాక్షస శరీరమును పొందెను. గంగా బిందువు స్పర్శచే రాక్షస శరీరమును విడిచి మరల రాజు అయ్యెను. (1/8)